ఓ లోమహర్షణ! నీవు సర్వమును మాకు దెలిపితివి. భువర్లోకము మొదలగు లోకములను, గ్రహ సంస్థానమును వాని ప్రమాణమును తెలుపుము. అని మునులడుగ
సూర్య చంద్రుల కిరణ ప్రసారము కలదాక సముద్ర శైల పరివృతమై యున్న ప్రదేశము పృథివీ మండలము, భూమియొక్క విస్తార మెంతో దానికి మీద నున్న అంతరిక్ష విస్తారము నంతే. భూమికి లక్ష యోజనము లలో సౌర మండల మున్నది. దానికి లక్ష యోజనములలో చంద్ర మండల మున్నది. దానికి లక్ష యోజనముల మీద నక్షత్ర మండల మున్నది. ఆ నక్షత్ర మండలము నకు రెండు లక్షల యోజనము లలో నుత్తరమున బుదుడు కలడు. అతని కంటే దూరములో శుక్రుడు, అంతే దూరములో అంగారకుడు (కుజుడు) గలరు. అక్కడకు రెండు లక్షల యోజనముల దూరములో బృహస్పతియు, ఆటకు రెండు లక్షల యోజనములలో శని ఆ మీద లక్ష యోజనములలో సప్తర్షి మండలము దానికి లక్ష యోజనము లలో జ్యోతి శ్చక్రమున కెల్ల కేంద్ర స్థానమై ధ్రువ మండలము నున్నవి. ఈ యంతరిక్ష లోకము జ్యోతిర్మండలము. ఇది యజ్ఞ ఫలమునకు స్థానము. ఇజ్య (యజ్ఞము) ఇందు బ్రతిష్ఠితమై యున్నది. “క్షిప్రంహి మానుషే లోకే సిద్ధిర్భవతి వర్మజా” మనుష్య లోకమున కర్మఫల సిద్ధి వేగముగ గల్గును.
ధ్రువ లోకమునకు మీద నొకకోటి యోజనము లలో కల్పాంత జీవులు నివసించు మహర్లోక మున్నది. దానిపై రెండు కోట్ల యోజనములలో జనో లోకమున్నది. అది బ్రహ్మ మానస పుత్రులు నిర్మల చిత్తులునైన సనకస నందనాదు లుండెడి స్థానము జనో లోకమునకు పై నెనిమిది కోట్ల యోజనములలో తపోలోక మున్నది. అచట వైరాజులను దేహ రహితులైన (విదేహులు) దేవతలు నివసింతురు. తపో లోకమునకు పై నాఱు యోజనములలో సత్య లోకము విరాజిల్లు చున్నది. అచట సిద్ధాది మును లుందురు. అది అపునర్మారకము తిరిగి మరణ ధర్మము లేని పుణ్య లోకము బ్రహ్మ లోకము.
పాదగమ్య మైన భూభాగ మంతయు భూలోకము. దీని విస్తారము చెప్ప బడెను. భూమికిని, సిద్ధాది ముని సేవిత మైన సూర్య లోకమునకు నడిమి భాగము భువర్లోకము (అంతరిక్షము) అని చెప్ప బడును, ఇది రెండవ లోకము. సూర్యునకు థ్రువునకును నడుమ గల చతుర్దశ నియుత (లక్ష) పరిమాణమైన లోకము స్వర్లోకము. ఈ మూడు లోకములకు కృతకము (కర్మ సంపాద్యము) లను పేరు గలదు. ఆ మీదు జనసపస్సత్య లోకములు మూడును ఆకృతకము లనబడును. కృతకాకృతముల నడిమి భాగము మహర్లోకము. దీనికి కృతకా కృతకమని పేరు. ఇది కల్పాంత మందు శూన్య మగును. కాని నశింపదు.
బ్రాహ్మణులారా! సప్త మహా లోకములు, సప్త పాతాళములు నాచే చెప్ప బడినవి. ఇది బ్రహ్మాండము యొక్క విస్తృతి. అండ కటాహముతో క్రింద మీద నడుమ వ్యాపించి వెలగ పండు విత్తనము వలె నుండు నది బ్రహ్మాండము. దీనికి పదిరెట్లు విరివి గల యుదకము వహ్నిచే నావరింప బడి యున్నది. అయ్యగ్ని వాయువుచే, నది యాకాశముచే నాకాశము మహత్తత్వముచే పదేసి రెట్లు పరిమాణము గల దానితో నావరింప బడి యున్నది. మహత్తత్వము నావరించి ప్రధాన మున్నది. అది అనంతము. దానికి లెక్క లేదు. అది సమస్త సృష్టికి హేతువైన పరాప్రకృతి. ఇట్టి అనంత కోటికోటి ప్రకృతు లందు దారువు నందగ్ని వలె నువ్వు లందు తైలము వలె చేతనాత్మకమై పురుష తత్వము అనగా పరబ్రహ్మ వస్తువు ప్రధాన మందు వ్యాపించి యున్నది. ఈ ప్రధానము పురుష తత్వము సర్వ భూతముల యను బూతిలో నున్న విష్ణుశక్తిచే ధరింప బడి పరస్పరాశ్రయ ధర్మము కలవియై యున్నవి. ఆ రెంటి పృథగ్భావమునకు, సంశ్రయ మునకు ఆ విష్ణుశ క్తియే కారణము.
