స్కంద మహా పురణము లోని బ్రహ్మ ఖండము లోని సేతు మహాత్మ్యము

Table of Contents

2వ అధ్యాయము

ఋషులు ఇట్లా అడిగారు. ఓ మహానుభావ ! సూతుడ ! ఏపనినైనా సులభంగా చేయగల రాముడు, అగాధమైన లోతుగల, నదులకు నాథుడైన నముద్రుని మీద సేతువును ఎట్లా నిర్మించాడు. (1) సేతువు యందు, గంధ మాదన పర్వతముందు ఎన్ని తీర్ధము లున్నాయో శ్రద్ధగా (వినదలచిన) మాకు ఈ విషయాలు చెప్పండి ఓ పౌరాణిక శ్రేష్ఠ! అని.

సూత ఉవాచ

తా॥ సూతుడు ఇట్లా అన్నాడు - ఓ మహర్షి శ్రేష్ఠులారా ! సముద్రమందు రాముడు సేతువును ఎట్లా నిర్మించాడో దానిని మీకు బాగా వివరిస్తాను (3) తండ్రి ఆజ్ఞతో రాముడు దండకారణ్యంలో ఉంటున్నాడు - సీతాలక్ష్మణులతో కూడి పంచవటి యందు బాగా ఉన్నప్పుడు (4) మహాత్ముడైన రాముని భార్యను మారీచునినెవంగా రావణుడు అపహరించాడు. (5) దశరధకుమారుడైన రాముడు తన భార్యను అరణ్యంలో వెతుకుతూ, శోకమోహములకులోనౌతూ పంపానదీతీరానికి చేరాడు (6) అక్కడ రాముడు ఒక వానరు ణ్ణి చూచాడు “నీవెవరు?” అని ఆవానరుడు రాముణ్ణి అడిగాడు (7) అప్పుడు రాముడు తన వృత్తాంతాన్ని మొదటి నుండి ఆ వానరునికి ఉన్నదున్నట్లుగా చెప్పాడు. ఆ తరువాత రాముడు, ఆ వానరుణ్ణి “నీవెవరు” అని అడిగాడు (8) అప్పుడాతడు తన వృత్తాంతాన్ని రామునకు చెప్పాడు ఇట్లా - నేను హనుమంతుడను పేరుగల వానరుడను. సుగ్రీవునకు మంత్రిని (9) మీతో స్నేహంకోరి, ఆతడు పంపగా వచ్చాను. రండి. సుగ్రీవుని దగ్గర మీకంతా భద్రమే (క్షేమమే) అని (10) అట్లాగే కానిమ్మని రాముడు కూడా ఆ వానరునితో పాటు సుగ్రీవుని దగ్గరకొచ్చాడు. సుగ్రీవునితో అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు రాముడు. (11) వాలిని వధిస్తానని సుగ్రీవునితో ప్రతిజ్ఞ చేశాడు రాముడు. సీతను తిరిగి తెప్పిస్తానని సుగ్రీవుడు రామునితో అన్నాడు.

