శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

33 - మహా రాస లీల

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మిక్కిలి మధురమైన మాటలను విని గోపికలకు విరహము వలన కలిగిన తాపము దూరమయ్యెను. ఆయన చేతులను, కాళ్లను స్పృశించుటచే వారి మనోరథములు పూర్ణమయ్యెను.

గోవిందునకు వశవర్తినులై ప్రేమ గల ఆ గొప్ప యువతులతో గోవిందుడు రాసక్రీడ (గుండ్రముగా చేసే నాట్యము,రసోల్లాసమును కలిగించేది) ను ప్రారంభించెను. వారు ఒకరి చేతులను మరియొకరు పట్టుకొనిరి.

శ్రీకృష్ణుడు నుండలాకారముగా నిలబడిన గోపికలే అలంకారము కాగా రాసలీల అనే ఉత్సవమునారంభించెను. యోగమాయకు ప్రభుడగు శ్రీ కృష్ణుడు వారిలో ఇద్దరిద్దరి మధ్య ప్రవేశించి వారిని కంఠమునందు కౌగిలించెను. ప్రతి గోపికకు శ్రీకృష్ణుడు తన ప్రక్కనే కానవచ్చెను. స్వర్గవాసులగు దేవతలు ఉత్కంఠతో పరవశమైన మనస్సులు గలవారై భార్యలతో సహా వచ్చిరి. వారి విమానములతో ఆకాశము రద్దీగా నుండెను.

అప్పుడు దేవదుందుభులు మ్రోగి పూల వానలు కురిసినవి. గంధర్వనాయకులు అప్సరసలతో కూడి ఆ శ్రీకృష్ణుని నిర్మలమైన కీర్తిని గానము చేసిరి.

రాసక్రీడ యొక్క వలయమునందు ప్రియుడగు శ్రీకృష్ణునితో కూడి గోపికలు నాట్యము చేసిరి. కంకణములు, కాలియందెలు, వడ్డాణముల చిరుగంటలు సంకులమగు ధ్వనిని చేసినవి.

దేవకి పుత్రుడగు శ్రీకృష్ణ భగవానుడు ఆ రాసమండలమునందు ఆ గోపికలతో గూడి, హారములో బంగరు రంగు గల మణుల మధ్యలో పెద్ద నీలమణి వలె, అతిశయించి శోభిల్లెను.

            శ్రీకృష్ణుని ప్రేమించే ఆ గోపికలు అడుగులను వేస్తూ, చేతులను త్రిప్పుతూ, చిరునవ్వుతో కనుబొమలను విరుస్తూ నాట్యమును చేయుచుండిరి. వారి నడుములు విరిగినవా యన్నట్లు వంగుచుండెను. వారి పై కొంగులు ఎగురుచుండగా కదలాడే కుండలములు చెక్కిళ్లపై ప్రకాశించెను. వారు జుట్టును, కాంచిని గట్టిగా ముడి వేసుకొని నాట్యము చేస్తూంటే ముఖముపై చెమట పొడసూ పెను. వారు కృష్ణుని కీర్తిని గానము చేస్తూ, మేఘముల గుంపులో మెరుపుల వలె అధికముగా శోభిల్లిరి.

ఎర్రని కంఠము గల గోపికలకు విహారమంటే ప్రీతి. వారు నాట్యము చేస్తూ బిగ్గరగా గానము చేసిరి. శ్రీకృష్ణుని స్పర్శచే వారికి ఆనందము కలిగెను. వారి గానముతో రాసమండలము ప్రతిధ్వనించెను.

ఒక గోపిక మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణునితో కలిపి పొడెను. కాని ఆమె తన రాగముల ఆలాపన గతులు శ్రీకృష్ణుని రాగముతో కలిసిపోకుండా హెచ్చు స్వరముతో గానము చేసెను. అపుడాయన సంతోషించి, బాగు బాగు అని ప్రశంసించెను. ఇంకో గోపిక అదే హెచ్చు స్వరముతో ధ్రువ తాళమును పాడెను. ఆయన ఆమెను కూడ అధికముగా కొనియాడెను.

