శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

89 - భృగువు త్రిమూర్తులను పరీక్షించుట - శ్రీకృష్ణుడు మరణించిన బ్రాహ్మణ బాలకులను మరల బ్రదికించుట

  శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను - పరీక్షిన్మహారాజా! మహర్షులు సరస్వతీ నదీతీరమునందు సత్రయాగమును చేసిరి. అప్పుడు వారిలో, ముగ్గురు జగన్నాథులలో గొప్పవారు ఎవరు? అనే విషయమై వివాదము కలిగెను.

ఓ పరీక్షిన్మహారాజా! వారికి ఎవరు గొప్పయో తెలియాలనే కోరిక కలిగెను. వారి మహత్త్వమునరయుటకై వారు బ్రహ్మదేవుని పుత్రుడగు భృగువును పంపించిరి. ఆ భృగువు బ్రహ్మదేవుని సభకు వెళ్ళెను.

బ్రహ్మదేవుని సత్త్వగుణమును పరీక్షించుటకై భృగువు ఆయనకు నమస్కారమును గాని, స్తోత్రమును గాని చేయలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు తన తేజస్సుతో మండి పడుతూ భృగువుపై కోపించెను.

అగ్నిని అగ్నినుండే పుట్టిన నీటితో చల్లారునట్లు చేయుదురు. అదే విధముగా, స్వయంభువుడగు ఆ బ్రహ్మదేవుడు వివేకబుద్ధిచే మనస్సులో తన పుత్రుడగు భృగువుపై పుట్టిన కోపమును శమింప జేసెను.

తరువాత ఆ భృగువు కైలాసమునకు వెళ్లాను. మహేశ్వర దేవుడానంద ముతో లేచి నిలబడి తమ్ముడు భృగువును కౌగిలించుటకుద్యుక్తుడాయెను.

నీవు మర్యాదలనుల్లంఘించువాడవు, అంటూ భృగువు శివప్రీభుని కౌగిలికి ఇష్ట పడ లేదు. కోపముతో కన్నులు ఎరుపెక్కిన శివుడు శూలమును పైకెత్తి ఆ భృగువును సంహరించుటకుద్యుక్తుడాయెను.

పార్వతీదేవి ఆ శివుని పాదములపై పడి అనునయవాక్యములతో శాంతింపజేసెను. తరువాత భృగువు దుష్టజనశిక్షకుడగు శ్రీహరి దేవుడు ఉండే వైకుంఠమునకు వెళ్లాను.

  లక్ష్మీదేవి ఒడిలో పరుండియున్న శ్రీహరిని భృగువు కాలితో వక్షఃస్థలము పై తన్నెను. సత్పురుషులచే ఆత్మరూపముగా పొందబడే శ్రీహరి భగవానుడు అప్పుడు లక్ష్మీదేవితో సహా లేచి నిలబడెను.

అప్పుడు శ్రీహరి తన శయ్య పైనుండి దిగి భృగు మహర్షికి తల వంచి నమస్కరించి ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! తమరికి స్వాగతము. ఈ ఆసనముపై క్షణకాలము కూర్చుండుడు. ఓ ప్రభూ! మీ రాకను మేము గమనించలేదు. మమ్ములను తమరు క్షమించ దగును.

ఓ తండ్రీ! మహరీ! నీ పాదములు మిక్కిలి సుకుమారములు అని పలికి శ్రీహరి తన చేతితో ఆ మహర్షి పాదములను నొక్కెను.

నీ పాదజలము గంగాది తీర్థములకు పావనము చేసే శక్తినిచ్చును. దానితో నన్ను, నా వైకుంఠలోకమును, నాయందున్న లోకపాలకులను కూడ పవిత్రము చేయుము

ఓ పూజనీయా! ఈనాడు నేను లక్ష్మీదేవికి ఏకాంతమగు ఆశ్రయమునైతిని. తమరి పాదముయొక్క స్పర్శ నాలోని దోషములను నశింపజేసినది. లక్ష్మీదేవి నా వక్షఃస్థలము పై నిత్యనివాసము చేయగలదు.

