ఇంద్రోత్సవము సేయ బని లేదను గోపకుల నిశ్చయముచే మిక్కిలి కోపించి యింద్రుడు సంవర్తకమును మేఘ గణముం గూర్చి యిట్లనియె. ఓ మేఘములారా! నేను బలుకు వచనము నాలింపుడు. నా యాజ్ఞను అవిరామముగ వెంటనే కావింపుడు. నందుడు దుర్బుద్ధియై గొల్లలం గూడ గట్టుకొని కృష్ణుని యాశ్రయ బలముచే నుబ్బి ఉత్సవ భంగము సేసివాడు. ఆ గొల్లలకు జీవ నాధారము, గోపాలు రనిపించు కొనుటకు గారణమును గోవులే. కావున వానిని రాళ్ళవాన గురిసి బాధింపుడు. నేనును కొండ శిఖర మట్లున్న యైరావత గజము నెక్కివచ్చి వాయువుల తోడ మీకు దోడ య్యెదను. ఇట్లింద్రునిచే నాజ్ఞాపింప బడి మేఘములు గోవులుచెడ జడుపు గొలుపు జడివాన గురిసినవి. క్షణములో నీ ధరణి దిక్కులు నాకాశము నొక్కటిగ నేక ధారగ గురిసిన కుంభ వృష్టిచే నావులు దెబ్బతిని మెడలు తలలు తిఱుగ బడి పడి పోయినవి. కొన్ని గోవులు దూడలను ఱొమ్ముల నదిమి కొన్నవి. కొన్ని గోవులు దూడల కెడమైనవి. కొన్ని యావులు గాలికి నొడలు వడక బిక్క మొగము పెట్టి కావుకావు మన్నట్లం బారవములు సేసి యల్లన గృష్ణునిం గూర్చి మొర వెట్టికొన్నవి. గోవులు గోపికలు గోపకులతో నా గోకులమెల్ల బెగడువడి వ్యాకులమౌట గని హరి వారిని రక్షింప నాలోచించెను. ఉత్సవ భంగమునకు బగగొని యింద్రుడిది చేసెను. నేనీ గోవ్రజముం గాపాడ వలయును. ఈ కొండం బెల్లగించి యీ గోష్ఠమున కెల్ల గొడుగుగా నెత్తి పట్టెదను గాక అని నిశ్చయించి యా గోవర్ధన గిరి నొంటి ఱెక్క నవలీలగ నెత్తి పట్టెను. మఱియును జగన్నాథుడు వాన కడ్డు సేసితిని. ఈ కొండ గొడుగు క్రింద కందఱు రండు రండు. గాలి తాకిడి లేనియెడ ననువగు చోటుల మీరు సరుదు కొనుడు. ఈ కొండ విరిగి మీదపడు నేమోయని యీ క్రింద నిలుచుటకు జడియ వలదన హరి పలుకు విని గోధనములతో బండ్లకెక్కించి కొన్న కుండలు మండలతో గోపకులు గోపికలు వాన దెబ్బదిని యా కొండ క్రిందికిం జొచ్చిరి. కృష్ణుడు నా శైలముం గేలల్లాడకుండ నెత్తి వట్టెను. వ్రజ వాసులు నానంద పడి యచ్చెరువు గొని విచ్చిన వెదకన్ను లప్పగించి కృష్ణ డప్పంగని బాలకృష్ణ లీలలం గొనియాడిరి. స్వామియు నదియొక యాటగా నేడు రాత్రులేక ధారగా నింద్రాజ్ఞ గొని మేఘములు గురియ నేకధాటి నా గోవర్ధనము నెత్తికొనెను. హరియట్ల ప్పెనుగొండ నెత్తికొన గోకులము రక్షణగొన బలారి తన ప్రతిన యబద్ధమయి యాకనమున మబ్బు విరిసి నట్ల తన యాలోచనలు వమ్మయిపో గోకులము వెడలి సంబర పడి స్వస్థానమునకు దిరిగి వచ్చెను.
