శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
40 - అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించుట
అక్రూర ఉవాచ ।
అక్రూరుడిట్లు పలికెను --- సర్వకారణకారణుడైన నారాయణుడవగు నిన్ను నమస్కరించుచున్నాను. నీవు పూర్ణుడవు, సృష్టికి మూలమునందున్నవాడవు, వినాశరహితుడవు. నీ నాభినుండి పుట్టిన పద్మపు మొగ్గనుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించి, బ్రహ్మాండమును సృష్టించినాడు.
పృథివి, జలములు, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచ భూతములు, వాటికి కారణమగు సమష్టి అహంకారము, దాని కారణమగు మహత్తత్త్వము, దాని కారణమగు పుట్టుక లేని మాయాశక్తి, దానితో కూడిన పురుషుడు (ఈశ్వరుడు), మనస్సు, ఇంద్రియములు, శబ్దస్పర్శరూప రసగంధములనే ఇంద్రియవిషయములు, వాటి అధిష్టాన దేవతలు అందరు
కూడ నీ స్వరూపమునుండియే ఆవిర్భవించిరి.
ఈ మాయాశక్తి, మహత్తత్త్వము మొదలైనవి దృశ్యములుగా తెలియ బడును గనుక అవి ఆత్మ (అధిష్ఠానము) అగు నీ స్వరూపమును తెలియ జాలవు. జీవుడు పుట్టుక లేని పరబ్రహ్మయే అయిననూ, మాయాశక్తి యొక్క సత్త్వరజస్తమోగుణములచే బంధించబడి యుండును గనుక,
గుణములకు అతీతమగు నీ స్వరూపమును తెలియకున్నాడు. (బ్రహ్మ దేవుడు రజోగుణమునకు అతీతమగు నీ తత్త్వమును తెలియకున్నాడు).
అధ్యాత్మము (దేహేంద్రియమనస్సంఘాతము), అధిభూతము (పంచభూతములు), అధిదైవము (దేవతలు) నీ స్వరూపములో భాగమే. నీవు జగన్నియామకుడవగు పురుషోత్తముడవు. సత్పురుషులగు సాధకులు నిన్ను తమ ఆత్మరూపముగా ధ్యానించెదరు. (యోగులు నిన్ను ఆత్మరూపముగా, పంచభూతముల రూపముగా, దేవతల రూపముగా దర్శించెదరు).
కొందరు యాజ్ఞికులైన వేదవేత్తలు ఋగ్యజుస్సామవేదములచే బోధించబడే విస్తృతమగు యజ్ఞములను చేసి అనేక రూపములు గల దేవతల పేర్లతో నిన్నే ఆరాధించుచున్నారు.
విరక్తులై శాంతులైన కొద్దిమంది జ్ఞాసయోగులు సర్వకర్మలను సన్న్యసించి జ్ఞానఘనుడవగు నిన్ను జ్ఞానయజ్ఞముతో ఆరాధించెదరు.
కొందరు నీచే చెప్పబడిన కల్పముచే దేహేంద్రియములను సంస్కరించుకొని నిన్ను తమయందు భావన చేస్తూ నిన్నే రామకృష్ణాద్యనేక రూపములయందు, నారాయణుడు అనే ఒకే రూపమునందు కూడ కొలుచుచున్నారు.
ఓ భగవానుడా! శివునిచే చెప్పబడిన మార్గముననుసరించి దధీచుడు మొదలైన అనేకులగు ఆచార్యులచే బోధించబడిన పద్ధతులకనుగుణముగా మరికొందరు శివుని రూసములోనున్న నిన్నే ఉపాసించుచున్నారు.
ఓ ప్రభూ! కొందరు ఇతగదేవతల భక్తులు గలరు. వారి మనస్సు ఇతర దేవతలయందు లగ్నమగును. ఆయా దేవతలు నీకంటె భిన్నమని అయినప్పటికీ, దేవతా స్వరూపుడవు, సకలనియంతవు అగు నిన్నే ఆరాధించుచున్నారు.
