శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
42 - శ్రీకృష్ణుడు కుబ్జను అనుగ్రహించి ధనుర్భంగమును చేయుట
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- సుదాముని అనుగ్రహించిన పిదప శ్రీకృష్ణ భగవానుడు రాజమార్గము గుండా వెళ్లుచుండెను. ప్రేమునిచ్చే ఆయనకు చందననిలేపనమున్న పాత్రను పట్టుకొని వెళ్తూ ఒక యువతి కనబడెను. ఆమె అందమైన ముఖము కలదియే అయినా గూనిది. ఆయన నవ్వుతూ ఆమెనిట్లడిగెను.
ఓ సుందరీ! నీవెవ తెవు? యువతీ! ఈ చందన లేపనమెవనికి చెప్పుమా! మాకు సత్యమును చెప్పుము. మా ఇద్దరికి ఉత్తమమగు అంగ లేపమునిమ్ము. ఆ ఇచ్చుట వలన నీకు తొందరలో హితము కలుగగలదు.
సైరంధీ ఇట్లు పలికెను --- ఓ సుందరుడా! నేను త్రివక్ర (మూడు వంకరలు గలది) అనే సార్థక నామము గల దాసీని. కంసుడు నన్ను అంగలేపమును చేసే పనియందు స్వీకరించినాడు. నేను చేసిన అంగలేపము ఆ భోజప్రభునకు ఇష్టము. మీ ఇద్దరిని మినహాయిస్తే దీనికి తగవాడు మరియొకడెవడు గలడు? (ఎవడూ లేడు).
శ్రీకృష్ణుని సౌందర్యము, సౌకుమార్యము, సహృదయత, నవ్వు, పలుకులచే సైగండ్రి మనస్సు మోహమును పొందెను. ఆమె వారిద్దరికి అంగరాగపు ముద్దను ఇచ్చెను.
తరువాత వారిద్దరు తమ దేహము యొక్క రంగుకంటే భిన్నమైన అంగలేపనమును తీసుకొని నాభికి పైభాగమునందు అలదుకొనిరి. దానిచే వారిద్దరు శోభిల్లిరి.
ప్రసన్నుడైన శ్రీకృష్ణ భగవానుడు తనను దర్శించినందులకు ఫలమును ఆమెకు చూపదలచెను. గూనిదే, అయిననూ, అందమైన మోము గల ఆమెను తిన్నని వ్యక్తిగా చేయాలని ఆయన సంకల్పించెను.
శ్రీకృష్ణ భగవానుడు ఆ రెండు పాదముల కొనలపై తన పాదములను వేసి నొక్కి పెట్టెను. రెండు వేళ్లను ఎత్తుగా పెట్టి చేతితో ఆమె గెడ్డమును పట్టుకొని శరీరమును పైకి యెత్తెను.
ఆమె దేహము శ్రీకృష్ణ భగవానుని స్పర్శచే అప్పుడు వెంటనే తిన్నగా సమానముగా ఆయెను. ఆమె విశాలమైన కటిభాగము, వక్షఃస్థలముతో అందమైన యువతులలో ఉత్తమురాలు ఆయెను.
అప్పుడు రూపము, సద్గుణములు, ఔదార్యములతో నిండియున్న ఆ సైరంధ్రికి హృదయములో ప్రేమ కలిగెను. ఆమె చిరునవ్వుతో శ్రీకృష్ణ భగవానుని ఉత్తరీయపు కొంగును లాగి ఇట్లు పలికెను.
ఓ వీరుడా! రమ్ము, ఇంటికి వెళ్లేదము. నిన్ను ఇక్కడనే విడిచి పెట్టుట నా వల్ల కాదు. నీవు నా మనస్సును కలిచివేసితివి. ఓ పురుష శ్రేష్ఠా! నా పై అనుగ్రహమును చూపుము.
ఆ యువతి ఈ విధముగా కోరుచుండ బలరాముడు చూచుచుండెను. శ్రీకృష్ణుడు అనుచరుల ముఖమును చూచి నవ్వుతూ ఆమెతో నిట్లనెను.
ఓ సుందరీ! నేను వచ్చిన పని పూర్తి చేసుకొని నీ ఇంటికి వచ్చేదను. వ్యక్తి యొక్క మనోవ్యాధిని నీ యిల్లు కృశింపజేయును. మేము ఇల్లు బాటసారులము. మాకు నీవు గొప్ప ఆశ్రయము.
