శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
18 - శ్రీకృష్ణుడు ప్రలంబాసురుని ఉద్ధరించుట
కార్చిచ్చునుండి రక్షించిన పిదప ఆనందముతో నిండిన బంధువులు చుట్టూ చేరి కీర్తిని గానము చేయుచుండగా, శ్రీకృష్ణుడు గోకులములో ప్రవేశించెను. ఆ గోకులమునకు గోవుల మందలే అలంకారము.
ఈ విధముగా మాయాశక్తిచే గోపాలకుల వేషముతో బలరామకృష్ణులిద్దరు గోకులమునందు క్రీడించుచుండిరి. ఇంతలో వేసవి కాలము వచ్చెను. ప్రాణులకు వేసవీ అంత ప్రియమైనది కాదు.
ఆ వేసవియైతే బృందావనముయొక్క (చెట్లు మొదలైన) సహజ గుణములను బట్టి వసంతమువలే తోచెను. పైగా, ఆ బృందావనములో సాక్షాత్తుగా శ్రీహరి భగవానుడు బలరామునితో గూడి ఉన్నాడు గదా!
ఆ బృందావనములో వేసవియందు ఈ పురుగుల కఠోరధ్వనులను కొండ కాలువల గలగలలు కప్పివేయును. అన్నివేళలా ఆ కొండకాలువల తుంపరలచే నును పెక్కిన చెట్ల గుంపులతో ఆ స్థానము శోభిల్లెను.
బృందావనము చెట్లతో, పచ్చిక బయళ్లతో పచ్చగా నుండును. అక్కడ సరస్సులలో ఉదయము సౌగంధికములు, మధ్యాహ్నము పద్మములు, రాత్రి కమలములు వికసించును. వాటి మీదనుండి వీచే గాలి వాటి పుప్పొడిని మోసుకువచ్చును. అచటి సరస్సులలో, నదులలో, కొండ కాలువలలోని తరంగములమీదనుండి వీచే గాలి వలన వనవాసీలకు తాపము లేదు. వేసవియందు కూడ ఎండ వేడికి చిచ్చు పుట్టి అడవిని దహించే ఘటనలు లేవు.
ఆ బృందావనమునందు నదులలోని నీరు లోతుగా నుండెను. ఆ నదుల కెరటములు ఒడ్లను తాకి ఇసుకతిన్నెలతో సహా అంతటా తడి, బురద ఉండునట్లు చేయుటచే, నేల పై పచ్చగడ్డి విస్తారముగా పెరిగెను. కావుననే, వేసవి సూర్యుని కిరణములు విషమువలె చాల తీక్ష్ణముగనున్ననూ, నేలయందలి తడిని ఎండింపలేకపోయినవి.
ఆడవి పువ్వులతో నిండి గొప్పగా శోభిల్లెను. రంగు రంగుల మృగములు, పక్షులు ధ్వనులను చేయుచుండెను. నెమళ్లు, తుమ్మెదలు గానము చేయుచుండెను. కోకిలలు, బెగ్గురు పక్షులు కూయుచుండెను.
శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో కూడి పిల్లన గ్రోవి పైములను పలికిస్తూ, ఆ అడవిలో విహారము కొరకై ప్రవేశించేను. ఆయన చుట్టూ గోపాలకులు, మంచి ఆవుల మందలు ఉండెను.
బలరాముడు, శ్రీకృష్ణుడు, సుదాముడు మొదలగు గోపాలకులు చిగుళ్లను, నెమలి యీకలను, పూల గుత్తులను, పూల మాలలను, రాతి రంగులను, బంగరు నగలను అలంకరించుకొనిరి. వారు పాటలు పాడుతూ, నాట్యమాడిరి. ఒకప్పుడు కుసీలను పటిరి.
శ్రీకృష్ణుడు నాట్యం చేస్తూ ఉంటే, కొందరు పాడగా, మరికొందరు వాద్యములను వాయించిరి. ఇంకొందరు పిల్లన గ్రోవిని కొమ్ము బూరాలను ఊది, చప్పట్లు కొట్టి ప్రోత్సహించిరి.