ఓ ప్రభూ! పర్వతములనుండి పుట్టిన నదులు మేఘములచే నీరు నింపబడి అన్ని వైపులనుండి సముద్రములో ప్రవేశించును. అదే విధముగా, ఆరాధనా పద్ధతులన్నీ అంతిమముగా నీ ఆరాధనలే యగును.
నీ మాయాశక్తి సత్త్వరజస్తమోగుణాత్మకము. బ్రహ్మదేవునితో మొదలిడి చెట్టు చేమలవరకు ఉండే ప్రాణులు ఆ మాయాశక్తి యొక్క పరిణామమగు దేహములతో తాదాత్మ్యము గలవై గుణములచే బంధింపబడి యున్నవి.
నీకు నమస్కారమగుగాక! నీ (స్వరూపమగు) జ్ఞానము అసంగము. నీవు సకల ప్రాణులలో సకలబుద్ధివృత్తులకు సాక్షియగు ఆత్మవు. నీ స్వరూపము తెలియకనే అజ్ఞానులు దేవమానవపశుపక్ష్యాది దేహముల యందు ఆత్మాభిమానము గలవారై సత్త్వరజస్తమోగుణముల ప్రవాహమైన జననమరణరూపమగు సంసారమునందు కొట్టుకుపోవుచున్నారు.
నీకు అగ్ని నోరు, భూమి పాదములు, సూర్యుడు కన్ను, ఆకాశము నాభి, దిక్కులు చెవులు, ద్యులోకము తల, నలుగురు లోకపాలకులు నాలుగు చేతులు, సముద్రములు ఉదరము, వాయువు ఊపిరి మరియు బలము అని మహాత్ములు ఉపాసించెదరు.
పరమేశ్వరుడవగు నీకు చెట్లు మొక్కలు రోమములు, మేఘములు. కేశములు, పర్వతములు ఎముకలు మరియు గోళ్లు, రాత్రింబగళ్లు రెప్పపాటు, బ్రహ్మదేవుడు (దక్షుడు) జననేంద్రియము, వర్షము వీర్యము అని (మహాత్ములచే) భావన చేయబడును.
ఓ ఈశ్వరా! నీవు పూర్ణుడవు. నీవు మనస్సే ప్రధానముగా కలిగియున్నప్పుడు లోకపాలకులతో కూడి అనేక ప్రాణులచే వ్యాప్తమైన ఈ లోకములు నీయందు భాసించును. నీటియందు జలజంతువులు వలె, మేడిపండునందు క్రీములు వలె, ఈ లోకములు నీయందే సంచరించును. కాని నీ స్వరూపము కూటస్థము (మార్పులు లేనిది).
ఈ లోకములో లీల కొరకై నీవు మత్స్యము మొదలైన ఏయే రూపములను ధరించితివో, వాటిచే తుడిచివేయబడిన శోకము గల జనులు ఆనందముతో నీ కీర్తిని గానము చేయుచున్నారు.
వేదరక్షణనిమితమై చేప ప్రళయకాలసముద్రమునందు సంచరించిన నీకు నమస్కారము. హయగ్రీవుడవై మధు కైటభులను సంహరించిన నీకు నమస్కారము.
నీవు తాబేలువై మందరపర్వతమును మోసితివి. నీవు వరాహమూర్తి వై భూమిని అవలీలగా పైకి తెచ్చితివి. నీకు అనేక నమస్కారములు.
సజ్జనుల భయమును పోగొట్టే ఓ దేవా! నీ సింహరూపము సగము మనిషి యగుటచే అచ్చెరువును గొల్పును. నీవు వామనుడవై ముల్లోకములను పాదములతో కొలిచితివి. నీకు అనేక నమస్కారములు.
గర్వించిన క్షత్రియుల సముదాయమును నశింప జేసిన భార్గవరాముడవు నీవే. రావణాసురుని మట్టుబెట్టిన రాఘవరాముడవు నీవే. నీ కొరకు అనేక నమస్కారములు.