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను -- శ్రీహరి ఇట్లు పలుకుచుండగా ఆయన యొక్క మధురమైన వాక్కుచే భృగుమహర్షికి సుఖము, తృప్తి కలిగెను. ఆయన భక్తిచే విహ్వలుడై, కన్నుల నీరు నిండగా, మిన్నకుండెను.

ఓ పరీక్షిన్మహారాజా! భృగుమహర్షి సత్రయాగమునకు తిరిగి వచ్చి, వేద వేత్తలగు మహర్షులకు తన అనుభవమును నిశ్శేషముగా వర్ణించెను.

ఆ వృత్తాంతమును విని మహర్షులు అప్పుడు చకితులైరి. వారి సంశయములు తొలగిపోయేను. శ్రీహరియే గొప్పవాడని వారు విశ్వసించిరి. శ్రీహరి వలననే శాంతి, అభయము సిద్ధించును.

శ్రీహరి వలన ధర్మము, సాక్షాత్కారరూపమైన జ్ఞానము, ఆ జ్ఞానముతో కూడిన వైరాగ్యము, అణిమాద్యషైశ్వర్యములు కలుగును. శ్రీహరి కీర్తి అంతఃకరణమాలిన్యమును పోనాడును.

భూతహింసను, సర్వస్వమును విడిచి పెట్టి శాంతులై సమచిత్తులై పరోపకారమును చేసే మహర్షులు పొందే మోక్షఫలము ఆ శ్రీహరియేనని చేప్పెదరు.

శ్రీహరికి సత్త్వప్రధానమగు మూర్తి ప్రియము. ఆయనకు బ్రాహ్మణులే ఇష్ట దైవము. ఆయనను నిష్కాములు, శాంతులు, వివేకపూర్ణమగు బుద్ధి గలవారు అగు సాధకులు భజించెదరు.

ఆ శ్రీహరికి సత్త్వరజస్తమోగుణాత్మికయగు మాయాశక్తిచే రాక్షసులు (క్రూరస్వభావులు, తామసులు), అసురులు (భోగపరాయణులు, రాజసులు), దేవతలు (చిన్మయులు, సాత్త్వికులు) అనే మూడు రూపములు సృష్టించబడినవి. ఆయనయొక్క సత్త్వగుణప్రధానమగు మూర్తి పురుషార్థ హేతువు.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సరస్వతీనదీతీరవాసులగు వేదవేత్తలు ఈ విధముగా మానవుల సంశయమును నివారణ చేసిరి. వారు పూర్ణుడగు శ్రీహరియొక్క పద్మములవంటి పాదములను సేవించి ఆయన స్వరూపమును పొందిరి.

సూతమహర్షి ఇట్లు పలి కెను --- పురుషోత్తమునియొక్క మహిమ సంసారభయమును పోగొట్టునది, కొనియాడదగినది. వ్యాసపుత్రుడగు శుకమహర్షియొక్క ముఖపద్మమునుండి జాలువారే ఆ మహిమ పరిమళభరితమైన అమృతమువంటిది. సంసారయాత్ర చేసే సాధకుడు దానిని మరల మరల చెవులనే దొప్పలతో పానము చేసినచో, సంసారమునందు తిరుగుటచే కలిగే శ్రమ దూరమగును.

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఒకప్పుడు ద్వారకానగరములో ఒక బ్రాహ్మణపత్నికి ప్రసవమాయెను. శిశువు పుట్టి నేలపై పడుటతోడనే మరణించెను.

వ్యాకులమైన చిత్తము గల ఆ బ్రాహ్మణుడు ఏడ్చుచుండెను. దీనమైన మనస్సు గల ఆతడు మరణించిన శిశువును తీసుకువెళ్లి రాజద్వారము వద్ద పెట్టి ఇట్లు పలి కెను.

