అన్ని భూత తత్త్వముల కంటె ఉత్తమ మగు తత్త్వమును అన్ని ధర్మముల కంటె మేలగు ధర్మమును మాకు తెలుపుమని మునులు వ్యాసుల నడిగిరి.
అతి ప్రాచీనమును ఋషులును మెచ్చినదియు నన్ని ధర్మముల కంటె శ్రేష్ఠమునునగు ధర్మము తెలిపెదము వినుడు. ఇంద్రియములు జీవుని కలవర పరచునవి. కనుక బుద్ధితో వాటిని బాలురను తండ్రివలె అదుపులో నుంచు కొని ఇంద్రియము లకును మనస్సు నకును ఏకాగ్రత అనెడి ఉత్తమ తపస్సుచే ఆ ఉత్తమ ధర్మమును ఎరుగ వలెను. గోచరించు వేటిని అనుభవింప గోరక ఇంద్రియములు నివృత్తి నొంది నపుడు శాశ్వతు డగు పరమాత్మ తత్త్వము సాక్షాత్కారమును పొందును. ఎన్నో కొమ్మలు పండ్లు పూలు ఆకులు కల వృక్షమునకు తన ఏ పండెక్కడనో ఏ పూవెక్కడనో ఏ కొమ్మ ఏ యాకు ఎక్కడనో తెలియ నట్లే అనేక వస్తు భేదములతో నిండిన ఈ సంసారము లోని జీవుడును తానెవడు? ఎక్కడ నుండి తాను వచ్చెను? ఎక్కడకు పోవలెను? అని తెలియ కుండును. కాని జ్ఞాన దీపమును ప్రకాశింప జేసికొని నచో అతడు తన అంతరాత్మతో తనలో తన్ను తాను చూడ గలుగును. కనుక ఓ విప్రులారా! అందులకై మీరును మొదట వైరాగ్యమును పూనుడు. దానిచే మీరు కుబుసము విడిచిన పాము వలె పాపములను వదలించు కొనగలరు. జ్ఞానము సంపాదించి చింతా సంతాపములు విడువ గలరు. లోకగతి అనాది ప్రవాహము. నది వంటిది. ఘోర మైనది. ఇది అన్ని వైపులకు వ్యాపించును. ఇంద్రియములు మొసళ్లు. మనః సంకల్పములు దీని గట్లు. లోభ మోహములు దీనిని కప్పిన గడ్డి. కామ క్రోధములు దానిలో తిరుగు పాములు. సత్యము స్నానమాడ దగిన రేవు. అనృతము కల్లోలములు. క్రోధము బురద. అవ్యక్త తత్త్వము నుండి ఇది పుట్టినది. మహా వేగము కలది. సంసార సాగరములో అది కలియును. జన్మ పరంపర అను పాతాళ ములోనికిది పోవును. కామముచే ఇది పుట్టును. జిహ్వా చాపలము సుడులు. దీనిని జ్ఞాన వంతులు మాత్రమే దాట గలరు. సమస్త భూతము సృష్టి ప్రళయములు తెలిసికొన గలరు. ఇదియే సర్వశ్రేష్ఠ మగు ధర్మము. దీనిని హితుడై అనుగతుడై శుచి మనస్కుడైన శిష్యునకుచు కుమారున కును మాత్రమే బోధించ వలయును.
స్వయంభూ బ్రహ్మము మోక్షమునకై నిర్ణయించిన ఉపాయమును యథాశాస్త్ర న్యాయా నుసారముగ మాకు తెలుప వేడు చున్నామని మునులు వ్యాసులను అడిగిరి.