ఇంకో గోపిక రాసక్రీడచే అలసిపోయెను. చేతినుండి కంకణములు, జుట్టునుండి మల్లె పూలు జారిపోవుచుండెను. ఆమె ప్రక్కనే ఉన్న వేణుధారియగు శ్రీకృష్ణ భగవానుని భుజమును చేతితో పట్టుకొనెను.

వారిలో ఒకామె తన భుజము పైనున్న శ్రీకృష్ణుని చేతిని ఆఘ్రాణించి ముద్దాడి రోమాంచమును పొందెను. కలువల సుగంధము గల ఆ చేయి అంతటా చండనము అలదబడి యుండెను. కస్యాశ్చిన్నాట్య

ఒకామె నాట్యము చేస్తూంటే కదలాడే కుండలముల కాంతియే చెక్కిలికి అలంకారమాయెను, ఆమె ఆ చెక్కిలిని తన చెక్కిలికి ఆనించగా, శ్రీ కృష్ణుడామెకు తాంబూలచర్వితమునిచ్చెను.

ఒక గోపిక కాలియందేలు, కాంచి ధ్వని చేయునట్లుగా నాట్యము చేసి పాడి అలసిపోయెను. ఆమె తన ప్రక్కనే ఉన్న శ్రీకృష్ణ భగవానుని పద్మమువంటి సుఖకరమైన చేతిని తన వక్షఃస్థలము పై ఉంచుకొనెను.

లక్ష్మీదేవికి మిక్కిలి ప్రియుడగు శ్రీకృష్ణ భగవానుని ప్రియునిగా పొందిన గోపికలు ఆయన కీర్తిని గానము చేస్తూ విహరించిరి. ఆయన తన రెండు చేతులతో వారిని కంఠములయందు కౌగిలించెను.

చెవులయందు కలువలను పెట్టుకొని గోపికలు శ్రీకృష్ణభగవానునితో గూడి రాససభయందు నాట్యము చేసిరి. ముంగురులే అలంకారములైన చెక్కిళ్లయందలి చెమట బిందువులతో వారి ముఖములు శోభిల్లెను. కంకణములు, కాలియండెలు, వడ్ఢాణముల చిరుగంటలు ఆ నాట్యమునకు వాద్యములు కాగా, తుమ్మెదలే పాటగాళ్లు ఆయెను. ఇట్లు వారు నాట్యమాడుచుండ, వారి కేశముల యందలి మాలలు జారిపోవుచుండెను.

ఈ విధముగా లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుడు గోకులము సంకలి సుందరయువతులతో కలిసి క్రీడించెను. పిల్లవాడు తన ప్రతిబింబములతో ఆడుకున్నట్లుగా, ఆయన (నిర్వికారముగా) వారిని కౌగిలించి చేతులతో స్పృశి: నీ ప్రేముతో చూస్తు గొప్ప విలాసను ప్రకటిస్తూ నవ్వుచుండెను.

ఓ పరీక్షిన్మహారాజా! నీవు కురువంశీయులలో శ్రేష్ఠుడవు. ఆ శ్రీకృష్ణుని దేహముతోడి మహానందముతో గోకులమునందలి యువతుల ఇంద్రియములు పరవశమయ్యెను. వారి పుష్పమాలలు, ఆభరణములు జారిపోవుచుండెను. వారు జుట్టును, కోకను, కంచుకమునైననూ సరిగ్గా సర్దుకొనజాలరైరి.

శ్రీకృష్ణుని విహారమును చూచి ఆకసమునందు సంచరించే దేవతల భార్యలు కామనచే పీడించబడిరి. నక్షత్రముల గుంపులతో కూడిన చంద్రుడు కూడ ఆశ్చర్యమును పొందెను.

ఆ శ్రీకృష్ణ భగవానుడు తనయందే రమించువాడు (పూర్ణుడు). అయిననూ, గోపికలెంతమంది గలరో అంతమందిగా యోగమాయచే తానే ప్రకటమై వారితో విహరించెను.

ఓ పరీక్షిన్మహారాజా! అధికమగు విహారముచే గోపికలు అలసిపోయిరి. అప్పుడు కరుణామయుడగు ఆ శ్రీకృష్ణుడు మిక్కిలి సుఖకరమగు తన చేతితో వారి ముఖములను ప్రేమతో తుడిచెను.