ఈ రాజు బ్రాహ్మణులను ద్వేషించే అధముడు. ఈతని బుద్ధి మోసపూరితము. ఈ లోభి మనస్సు భోగములయందు లగ్న మై యున్నది. వీని కర్మయందలి దోషము వలన నా పిల్లవాడు మరణించెను.

రాజు చేడు శీలము గలవాడై హింసయందు విహరిస్తూ ఇంద్రియజయము లేనివాడైనచో, అట్టి రాజును సేవించే ప్రజలు దరిద్రులై నిత్యము దుఃఖములననుభవిస్తూ ఇడుముల పాలగుదురు.

వేదవేత్తయగు ఆ మహర్షియొక్క రెండవ, మూడవ శిశువులు కూడ ఇదే విధముగా మరణించగా, ఆయన రాజద్వారము వద్ద మృతశిశువును ఉంచి, అదే విధముగా బిగ్గరగా పలికెను.

ఒకనాడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని వద్దనుండెను. అప్పుడు మరల ఆ బ్రాహ్మణుని తొమ్మిదవ పిల్లవాడు మరణించెను. ఆ బ్రాహ్మణుడు పలికిన పలుకులను అర్జునుడు విని ఆయనతో నిట్లనెను.

ఓ మహర్షీ! నీవు నివసించే ఈ ద్వారకయందు ధనుస్సు పట్టిన అధమ క్షత్రియుడు కూడ లేడా యేమి? ఈ యదువంశక్షత్రియులు బ్రాహ్మ ణులుగా మారి పాలనను విడిచి యాగములో కూర్చుండినారు కాబోలు!

ఏ రాజ్యమునందైతే బ్రాహ్మణులు ధనమును, భార్యను, సంతానమును కోల్పోయి దుఃఖించెదరో, ఆ పొలకులు రాజు వేషములోనున్న నటులు, వారు రాజ్యాధికారముతో పొట్ట పోసుకొని జీవించువారు మాత్రమే.

ఓ పూజనీయా! దీనులగు మీ దంపతుల పిల్లలను నేను ఇప్పుడు ఇక్కడ రక్షించెదను. ప్రతి నెరవేర్చకపోయినచో, నేను అగ్నిలో ప్రవేశించెదను. దానిచే, నా పాపములన్నియు నశించగలవు.

బ్రాహ్మణుడిట్లు పలి కెను --- బలరాముడు, శ్రీకృష్ణుడు, ధనుర్ధారులలో శ్రేష్ఠుడగు ప్రద్యుమ్నుడు, సమ ఉజ్జీ లేని అనిరుద్దుడు నా సంతానమును కాపాడలేకపోయిరి.

జగన్నాథులు చేయలేకపోయిన ఆ పనిని నీవు ఎట్లు చేసెదవు? నీవు తెలివి తక్కువదనముచే ఆ పనిని చేయగోరుచున్నావు. నిన్ను మేము విశ్వసించము.

అర్జునుడిట్లు పలికెను --- ఓ బ్రాహ్మణుడా! నేను బలరాముడను గాని, శ్రీకృష్ణుడను గాని, ఆయన పుత్రుడగు ప్రద్యుమ్నుడను గాని కాను. నేను అర్జునుడని ప్రసిద్ధి చెందినవాడను. నా ధనుస్సైతే గాండీవము.

ఓ బ్రాహ్మణా! ముక్కంటిని సంతోష పెట్టిన నా పరాక్రమమునవమానించకుము. ఓ ప్రభూ! నేను యుద్దములో యమధర్మరాజును జయించి నీ సంతానమును తీసుకురాగలను.

శత్రువులను తపింపజేసే పరీక్షిన్మహారాజా! అర్జునుడీ విధముగా ఆ బ్రాహ్మణునకు నమ్మకము కలిగించెను. ఆయన సంతోషిస్తూ తన యింటికి వెళ్లాను. ఆయన అర్జునుని పరాక్రమమును గురించి వినుచుండెను.

