శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

13 - బ్రహ్మదేవుడు వ్యామోహితుడగుట

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! నీవు గొప్ప భాగ్యము గలవాడవు, భగవద్భక్తులలో శ్రేష్ఠుడవు. నీవు బాగుగా ప్రశ్నించితివి. ఎందుకంటే, నీవు పలుమార్లు విన్ననూ, శ్రీకృష్ణ భగవానుని గాథకు నీ ప్రశ్నల ద్వారా ఒక కొత్తదనమును కలిగించుచున్నావు.

సత్పురుషుల వాక్కు శ్రీహరినే కీర్తించును, చెవులు శ్రీహరి గాథనే వినును, మనస్సు ఆ శ్రీహరినే ధ్యానించును. సారమును గ్రహించే అట్టి సత్పురుషుల స్వభావము ఇదియే. ఏదనగా, విటులకు యువతుల వార్త వలె, వారికి శ్రీకృష్ణ భగవానుని ప్రసంగము ప్రతిక్షణము బాగా కొత్తదివలె నుండును.

ఓ పరీక్షిన్మహారాజా! సావధానుడవై వినుము. అది రహస్యమే ఐననూ, నీకు చెప్పెదను. ఎందుకంటే, గురువులు ప్రేమ గల శిష్యునకు రహస్యమునైననూ చెప్పెదరు.

ఆ విధముగా శ్రీకృష్ణ భగవానుడు దూడలను, గోపబాలకులను మృత్యురూపమైన అఘాసురుని నోటినుండి రక్షించి యమునానదియొక్క ఇసుకతిన్నె వద్దకు తీసుకువచ్చి ఇట్లు పలికెను.

ఆహా! మిత్రులారా! ఇసుకతిన్నె చాల అందముగా నున్నది. మెత్తని స్వచ్చమగు ఇసుక గల ఇది మన ఆటపాటలకు అన్ని విధముల సామగ్రిని కలిగియున్నది (విశాలమైనది). సరస్సులోని పద్మములు వికసించి సర స్సే వికసించినట్లున్నది. వాటి పరిమళముచే ఆకర్షితములైన తుమ్మెదలు, పక్షులు నీటిలో చేసే ధ్వనులను ప్రతిధ్వనిస్తూ ప్రకాశించే చెట్లతో వ్యాపించబడి యున్నది.

మనము ఇక్కడనే భుజించెదము. బాగా పొద్దెక్కినది. ఆకలి ఇబ్బంది పెట్టుచున్నది. దూడలు నీళ్లను త్రాగి, దగ్గరలో మెల్లగా గడ్డిని మేయుగాక!

గోపబాలకులు సరేనని దూడలకు నీరు త్రాగించి వాటిని పచ్చిక బయలునందు కట్టివేసి, ఉట్టిల ముడులను విప్పి, శ్రీకృష్ణ భగవానునితో బాటుగా భోజనము చేసిరి.

అడవిలో గోకుల బాలకులు శ్రీకృష్ణునకు అభిముఖముగా ఆయన చుట్టూ గుండ్రని వరుసలలో దగ్గరగా కలిసి కూర్చుండిరి. వికసించిన కన్నులు గల వారు పద్మపు దుద్దు చుట్టూ ఉండే రేకలవలె ప్రకాశించిరి.

కొందరికి పువ్వులు, కొందరికి ఆకులు, మరికొందరికి చిగుళ్లు, ఇంకొందరికి మొలకలు భోజనపాత్రలైనవి. కొందరు పళ్లను, కొందరు ఉట్టీలను, కొందరు చర్మములను, మరికొందరు చెట్టు బెరడులను, ఇంకొందరు రాళ్లను పాత్రలుగా చేసుకొని భుజించిరి.

వారందరు తమ తమ తినుబండారముల రుచిని వేర్వేరుగా ఒకరికొకరు చూపించుచుండిరి. వారు నవ్వుతూ నవ్విస్తూ, శ్రీకృష్ణ భగవానునితో కలిసి భుజించిరి.

