శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

3- శ్రీకృష్ణ జననము

ఆ సమయము అన్ని మంచి లక్షణములతో కూడి అతిశయించి కల్యాణకరమాయెను. అశ్విని మొదలైన నక్షత్రగణములు, గ్రహములు, తారకలు శాంతముగా నుండెను. అదియే జన్మలేని శ్రీహరి జన్మించిన నక్షత్రము (రోహిణి), ఆ నక్షత్రమునకు విష్ణువునుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుడు అధిష్టానము.

దిక్కులు ప్రసన్నములు (ధూళి లేనివి) ఆయెను. నిర్మలమైన ఆకసమునందు నక్షత్రముల గుంపులు ఉదయించెను, పట్టణములు, గ్రామములు, గొల్ల పల్లెలు, గనులయందు నిండా మంగళములు ఉండెను.

నదులలోని నీరు తేటపడెను. సరస్సులలో కలువలు శోభిల్లెను. అడవుల వరుసలలోని పూల గుత్తులు పక్షుల మరియు తుమ్మెదల గుంపుల ధ్వనులతో చక్కగా నుండెను.

ఆ సమయమునందు - పవిత్రమగు . పరిమళమును మోసుకు వచ్చుచున్న స్వచ్చమగు గాలి సుఖకరమగు స్పర్శను కలిగిస్తూ వీచెను. బ్రాహ్మణుల అగ్నులు కూడ పొగ లేకుండా బాగా మండినవి.

వాస్తవముగా పుట్టుక లేని శ్రీహరి అవతరించుచుండగా సత్పురుషుల మనస్సులు ప్రసన్నములైనవి. కాని, దేవతలకు హానిని తల పెట్టే కంసాది రాక్షసుల మనస్సులు ప్రసన్నము కాలేదు. అప్పుడు స్వర్గలోకమునందు దుందుభులు మ్రోగినవి. 

అప్పుడు కిన్నరులు, గంధర్వులు గానము చేయగా, విద్యాధరస్త్రీలు అప్సరసలతో కలిసి నాట్యము చేసిరి. సిద్ధులు, చారణులు స్తుతించిరి.

మునులు, దేవతలు ఆనందముతో వూలవానను కురిపించిరి. మేఘములు సముద్రము వలె చాల మెల్లగా గర్జించినవి.

చీకటి దట్టముగా వ్యాపించి ప్రాణులకు ఇబ్బందిని కలిగించే అర్ధరాత్రము ఆయెను. అప్పుడు సకలప్రాణుల హృదయమనే గుహయందుండే శ్రీహరి దేవతాస్వరూపిణియగు దేవకీయందు, తూర్పు దిక్కునందు పూర్ణచంద్రుడు వలే, పూర్ణరూపముతో జన్మించెను.

పద్మములవంటి కన్నులు గల ఆ పిల్లవాడు నాలుగు చేతులతో, శంఖము గద చక్రము అనే గొప్ప ఆయుధములతో, రొమ్ము పై శ్రీవత్సమనే బంగరు రేఖతో, మెడలో ప్రకాశించే కౌస్తుభ మాణిక్యముతో (మేడచే ప్రకాశింపజేయబడే కౌస్తుభముతో అచ్చెరువును గొల్పుచుండెను. దట్టని మేఘము వలె ప్రకాశించే ఆ పిల్లవాడు పచ్చని వస్త్రమును దాల్చెను.

మిక్కిలి విలువైన వైడూర్యములు పొదిగిన కిరీటమునుండి మరియు కుండలములనుండి వెల్వడే కాంతులు తమ మధ్యలోనుండే దట్టని ముంగురులను ఆవరించి వేసినవి. ఆ బాలుడు మిక్కిలి విలువైన నడుము పట్టీని, భుజకీర్తులను, కంకణములను, ఇతరములగు ఆయుధములను ధరించి విశేషముగా ప్రకాశించుచుండగా, వసుదేవుడు చూచెను.