భార్యకు ప్రసూతి కాలము వచ్చెను. ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు దుఃఖముతో కంగారు పడుతూ, సంతానమును మృత్యువునుండి కాపాడుము, కాపాడుము, అని అర్జునునితో చెప్పెను.

ఆ అర్జునుడు స్వచ్చమైన నీటిని త్రాగి, మహేశ్వరునకు నమస్కరించి, దేవతలిచ్చిన అస్త్రములను స్మరించి, నారిత్రాడు తగిల్చిన గాండీవమును తీసుకోనెను.

అర్జునుడు అనేకములైన అస్త్రములను సంధానము చేసిన బాణములతో ప్రసవగృహమును చుట్టూ కట్టివేసెను. అడ్డముగా, పైన, క్రింద బాణముల పంజరమును చేసెను.

తరువాత బ్రాహ్మణుని భార్య పిల్లవాడిని కనెను. ఆ పిల్లవాడు మరల మరల యేడుస్తూనే వెంటనే ఆకాశమార్గము గుండా శరీరముతో సహా కనబడకుండా పోయెను.

అప్పుడు బ్రాహ్మణుడు అర్జునుని శ్రీకృష్ణుని సన్నిధిలోనే నిందిస్తూ ఇట్లు పలి కెను --- నా మూర్ఖత్వమును చూడుడు. నపుంసకుని బడాయి కబుర్లను నేను నమ్మితిని.

ప్రద్యుమ్నుడు, అనిరుద్దుడు, బలరాముడు, శ్రీకృష్ణ భగవానుడు కూడ నా సంతానమును రక్షించలేకపోయినారు. అట్టి స్థితిలో రక్షించగల మొనగాడు ఎవడు ఉండును? (ఉండడు).

అసత్యమును పలికే అర్జునునకు, తన గొప్పలు చెప్పుకునే అర్జునుని ధనుస్సునకు నింద యగుగాక! అర్జునుడు దుర్బుద్ధి, మూర్ఖుడు. కావుననే, దైవము తీసుకుపోయిన నా సంతానమును తీసుకురా గోరుచున్నాడు.

వేద వేత్తయగు మహర్షి ఈ విధముగా . తిట్టుచుండెను. అర్జునుడు యోగవిద్యనాశ్రయించి వెంటనే యమభగవానుడు నివసించే సంయమనీ నగరమునకు వెళ్లాను.

అక్కడ అర్జునునకు బ్రాహ్మణుని పుత్రుడు కనబడలేదు. ఆయన " శస్త్రధారియై అక్కడనుండి ఇంద్ర-అగ్ని-నిరృతి-సోమ-వాయు-వరుణ దేవతల పురములకు, పాతాళమునకు, స్వర్గముయొక్క పైభాగమునకు, ఇతరములగు యక్షపురి మొదలైన ధామములకు వెళ్లాను.

అర్జునునకు బ్రాహ్మణుని పుత్రుడు లభించలేదు. ఆయన తాను చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకొనలేకపోయెను. అప్పుడాయన అగ్నిలో ప్రవేశించ గోరగా, శ్రీకృష్ణుడు వద్దని నివారిస్తూ ఇట్లు పలి కెను.

నీకు బ్రాహ్మణుని పుత్రులను చూపించెదను. నిన్ను నీవే అవమానించుకోనకుము. ఏ మానవులు నిన్ను తిట్టినారో, వారే మనకు స్వచ్ఛమైన కీర్తిని నిలబెట్టగలరు.

సర్వశక్తిమంతుడగు శ్రీకృష్ణుడీ విధముగా పలికి, అర్జునునితో కలిసి తన ప్రకాశించే రథమునెక్కి పడమటి దిక్కును ప్రవేశించెను.

