శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

2 - శ్రీకృష్ణావతారము - దేవతలు దేవకి గర్భమునందలి శ్రీహరిని స్తుతించుట

బలశాలియగు కంసునకు మగధరాజగు జరాసంధుడు ఆసరా. ఆతడు  ప్రలంబ-బక-చాణూర-తృణావర్త-అఘ-ముష్టిక-అరిష్ట-ద్వివిద-పూతనా- కేశి -ధేనుకులనే అనుచరులు తోడు కాగా, బాణాసురుడు నరకాసురుడు మొదలైన ఇతరరాక్షసరాజుల సాహాయ్యముతో యాదవుల వినాశమునకు పూనుకొనెను.

పీడించబడిన ఆ యాదవులు కురుపంచాల కేకయశాల్వవిదర్భనిషధ విదేహకోసలప్రాంతములకు వలస పోయిరి. కొందరు జ్ఞాతులు ఆ కంసుని అనుసరిస్తూ సేవించుచుండిరి.

ఉగ్రసేనుని పుత్రుడగు కంసుడు దేవకియొక్క ఆర్గురు పుత్రులను సంహరించేను. దేవకి ఏడవ సారి గర్భవతి ఆయెను. (సంతానము కలుగుననే) హర్షమును, (కంసుడు చంపుననే శోకమును కూడ వర్ధిల్లజేసే ఆ గర్భమునందు విష్ణువు యొక్క కళ యైన శేషుడు ఉండెను. ఆ శేషుడు అనంతుడని మహాత్ములు చెప్పెదరు.

సర్వమునకు ఆత్మ శ్రీహరియే. ఆ భగవానుడు తానే రక్షకుడై ఉన్న యాదవులకు కంసుని వలన కలిగిన భయమును గుర్తించి యోగమాయను ఆదేశించేను.

ఓ దేవీ! కల్యాణీ! గోపాలకులతో గోవులతో అందముగానుండే గోకులమునకు వెళ్లుము. నందగోకులమునందు వసుదేవుని భార్యయగు రోహిణి ఉన్నది. ఆయనయొక్క ఇతరభార్యలు కంసుని వలన భయపడి రహస్యస్థానములలో నివసించుచున్నారు గదా!

దేవకి యొక్క ఉదరమునందలి గర్భము శేషుడనే పేరు గల నా అంశయే. ఆ గర్భమునాకర్షించి రోహిణియొక్క ఉదరమునందు చక్కగా స్థాపించుము.

ఓ కల్యాణీ! తరువాత నేను జ్ఞానబలాదులతో భక్తులయందు ప్రకటమయ్యే రూపముతో దేవకికి పుత్రుడనై జన్మించెదను. నీవు నందుని భార్యయగు యశోదయందు పుత్రికవై జన్మించగలవు.

సకలములైన కామనలు గలవారలకు శ్రేష్ఠమైన ఈశ్వరివి నీవే. సకలములైన కామనలను వరములుగా ఇచ్చే నిన్ను మానవులు ధూప-పుష్ప-నైవేద్యాదులతో పూజించెదరు.

భూలోకములో మానవులు నిన్ను దుర్గ (కష్టములను గట్టెక్కించునది), భద్రకాళి (మంగళములను కలిగించునది), విజయ (జయమునిచ్చునది), వైష్ణవి (విష్ణువునకు చెందినది), కుముద (భూలోకమునందు ఆనందమును కలిగించునది), చండిక (దుష్టులపై కోపించునది), కృష్ణ (భక్తులనాకర్షించునది), మాధవి (మధువంశమునందు అవతరించినది), కన్యక (ఆనందమును పొందించునది), మాయ (అసంభవమును సంభవము చేయు శక్తి), నారాయణి (ప్రాణులయందు ప్రాణరూపముగా నున్నది), ఈశాని (సర్వమును శాసించునది), శారద (సంసారమును నశింపజేయునది, శత్రువులను హింసించునది, - శరత్కాలమునందు పూజించబడునది), అంబిక (ఆర్తభక్తులచే శరణు పొందబడునది) అనే పేర్లతో పిలుస్తూ పుణ్య క్షేత్రములను నిర్మించెదరు.