శ్రీహరి తనకు పుత్రుడై పుట్టుటను గాంచిన ఆ వసుదేవుని కన్నులు ఆశ్చర్యముతో విప్పారెను. నల్లనయ్య అవతరించిన ఉత్సవముయొక్క హడావుడితో కూడియున్న ఆయనను ఆనందము ముంచేత్తాను. అప్పుడాయన వేదపండితుల కొరకు పది వేల గోవులను దానము చేయుటకు సంకల్పము చేసెను.

ఓ మహారాజా! తన కాంతితో ఆ ప్రసవగృహమును వెలిగిపోవునట్లు చేయుచున్న ఈ బుడతడు పురుషోత్తముడేనని వసుదేవుడు నిశ్చయించుకొనెను. శ్రీహరి మహిమ నేరిగిన ఆయనకు కంసుని వలని భయము తొలగిపోయెను. ఏకాగ్రమగు చిత్తము - (పవిత్రమగు అంతఃకరణము) గల ఆయన అప్పుడు ప్రణామము చేసి దోసిలి ఘటించి స్తుతించెను.

వసుదేవుడిట్లు పలికెను -- నీవెవరివో నాకు తెలిసినది. నీవు సాక్షాత్తు ప్రకృతికి అతీతుడవగు పురుషోత్తముడవు. ప్రాణులయందలి అద్వయమగు ఆనందానుభవమే నీ స్వరూపము. నీవు సకలప్రాణులలో ఆత్మరూపుడవై సకలబుద్ధివృత్తులకు సాక్షి వై ఉన్నావు.

అట్టి (ప్రకృతికి అతీతుడవగు) నీవే సృష్ట్యాదియందు నీ మాయాశక్తితో సత్త్వరజస్తమోగుణములు ఉపాదానముగా గల ఈ జగత్తును సృష్టించినావు. ఆ పైన నీవు ఆ జగత్తులో యథార్థముగా ప్రవేశించకున్ననూ, (జగత్తునందు అనుభవమునకు వచ్చే సత్తాస్పూర్తులను బట్టి). ప్రవేశించినావా యన్నట్లున్నావని శ్రుతులు వర్ణించుచున్నవి. (నీవు యథార్థముగా దేవకీగర్భమునందు ప్రవేశించకున్ననూ, ప్రవేశించినావన్నట్లు తెలియబడెదవు).

మహత్తత్త్వము, అహంకారము, శబ్దస్పర్శరూపరసగంధములనే ఐదు తన్మాత్రలు వెరసి ఏడు వికారము చెందని తత్త్వములు. పృథివి మొదలైన పంచభూతములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, మనసు వెరసీ పదహారు - వికారము చేందే తత్త్వములు. అవికారీ తత్త్వములు వికారి తత్త్వములలో వాస్తవముగా ప్రవేశించకున్ననూ, ప్రవేశించినవా యన్నట్లు కానవచ్చును. నీవు కూడ అటులనే. (సర్వమునందు పరమాత్మ సద్రూపముగా ముందునుండియే ఉండును గనుక, కొత్తగా ప్రవేశించడమనేది లేదు; ఐననూ ప్రవేశించినట్లు భావించబడును). ఈ అవికారి తత్త్వములు ఏడు వేర్వేరుగా ఉన్నంత వరకు వాటి శక్తుల మధ్య పొంతన ఉండదు. అవి (సదనమగు పరబ్రహ్మయొక్క ప్రేరణచే) వికారి తత్త్వములతో కలిసి బ్రహ్మాండమును ఉత్పన్నము చేయుచున్నవి.

ఆ అవికారి తత్త్వములు పరస్పరము కలిసి బ్రహ్మాండమును ఉత్పన్నము చేయగా, కొత్తగా ప్రవేశించినవా యన్నట్లు కనబడుచున్నవి. అవి ఈ బ్రహ్మాండమునందు ముందే (కారణరూపముగా) ఉండుట వలన, కొత్తగా ప్రవేశించుట అనేది లేదు.