శ్రీకృష్ణుడు తియ్యని మాటను చెప్పి ఆమెను పంపివేసెను. మార్గములో వెళ్లుచున్న ఆయనను, అన్నగారిని బజారు వీథిలోని వర్తకులు బహుమతులు, తాంబూలము, మాలలు, గంధములతో పూజించిరి.
ఆదున దర్శనము వలన స్త్రీలకు హృదయములో అనురాగావేశముచే దేహస్పృహ లేకుండెను. వారి వస్త్రములు, జుట్టుముడులు, కంకణములు జారిపోయెను. వారు చిత్రపటమునందలి బొమ్మలవలె నిలబడిరి.
తరువాత శ్రీకృష్ణ భగవానుడు ధనుర్యాగము జరుగుచున్న చోటును గురించి పురజనులను అడుగుతూ ఆ చోటికి చేరెను. అచట ఆయనకు ఇంద్రధనుస్సు వలె అచ్చెరువును గొలిపే ధనుస్సు కనబడెను.
పూజించబడిన ఆ ధనుస్సును అనేకరక్షకభటులు కాపలా కాయుచుండిరి. బంగరు ఆభరణములచే అలంకరించబడిన ఆ ధనుస్సు గొప్ప సమృద్ధి, బరువు గలది. శ్రీకృష్ణుడు, రక్షకభటులు అడ్డుకున్నా బలాత్కారముగా దానిని చేతిలో దీనికి తీసుకొనెను.
గొప్ప పరాక్రమము గల శ్రీకృష్ణుడు ఎడమ చేతితో ఆ ధనుస్సును అవలీలగా పైకెత్తి నారిత్రాడును తగిల్చెను. భటులు చూస్తుండగానే రెప్పపాటు కాలములో ఆయన దానిని లాగి, మదించిన ఏనుగు చెరుకు గడను వలె, మధ్యలో విరిచెను.
ఆ ధనుస్సును విరుచుచుండగా బయలుదేరిస శబ్దము ఆకాశమును, ద్యులోకభూలోకములను, దిక్కులను నింపివేసెను. ఆ ధ్వనిని విని కంసుడు హడలిపోయెను.
ఆ ధనుస్సును రక్షించే భటులకు, వారి అనుచరులకు కోపము వచ్చెను. వారు ఆయనను పట్టుకొనగోరి ఆయుధములను పట్టుకొని, పట్టుకొనుడు, బంధించుడు, అంటూ ఆయనను చుట్టుముట్టిరి.
అప్పుడు వారి దుష్టమైన అభిప్రాయమును గ్రహించిన బలరాముడు, శ్రీకృష్ణ భగవానుడు కోపించి ధనుస్సు యొక్క ముక్కలను తీసుకొని, వారిని కూడ జాదిరి.
వారు కంసునిచే పంపబడిన సైన్యమును కూడ మట్టుబెట్టిరి. తరువాత అందరు కలిసి యజ్ఞశాల ముఖద్వారమునుండి బయటకు వచ్చి నగరము యొక్క సంపదలను చూసి ఆనందిస్తూ విహరించిరి.
వారిద్దరి ఆ అద్భుతమగు పరాక్రమమును, తేజస్సును, సాహసమును, రూపమును కూడ చూచి నగరప్రజలు వారిని దేవతా శ్రేష్ఠులని తలపోసిరి.
బలరామకృష్ణులీ విధముగా గోపాలకులతో కలిసి యథేచ్ఛగా సూర్యుడు అస్తమించెను. అపుడు నగరమునుండి బళ్లను ఆపుకున్న ఉద్యానమునకు చేరుకొనిరి.
శ్రీకృష్ణుడు ప్రయాణము చేసిన సమయములో చేసిన సమయములో గోకులములోని
గోపికలు ఆయన విరహము వలన పీడను పొంది మథురానగరవాసులను గురించి ఆశీస్సులను పలికిరి. మానవులకే అలంకారమైన శ్రీకృష్ణుని దేహశోభను చూచిన మధురా నగరవాసులకు ఆశీస్సులు సత్యములైనవి. లక్ష్మీదేవి తనను సేవించే ఇంద్రాదులను విడిచి పెట్టి
శ్రీకృష్ణుని దేహమునే ఆశ్రయమునుగా కోరెను గదా!