శ్రీకృష్ణుని చేతి గోళ్ల స్పర్శచే గోపికలకు గొప్ప ఆనందము కలిగెను. వారా పురుష శ్రేష్ఠునకు ప్రకాశిస్తూ కదలాడే బంగరు కుండలముల గల చెక్కిళ్ల శోభతో, మరియు మరియు ముంగురుల కాంతి అమృతమువంటి చిరునవ్వుతో కూడిన చూపులతో సమ్మానమును చేసిరి. అపుడు వారు పావనములగు ఆయన లీలలను గానము చేసిరి.

అలసిన ఆ శ్రీకృష్ణుడు శ్రమను పోగొట్టుటకొనుటకై ఆ గోపికలతో కూడి యమునానదియందు ప్రవేశించెను. వక్షఃస్థలమునందలి కుంకుమచే ఎర్రనై దేహముల కలయికచే నలిగిపోయిన వనమాల వనమాల చుట్టూ తిరుగాడే తుమ్మెదలు గంధర్వనాయకుల వలె గానము చేస్తూ ఆయనను వెంబడించినవి. ఆయన ఆడు యేనుగులతో కూడి ఒడ్లను పగులగొట్టి నీటిలో ప్రవేశించిన గజేంద్రుని పోలి యుండెను.

ఓ పరీక్షిస్మహారాజా! ఆ నీటియందు బిగ్గరగా నవ్వే గోపికలు ఆయనను ప్రేమతో చూస్తూ ఇటునటు నీళ్లను అధికముగా చల్లుచుండిరి. విమానములయందలి దేవతలు పూల వానలను కురిపిస్తూ ఆయనను స్తుతించుచుండిరి. ఆత్మారాముడు, పూర్ణుడు అగు ఆ శ్రీకృష్ణుడు గజేంద్రుని లీల గలవాడై ఆ యమునానదియందు క్రీడించెను.

ఇంతేగాక, జలక్రీడ అయిన పిదప శ్రీకృష్ణుడు యమునానది ఒడ్డున ఉన్న ఉద్యానవనములో, మదమును స్రవించే గొప్ప ఏనుగు ఆడు యేనుగులతో వలె, విహరించెను. తుమ్మెదలే గాక, గోపికల గుంపులు కూడ ఆయనను చుట్టువారి యుండెను. నీటిలోని మరియు గట్టుమీది పువ్వుల సుగంధమును గాలి దిక్కుల అంతముల వరకు వ్యాపింపజేసెను.

సత్యసంకల్పుడగు శ్రీకృష్ణుడు విధముగా శరత్కాలరాత్రులన్నింటియందు నిరంతరముగా విహరించెను. మనస్సునందు స్థాపించుకున్న హావభావములు గల ఆయనను ప్రేమతో కూడిన గోపికలు గుంపులుగా అనుసరించిరి. కావ్యముల శృంగారహాస్యాది రసములకు ఆలంబన మయ్యే ఆ రాత్రులను చంద్రుడు తన కిరణములతో ఉజ్జ్వలముగా చేసెను.

రాజోవాచ।

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ధర్మమును చక్కగా స్థాపించి అధర్మమును నశింప జేయుటకై జగన్నాథుడగు శ్రీకృష్ణ భగవానుడు తన అంశయే అయిన బలరామునితో గూడి అవతరించినాడు గదా!

ఓ మహర్షీ! ఆ శ్రీకృష్ణ భగవానుడు ధర్మమర్యాదలను సృష్టించి, ఉపదేశించి, రక్షించువాడు. ఆయన ధర్మవిరుద్ధముగా ఇతరుని భార్యను స్పృశించుట అనే పనిని ఎట్లు చేసెను ?

ఓ మహర్షీ! పూర్ణకాముడగు భగవానుడై యాదవులకు ప్రభువుగా అవతరించి ఏవగించుకొనబడే పనిని చేయుటలో ఆయన అభిప్రాయమేమి? ఈ మా సంశయమును నివారించుడు.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సమర్థులైనవారు ధర్మము నుల్లంఘించి శాస్త్ర విరుద్ధముగా ప్రవర్తించుట మనకు కనబడును. సర్వ భక్షకుడగు అగ్నికి వలె గొప్ప తేజశ్శాలురకు అది దోషమును కలిగించదు.