సర్వము నీవే అయి ఉన్నావు. సర్వముయొక్క అంతర్యామివి నీవే. రూపాదిజ్ఞానమును బట్టి కన్ను మొదలగు ఇంద్రియముల ఉనికి ఊహించబడును. ఈ విధముగా నీవు ఆ ఇంద్రియములతో మరియు వాటిచే గ్రహించబడే రూపాది గుణకార్యములతో కలిసిపోయి ఉన్ననూ, నీకు ఆ ప్రకృతియొక్క గుణములతో సంగము లేదు. సదనమగు ఆత్మవు నీవే. నీయందు దేశకాలపరిచ్చేదములు లేవు గనుక, బయట-లోపల అనే తేడాలు నీకు లేవు.

త్రిగుణముల కార్యములు మరియు దృశ్యములు అగు దేహాదులు ఆత్మస్వరూపమగు ఉనికిని విడిచి స్వతంత్రమగు ఉనికి గలవి కానే కావు. అవి కేవలము పోగీంద్రీయము మాత్రమే ఆలంబనముగా గల నామములతో కూడియుండే రూపములు మాత్రమే. ఎందుకంటే, శాస్త్రవిచారము చేసిన మహాత్ములు వాటిని స్వతంత్రమగు ఉనికి లేని అధ్యారోపములు మాత్రమేనని త్రోసిపుచ్చినారు. కాని, అజ్ఞానియగు వ్యక్తి అవి ఆత్మకంటే భిన్నముగా స్వతంత్రమగు సత్త గలవియని నిశ్చయించుకొనును.

ఓ ప్రభూ! నీయందు సంకల్పములు గాని, క్రియలు గాని, వికారములు గానీ లేవు. సత్త్వరజస్తమోగుణాత్మకమగు ప్రకృతి నీయందు యథార్థముగా స్వతంత్రమగు సత్త గలదిగా లేనే లేదు. ఐననూ, ఈ జగత్తుయొక్క సృష్టి స్థితిలయములు నీవలననే ఘటిల్లుచున్నవని మహాత్ములు చెప్పెదరు. ఇట్లు చెప్పుటలో విరోధమేమీ లేదు. ఎందుకంటే, నిర్గుణబ్రహ్మవు నీవే, సగుణబ్రహ్మవు (ఈశ్వరుడవు) నీవే. నీయందు ఆరోపించబడే గుణములకు అధిష్టానము నీవే గనుక, గుణములయందలి కర్తృత్వము కూడ నీయందు ఆరోపించబడుచున్నది.

అట్టి సదనుడవగు నీవు నీ మాయాశక్తి ద్వారా. ముల్లోకములను పాలించుట కొరకై సత్త్వగుణమయమగు విష్ణు (శాంత) రూపమును, సృష్టించుటకై రాగముతో కూడిన రజోగుణప్రధానమగు ప్రజాపతి రూపమును, ప్రాణులను ఉపసంహరించే ప్రళయకాలమునందు. తమో గుణప్రధానమైన రుద్రరూపమును దాల్చెదవు. తెలుపు సత్త్వగుణమునకు, ఎరుపు రజోగుణమునకు, నలుపు తమస్సునకు చిహ్నములు.

సకలజగత్తును శాసించే ఓ ప్రభూ! నీవు ఈ లోకమును రక్షించగోరి నా ఇంటిలో అవతరించితివి. రాక్షసులు రాజుల పేరుతో చెలామణీ అగుచున్నారు. వారి సేనానాయకులచే ఇటునటు త్రిప్పబడుతూ ఉండే కోట్లాది సేనలను నీవు మట్టుబెట్టగలవు.

