భగవంతుడిట్లు దేవేంద్రునిచే బొగడొంది భావ గంభీరముగ నవ్వి యిట్లు పలికెను.
జగన్నాథా!నీవు దేవ ప్రభువవు. ఇంద్రుడవు. మేము మానవులము. నా చేసిన యీ యపరాధము నీవు క్షమింప వలయు, ఈ పారిజాత తరువును యథా స్థానమునకు గొంపొమ్ము. సత్యభామ వచనానుసారము నేనిద్ధానిం గొని వచ్చితిని. నీచే విసర బడిన యీ వజ్రాయుధము పూజ నీయము. దీనిని నీవే చేకొనుము. శత్రువులం జీల్చు నీ ప్రహరణము (ఆయుధము) నీదే. అన నింద్రుడిట్లనియె.
స్వామి! నేను మర్త్యుడ నని పలికి నన్ను తబ్బిబ్బు జేయ నేల? భగవంతుడగు నీ వలని యనంత సౌఖ్యమును నెఱిగిన (రుచి మఱగిన) మేము నిన్నె ఱుగుదుము. జగన్నాథ! నీవెవ్వడవో యాతడే యగుదువు గాక! (నీ స్వరూపమును గూర్చి తర్కింప పని లేదన్న మాట) అయినను ప్రవృత్తి యందు న్నావు. (నివృత్తి యందు కేవలము నీవు సాక్షివి. కూటస్థ బ్రహ్మ మయినను) జగత్కంటకుల నిష్కర్షను (= పెల్లగించి వేయుటను) జేయు చున్నావు (దుష్ట సంహారము కొఱ కవతరించితి వన్నమాట) కావున ఈ పారిజాతమును ద్వారవతి కింగొం పొమ్ము. మర్త్య లోకము నీవు విడిచిన తర్వాత నీ వృక్షమట నుండదు.
అన హరియు నింద్రునితో నట్లు కానిమ్మని యాతని తోడి సిధ్ధ గంధర్వులు ఋషులునుం గొనియాడ భూలోకమున కేతెంచి ద్వారకా నగరముపై నుండి శంఖముం పూరించి పుర వాసుల కానంద మొదవించెను.
అవ్వల సత్యభామతో గరుడునిం దిగి పారిజాత తరువును సత్యభామ పెరటిలో నాటించెను. నగర మందలి జనమా స్వర్గ తరవుం దర్శించి పూర్వ జన్మ స్మృతి నందిరి. ఆ పారిజాతము యొక్క పూవుల వాసనచే మూడు యోజనముల దాక పరిమళించుట మఱియు యాదవు లెల్లరు నాతరువునం దద్దమందు వలె దమ ముఖ దర్శనము సేయుటయే గాదు దేవ గంధర్వ మానుషుల నెల్లర నందు దర్శించిరి. ప్రాగ్జ్యోతిషము నుండి నౌకరులు గొని వచ్చిన ఏన్గులు గుఱ్ఱములు ధనము స్త్రీలను కృష్ణుడు నరకుని పరిగ్రహము నుండి గ్రహించెను. అవ్వల నొక సుమూహుర్త మందు నరకుని చెఱ నుండి విడిచి రప్పింప బడిన యాకన్య లందఱను (అవివాహిత లన్నమాట) తన కుల ధర్మాను సారము పదునాఱు వేలమీద నొక వంద మందిని యథా శాస్త్రముగా పాణి గ్రహణ మొనరించు కొనెను. అయ్యెడ భగవంతుడా తడందఱ కన్ని రూపములం దాల్చెను. అక్కన్యకలును నెక్కొక్కతె కొక్కొక్కనిగా గృష్ణుం భావించి ఎవరి మట్టుకు వారు గోవిందుడు నా పాణియే గ్రహించి నా చేతినే చే నెసని యను కొనిరి రాత్రు లందు జగత్సృష్టి కర్త యగు మాధవుడు యోగీశ్వ రేశ్వరుండు గావున విశ్వరూప ధరుండై యంతఱి యిండ్ల నిన్ని రూపుల తానొక్కడే సంచరించెను.
Summary of chapter 97 of the Brahma Purāṇa is as follows:
Aniruddha (Kṛṣṇa's grandson) is abducted to Śoṇitapura by the demon Bāṇa after being discovered with the princess Uṣā, who had fallen in love with him through a dream-vision. Kṛṣṇa and Balarāma march to recover him, confronting Bāṇa's army and Śiva himself who supports Bāṇa. After fierce battle in which Kṛṣṇa defeats all opponents, Bāṇa is humbled, Śiva acknowledges Kṛṣṇa's supremacy, and Aniruddha is returned home with Uṣā as his bride.