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ బలరాములు గోపజాతిలో జన్మించిన శ్రీహరి-ఆది శేషులే. గోపాలకుల రూపములోనున్న దేవతలు వారిద్దరిని, ఒక నటుని ఇతరనటులు వలె, కొనియాడిరి.
బలరామకృష్ణుల కేశములు వక్రములై చెవుల వరకు వ్రేలాడు చుండెను. వారు ఒకప్పుడు ఒకరి చేతులు మరియొకరు పట్టుకొని గిర గిర తిరిగెదరు; గోతులపై గెంతెదరు; రాళ్లను విసి రెదరు; ఒకరినొకరు చరుపులు చరచెదరు; త్రాడును రెండు వైపులా లాగెదరు. మరియొకప్పుడు వారు బాహుయుద్ధమును చేసిరి.
ఓ పరీక్షిన్మహారాజా! ఒకప్పుడు ఇతర బాలకులు కూడ నాట్యము చేయుచుండగా బలరామకృష్ణులిద్దరు తాము స్వయముగా పాట పాడి వాద్యములను వాయించెడివారు; బాగు బాగు అంటూ కొనియాడెడివారు.
వారు ఒకప్పుడు మారేడు పళ్లను, మరియొకప్పుడు గుగ్గిలపు పళ్లను, ఇంకో సమయములో ఉసిరిక పళ్లను గుప్పిళ్లతో విసురుతూ ఆడెడివారు. ఒకడు పరుగెత్తి ఇతరులను ముట్టుట, కళ్లకు గంతలు కట్టి ముట్టుట, కుంటుతూ ముట్టుట వంటి ఆటలను ఆడెడివారు. ఒకప్పుడు పశువుల చేష్టలను, మరియొకప్పుడు పక్షుల చేష్టలను అనుకరించి ఆడెడివారు.
వారు ఒకప్పుడు కప్ప గెంతుల ఆటను ఆడెడివారు. మరియొకప్పుడు పలు రకముల చేష్టలతో ఇతరులను నవ్వించెడివారు. ఒకప్పుడు చెట్టుకు త్రాడు కట్టి ఊయలలూగెడివారు. మరియొకప్పుడు రాజును అనుకరించే ఆటను ఆడెడివారు.
వారీ విధముగా లోకప్రసిద్ధములైన ఆటలను ఆడుతూ బృందావనములోని నదీతీరములు, కొండలు, లోయలు, తీగల డొంకలు, అడవులు, సరస్సులు అనువాటియందు సంచరించిరి. .
బలరామకృష్ణులు గోపాలకులతో కూడి ఆ బృందావనమునందు పశువులను - మేపుచుండిరి. వారిద్దరిని ఎత్తుకు పోవాలనే కోరికతో ప్రలంబుడనే రాక్షసుడు గోపాలకుని రూపముతో అచటకు వెళ్లాను.
దశార్హ వంశములో జన్మించిన సర్వజ్ఞుడగు శ్రీకృష్ణ భగవానునకు ఆ రాక్షసుని గురించి తెలియును. అయిననూ, ఆయన వానిని వధించే ఉపాయమును గురించి ఆలోచిస్తూ, వానితోడి జట్టును అనుమోదించెను.
శ్రీకృష్ణుడు క్రీడలలో దిట్ట. ఆయన అప్పుడు గోపాలకులను పిలిచి ఇట్లు చెప్పెను -- ఓ గోపాలకులారా! మనము ఎవరికి తగ్గ వారితో వారు రెండు జట్లుగా జత కట్టి ఆడుకొనేదము.
అప్పుడా గోపాలకులు బలరామకృష్ణులనే నాయకులుగా చేసుకొనిరి. కొందరు శ్రీకృష్ణుని జట్టువారు కాగా, మిగిలిన వారు బలరాముని జట్టు.
మో సేవాడు, మోయబడువాడు అనే రూపములోనుండే పలు రకముల ఆటలను వారు ఆడిరి. ఆ ఆటలలో నెగ్గినవానిని భుజముపై నెక్కించుకోని ఓడినవాడు మోయును.
మోస్తున్నవారు, మోయబడుచున్నవారు కూడ పశుసంపదను మేపే పనిని చేస్తూనే, భాండీరకమని ప్రసిద్ధి గాంచిన మర్రి చెట్టు వద్దకు వెళ్లిరి. వారికి ముందు శ్రీకృష్ణుడు ఉండెను.
ఓ పరీక్షిన్మహారాజా! బలరాముని జట్టు నెగెను. అప్పుడు శ్రీరాముడు, వృషభుడు మొదలగువారిని శ్రీకృష్ణుని జట్టులోనివారు ఒకరిని ఒకరు చొప్పున మోసిరి.
ఆటలో ఓడిన శ్రీకృష్ణ భగవానుడు శ్రీదాముని, భద్ర సేనుడు వృషభుని, ప్రలంబాసురుడు రోహిణి పుత్రుడగు బలరాముని మోసిరి.
రాక్షసశ్రేష్ఠుడగు ప్రలంబుడు శ్రీకృష్ణుని మోయుట సాధ్యము కాదని తలచి ఆయన పక్షములో చేరి బలరాముని మో సెను. ఆతడు అందరికంటే వేగముగా మోస్తూ, దింప వలసిన మర్రి కంటే ముందుకు వెళ్లిపోయెను.
ఆ పెద్ద రాక్షసుడు బంగరు ఆభరణములతో మెరుపు వలె ప్రకాశించుచుండెను. బలరాముడు పర్వతము వలె బరువుగా నుండుటచే పొని వేగము తగ్గిపోయెను. వాడు తన రాక్షసరూపమును దాల్చెను. అప్పుడాతడు నక్షత్రరాజగు చంద్రుని మోస్తూ మెరుపులతో ప్రకాశించే మేఘము వలె నొప్పారెను.
మండే కన్నులు మరియు మండే కేశములు గల ఆ రాక్షసుని దేహము ఆకాశములో వేగముగా కదులుచుండెను. వాని భయంకరమగు కోరలు కనుబొమల పైన తగులుచుండెను. కడియములు, కిరీటము, కుండలములతో అబ్బురమును గోల్పే వాని ఆ దేహమును పరికించి చూచి నాగలియే ఆయుధముగా గల బలరాముడు కొంచెము భయపడెను.
తరువాత బలరామునకు స్మృతి వచ్చి భయము దూరమయ్యెను. ఆయనను ప్రలంబాసురుడు ఆకాశమార్గము గుండా తన సొత్తా యన్నట్లు కొనిపోవుచుండెను. ఆయన కోపముతో ఆ శత్రువును, దేవేంద్రుడు పర్వతమును వలె, వజ్రపు వేగము గల గట్టి పీడికిలితో తలపై కొట్టెను.
బలరాముడు కొట్టిన దెబ్బకు ఆ రాక్షసుడు నోటినుండి రక్తమును గ్రక్కెను. వాని తల ప్రక్కలై స్పృహ తప్పెను. వెంటనే వాని ప్రాణములు పోయెను. ఇంద్రుని వజ్రముచే కొట్టబడిన పర్వతము వలె వాడు పెద్ద శబ్దమును చేస్తూ నేల గూలెను.
బలశాలియగు బలరాముడు వధించిన ప్రలంబుని చూచి గోపాలకులు చాల ఆశ్చర్యమును పొందిరి. వారు బాగు, బాగు అని పలికిరి.
మరణించి వచ్చినాడా యన్నట్లున్న ఆ బలరాముని గోపాలకులు ఆశీర్వదిస్తూ కౌగిలించుకొనిరి. వారాయనను ప్రేమతో వ్యాకులమైన మనస్సులతో ప్రశంసించిరి. వారి పొగడ్తలకు ఆయన అర్హుడు.
పాపియగు ప్రలంబాసురుని బలరాముడు సంహరించగా, దేవతలకు గొప్ప. సుఖము అనుభవమునకు వచ్చెను. వారాయన పై పూల వానను కురిపించి, బాగు బాగు అని కొనియాడిరి.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో బలరాముడు ప్రలంబాసురుని ఉద్దరించుటను వర్ణించే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (18).