ఓ దేవదేవా! నీవు మా ఇద్దరి ఇంట్లో అవతరిస్తావని విని దుష్టుడగు ఈ కంసుడైతే నీ అన్నలను (నీవేమోననీ) క్రూరముగా చంపినాడు. నీవు అవతరించిన విషయమును రాజభటులు ఆతనికి ఇప్పటికే చెప్పి యుందురు. ఆతడు ఆయుధమును చేతబట్టి నీ మీదకు వచ్చుచుండును.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- అప్పుడు పురుషోత్తముని లక్షణములతో కూడియున్న పుత్రుని చూచి దేవకి ఆయనను స్తుతించెను, ఆమె కంసునకు భయపడిననూ, పుత్రుని చూచి ఆమె ముఖములో స్వచ్ఛమగు చిరునవ్వు మొల కెప్తాను.

సర్వజగత్కారణమగు పరబ్రహ్మ ఇంద్రియగోచరము కాదు. స్వయంప్రకాశమగు ఆ బ్రహ్మయొక్క స్వరూపమునందు గుణములు గాని, వికారములు గాని, భేదములు గాని, చేష్టలు గాని, సంకల్పములు గాని లేవని మహాత్ములు చెప్పుచున్నారు. సర్వవ్యాపకమగు ఆ పరబ్రహ్మ సాక్షాత్తుగా నీవే. దేహేంద్రియమనస్సంఘాతమునకు సత్తాస్ఫూర్తుల ననుగ్రహించే ఆత్మవు నీవే.

కాలముయొక్క వేగముచే బ్రహ్మగారి రెండు ఏబదుల ఆయుష్టు పూర్తియే బ్రహ్మాండము ఐదు మహాభూతములయందు, అవి తమకు కారణమగు మహత్తత్త్వమునందు, అది మాయాశక్తియందు విలీనమగును. అప్పుడు నీవొక్కడివే మిగిలియుందువు. కావుననే నీకు శేషుడని పేరు.

ప్రకృతిని ప్రవర్తిల్ల జేసే ఓ ఈశ్వరా! రెప్పపాటుతో మొదలై సంవత్సరము వరకు ఉండే ఏ కాలము గలదో, ఇది చాల గొప్పది. దాని వలననే జగత్తు (సృష్టిస్థితిప్రళయములయందు) తిరుగుచున్నది. ఆ కాలము నీ లీలయేనని మహాత్ములు చేప్పెదరు. అట్టి కాలప్రవర్తకుడవైన నీవు అభయమునకు స్థానమవు. నిన్ను శరణు వేడుచున్నాను.

సర్వకారణమైన ఓ ఈశ్వరా! మరణశీలుడగు మానవుడు మరణమనే పెద్ద పామునకు భయపడుతూ లోకములనన్నింటినీ తిరిగి అభయమును పొందలేకపోయెను. ఆ మానవుడు అనుకోకుండా (నీ కృపచే) పద్మములవంటి నీ పాదములను చేరి (శరణాగతి చేసి) విశ్రాంతిని పొందును. మృత్యువు అట్టివానికి దూరముగా పోవును.

అట్టి (అభయస్థానమగు) నీవు మమ్ములను కాపాడుము. ఉగ్రసేనుని పుత్రుడగు కంసుడు భయంకరుడు. మేము వానికి భయపడుచున్నాము. నీవు భక్తుల భయమును పోగొట్టువాడవు. ధ్యానించ దగిన ఈ పురుషోత్తమ రూపమును మాంసచక్షువులగు అజ్ఞానులకు కనబడనీయకుము.

మధువును సంహరించిన ఓ శ్రీహరీ! నీవు నా పుత్రుడవై అవతరించిన సంగతి పాపియగు ఈ కంసునకు తెలియరాదు. నా మనస్సులో ధైర్యము లేదు. నేను నీ గురించి కంసుని నిమిత్తముగా చాల ఆదుర్దా పడుచున్నాను.

ఓ శ్రీహరీ! జగత్తుయొక్క సారము నీవే. శంఖచక్రగదాపద్మములతో సేవించబడే నాలుగు చేతుల ఈ దివ్యరూపమును దాచి పెట్టుము.