యోగమాయ గర్భమును దేవకీనుండి రోహిణిలోనికి ఆకర్షించుట వలన పుట్టినవాడగుటచే ఆ బాలకుని ఈ లోకములో జనులు సంకర్షణుడు అని పిలిచెదరు. ఆయన జనులను రమింప జేయుట వలన రాముడని, బలవంతులలో శ్రేష్ఠుడగుట వలన బలుడనియు ప్రఖ్యాతి జెందును.

శ్రీహరి భగవానుడు - ఈ విధముగా ఆదేశించగా. యోగమాయ అటులనే, సరే అని స్వీకరించి, ఆయనకు ప్రదక్షిణము చేసి భూలోకమునకు వెళ్లి, ఆమె ఆ మాటను అదే విధముగా అమలు చేసెను.

యోగమాయ దేవకీయొక్క గర్భమునాకర్షించి రోహిణియందు ప్రవేశ పెట్టెను. అప్పుడు పురజనులు, అయ్యో! దేవకి గర్భము నష్టమైనది, అని ఆక్రోశించిరి.

సర్వమునకు ఆత్మయగు శ్రీహరి భక్తులకభయమునిచ్చువాడు. ఆయన జ్ఞానము బలము మొదలైన అంశలతో భక్తులయందు ప్రకటమయ్యే రూపముతో వసుదేవుని మనస్సును ఆవేశించెను.

పురుషోత్తముడగు శ్రీహరియొక్క తేజస్సును ధరించియున్న ఆ వసుదేవుడు సూర్యుడు వలె ప్రకాశించుచుండెను. ప్రాణులు ఆయనను సమీపించ లేకపోయినవి. కంసాదులకైననూ ఆయనను తిరస్కరించుట శక్యము కాకుండెను.

తరువాత ప్రకాశించే దేవకి శూరుని పుత్రుడగు వసుదేవునిచే నిక్షేపించబడిన అచ్యుతుని రూపమును ధరించెను. సర్వమునకు సత్తాస్పూర్తులననుగ్రహిస్తూ సర్వప్రాణులలో ఆత్మరూపుడై యున్న శ్రీహరి జగత్కల్యాణము కొరకు అవతరించబోతున్నాడు. ఆ శ్రీహరిని దేవకి, తూర్పు దిక్కు అమృతకిరణుడగు చంద్రుని వలె, మనస్సుతో ధారణ చేసెను.

ఆ దేవకి సకలజగత్తునకు అధిష్టానమైన శ్రీహరిని తన గర్భమునందు దాల్చియుండెను. కుండయందు దాగియున్న అగ్నిజ్వాల వలన చుట్టూ ప్రకాశము ఉండదు. జ్ఞానవంచకునీ (జ్ఞానమును ఇతరులకు ఈయనివాడు, జ్ఞానమును జీవితములో ఆచరించనివాడు) యందలి జ్ఞానము వలన సమాజమునకు వెలుగు ఉండదు. అదే విధముగా, భోజప్రభువగు కంసుని కారాగారమునందు బంధించబడిన దేవకి అధికముగా ప్రకాశించలేదు.

అజేయుడగు శ్రీహరిని తనయందు కలిగియున్న దేవకియొక్క కాంతిచే కారాగృహము విశేషముగా ప్రకాశింప జొచ్చెను. స్వచ్చమగు చిరునగవు గల ఆ దేవకిని చూచి కంసుడు తనలో -- ఈమె ఇదివరలో ఉన్నట్లుగా లేదు; (సింహము గుహలో ప్రవేశించినట్లుగా) నా ప్రాణములను తీసే శ్రీహరి ఈమెయందు ప్రవేశించినాడు; ఇది నిశ్చయము -- అని తలపోసెను.

ఆ శ్రీహరి విషయములో ఇప్పుడు వెంటనే నేనేమి చేయవలెను? పని పూర్తి అగుటయే ప్రధానముగా గల వ్యక్తి కంగారు పడి తన పరాక్రమమునకు హాని కలిగే పనిని చేయరాదు. ఈమెనిప్పుడు చంపినచో, స్త్రీని అందులో చెల్లెలిని, అందులో గర్భవతిని చంపినచో, ఆ పని వెనువెంటనే కీర్తిని, సంపదను, ఆయుర్దాయమును నశింప జేయును.