వారు రెండు కాళ్లను. కడుగుకొని పాలను కలిపిన అన్నమును తినిరి. మరునాడు కంసుడు చేయగోరిన ఉద్యమము గురించి వారికి తెలియును. వారిద్దరు ఆ రాత్రి సుఖముగా విశ్రమించిరి.
గోవింద బలరాములు ధనుస్సును విరుచుటను, రక్షకభటులను తాను పంపిన సైన్యమును కూడ సంహరించుటను, ఈ పనినంతనూ వారు ఒక ఆటవలె చేయుటను గురించి కంసుడైతే వినెను.
కంసుడు భయముతో నిద్ర పట్టక చాల సేపు తెలివిగా నుండెను. వానికి తెలివిలో మరియు నిద్రలోని కలలో కూడ అనేకములగు అపశకునములు కనబడి రాబోయే మృత్యువును సూచించెను.
ఆతడు అద్దములో చూచినప్పుడు ప్రతిబింబము కనబడునే గాని తన తల కనపడదు. మరియు, వస్తువులు రెండుగా కనబడుటకు కారణమైన కళ్లలోని నీరు మొదలైనవి లేకుండానే, చంద్రుడు మొదలగు జ్యోతిర్మండలములు రెండుగా కనబడెను. (జాగ్రదవస్థలోని అపశకునము).
నీడయందు చిల్లు కనబడుట, చెవులను మూసిననూ ప్రాణము యొక్క ఘోష వినబడకపోవుట, చెట్లు బంగరు వర్ణముతో కనబడుట, తన కాళ్లు తనకు కనబడకుండుట (అనే అపశకునములు ఆతనికి జాగ్రదవస్థలో కలిగెను).
ఆతనికి కలలో శవమును కౌగిలించుకున్నట్లు విషమును తిన్నట్లు కనబడెను. ఆతడు కలలో వట్టివేళ్ల మాలను ధరించి దేహమునకు నూనె రాసుకొని వస్త్రములు లేకుండా ఒంటరిగా గాడిదపై పయనించెను.
ఈ నిధముగా జాగ్రదవస్థలో మరియు కలలలో కంసునకు ఇటువంటి అపశకునములు కనబడెను. ఆతనికి తాను మరణిస్తాననే భయము పట్టుకొనెను. బెంగతో ఆతనికి నిద్ర కరువయ్యెను.
కురువంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! రాత్రి తెల్లవారెను. సూర్యుడు తూర్పు సముద్రమునుండీ పైకి వచ్చెను. ఆనాడు కంసుడు మల్లయుద్ధక్రీడల పెద్ద ఉత్సవమును నడిపించెను.
రాజపురుషులు క్రీడారంగమునలంకరించిరి. వాద్యములను, దుందుభులను మ్రోగించిరి. పుష్పమాలలు, జెండాలు, వస్త్రములు, మామిడాకుల తోరణములతో కూర్చునే ఆసనములను అలంకరించిరి.
వాటిపై నాగరికులు, పల్లెలనుండి వచ్చిన జనులు బ్రాహ్మణులు క్షత్రియులు మొదలైనవారు హాయిగా కూర్చుండిరి. రాజవంశీయులు కూడ ఆసనములను స్వీకరించిరి.
కంసుడు తాపముతో నిండిన హృదయముతో రాజసింహాసనముపై కూర్చుండెను. ఆతని చుట్టూ అమాత్యులు, మండలాధిపతులు ఉండిరి.
వాద్యములు మ్రోగించబడుచుండెను. కాని, మల్లుల చరుపులే బిగ్గరగా వినబడుచుండెను. గర్వించిన మల్లులు బాగా అలంకరించుకొని తమ గురువులతో బాటు విచ్చేసిరి.
చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోశలుడు మొదలైన 'మల్లులకు వాద్యముల ధ్వని మనోహరముగానుండి ఉత్సాహమును వర్ధిల్లజేసెను. వారు మల్లరంగమును చేరిరి.
నందగోపుడు, సునందుడు మొదలగు గోపాలకులు భోజరాజగు కంసుని ఆహ్వానము పై వచ్చిరి. వారు తాము తెచ్చిన బహుమానములను కంసునకు సమర్పించిరి. వారందరు ఒకే పెద్ద ఆసనముపై కూర్చుండిరి.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో
శ్రీకృష్ణుడు కుబ్జను అనుగ్రహించి ధనుర్భంగమును చేయుటను వర్ణించే
నలుబది రెండవ అధ్యాయము ముగిసినది (42).