యోగశక్తి లేని అసమర్థుడీ అధర్మమును ఏ నాడైననూ సంకల్పించనే రాదు. మూర్ఖత్వము వలన అధర్మమును చేయువాడు నశించును. రుద్రుడు కానివాడు సముద్రమునుండి పుట్టిన విషమును త్రాగినచో మరణించును.

తేజశ్శాలుర ఉపదేశము సత్యము. కాని, వారి ఆచరణము మాత్రము అప్పుడప్పుడు సత్యము కావచ్చును, కాకపోవచ్చును. కాబట్టి వారి ఏ ఉపదేశమునకు అనుకూలమో దానిని మాత్రమే బుద్ధిమంతుడు అనుసరించవలెను.

ఓ పరీక్షిన్మహారాజా! ఈ తేజశ్శాలురయందు తాము కర్తలమనే అభిమానము ఉండదు. కావున, వారీ లోకములో ధర్మముననుష్ఠించి పొందే స్వంత ప్రయోజనము లేదు. దానికి విరుద్ధముగా అధర్మమును చేసి పాపము (దాని కార్యమగు అనర్థము) ను గాని పొందరు.

పశుపక్ష్యాదులు,మానవులు, దేవలోకవాసులు మొదలగు సకల ప్రాణులకు అంతర్యామియగు పరమేశ్వరుని విషయములో పుణ్యపాపముల ప్రసక్తి ఉండదని వేరుగా చెప్పవలయునా? ధర్మాధర్మములు ఈశ్వరునిచే శాసించబడే జీవులకు వర్తించును.

సాధకులు ఆ ఈశ్వరుని పద్మములవంటి పాదముల ధూళిని సేవించి (శరణాగతి చేసి) తృప్తి (భోగకాంక్షలనుండి నివృత్తి) ని చెందెదరు. వారు కర్మయోగము యొక్క మహిమచే సకలకర్మల బంధములను కడిగి వేయుదురు. వారైననూ యథేచ్ఛగా సంచరించి బంధమును పొందరు. అట్టిచో, తన ఇచ్చచే దేహమును స్వీకరించిన శ్రీహరికి కర్మబంధము ఎందువలన కలుగును? (కలుగదు).

సకలబుద్ధిసాక్షి యగు పరమేశ్వరుడు గోపికలకు, వారి భర్తలకు మాత్రమే గాక, సకల ప్రాణులకు కూడ అంతర్యామియై ఉన్నాడు. ఆయన ఈ లోకములో తన లీలలను ప్రకటించుటకై దేహమును స్వీకరించినాడు.

పరమేశ్వరుడు ప్రాణులననుగ్రహించుటకై మానవదేహమును దాల్చినాడు గనుక, ఆ దేహమునకు తగ్గ లీలలనే ప్రకటించును. ఆ లీలలను విన్న మానవుడు పరమేశ్వరునియందు నిమగ్నుడగును.

గోకులవాసులగు జనులకు శ్రీకృష్ణునియందు దోషబుద్ధి కలుగనే లేదు. ఎందుకంటే, ఆయన యోగమాయచే మోహితులైన వారికి తమ తమ భార్యలు తమ ప్రక్కనే ఉన్నట్లుగా తోచెను.

ఇంతలో బ్రాహ్మముహూర్తము (తెల్లవారు జాము) ఆయెను. వసుదేవ పుత్రుడగు శ్రీకృష్ణుడు తనకు ప్రీతిపాత్రులగు గోపికలకు అనుమతి నిచ్చెను (ప్రేరేపించెను). ఇచ్ఛ లేకున్ననూ వారు తమ తమ ఇళ్లకు వెళ్లిరి.  

శ్రీహరి గోకులమునందలి గోపికలతో కలిసి చేసిన ఈ లీలను ఎవడైతే శ్రద్ధతో గూడి క్రమముగా వినునో, లేదా వర్ణించునో, అట్టివాడు విలంబము లేకుండా జితేంద్రియుడగును. మరియు ఆతడు శ్రీహరి భగవానునిపై నిష్కామమగు భక్తిని పొంది వెంటనే హృదయమునకు రోగమనదగిన కామనను తొలగించుకొనును.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము పూర్వార్ధములో

మహారాసలీలను వర్ణించే ముప్పది మూడవ

అధ్యాయము ముగిసినది (33).