 ఎవడైతే మిక్కిలి క్రూరమైన పనితో తన ప్రాణమును నిలబెట్టుకొనునో, అట్టి ఈతడు బ్రతికియున్ననూ చచ్చినట్లే గదా! ఇతరప్రాణులను హింసించి. తన దేహమును లాలించే వ్యక్తియొక్క దేహము మరణించినప్పుడు జనులు వానిని ఉద్దేశించి -- వీడు నిశ్చయముగా చీకటి గుయ్యారమనదగిన నరకమును పొందును -- అని తిట్టి పోసెదరు.

కంసప్రభుడు శ్రీహరియందు వైరమును నిరంతరముగా చేసెను. ఆతడీ విధముగా ఆలోచించి మిక్కిలి క్రూరమైన (స్త్రీని వధించుట) పనినుండి తనంత తానే విరమించుకొని, ఆ శ్రీహరియొక్క పుట్టుకకై వేచియుండెను.

కంసునకు కూర్చున్నా, పరున్నా, నిలుచున్నా, తింటున్నా, రాజ్యములో పర్యటిస్తున్నా, ఇంద్రియాధిపతియగు శ్రీహరిని గురించిన తలపులే ఉండెను. ఆతనికి జగత్తు అంతా శ్రీహరితో నిండియున్నట్లుగా కనబడెను.

బ్రహ్మదేవుడు, రుద్రుడు కూడ నారదుడు భృగువు మొదలైన మహర్షులతో కూడి అచటకు వచ్చిరి. అనుయాయులతో బాటుగా దేవతలు వారి వెంట వచ్చిరి. వారందరు వరములను వర్షించే శ్రీహరిని స్తుతించిరి.

నీవు సత్యసంకల్పుడవు. నిన్ను పొందే సాధనములలో సత్యము గొప్పది. నీవు సృష్టి స్థితిలయకాలములు మూడింటియందు నిలిచి యుందువు. పృథివి, జలములు, అగ్ని (సత్), వాయువు, ఆకాశము (త్యత్) అనే పంచభూతముల పారమార్థిక స్వరూపము నీవే నీవే వాటికి కారణమై పోటియందు అంతర్యామివై ఉన్నావు. సత్యవచనమును, సమదర్శనమును ప్రవర్తిల్ల జేసే సత్యస్వరూపుడవైన నిన్ను మేము శరణు వేడుచున్నాము.

ఏలయన, ఈ వ్యష్టిసమష్టిదేహరూపమైన సనాతనమగు సంసారము చెట్టు వంటిది. పరమేశ్వరుని మాయాశక్తి మాత్రమే దీనికి ఆశ్రయము. దీనికి సుఖదుఃఖములనే రెండు ఫలములు, సత్త్వరజస్తమోగుణములనే మూడు వ్రేళ్లు, ధర్మార్థకామమోక్షములనే నాలుగు రసములు గలవు. దీనిని శ్రోత్రత్వక్చక్షుర్జిహ్వాఘాణములనే ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా తెలియ దగును. పుట్టుట-ఉండుట- పెరుగుట-పరిణామమును చెందుట-క్షీణించుట. నశించుట అనే ఆరు పదార్థవికారములే దీని స్వభావములు. రసము, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముకలు, మూలుగు, చర్మములనే ఏడు ధాతువులే దీని బెరడులు. పృథివ్య స్తేజోవాయ్వాకాశములు మనో బుద్ద్యహంకారములు అనే ఎనిమిది దీని కొమ్మలు. దేహమునందలి తొమ్మిది రంధ్రములే దీని తొర్రలు. ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన సమానములు, నాగకూర్మకృకలదేవదత్తధనంజయములనే పది వాయువులే దీని ఆకులు. జీవేశ్వరులనే రెండు పక్షులు దీనిపై గలవు.

ఈ కార్యజగత్తు (సంసారవృక్షము) నీనుండి పుట్టి నీయందే విలీనమగును. దీనిని పాలించేది కూడ నీవే. నీ మాయచే కప్పివేయబడిన వివేకజ్ఞానము గలవారలు నీయందు భేదమును దర్శించెదరు. వారు సత్యము తెలిసినవారు కారు. (నీ మాయచే కప్పివేయబడని వివేకజ్ఞానము గల విద్వాంసులు నిన్ను భిన్నముగా దర్శించరు).

చైతన్యస్వరూపమగు ఆత్మవు నీవే. నీవు స్థావరజంగమాత్మకమగు ప్రాణివర్గముయొక్క క్షేమము కొరకై పలుమార్లు అవతారములను దాల్చెదవు. సత్త్వగుణప్రధానమగు నీ అవతారములు సజ్జనులకు సుఖమును, దుష్టులకు అమంగళమును కలిగించును.