తా॥ఈరకంగా ఇద్దరు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని, ఒకరినొకరు నమ్మికవీశ్వరనరేశ్వరులు (సుగ్రీవరాములు) పరమసంతోషంతో కలిసి (13) ఉన్నారు, ఋష్యమూకపర్వతం మీద సుగ్రీవునకు నమ్మకం కలగటంకోసం రాముడు దుందుభిశరీరాన్ని (14) తనకాలి బోటన వేలితో అనేకయోజనముల దూరం చిమ్మాడు. అట్లాగే ఏడు తాటిచెట్లను రాముడు ఛేదించాడు (15) అప్పుడు సంతోషపడ్డ సుగ్రీవుడు రామునితో ఇట్లా అన్నాడు. ఓరామ ! నాడు ఇంద్రాది దేవతల నుండి కూడా భయం లేదు (16) ఎందువల్లనంటే, బాగా పరాక్రమవంతుడవైన నీవునాకు స్నేహితునిగా లభించావుగదా. నేను రావణుని చంపి నీ భార్యను తీసుకొస్తాను, అని (17) ఆ పిదప బలవంతుడైన రాముడు సుగ్రీవ లక్ష్మణులతో కూడి వాలి పాలించే కిష్కింధా నగరానికి త్వరగా వెళ్ళాడు (18) వాలి (నగరంనుండి) బయటికి రావాలనే ఉద్దేశ్యంతో, సుగ్రీవుడు గర్ణించాడు. వాలి, తన తమ్ముని గర్జనను సహించలేనివాడై, (19) అంతఃపురం నుండి బయటికి వచ్చి తమ్మునితో కూడా యుద్ధం చేశాడు. వాలి, పిడికిలి దెబ్బలను తిని బాగా కలత చెంది (20) సుగ్రీవుడు రాముడున్న చోటికి వేగంగా వచ్చాడు. అప్పుడు రాముడు సుగ్రీవుని తల క్రింద (మెడలో) (21) గురుగా ఒక తీగను కట్టి యుద్ధానికి తిరిగి ప్రేరేపించాడు. తన గర్జనలో సుగ్రీవుడు వాటిని తిరిగి (యుద్దానికి) పిలిచి (22) రాముని ప్రేరణతో సుగ్రీవుడు వాలితో బాహుయుద్ధం చేయనారంభించాడు. అంతలో రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు(23) వాలి మరణించాక సుగ్రీవుడు కిష్కింధకు చేరాడు. ఆ తర్వాత వర్షాకాలం గడిచాక వానరుల కథిపతియైన సుగ్రీవుడు (24) సీతను తొందరగా తీసుకురావటంకోసం వానరుల మహాసైన్యాన్ని తీసుకొని రాకుమారుల దగ్గరకు వచ్చాడు (25) సీతను వెతుకుట కొరకు వానరులను బయలుదేర దీశాడు. హనుమంతుడు లంకలో సీతజాడతెలుసుకున్నాక (26) చూడామణులను (హనుమంతుడు) ఇచ్చాక, ఆనందమున దుఃఖమును పొందిన (జాడ తెలియటం ఆనందం, ఆమెదుఃఖం గురించి వినటం దుఃఖకారణం) రాముడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు, హనుమంతుడు, (27) జాంబవంతుడు, నలుడు ఇంకా ఇతరులైన వానరులతో కూడినవాడై (రాముడు) అభిజిత్ ముహూర్తంలో బయలుదేరి (28) అనేక దేశములను దాటి మ హేంద్ర పర్వత ప్రాంతం చేరాడు. అక్కడున్న చక్రతీర్థమునకు వెళ్ళి అక్కడ నివాసం చేశాడు.