పురుషోత్తముడవగు నీవు ప్రళయమునకు అంతము (సృష్టిస్థితులు), నందు ఈ జగత్తును నీ దేహమునందు తొడతొక్కిడి లేకుండా ధరించి యుందువు. అట్టి ఈ నీవు నా గర్భమునందు జన్మించితివనేది యేది గలదో అది మానవలోకమునకు (ఊహకు అందనిదగుటచే హాస్యాస్పదముగా నుండును గదా!

శ్రీభగవానుడిట్లు పలికెను --- స్వాయంభువ మన్వంతరము నడచుచుండగా నీవు గడచిన జన్మలో పృశ్నిగను, ఈ వసుదేవుడు నిష్కల్మషుడగు సుతపసుడనే ప్రజాపతిగను ఉండిరి.

మీరిద్దరిని బ్రహ్మగారు సంతానమును కనుడని ఖచ్చితముగా ఆదేశించెను. అప్పుడు మీరు ఇంద్రియములనన్నింటినీ బాగుగా నియమించి కఠోరమగు తపస్సును చేసిరి.

మీరిద్దరు ఆయా కాలముల లక్షణములైన వర్షమును, గాలిని, ఎండను, మంచును, వేసవి తాపమును సహిస్తూ ప్రాణాయామమును చేసి మనస్సులోని కాలుష్యములను పటాపంచలు చేసిరి.

మీరిద్దరు నానుండి కోరికలను కోరువారై రాలిన ఎండుటాకులను గాలిని మాత్రమే ఆహారముగా తీసుకుంటూ ప్రశాంతమగు మనస్సుతో నన్ను ఆరాధించిరి.

 ఈ విధముగా మీరిద్దరు మనస్సును నాయందు నిలిపి ఇతరులకు చేయ శక్యము కాని కఠోరమైన తపస్సును చేయుచుండగా, పన్నెండు వేల దేవసంవత్సరములు గడచినవి.

ఓ పుణ్యాత్మురాలా! వరములనిచ్చువారిలో నేను అగ్రేసరుడను. మీరిద్దరు తపస్సు చేస్తూ నమ్న నిత్యము శ్రద్ధాభక్తులతో హృదయములో ధ్యానించితిరి. అప్పుడు నేను మిక్కిలి ప్రీతి జెంది మీ ఇద్దరి కోరికలను తీర్చగోరి ఇదే రూపములో సాక్షాత్కరించితిని. పరమును కోరుకొనుడని నేను చెప్పగా, నావంటి పుత్రుని మీరు వరముగా కోరితిరి.

సంతానము లేని దంపతులైన మీరిద్దరు ఇంద్రియభోగములను సేవించినవారు కారు. కాని, నా మాయాశక్తిచే మోహితులైన మీరు నానుండి మోక్షమును కోరకుండిరి.

వరములిచ్చి నేను నిషమించితిని. నన్ను పోలిన పుత్రుని వరముగా పొంది మీ ఇద్దరి అభీష్టము ఈడేరినది. పిదప మీరిద్దరు ఇంద్రియభోగముల ననుభవించిరి.

సచ్చీలము, నిండుదనము, దయ ఇత్యాది గుణములచే నాతో సమమైనవాడు లోకములో మరియొకడు కానరాడు. కావుననే, నేను మీకిద్దరికి పుత్రుడనై జన్మించి పృశ్నిగర్బుడని పేరు వడసితిని. 

మీరిద్దరు అదితి-కశ్యపులు కాగా మరల నేనే మీకు పుత్రుడనై జన్మించి ఉపేంద్రుడని పేరు వడసితిని. నేను పొట్టిగా నుండుట వలన

 మరల ఆ మీ ఇద్దరే ఇప్పుడు దేవకీవసుదేవులైరి. ఆ నేనే అదే రూపముతో మరల ఇప్పుడు మూడో సారి మీకు పుత్రుడనైతిని. ఓ పతివ్రతా! నా మాట యథార్థము.

నేను గడచిన జన్మలలో మీకు పుత్రుడనై జన్మించిన విషయము మీకు గుర్తుకు వచ్చుటకై మీకీ రూపమును చూపించితిని. అట్లు చూపించనిచో, మానవదేహముతో నా అవతారముల గురించి జ్ఞానము కలుగదు.