మునుల కిట్ల చెప్పెను. ఓమహా ప్రాజ్ఞులారా! మనవంటి వారికి వివేక జ్ఞానము సరియగు ఉపాయము. దాని సహాయమున సర్వ విషయములను అన్వేషించి కనుగొన వచ్చును. కాని మనకు ఒక కడవతో పనిపడి నపుడు దాని నొక్క దానిని సరియైన దానిని సంపాదించు కొనవలయునే కాని లోకములో అన్ని కడవలను గూర్చి తెలిసికొన వలసిన పని కాని అన్ని కడవలను సంపాదించ వలసిన పనికాని లేదు. అట్లే మోక్షమును కోరిన వారు మోక్ష ధర్మమును మాత్రమే కాని ఇతర ధర్మములను తెలిసికొన నక్కర లేదు. తూర్పు సముద్రమునకు చేర్చు మార్గము పశ్చిమ సముద్రమునకు చేర్చదు. అట్లే మోక్షము సిద్ధింప జేయు ధర్మము ఒక్కటియే. ఇతర మార్గములు దానిని సిద్ధింప జేయ జాలవు. అట్టి ధర్మమును తెలిపెదను. యోగ సాధనకు మూలముగా క్షమచే క్రోధమును సంకల్పము లను విడుచుటచే కోరికలను సత్త్వ వృద్ధిచే నిద్రను ఎచ్చరిక చే భయమును మనస్సు నిబ్బరముచే ఇచ్ఛను ద్వేషమును కామ ప్రవృత్తిని జ్ఞాన వివేకము నభ్యసించుటచే బుద్ది మాంద్యమును ఏ విషయములును చిత్తమున స్ఫురించక పోవుటను హితములు సులభముగా జీర్ణమగు మితాహారముచే దైహికములు మానసికములు అగు ఉపద్రవములను తృప్తిచే లోభ మోహములను తత్త్వా జ్ఞానముచే విషయ భోగములను దయా భావముచే అధర్మమును ఫలానభిసంధిచే యజ్ఞ దానాది ధర్మ కర్మములను అయతిచే ఆశను సంగము విడుచుటచే కార్య సామర్థ్యమును దృశ్య ప్రపంచ వస్తువులు అనిత్యములను భావముచే వాటిపై ప్రీతిని యోగముచే ఆకలిని జయించ వలెను. నిత్య ప్రయత్నముతో సోమరి తనమును సంశయములను నిశ్చయము తోను జయించ వలెను. మౌనముచే వాగుడు తనమును శౌర్యముచే భయమును విడువ వలెను. వాక్కును మనస్సును బుద్ధితో బుద్ధిని జ్ఞాన నేత్రములతో అదుపు లోనుంచి జ్ఞానముచే ఆత్మ తత్త్వ మెరిగి ఆత్మ శాంతిని సాధించ వలెను. ఫలాభిసంధి లేక పవిత్ర కర్మ లాచరించి శుద్ధమైన చిత్తముతో జ్ఞానము సాధించ వలెను. కామ క్రోధ లోభ భయ స్వప్నములను యోగ దోషముల నైదింటిని విడిచి యోగ సాధనము చేయుచు ధ్యానము అధ్యయనము దానము సత్యము బిడియము ఋజు వర్తనము క్షమ శౌచము ఆచార శుద్ది ఇంద్రియ జయము కలిగి యున్నచో తేజస్సు వృద్ధి యగును. పాపము నశించును. సంకల్పముల నెరవేరును. విజ్ఞానము ప్రవర్తిల్లును. చివరకు బ్రహ్మ స్థానమున ప్రవేశించును. అ మూఢత్వము సంగ రాహిత్యము కామ క్రోధముల విడుచుట దైన్యము కాని పొగరు కాని లేకుండుట భయము లేక నిబ్బరముతో నుండుట ఇది ప్రసన్నమును విమలమును శుచియు నైన మోక్షమార్గము. మనో వాక్కాయ నిగ్రహము తప్పక యుండ వలసిన నియమము.
Summary of chapter 131 of the Brahma Purāṇa is as follows:
The specific ethical and behavioral injunctions required to support authentic yogic practice are enumerated. The practitioner must observe ahiṃsā, satya, asteya, brahmacarya, and aparigraha in the external domain, and śauca, santoṣa, tapas, svādhyāya, and Īśvara-praṇidhāna in the inner domain. The chapter emphasizes that Yoga without ethical foundation is ineffective and potentially harmful.