రావణునికి తమ్ముడైన, ధర్మాత్ముడైన విభీషణుడు నలుగురు మంత్రులతో కూడి అక్కడికే (చక్రతీర్థం) వచ్చాడు. (30) గొప్పగా స్వాగతంచేసి రాముడు ఆ విభీషణుని స్వీకరించాడు. ఈ విభీషణుడు గూఢచారి ఐయ్యుండవచ్చు అని సుగ్రీవునకు అనుమానం వచ్చింది (31) రాముడు మాత్రము, విభీషణుని చేష్టలతో, ఆతనిపాతకరమైన నడవడికలతో ఆతనిని మంచివానిగా (అదుషునిగా) గ్రహించి, ఆ పిదప ఆతనిని పూజించాడు (32) రాక్షసరాజ్యమునకంతకు ఆ విభీషణుని రాజుగా అభిషేకించాడు. సుగ్రీవునితో సమానమైన వానిని శ్రేష్ఠుని మంత్రిగా ఏర్పరచాడు (33) ఆపిదవ రాముడు చక్రతీర్థానికి వచ్చి వసించాడు. సుగ్రీవుడు మొదలగువారు ఇతర వానర శ్రేషులు చుట్టూ ఉండగా విచారంతో రాముడు (34) యోగ్యమైన కాలాన్ని గమనించి ఇట్లా వారితో అన్నాడు. ఈ సముద్రాన్ని దాటటానికి మీకు (తోచిన) ఉపాయం ఏది? (35) ఇదేమో పెద్ద సైన్యము. ఈ సముద్రమో దాటటానికి శక్యం కానిది. ఈ నీలపువర్ణం కల జలరాశి (సముద్రము) చంచలమైన అలలతో కూడి ఉంది. (36) ఎగురుతున్న చేవలు, పెద్ద పెద్ద మొసళ్ళు, శంఖములు, ముత్యములు వీటితో వ్యాకులమైంది. ఒక్కోచోట బడబానలంతో ఆక్రమించబడింది. ఒక్కోచోట నురుగుతోనిండి, మహాభయంకరంగా ఉంది . (37) పెద్ద పెద్ద గాలులతో లాగబడ్డ నల్లని మేఘములతో కూడిందిది. ప్రళయ కాలమందలి మేము గర్జన వంటి ధ్వని గలది. గాలితో చాలా ఉద్దృతంగా ఉంది. జల సమృద్ధమైంది (38) ఈ సముద్రమును ఏకలత లేకుండా ఎట్లా దాటగలము అందరూ తమ వానర సైన్యములతో కూడి ఉన్నారు (39) నదములకు నదులకు వతియైన ఈ సముద్రుణ్ణి ఏ ఉపాయంతో అధిగమిద్దాము. తొందరగా, సైన్యములతో కూడి ఈ నముద్రాన్ని ఎట్లా దాటుదాము (40) శతయోజన విస్తీర్ణమైనదీది మనస్పుతోకూడా చేరడానికి వీలు కానిదిది. పైగా అనేక విఘ్నాలు. మరి సీతను పొందుట ఎట్లా? (41) కష్టముకన్న ఇంతా కష్టమైన స్థితికి వచ్చాము. ఇవ్వాళ మనము ఆశ్రయంలేని వాళ్ళమైనాము. నిరాశ్రయులమై బాగా నీళ్ళు, అధికమైన గాలిగల సముద్రాన్ని (42) ఈ వానరులంతా దాటే కొరకు ఏ ఉపాయాన్ని చేద్దాము. రాజ్యము పోవటం అడవికి రావటం, సీతను (రావణుడు) ఎత్తుకు పోవటం, తండ్రి మరణించటం (43) వీటన్నింటికంటే భరింపరాని దు:ఖము ఏమంటే ఈ సముద్రాన్ని దాటటం అయ్యో! ఎంతటి దయనీయస్థితి ఈ సముద్ర గర్థనలకు (సగు నగు) జలరాశికి తిరస్కారము (44) మహర్షియైన అగస్త్యుని వచనము అబద్దం ఎట్లా ఔతుంది. పవిత్రమైన గంధమాదన పర్వత ప్రాంతం మునకు నీవు రావణుని చంపి (45) పావం నశింపచేసే కొరకు తొందరగా వెళ్ళు అని అగస్త్యుడు చెప్పిన మాట అబద్ధం ఎట్లా ఔతుంది.