శ్రీకృష్ణుడు నడుము కట్టిన జంట వస్త్రములయందు పిల్లన గ్రోవిని, ఎడమ కచ్చయందు కొమ్ముబూరాను బెత్తమును పెట్టుకొనెను. ఆయన చేతిలో పెరుగు అన్నపు ముద్దను, వ్రేళ్ల సందులయందు ఊరగాయ ముక్కలను పట్టుకొనెను. మిత్రుల మధ్యలో ఉన్న ఆయన తన చుట్టూ ఉన్న మిత్రులను తన పరిహాసోక్తులతో నవ్వించుచుండెను. యజ్ఞభాగములను స్వీకరించే భగవానుడు పిల్లలతో ఆడుతూ తింటూ ఉంటే స్వర్గములోని దేవతలు కళ్లప్పగించి చూచుచుండిరి.

భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! దూడలను, కాసే ఆ బాలకులీ విధముగా శ్రీకృష్ణ భగవానునియందు లగ్నమైన మనస్సులు గలవారై భోజనము చేయుచుండిరి. ఇంతలో దూడలు గడ్డి మీది ఆశతో అడవి మధ్యలోనికి దూరముగా వెళ్లినవి.

ఈ జగత్తులోని భయములకు శ్రీకృష్ణుడంటే భయము. ఆ గోపబాలకులు భయముతో కంగారు పడుటను ఆయన చూచెను. దూడలు ఏమైనవో అనే ఆశంక వలన కలిగిన వారి భయమును పోగొడుతూ, ఆయన వారితో నిట్లనెను -- ఓ మిత్రులారా! మీరు భోజనమును మానకుడు. నేను దూడలను ఇక్కడకు తీసుకువచ్చెదను.

శ్రీకృష్ణభగవానుడు ఇట్లు పలికి తమ దూడలను వెదుకుటకు వెళ్లాను. ఆయన చేతిలో అన్నపు ముద్ద అటులనే యుండెను. పర్వతములు, గుహలు, పొదరిళ్లలో మరియు దాగే స్థానములయందు ఆయన వెదికేను.

కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! పద్మసంభవుడగు బ్రహ్మ దేవుడు ముందు ఆకాశములోనున్నవాడై సర్వశక్తిమంతుడగు శ్రీకృష్ణుడు అఘాసురునకు విముక్తినిచ్చుటను గాంచి చాల ఆశ్చర్యమును పొందెను. ఆయన అదే సమయములో శ్రీకృష్ణుని ఆ ఇబ్బందిలో అచటకు వెళ్లాను. మాయాశక్తిచే మానవబాలకుడై అవతరించిన పరమేశ్వరుని మరియొక ఆహ్లాదకరమైన మహిమను. చూడాలని ఆయన కోరిక. ఆయన దూడలను కాసే పిల్లలను, వారి దూడలను అక్కడనుండి ఇంకో చోటకు తీసుకుపోయి తాను అంతర్ధానము చెందెను.

అప్పుడు శ్రీకృష్ణునకు అడవిలో దూడల జాడ తెలియలేదు. ఇసుకతిన్నెకు తిరిగి వస్తే ఆక్కడ గోపబాలకుల జాడ కూడ లేదు. ఆయన ఇటు దూడలను, అటు గోపబాలకులను, ఇద్దరినీ కూడ అంతటా వెదికెను.

అడవి మధ్యలో దూడలు కానరాలేదు. గోపబాలకులు కూడ ఎక్కడనైననూ కనబడలేదు. వెంటనే సర్వజ్ఞుడైన శ్రీకృష్ణునకు అదంతా బ్రహ్మదేవుడు చేసిన పనియేనని తెలిసి పోయెను.

అప్పుడు జగత్కారణుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇటు ఆ గోపబాలకుల తల్లులను, అటు బ్రహ్మదేవుని కూడ ఆనందింప జేయగోరెను. ఆయన తానే దూడలు, గోపబాలురు అనే రెండు రూపములుగా ప్రకటమయ్యెను.

ఎన్ని దూడల మరియు దూడలను కాసే బాలుర చిన్ని దేహములు గలవో, ఏ ప్రమాణములో వారి చేతులు కాళ్లు ముక్కు మొదలైనవి గలవో, ఎన్నైతే బెత్తములు కొమ్ము బూరెలు పిల్లన గ్రోవులు అలంకరించుకునే ఆకులు ఉట్టిలు గలవో, ఏయే ఆభరణములు వస్త్రములు గలవో అవన్నీ ఆ శ్రీకృష్ణుడే ఆయెను. ఇంతే గాదు. ఆ దూడలకు, బాలురకు ఏయే స్వభావము, గుణములు, పేర్లు, మాట తీరులు, ఆకారములు, వయస్సులు, విహారములు, పెంకి తనములు మొదలైనవి గలవో వాటినన్నింటినీ పుట్టుక లేని ఆయన యథాతథముగా ప్రకటించెను. సర్వము విష్ణుమయమనే శ్రుతివచనమునకు ఆ స్థితి అద్దము పట్టెను.