సృష్టి కాలమందు విష్ణుశక్తి యైన మాయ (ప్రకృతి) యే కారణ రూపమైన తత్త్వము నందు క్షోభకు కారణ మగును. అదే ప్రథమ స్పందనము. ఈ శక్తి, వాయువు నీటి బిందువు లందలి చలువను భరించి నట్లు, ప్రధాన పురుషాత్మకమై యీ జగత్తును భరించును. చెట్టు, మొదలు స్కంధము (బోదె) కొమ్మలు రెమ్మలు ఆకులతో మొదటి విత్తనము నుండి పుట్టును. ఆచెట్టు నుండి మఱల విత్తనము పుట్టును. ఈ క్రమము నందు పుట్టిన చెట్లు మొదలయిన వాని లక్షణములు తత్తద్రవ్యముల కారణముల నను సరించి యున్నట్లే యీ జగత్పరంపర (బీజ పరంపర) అనంతమైన జగత్కారణమైన విష్ణువు ననుసరించి యుండును. ఆ విష్ణువే యవ్యాకృత తత్త్వము. ఆ బీజము నుండియే మహత్తు అహంకారము సమష్టి మనస్సు మొదలగు నవి వ్యాకృత మగు చున్నవి. (అవ్యాకృత మునే యవ్యక్త మని వ్యాకృతమును వ్యక్త మని శాస్త్రము వ్యవహరించినది). అహంకార తత్త్వము నుండి దేవ వర్గము తత్పుత్రులు పౌత్రులు జనించిరి. బీజము నుండి మొలక మొలక నుండి వృక్షము తద్భాగములు పుట్టి నపుడు బీజాదులకు నాశము లేనట్లు భూతల పరిణామము వలన మూల భూతముల కపచయము లేదు. వృక్షమునకు నాకాశము కాలము మొదలైన ద్రవ్యములు సన్నిధాన మాత్రమున కారణ మైనట్లు సర్వసాక్షి యయిన భగవంతుని సన్నిధాన మాత్రమున బొడమెడి నామ రూపాత్మక వివిధ సృష్టి వలన సర్వాధిష్ఠాన మైన భగవ తత్త్వమునకు నుపచయా పచయములు లేవు. హరి పరిణామము లేకుండగనే కారణమగు చున్నాడు. ధాన్యపు గింజలో మూలము కాడ మొలక ఆకు కోశము పువ్వు క్షీరము, ధాన్యము బియ్యము ఊక తవుడు మొదలైన పదార్థములు (అవ్యక్త ముగ) ఇమిడి యుండి తరువాత వ్యక్త మైనట్లు పరమాత్మ యందు సృష్టి కారణ సామగ్రి యయిన అనేక కర్మ బీజములు దేవాద్యుపాధులు జీవ శరీరమును నిండి యుండి విష్ణు శక్తిలన యప్పరమాత్మ నుండి యావిర్భావమును బొందు చున్నవి. కావున నీ జగమెల్ల పుట్టి, పెరిగి, లయించుటకు హేతువైన విష్ణువే పరబ్రహ్మ మన బడును. అదియే పరంధామము, పరమ పదము, సదసద్రూపము ననబడు పరతత్త్వము. చరాచర మైన యీ జగత్తు అభేద దృష్టిచేత నతడే యగును. మూల ప్రకృతియు, వ్యక్తరూప మగు జగత్తును నతడే. ఆతని యందే సర్వము నిలుచు చున్నధి, లయించు చున్నది. యజ్ఞకర్త యజ్ఞము యజ్ఞమున యజింప బడువాడు యజ్ఞభోక్త యజ్ఞఫలము నాతడే. సర్వ స్వరూపు డయిన నతని నుండియే యుగాది కాల గణన మేర్పడినది. ఆ హరికి వ్యతిరిక్తమయినదే కొంచెము లేదు.
Summary of chapter 23 of the Brahma Purāṇa is as follows:
The supreme efficacy of tīrthas (sacred pilgrimage centres) is established through a general discourse on the purifying power of sacred waters, holy forests, and places sanctified by the tapas of great ṛṣis. The chapter teaches that pilgrimage destroys sin, elevates one's progeny, and grants liberation, and provides the theological foundation for the extensive tīrtha-māhātmya sections that follow.