శ్రీ సూతులు ఇట్లా అన్నారు. అనే రాముని మాటలను విని, సుగ్రీవుడు మొదలగు పెద్దలంతా (46) చేతులు జోడించి మహా బలవంతుడైన రామునితో ఇట్లా అన్నారు. నావలతో వివిధములైన తెప్పలతో నముద్రాన్ని దాటుదాము అని (47) అప్పుడు వానర సమూహం మధ్యలోనున్న విభీషణుడు ఇట్లా అన్నాడు. రాజైన రాఘవుడు సముద్రుణి శరణు వేడాలి (48) ఈ వరుణునకు నిలయమైన సముద్రము నగరవుత్రులచే త్రవ్వబడింది. వారికి జ్ఞాతియైన ఈ రాముని కార్యాన్ని సముద్రుడు చేయవలసినవాడు (49) అని విద్వాంసుడైన రాక్షసుడైన విభీషణుడు ఇట్లా చెప్పిన పిదవ, రాముడు వానరులందరిని ఓదారుస్తూ ఇట్లా అన్నాడు (50) శతయోజన విస్తీరమైన అతి భయంకరమైన, సముద్రమును వానరులందరు దోనెలతో తెప్పలతో దాటలేరు (51) వానర శ్రేష్టులు ఎక్కువగా ఉన్నారు. ఈ సైన్యానికి సరిపోయే ఎక్కువ నావలు లేవు నాలాంటివాడు వ్యాపారస్తులకు ఇబ్బందికలిగేట్టుగా ఎట్లానడుస్తాడు (52) మన సైన్యం చాలా విస్తారంగా ఉంది. శత్రువు మన లోపం గుర్తించి చంపవచ్చు. అందువల్ల వారు తీప్పలతో బల్లకట్టు లతో, దోనెలలో, మోసపోవటం ఇష్టంలేదు. (53) విభీషణుడు చెప్పిందే నాకు ఇష్టమైంది. ఓ వానరులారా! మార్గనిసిద్దికొరకు నేను ఈ సముద్రాన్ని ఉపాసిస్తాను. (54) మార్గం చూపని పక్షంలో అవ్వడు సముద్రుణి నేను కోపగిస్తాను. ఎదురు లేని మహాస్త్రములతో, అగ్నిని మించిన వాయువును మించి వెలిగిపోతున్న బాణములతో (బెదిరిస్తాను) (55) అని రాముడు వలికి లక్షణుని తో కుడిన వాడై రాముడు సముద్రపు నీటిని ముట్టి (సంకల్పించి) శాస్త్ర ప్రకారము దర్భలలో చేసిన పడక యందు కూర్చొనెను.

తా॥ నదములకు నదులకు పతియైన సముద్రుని తీరమందు, తుశాస్తరణమందు దీర్ఘబాహువులు కలరాముడు, వేదికయందు అగ్నివలె ప్రవేశించాడు (ఉన్నాడు) (57) దాక్షిణ్యము గల రాముడు, ఆదిశేషుని పడగవంటి తన దక్షిణ బాహువును తలగడగా ఉంచుకొని సముద్రతీర మందు ఉపాసిస్తూ ఉన్నాడు (58) భూమిపై దర్భల పడకయందు, నియమాలనుండి అతిజాగరూకడై నిద్రిస్తున్న రామునకు మూడురోజులు గడిచాయి. (59) నీతి తెలిసిన, ధర్మతత్పరుడైన రాముడు అక్కడ అట్లా మూడు రాత్రులు ఉండి మార్గసిద్ధి కొరకు సముద్రుణ్ణి ఉపాసిస్తున్నాడు (60) రాముడు యోగ్య మగునట్లుగా పూజించి, ప్రయత్నించినా సముద్రుడు కొంచంగానైనా రామునకు కన్పించలేదు (61) రామునకు, తన రూపం కొంచమైనో చూపని నముద్రునిపై రాముడు కోపగించి కళ్లు ఎర్రబడ్డవాడై (62) దగ్గరలో