ఏడేసి మర్యాదపర్వతములుండే ఏడు ద్వీపములను, ఏడు సముద్రములను, తరువాత లోకాలోకపర్వతమును కూడ దాటి, వారు చాల దట్టని చీకటిని ప్రవేశించిరి.

            భరతవంశీయులలో శ్రేష్ఠుడవగు ఓ రాజా! శైబ్యము, సుగ్రీవము, మేఘ పుష్పము, బలాహకము అనే గుర్రములు ఆ చీకటిలో దారి తప్పినవి.

శ్రీకృష్ణ భగవానుడు యోగేశ్వరులగు సనకాదులకు కూడ పరమేశ్వరుడు. గుర్రములు దారి తప్పుటను గాంచిన ఆయన వేయి సూర్యుల కాంతి గల తన చక్రమును ముందు పం పెను.

ప్రవేశింప శక్యము కాకుండా సృష్టికర్తచే చేయబడిన ఆ చీకటి మిక్కిలి భయమును గొల్పుచుండెను. మనోవేగము గల సుదర్శనచక్రము అంతకంటే పెద్ద కాంతితో చీల్చి వేస్తూ, రాముని ధనుస్సు నుండి విడిచి పెట్టబడిన బాణము సైన్యములను వలే, ఆ చీకటిని ప్రవేశించెను.

చక్రము ఆ చీకటిలో ఏర్పరచిన దారి గుండా ఆ చీకటికీ ఆవలనుండే తేజస్సును వారు చేరిరి. సర్వాతిశాయియగు ఆ తేజస్సు అంతమయ్యే హద్దు ఏదీ లేదు. సర్వమును వ్యాపించియున్న ఆ తేజస్సుచే కళ్లలో పొడిచినట్లు కాగా అర్జునుడు రెండు కళ్లను మూసుకొనెను.

ఆ చీకటికి ఆవల రథము జలాశయములో ప్రవేశించేను. మిక్కిలి బలమైన గాలిచే పైకి లేచిన పెద్ద కెరటములే ఆ జలాశయమునకు అలంకారములాయెను. ఆ జలాశయములో అచ్చెరువును గొలిపే పెద్ద భవనము ఉండెను. అతీశయముగా ప్రకాశించే ఆ భవనమునందు వెలిగిపోయే మణులతో పొదిగిన స్తంభములు వేయి ఉండెను.

ఆ జలాశయమునందు వారు చాల భయమును, విస్మయమును గొల్పే అనంతుని చూచిరి. ఆయనయొక్క వేయి తలలయందలి పడగలలో మణులు ప్రకాశించుచుండెను. రెండు వేల కన్నులు భయంకరముగా నుండెను. తెల్లని కొండ వలె ప్రకాశించే ఆ అనంతుడు నల్లని కంఠములను, నాలుకలను కలిగియుండెను.

సర్వవ్యాపకుడు, సర్వాతిశాయి అగు పురుషోత్తమ భగవానుడు మంచి పచ్చని వస్త్రమును దాల్చి ఆ అనంతుని పడగలనే సుఖకరమగు ఆసనముపై కూర్చుండెను. గొప్ప మహిమ గల ఆయన దట్టని మేఘము వలె ప్రకాశించేను. అందమైన నిడివి కన్నులు గల ఆయన ముఖము ప్రసన్నముగా నుండెను.

గొప్ప మణుల సమూహములు పొదిగిన కిరీటము, కుండలముల కాంతులచే వేలాది ముంగురులు అంతటా వెలిగిపోవుచుండెను. ఆయన పొడవాటి అందమైన ఎనిమిది భుజములు కలిగియుండెను. ఆయన మేడలో కౌస్తుభ మాణిక్యమును, వక్షఃస్థలము పై శ్రీవత్సమనే చిహ్నమును, వనమాలను కలిగియుండెను.