యాదవులకు (సత్త్వగుణ ప్రధానులగు భక్తులకు) రక్షకుడవగు వాసుదే వుడవీవే. నీకు నమస్కారము. బలరామునకు, ప్రద్యుమ్న (శ్రీకృష్ణుని పుత్రుడు), అనిరుద్ధుల (మనుమడు) కు నమస్కారము. ఆ నామములు గల నాలుగు వ్యూహములకు నమస్కారము. సర్వజగన్నివాసుడు, ప్రకాశ స్వరూపుడు, ప్రేమస్వరూపుడై భక్తులను తన వద్దకు ఆకర్షించువాడు, తేజ స్స్వరూపుడు, స్వతంత్రుడు అగు భగవానునకు నమస్కారము.
నీవు శుద్దుడగు (అహింసను బోధించే) బుద్ధుడవై దైత్యులను, దానవులను మోహపెట్టితివి. ఇంచుమించు మ్లేచ్చులై పోయిన క్షత్రియులను. నీవు కల్కివై సంహరించెదవు. నీకు నమస్కారములు.
ఓ భగవానుడా! ఈ జీవసముదాయము నీ మాయచే మోహమును నేను నాది అనే దురాగ్రహము గలదియై కామ్యకర్మల మార్గములయందు పరిభ్రమించుచున్నది.
ఓ ప్రభూ! మూర్ఖుడనగు నేను కూడ కలవంటి దేహము. సంతానము, , ఇల్లు, భార్య, ధనము, నావారు, నా పొలము మొదలైనవాటియందు అవి సత్యములనే భావనతో పరిభ్రమించుచున్నాను.
నేను అజ్ఞానముచే వ్యాపించబడి యుండుటచే అనిత్యమగు కర్మఫలము నిత్యమని, అనాత్మయగు దేహము ఆత్మయని, దుఃఖ హేతువులగు ధనాదులు సుఖ హేతువులని భ్రమిస్తూ, శీతోష్ణాది ద్వంద్వములయందు రమించుచున్నాను. అట్టి నేను ఆత్మస్వరూపుడవై ప్రియుడవైన నిన్ను తెలియకున్నాను.
మూర్ఖుడు నీటిలో పుట్టి నీటిని కప్పివేసే నాచుచే కప్పివేయబడిన నీటిని విడిచి పెట్టి ఎండ మావుల వెంట పరుగెత్తును. అదే విధముగా, నేను (దేహాదులయందు ఆత్మబుద్ధిచే కప్పివేయబడిన ఆత్మవగు) నీకు పెడ మోము (సంసారము వైపు మోము) కలిగియున్నాను.
నా మనస్సు కామవాసనలచే, కర్మవాసనలచే క్షోభను పొందియున్నది. దానిని ప్రబలమైన ఇంద్రియములు ఇటునటు ఆకర్షించుచున్నవి. దీనుడనగు నేను దానిని నిగ్రహించ లేకున్నాను,
అట్టి నేను దుష్టులు పొంద లేని నీ పాదమును శరణు పొందినాను. ఓ ఈశ్వరా! ఇది కూడ నీ అనుగ్రహమేనని తలచెదను. ఎందుకంటే, ఓ పద్మ నాభా! ఎప్పుడైతే వ్యక్తికి సంసారమునకు అంతము భావనకు వచ్చునో, అప్పుడు వాని మనస్సు సత్సాంగత్యముచే నీయందు లగ్నమగును.
పరబ్రహ్మ యొక్క స్వరూపము చైతన్యము. ఆ చైతన్యము వలననే బుద్ధియందు వివిధజ్ఞానములు కలుగుచున్నవి. పరబ్రహ్మయే ఉపాధులను బట్టి జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అగుచున్నాడు. అనంతమగు శక్తి గల ఆ పరబ్రహ్మకు నమస్కారము.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో
అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించుటను వర్ణించే
నలుబదియవ అధ్యాయము ముగిసినది (40).