మీరిద్దరు నన్ను పుత్రుడనే భావముతో, పలుమార్లు పరబ్రహ్మ అనే భావముతో కూడ భావించువారై నాయందు ప్రేమను కలిగియుండుడు. మీరు సర్వాతిశాయియగు నా స్వరూపము (మోక్షము) ను పొందెదరు.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీహరి భగవానుడిట్లు పలికి మిన్నకుండెను. తల్లిదండ్రులు ప్రేమతో చూచుచుండగనే, ఆయన తన మాయాశక్తిచే వెంటనే మామూలు పిల్లవాడు ఆయెను.

తరువాత శ్రీహరి భగవానుని ప్రేరణచే శూరపుత్రుడగు ఆ వసుదేవుడు పురిటి గదినుండి పుత్రుని ప్రేమగా తీసుకొని బయటకు వెళ్లుటకు సంసిద్ధుడాయెను. అదే సమయములో యథార్థముగు పుట్టుక లేని ఏ యోగమాయ గలదో ఆమె నందుని భార్యయగు యశోదకు జన్మించెను.

అప్పుడు ఆ యోగమాయ ద్వారపాలకులకు, పురజనులకు కూడ పదార్థజ్ఞానమును కలిగించే ఇంద్రియవ్యాపారములన్నింటినీ తొలగించి నిద్ర పోవునట్లు చేసెను. కారాగారముయొక్క ద్వారములన్నింటికీ పెద్ద తలుపులు ఉండెను. అవి-ఇనుప కీలలలో, గొలుసులతో మూసివేయబడెను. వాటిని తెరుచుకొని బయట పడుట దుర్ఘటము.

 సూర్యుడు ఉదయించగానే చీకటి తొలగిపోవునట్లుగా, కృష్ణుని నెత్తి పై పెట్టుకొని వసుదేవుడు రాగానే ఆ తలుపులు తమంత తాము తెరుచుకొనెను. మేఘము మెల్లగా గర్జిస్తూ వర్షించెను. ఆది శేషుడు పడగలతో నీరు కృష్ణునిపై పడకుండా కాపాడుతూ ఆయన వెంట వెళ్లెను.

పలుమార్లు పర్జన్యాధిపతియగు ఇంద్రుడు వర్షించిన కారణముగా యముని సహోదరియగు యమునా నది లోతైన నీటియందు ప్రవాహవేగముతో కూడిన, తరంగములను, నురగను కలిగియుండెను. వందలాది సుడిగుండములతో కల్లోలముగానున్న ఆ నది, సీతాపతియగు శ్రీరామునకు సముద్రము వలె, దారినీ ఇచ్చెను.

శూరపుత్రుడగు వసుదేవుడు నందుని గొల్లపల్లెను చేరుసరికి అచట యోగమాయ ప్రభావముచే ఒళ్లు మరిచి నిద్రించుచున్న గోపాలకులు ఆయన కంట బడిరి. ఆయన పుత్రుని యశోద ప్రక్కలో పరుండబెట్టి, ఆమె కుమార్తెను తీసుకొని మరల కారాగారమును చేరుకొనెను.

తరువాత వసుదేవుడు ఆ అమ్మాయిని దేవకి ప్రక్కలో పరుండబెట్టెను. ఆయన కాళ్లకు సంకెళ్లను కట్టుకొని ఇదివరలో వలేనే బందీయై ఉండెను.

నందుని భార్యయగు యశోద సొమ్మసిల్లేను. ఆమెకు నిద్రచే (యోగమాయా ప్రభావముచే) స్మృతి లేకుండెను. తనకు ప్రసవమైనదని మాత్రమే ఆమెకు తెలిసెను. ఆ శిశువు మగా, లేక ఆడా ఆను విషయము ఆమెకు తెలియలేదు.

శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో శ్రీకృష్ణ జననమును వర్ణించే మూడవ అధ్యాయము ముగిసినది (3).