ఉన్న లక్ష్మణునితో ఇట్లా అన్నాడు. ఈ వేళనా బాణములతో మొనళ్ళను ఛేదించి వాటితో సముద్రము (63) నీరంత అడ్డగించబడేట్టు క్షణాల్లో నేను చేస్తాను. శంఖముల ముత్యముల సమూహములు, చేపలు మొనళ్ళు (64) గల సముద్రమును మెల్లగా, వ్యర్థము కానీ అస్త్రములుగల నా బాణములతో ఎండింపచేస్తాను. ఓర్పువహించిన నన్ను ఈ సముద్రుడు (65) అసమర్ధునిగా భావిస్తున్నాడు. ఇటువంటి వానిపై ఓర్పువహించటం వ్యర్ధము. సామము (ఒక ఉపాయం) తో ఈ సముద్రుడు తన రూపాన్ని వారు చూపటం లేదు (66) ఓ లక్ష్మణా! ధనస్సును, సర్పములవంటి బాణములను తీసుకొనిరా. ఈ సముద్రాన్ని ఎండగొడ్తాను. వానరులందరు నడిచివెళ్ళని. (67) వేల అలలతో కూడిన మర్యాదనతిక్రమించిన ఈ నముద్రుణ్ణి సోబాణాలతో మర్యాదలేకుండా చేస్తాను. (68) గొప్పదానవులతో కూడిన, గొప్పగొప్ప మకరములతో నక్రములతో కూడిన (పెద్దచేపలు) పెద్ద పెద్ద అలలతో కూడిన ఈ పెద్ద సముద్రాన్ని ఎండింప చేస్తాను. (69) అని లక్ష్మణునితో ఇట్లా అని కోపముతో నిండిన చూపులుగలవాడై చేత ధనస్సు ధరించిన రాముడు, త్రివురులను సంహారం చేసిన శివునిలా ఎదిరింపరాకుండా ఉన్నాడు. (70) కొపంతో ధనస్సునులాగి, తన బాణములతో ప్రపంచాన్ని కంపింపచేస్తూ, త్రిపురాసులపై భవుడు బాణములు వదలినట్టు, ఉగ్రమైన బాణములను రాముడు నముద్రుని పై వదిలాడు (71) మండిపోతున్న వూరమైన బాణములు దిక్కులన్నింటిని వెలిగింప సంకులమైన సముద్రపు నీటిలోకి ప్రవేశించాయి (72) ఆపిదప సముద్రుడు భయపడి, వణుకుతూ, చేతులు జోడించి, మరొక రక్షకుడు లేనివాడై బ్రాహ్మణుడుగా పాతాళము నుండి స్వయంగా వచ్చాడు (73) ముక్తిపదమునకు కారకుడైన రాముణ్ణి శరణు వేడాడు. బ్రాహ్మణుడుగా మారి మధురమైన మాటలతో రాముణ్ణి సంతోష వరిచాడు.

సముద్రుడు ఇట్లా అన్నాడు - ఓ రాఘవనీ పద్మములవంటి పాదములకు నమస్కరిస్తున్నాను. ఓ సీతాపతి ! నీ పాద సేవవలన సౌఖ్యాన్ని ఇస్తావు. గౌతముని భార్యకు మోక్షమిచ్చివ, దేవతల సమూహంతో సేవించబడే నీ శ్రీపాదముల ధూళికి నమస్కరిస్తున్నాను (75) నుందుని ప్రియురాలి దేహమును నాశనము చేసిన నీకు నమస్కారము విశ్వామిత్ర యాగమును రక్షించిన నీకు నమస్కారము. శివుని ధనన్పును విరిచిన నీకు నమస్కారము, రాక్షన పంథమును నాశనము చేసిన నీకు నమస్కారము (76) భక్తులకు ఇష్టమైన దానిని ఇచ్చేరామ! నమస్కరిస్తున్నాను. దేవతల కార్యం నెరవేర్చుట కొరకు రఘుకులంలో అవతరించావు (77) వారాయణుడవు. ఆద్యంతరహితుడవు, మోక్షప్రదుడవు, మంగళకరుడవు, నాశరహితుడవు ఐన ఓరామ! మహాబాహో! శరణాగతుడనైన, నన్ను రక్షించు (78) ఓ రాజేంద్ర ! కోపాన్ని ఉపసంహరించుకో. ఓ దయామయుడ! నన్ను క్షమించు. భూమి, వాయువు, ఆకాశము, నీరు, జ్యోతిస్సు (79) వీటిని పరమేష్టీయైన బ్రహ్మ ఎంత స్వభావ సిద్ధములైనవిగా నిర్మించాడో, అటువంటి స్వభావ సిద్ధములు నాకూ ఉన్నవి. నా స్వభావము అగాధంగా ఉండుటయే. (80) నాకు వికారం ఏర్పడుతుంది. అదే గాధత (అగాధంకాకపోవటం) ఇది నిజం నేను చెప్తున్నాను. లోభం వల్లకాని, కామం వల్ల కాని, భయం వల్లకాని, రాగంవల్లని ఓరామ! (81) వంశం వల్ల వచ్చిన గుణాన్ని వదలటానికి ఏరకంగా ఉత్సాహం లేను. అందువల్లనీ సేనను నముద్రం (నన్ను) దాటటానికి సహాయం చేస్తాను (82) ఈ రకంగా చెప్పుచున్న నదీపతియైన సముద్రుణ్ణి గూర్చి రాముడిట్లా అన్నాడు. రావణుడు పాలించే లంకానగరానికి సైన్యంతో సహానేను వెళ్ళాలి. (83) అందు వల్ల నేను ఇప్పుడు నిన్ను దాటే కొరకు నీవు ఎండిపో. అని అన్న రామునితో మరల సముద్రుడు ఇట్లా అన్నాడు. (84) రామ! జాగ్రత్తగా విను. ఏని చేయవలసినదేమిటోచేయి. సైన్యముతో పాటు వెళ్ళుటకు సిద్ధపడ్డ నీ ఆజ్ఞతో వేను ఎండిపోయినట్లైతే (85) ఇతరులు కూడా తమ ధనుర్బలముతో నన్ను ఈ విధముగా ఆజ్ఞాపించుదురు. నీ సైన్యము దాటుటకొరకు మరొక ఉపాయమును చెప్పెదను. (86) శిల్పులు అంగీకరించిన నలుడను పేరుగల వానరుడు ఇక్కడున్నాడు. ఓరామ! ఆతడు బలవంతుడు. త్వష్టయైన విశ్వకర్మయొక్క కుమారుడు (87) ఆతడు కర్రను గడ్డిని, రాయని దేన్నైనా నాలో వేసినచో అదంతా నేను ధరిస్తాను. అదినాకు సేతువు అవుతుంది. (88) ఆ సేతువు ద్వారా రావణుడు పాలించే లంకానగరానికి నీవు వెళ్ళు. ఇట్లా చెప్పి, సముద్రుడు అంతర్హితుడుకాగా, రాముడు నలునితో ఇట్లా అన్నాడు. (89) ఓ బుద్ధిమంతుడా! నీవు నముద్రమందు సేతువు నిర్మించుటకు సమర్దుడవు. నిర్మించు అని అనగా ధర్మమును తెలిసిన వారిలో శ్రేష్ఠుడైన రామునితో నలుడు ఇట్లా అన్నాడు. (90) నేను అగాధమైన సముద్రమందు సేతువును నిర్మిస్తాను. మాతండ్రిగారితో నేను వరం కూడా పొందాను. సామర్థ్యంలో నా తండ్రితో సమానమైనవాణ్ణి. (91) మందరంలో విశ్వకర్మ మా అమ్మగారికి వరమిచ్చాడు. శిల్పకర్మలో నీ కుమారుడు నాతో సమానమైన వాడు కాగలడు అని (92) నేను ఆతనిఔరనపుత్రుణ్ణి. విశ్వకర్మతో సమానమైన వాణ్ణి ఈరోజే వానర శ్రేష్ఠులు సేతువును స్వేచ్ఛగా నిర్మించని (93) అని.