కృష్ణుడును గోవర్ధన గిరిని యధా స్ధానమున దించెను. వ్రజ వాసులెన లేని యుల్లాసమున నవ్వింతం గనిరి. ఈవిధముగ గిరినెత్త గోకులము రక్షణముగొన నింద్రుడు కృష్ణ దర్శనము సేసి కొననెంచి యైరావత మెక్కి క్రిందికిం దిగివచ్చి యయ్యాల కాపరిని జగమ్మున కెల్ల కాపరింగా గరుడుండు తన ఱక్కలు విప్పి కల్పించిన నీడ క్రింద గరుడ వాహనా రూఢుడై యున్న సాక్షా ద్విష్ణువుని మధుసూదనునిం గని గజరాజము నుండి దిగి యేకాంత మునం దల్లన నగుచు ప్రీతిచే కన్నులు విప్పార నిట్లనియె.
కృష్ణా కృష్ణా! విను మేనిటకు నీ సన్నిధి కెందులకు వచ్చతినో యిది మఱొక లాగున భావింప వలదు. భూ భారము దింప నియ్యిలపై నీవతరించిన నిఖిలా ధారుడవు. పరమేశ్వరుడవు నీవే. నన్ను గూర్చిన మహోత్సవమునకు భంగమయ్యె నన్న విరోధమున గోకులముం జెఱుప నేను బంపిన కార్మబ్బులచే నింత రగడు జరిగినది. నీ వా గిరినెత్తి యాదవులం గాంచితిని. అవ్వింతంగని నేనును సంతుష్టుడ నైతిని దేవతల కార్యమిద్దాన నెరవేరినది. నా ప్రయోజనము చక్కగ సిద్ధించినదని నేను దలచెదను. నీ రక్షణ మందిన గోవులు నీ యవతార కారణమునకు గారణ మైనవి. ప్రేరణ సేయ నీ దరి కేతెంచితిని. గోవిందుడ వీవే యిపు డుపేంద్రుడను కాగలవు. అని యైరావతము మెడ నుండి గంటను జేకొని పవిత్ర జల పూర్ణమైన యద్దానిచే హరి కభిషేకము గావించెను. గో ప్రేరణచే ఆ జరిపిన యా గోవర్ధన పట్టాభిషేక వైభవ మందు గోవులు నిండ చేసిన క్షీరధారలచే నా క్షణ మయభిషేకించి యి వ్వసుంధరం గూడ నిండ దడిపినవి. శచీపతి ప్రీతిగోని వినయముతో గృష్ణుంగని మఱియు నిట్లనియె.
ఈ వైభవ మంతయు గోవుల మాటం బట్టి చేసితిని. ఒక విన్నపము గావించెద నాలింపుము. నా యంశమున నియ్యవని పై మహా పురుషుడై అర్జునుం డవతరించి యున్నాడు. అతడు తమ రక్షణ కర్హుడు. భూ భారము నందు నీతో జెలిమి చేయ గలడు. వానిని నీవు నిన్ను వలె గాపాడ వలయును. అన భగవంతు డిట్లనియె.
భారత వంశమున నీ యంశమున పార్ధుడు పుట్టుట నే నెఱుంగుదును. వానిని నే నవని నున్నంత దనుక పాలింతును. ఆ యర్జును నెవ్వడును యుద్ధమున గెలువ జాలడు. కంసుడు అరిష్టుడు కేశి కువలయా పీడుడు నరకుడు మఱి యెందరో కూలిన తరువాత మహా యుద్దము జరుగ గలదు. దాన భూ భారము హరించును. అందుచే నీ వేగుము. నీ పుత్రునకై నీవు పరితాప పడకుము. అర్జునునికి శత్రువను వాడొక్కడు నాముందుండ బోడు. అర్జును కొఱకే నేను యుదిష్టి రాదులను భారత యుద్ధము జరిగిన తరువాత క్షేమమున నున్న వారిని గుంతికి సమర్పింతును. అని హరి పలుక దేవాధి పతి జనార్ధనుం గౌగలించి కొని యైరావత మెక్కి దివంబున కరిగెను. కృష్ణుడును గోవులతో గోపాలురతో గొల్ల పల్లెను గోపికల చూపులచే బవిత్ర మైన త్రోవ నేతెంచెను.
Summary of chapter 81 of the Brahma Purāṇa is as follows:
The bull-demon Ariṣṭāsura terrorizes Vṛndāvana; his massive form shakes the earth. The gopīs and gopas flee in terror. Kṛṣṇa fearlessly confronts the demon, wrestles him by the horns, and kills him. The victory over Ariṣṭa is celebrated by the cowherds and celestial beings alike, further establishing Kṛṣṇa's identity as the supreme protector of all who take refuge in him.