పద్మములవంటి కన్నులు గల ఓ శ్రీహరీ! కొద్దిమంది శుద్ధసత్త్వస్వరూపుడవగు నీయందు ఏకాగ్రతతో మనస్సును లగ్నము చేసి, నీ పాదములనే పడవగా చేసుకొని సంసారసముద్రమును, ఆవు దూడ గిట్ట గాడిని దాటినంత తేలికగా, దాటి వేసెదరు. మహాత్ములు నీ పాదములనే శరణు జొచ్చి కృతార్థులైరి.

స్వయంప్రకాశస్వరూపుడవగు ఓ శ్రీహరీ! సంసారమనే సముద్రము భయంకరమైనది. దానిని దాటుట చాల కష్టము. ఆ మహాత్ములు దానిని చక్కగా తాము దాటివేసి, ప్రాణులపై గోప్ప దయ గలవారై, నీ పాదపద్మములనే నావను ఈ లోకమునందే విడిచి పెట్టి వెళ్లిరి (నీ పాదములయందలి భక్తిని లోకములో ప్రవర్తిల్ల జేసిరి). నీకు సజ్జనులపై . అనుగ్రహము మెండు.

మరి కొందరు తాము విముక్తులమనే అహంకారము కలిగి. నీ పొదములనాదరించరు. వారిలో భక్తి కొరవడుట వలన వారి అంతఃకరణమునందలి మాలిన్యము తొలగిపోదు. వారు . తపస్సు మొదలగు కఠినసాధనలతో సర్వాతిశాయి. స్థానమును పొందిననూ, అక్కడనుండి క్రిందకు పడిపోయెదరు.

ఓ లక్ష్మీపతీ! నీయందు దృఢమగు ప్రేమ గల ఆ నీ భక్తులు ఆ విధముగా (భక్తి లేనివారు వలే) ఏనాడైననూ యోగభ్రష్టులు కారు. ఓ ప్రభూ! నీచే అన్ని వైపులనుండియు రక్షించబడే ఆ భక్తులు నిర్భయులై విఘ్నకర్తల సైన్యముయొక్క అధ్యక్షుల తలలపై సంచరించెదరు (విఘ్నములనన్నింటినీ జయించెదరు).

నీవు స్థితికాలమునందు రజస్తమోగుణముల కల్తీ లేని శుద్ధసత్త్వగుణప్రధానుడవై ప్రాణులకు మోక్షముననుగ్రహించే రూపమును ఉపాధిగా స్వీకరించెదవు. ఆ రూపము ద్వారా మానవుడు వేదములనధ్యయనము చేసి, కర్మలననుష్ఠించి, యోగానుష్ఠానమును మరియు తపస్సును చేసి, సమాధి (ఏకాగ్రచిత్తము) తో నిన్ను చక్కగా ఆరాధించగల్గును.

ఓ విధాతా! శుద్ధసత్త్వ ప్రధానమైన నీ- ఈ రూపము లేకున్నచో, అజ్ఞానము వలన కలిగే భేదబుద్ధిని పోనాడే ఆత్మజ్ఞానమే ఉండెడిది కాదు. ఈ బుద్ది, మనస్సు మొదలైన గుణవికారములు ఆత్మకు చెందినవియే (అనగా సాక్షియగు ఆత్మ చైతన్యముచే ప్రకాశింప జేయబడేవే. ఆత్మచే అధిష్టించబడిన బుద్ధి మొదలైనవి బాహ్యమునందలి శబ్దాది గుణవికారములను ప్రకాశింప జేయుచున్నవి. ఈ విధముగా ఆత్మ చైతన్యముచే ప్రకాశింప జేయబడే బుద్ధి మొదలైన ఇంద్రియములు ద్వారా, మరియు వాటిచే ప్రకాశింప జేయబడే శబ్దము మొదలైన గుణవికారముల ద్వారా, నిన్ను జ్ఞానయోగులు ఆత్మరూపముగా సాక్షాత్కరించుకొనెదరు. (ఆత్మయందు నిష్ఠను పొంది ఉండుట మాత్రమే. సంభవము. ఆత్మను ఇంద్రియములతో కనుట గాని, మనస్సుతో భావన చేయుట గాని సంభవము కాదు. కాని, భగవానుని రూపమును ఇంద్రియములతో కని మనస్సుతో భక్తిని చేయవచ్చును).

ఇంద్రియసంఘాతమును ప్రకాశింపజేసే సాక్షి చైతన్యము నీవే. నిన్ను పొందే జ్ఞానమార్గమును సూక్ష్మమగు బుద్ధి మాత్రమే తెలియగలదు. వాత్సల్యము మొదలగు గుణములతో, మత్స్యము మొదలైన జన్మలతో, గోవర్ధనోద్ధారము మొదలైన లీలలతో, కూడియుండే నీ నామరూపములను (అవి అనంతములగుట వలన) మనస్సుతో భావించుట గాని, వాక్కుతో కీర్తించుట గాని సంభవము కాదు. ఓ దేవా! అయినప్పటికీ నీ ఆరాధనయందు నిష్ఠ గల భక్తులు నీ నామములను కీర్తిస్తూ, నీ రూపములను మనస్సుతో ధ్యానిస్తూనే ఉన్నారు. (అనగా, మనస్సునకు వాక్కునకు అందని భగవానుడు భక్తుని భక్తికి అందునని యర్థము).

ఎవడైతే పద్మములవంటి నీ రెండు పాదములయందు మనస్సును లగ్నము చేసి కల్యాణకరములైన నీ పేర్లను వింటూ కీర్తిస్తూ స్మరిస్తూ మరియు ధ్యానము చేస్తూ, తన పనులను చేసుకొనునో, అట్టివాడు మరల సంసారములో పడే ప్రసక్తి ఉండదు.

ఓ శ్రీహరీ! జగన్నియామకుడవగు నీ పుట్టుకచే నీ పాదమే అయిన ఈ భూమియొక్క భారము తొలగిపోయినట్లే. ఇది దైవానుగ్రహమే. మిక్కిలి సుందరమైన నీ కోమలములైన పాదముల గుర్తులు నేలపై పడగలవు. స్వర్గలోకము కూడ నీ దయకు పాత్రము కాగలదు. ఈ దైవానుగ్రహమును మేము కాంచెదము.

ఓ ఈశ్వరా! అభయమునకు ఆశ్రయము నీవే. పుట్టుకయే లేని నీకు పుట్టుటకు కారణము వినోదమే. అది కాక మరియొక కారణమును మేము ఊహ చేయలేము. ఎందుకంటే, ఆత్మస్వరూపుడవగు నీయందు పుట్టుక, జీవించి యుండుట, మరణము అనేవి అజ్ఞానముచే కల్పించబడినవి.

ఓ ఈశ్వరా! యాదవులలో శ్రేష్ఠుడవు నీవే. నీవు ఇదివరలో మత్స్య-హయగ్రీవ-కూర్మ-నృసింహ-వరాహ-హంస-శ్రీరామ-పరశురామ వామనరూపములుగా అవతరించి మమ్ములను, ముల్లోకములను కూడ పాలించితివి. . అదే విధముగా, ఇప్పుడు కూడ భూభారమును తొలగించుము. నీకు నమస్కారము.

అమ్మా దేవకీ! ఇదివరలో శ్రీహరి అంశయగు శేషుడు నీ గర్బమునందు ప్రకటమైనాడు. ఇప్పుడు సాక్షాత్తుగా పురుషోత్తముడగు శ్రీహరి భగవానుడే మా క్షేమము కొరకై నీ గర్బమును పొందియున్నాడు. ఇది దైవానుగ్రహము. భోజదేశాధిపతియగు కంసుడు మృత్యువును ఏరి కోరి తెచ్చుకొనుచున్నాడు. నీవు వానికి భయపడవద్దు. నీ పుత్రుడు యాదవులను తప్పక రక్షించగలడు.

శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను -- దేవతలు బ్రహ్మను శివుని ముందడుకొని పూర్ణుడగు శ్రీహరిని ఈ విధముగా స్తుతించిరి. శ్రీహరి యథార్థస్వరూపము కంటికి కనబడేది (ఇంద్రియగోచరము) కాదు. అప్పుడు వారు స్వర్గమునకు వెళ్లిరి.

శ్రీమద్భాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో దేవతలు దేవకీగర్భమునందలి శ్రీహరిని స్తుతించుటను వర్ణించే రెండవ అధ్యాయము ముగిసినది (2).