పిదప రామునితో ఆజ్ఞాపించ బడిన బలవంతులైన వానరులు, పర్వతములను, పర్వతశిఖరాలను, తీగలను, గడ్డిని, చెట్లను (94) గరుడినితో, వాయువుతో సమానమైన వేగం కల పెద్ద పెద్ద శరీరాలు కల (95) ఆ వానరులు తీసుకవచ్చారు. సముద్ర మధ్యంలో నలుడు గొప్ప సేతువును నిర్మించాడు (95) పదియోజనముల విస్తీర్ణము, పదియోజనముల పొడవుగల సేతువును జానకి భర్తయైన రాముడు నిర్మింప జేసెను. (98) విశ్వకర్మ సుతుడైన నలుడనే వానరశ్రేష్ఠునితో నిర్మింపబడిన రామచంద్రుడు నిర్మింపచేసిన (97) ఈ సేతువును పొందిన పాపాత్ములైన నరులందరు అన్ని పాపముల నుండి విముక్తులౌతారు. వ్రతదాన తపోహోమములతో శివుడు అంత సంతృప్తి చెందడు, (98) సేతువుయందు స్నానం చేసినంత మాత్రముననే ఎంతగా శివుడు ఆనంద పడ్డాడో. సూర్య తేజస్సుతో సమానమైన తేజస్సులేనట్లే (99) సేతుస్నానంతో సమానమైనది ఎక్కడాలేదు. రాముడెక్కడికి పోదల్చుకుతున్నాడో, కోతులతో సేతువును ఆరంభింపచేశాడో ఆ సేతువు యొక్క మూలము లంకలో ఉంది (100) వానరులు ఆరంభించిన సేతువు పుణ్యప్రదము, పాపనాశకము. అదే తర్వాత దర్భశయనమని లోకమున ప్రసిద్ధమైంది. (101) ఈవిధంగా సముద్రమందు సేతు నిర్మాణాన్ని గురించి నేను చెప్పాను. ఇక్కడ పుణ్యప్రదమైన తీర్థములు అనేకం ఉన్నాయి (102) అనేకములైన ఈ తీర్థముల సంఖ్యనుకాని, పేర్లుకాని శేషుడు కూడా లెక్కింపలేడు. కాని నేను ఈవేళ అక్కడి తీర్థములను కొన్నింటిని చెప్తాను. (103) సేతువుయందు ప్రధానంగా ఇరువదినాల్గు తీర్థములున్నాయి. ఒకటి చక్రతీర్థము, పిదప బేతాళ వరద తీర్థం (104) పిదప పావవినాశనము, పిదప సీతాసరస్పు, పిదప మంగళతీర్థము (105) సకల పాపఘ్నీ, అమృత వాహిక, బ్రహ్మకుండం, హనుమత్కుండం, (106) అగస్త్యతీర్థం, రామతీర్థం, లక్ష్మణతీర్థం, జటాతీర్థం (107) లక్ష్మితీర్థం, అగ్నితీర్థం, చక్రతీర్థం, శివతీర్థం (108) శంఖతీర్థం, యమునతీర్థం, గంగాతీర్థం,గయాతీర్థం (109) కోటి తీర్థం, సాధ్యతీర్థం, మానసతీర్థం, ధనుష్కోటి (110) ఇవి ప్రధానమైన పాపనోశకమైన తీర్థములు సేతు మధ్యంలో ఉన్న వీని గూర్చి ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! నేను చెప్పాను (111) రాముడు సముద్రమందు గొప్ప సేతువును నిర్మించాడు. దాన్ని గూర్చి పుణ్యప్రదమై, పాపనాశకమైన దాని గూర్చి నేను చెప్పాను (112) దానిని, విని చదివి మనుష్యుడు ఈ లోకమందు ముక్తుడౌతాడు (113) ఈ అధ్యాయమును భక్తి కల్గినవాడై చదివిన, విన్న మనుష్యుడు అనంత జయమును ఈ లోకంలో పొందుతాడు. వరంలో తిరిగి జన్మనెత్తే క్లేశాన్ని పొందడు.

అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఎనుబది ఒకటవ వేల సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు సేతు నిర్మాణము మొదలుగా వర్ణన మనునది ఇది ద్వితీయ అధ్యాయుము.