బ్రహ్మాది లోకపాలకులకు ప్రభుడగు ఆ నారాయణుని సునందుడు-నందుడు మొదలగు పార్షదులు, పుష్టి-శ్రీ-కీర్తి-మాయ అనే శక్తులు, చక్రము-గద మొదలగు ఆయుధములు, అణిమ మొదలైన అష్ట సిద్ధులు రూపు దాల్చి సేవించుచుండెను.

శ్రీకృష్ణ భగవానుడు తన రూపమే అయిన అనంతునకు నమస్కరించెను. ఆయనను చూచుటచే భయము కలిగిన అర్జునుడు కూడ నమస్కరించెను. బ్రహ్మాది లోకపాలకులకు ప్రభుడు, సర్వస్వరూపుడు అగు పురుషోత్తముడు దోసిలి యొగ్గిన వారిద్దరిని ఉద్దేశించి చిరునవ్వుతో గంభీరమగు వాక్కుతో నిట్లనెను.

మీ యిద్దరినీ చూడగోరి నేను బ్రాహ్మణుని పుత్రులను తీసుకువచ్చినాను. భూలోకమునందు ధర్మరక్షణకై మీరిద్దరు నా అంశచే అవతరించినారు. భూమికి బరువైన రాక్షసులను సంహరించి ఇచట నా సమీపమునకు మీరిద్దరు తొందరగా మరలి రండు.

మీరిద్దరు గొప్ప మహర్షులైన నరనారాయణులు. మీరు ఆప్తకాములే అయినా, లోకరక్షణకై జనులకు ఆదర్శముగా ధర్మమును ఆచరించుడు.

పరమేశ్వరుడైన పురుషోత్తమ భగవానునిచే ఈ విధముగా ఆదేశించబడిన ఆ శ్రీకృష్ణార్జునులు అటులనే అని పలికి ఆయనకు ప్రణమి ల్లిరి. అప్పుడు వారు బ్రాహ్మణపుత్రులను తీసుకొని వెళ్లిన దారినే తమ స్థానము (ద్వారక) నకు మరలి వచ్చిరి. వారు బ్రాహ్మణునకు పుత్రులను సమర్పించిరి. ఆ పిల్లవాండ్ల వయస్సు, రూపములలో తేడా ఏమీ లేదు.

శ్రీహరియొక్క వైకుంఠధామమును చూచి అర్జునునకు అత్యాశ్చర్యము కలిగెను. మానవులలో ఏ కొంచెము పురుషకారము ఉన్నా, అది శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహము మాత్రమేనని ఆతడు తలపో సెను.

శ్రీకృష్ణ భగవానుడీ విధముగా ఈ లోకములో ఇటువంటి అనేకములగు పరాక్రమములను ప్రదర్శించెను. ఆయన లౌకికములైన భోగములను భోగించుటయే గాక, మిక్కిలి సమృద్ధములగు యజ్ఞములతో పరమేశ్వరునారాధించెను.

శ్రేష్ఠమగు గృహస్థధర్మాచరణ గల శ్రీకృష్ణ భగవానుడు, సకాలములో ఇంద్రుడు వర్షించినట్లుగా, ఆయా కాలములలో బ్రాహ్మణులు మొదలైన ప్రజలకు సకలములైన కామనలను అధికముగా పూర్ణము చేసెను.

శ్రీకృష్ణ భగవానుడు అధర్మాత్ములగు రాజులలో కొందరిని తాను సంహరించెను. ఆయన ఇతరులను అర్జునుడు, భీముడు మొదలగువారిచే సంహరింపజేసెను. ఆయన ధర్మరాజు, ఉగ్రసేనుడు మొదలగువారిచే ధర్మమును తేలికగా అనుష్ఠింపజేసెను.

శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో భృగువు త్రిమూర్తులను పరీక్షించుటను, శ్రీకృష్ణుడు మరణించిన బ్రాహ్మణ బాలకులను మరల బ్రదికించుటను వర్ణించే ఎనుబది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది .