శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
28 - శ్రీకృష్ణుడు నందుని వరుణలోకమునుండి విడిపించుట
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- నందుడైతే ఏకాదశి నాడు ఉపవాసము చేసి, దుష్టజనశిక్షకుడగు శ్రీహరిని బాగుగా పూజించెను. ద్వాదశినాడు స్నానము కొరకై యమునానదీజలములయందు ప్రవేశించెను.
అది రాత్రియందలి రాక్షసులకు చెందిన వేళ, ఆ విషయము తెలియని నందుడు నీటిలో ప్రవేశించెను. వరుణుని సేవకుడగు రాక్షసుడాతనిని పట్టుకొని వరుణుని వద్దకు తీసుకొని పోయెను.
ఓ పరీక్షిన్మహారాజా! నందుని రక్షకులగు గోపాలకులకు ఆయన కానరాలేదు. అపుడు వారు ఓ శ్రీకృష్ణా! ఓ బలరామా! అంటూ ఆక్రోశించిరి. అది విని, వరుణుడు నందుని కొనిపోయినాడని శ్రీకృష్ణుడు తెలుసుకొనెను. తన వారలకు అభయమునిచ్చే ఆయన ఆ వరుణుని వద్దకు వెళ్లెను.
ఇంద్రియాధిపతియగు శ్రీకృష్ణుడు వచ్చుటను పశ్చిమదిక్పాలకుడగు వరుణుడు చూచెను. ఆయన దర్శనముచే వరుణునకు గొప్ప ఉత్సాహము కలిగెను. ఆయన ఆ భగవానుని గొప్ప సపర్యతో పూజించి ఇట్లు పలికెను.
వరుణుడిట్లు పలికెను --- ఓ ప్రభూ! ఈనాడు నా జన్మ సార్థకమైనది. నాకీనాడే పరమప్రయోజనము సిద్ధించినది. ఓ భగవానుడా! నీ పాదములను శరణు వేడువారు సంసారమార్గము యొక్క ఆవలి గట్టు (మోక్షము) ను చేరెదరు.
నిర్గుణ పరబ్రహ్మవు, సగుణబ్రహ్మవు, ప్రాణులలోని అంతరతమమగు ఆత్మవు నీవే. నీకు నమస్కారము. లోకముల సృష్టి రూపములోనుండే వివిధములగు కల్పనలకు ఆశ్రయమైన మాయాశక్తి నీయందు నీకంటె భిన్నముగా లేదని శ్రుతి చెప్పుచున్నది.
నా సేవకుడు కార్యపరిజ్ఞానము లేని మూర్ఖుడు. నీ తండ్రి అని తెలియక ఈయనను తీసుకువచ్చినాడు. ఆ పనిని నీవు క్షమించదగును.
ఓ శ్రీకృష్ణా! నీవు సకలసాక్షివి, గోవిందుడవు, తండ్రియందు అనురాగము గలవాడవు. నీవు నన్ను కూడ అనుగ్రహించవలెను. ఈ నీ తండ్రిని నీతోబాటు తీసుకువెళ్లుము.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- లోకపాలకులకు కూడ ప్రభుడగు శ్రీకృష్ణ భగవానుని వరుణుడీ విధముగా ప్రసన్నుని చేసెను. ఆయన తన తండ్రిని తీసుకువెళ్లెను. నందుని చూచి బంధువులు ఆనందించిరి.
లోకపాలకుడగు వరుణుని ఐశ్వర్యము మామూలుగా కంటికి కానరాదు. నందుడైతే దానిని చూచెను. పైగా, ఆ లోకములోని వారందరు శ్రీకృష్ణుని యెడల చూపిన వినయమును చూచి నందుడు ఆశ్చర్యపడి, ఆ విషయమును బంధువులకు చెప్పెను.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ గోపాలకులైతే ఆ శ్రీకృష్ణుడు ఈశ్వరుడని తెలుసుకొనిరి. ఈ సర్వేశ్వరుడగు శ్రీకృష్ణుడు మనకు ఇంద్రియగోచరము కాని తన ధామమును చూపునా? అని వారి మనస్సులలో ఉత్కంఠ కలిగెను.
సర్వసాక్షియగు ఆ శ్రీకృష్ణ భగవానుడు తన వారలకున్న ఈ విధమైన అభిప్రాయమును స్వయముగా గుర్తించెను. ఆయన దయతో వారి అభిలాష సిద్ధించుటకై ఈ విధముగా సంకల్పించెను.
మానవుడైతే లోకములో అజ్ఞానము - కామనలు - కర్మలచే ఉత్తమములు మరియు అధమములు అగు జన్మలను పొందుతూ పరిభ్రమించుచుండునే గాని, తన స్వరూపమును తెలుసుకొనడు.
గొప్ప కరుణామయుడగు శ్రీకృష్ణ భగవానుడీ విధముగా సంకల్పించి, గోపాలకులకు అజ్ఞానమునకు ఆవలనుండే తన ధామమును చూపెను.
ఆ ధామము అనంత సంబ్రహ్మయే. అది కాలాతీతమైన స్వయంప్రకాశ చైతన్యము. మహర్షులు ఏకాగ్రమగు చిత్తముతో సత్త్వరజస్తమోగుణముల సధిగమించి ఆ పంబ్రహ్మను ఆత్మరూపముగా దర్శించెదరు.
ఏ జలాశయమునందైతో భగవానుడు అక్రూరునకు తన స్వరూపమును చూపైనో, అదే జలా శయమునకు శ్రీకృష్ణుడు గోపాలకులను తీసుకు వెళ్లెను. వారు దానిలో మునిగి పరబ్రహ్మ యొక్క వైకుంఠ భామమును దర్శించిరి. వారిని ఆయన మరల పైకి తీసుకువచ్చెను.
నందుడు మొదలగు గోసాలకులైతే ఆ లోకమునందు వేదములు కూడ శ్రీకృష్ణుని స్తుతించుచుండుటను గాంచి పరమాశ్చర్యమునందు, మహానందమునందు నిమగ్ను లైరి.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము
పూర్వార్ధములో శ్రీకృష్ణుడు నందుని వరుణులోకము నుండి విడిపించుటను
వర్ణించే ఇరువది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (28).