శ్రీకృష్ణుడు స్వయముగా తానే ఆవుదూడలై, తానే వాటిని కాసే గోప బాలకులై, తానే తనతో విహరించి క్రీడిస్తూ, తానే పోటీని వెనుకకు దోలి, సర్వము (క్రియలు, కారకములు) తానే అయి గోకులములో ప్రవేశించెను.

ఓ పరీక్షిన్మహారాజా! ఆయన ఆయా దూడలను వేరుగా తోలుకు వెళ్లి ఆయా ఆవుల కొట్టములయందు కట్టివేసెను. తరువాత ఆయా గోపబాలకులై వారి వారి ఇళ్లలోనికి ప్రవేశించెను.

పిల్లన గ్రోవి ధ్వని వినగానే పరబ్రహ్మయగు శ్రీకృష్ణుని తమ తమ పుత్రులుగా భావించిన ఆ బాలుర తల్లులు వేగముగా లేచి పుత్రులను చేతులతో ఎత్తుకొనెడివారు. వారిని ప్రేమతో నిండుగా ఆలింగనము చేసి, ప్రేమతో స్రవించే పౌలు అనే అమృతమువంటి ఆసవమును ఆ పిల్లలచే త్రాగించెడివారు.

ఓ పరీక్షిన్మహారాజా! ఆఖరి జామున ఇంటికి చేరాలనే నియమం ప్రకారముగా శ్రీకృష్ణ భగవానుడు సాయంకాలము ఇంటికి చేరి తన చేష్టలతో తల్లులకు ఆనందమును కలిగించెడివాడు. అప్పుడు తల్లులు తమ పుత్రులకు. అభ్యంగనస్నానము చేయించి, చందనమునలది, భూషణములనలంకరించి, దిష్టి తీసి, తిలకము దిద్ది, ఆహారము పెట్టి, నిద్ర పుచ్చి ఈ విధమైన పనులతో లాలించెడివారు.

ఆవులు ఆ అడవినుండి తొందరగా కొట్టమును చేరి హుంకారములతో లేగదూడలను పిలువగా అవి దగ్గరకు వచ్చెడివి. అపుడా ఆవులు తమ తమ లేగలను మాటి మాటికీ నాలుకతో ఆస్వాదిస్తూ పొదుగునుండి స్రవించే పాలను త్రాగించెడివి.

ఆవులకు దూడల రూపములోనున్నట్టియు, గోపికలకు పుత్రుల రూపమునందున్న శ్రీకృష్ణునియందు తల్లుల వ్యవహారమంతా పూర్వమునందు వలెనే ఉండెను. కాని, ప్రేమయందు మాత్రము ఆధిక్యము ఉండెను. ఆయా రూపములయందున్న ఆయనకు కూడ వారియందు తల్లుల యెడల ప్రేమ పూర్వము వలెనే ఉండెను. కాని, అజ్ఞానముచే కలిగే ఆసక్తి మాత్రము లేకుండుటయే తేడా.

గోకులవాసులకు తమ పిల్లలయందు శ్రీకృష్ణునియందు వలే ప్రేవు ఉండెడిది. కాని, ఆ ప్రేమప్రవాహము ఇదివరలో లేని విధముగా హద్దులు లేకుండా మేలగా సంవత్సర పగంతము ప్రతి దినము పెరిగెను

గోపాలకుడగు ఆ శ్రీకృష్ణుడీ వీధముగా దూడల మరియు గోపబాలుర వేషముతో తాను తనను తనచే అడవిలో మరియు ఆవుల కొట్టములో పాలించుచుండెను. ఆ విధముగా ఆయన సంవత్సరము క్రీడించేను.

సంవత్సరము పూర్తి యగుటకు ఇంకనూ ఐదారు రోజులు మాత్రమే మిగిలేను. ఒకనాడు పుట్టుక లేని శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో గూడి దూడలను మేపుతూ అడవిని ప్రవేశించెను.

గోవర్ధనపర్వతశిఖరముపై గడ్డి మేయుచున్న ఆవులు అక్కడనుండి చాల దూరముగా గొల్లపల్లెకు దగ్గరలో మేయుచున్న దూడలను చూచినవి.

దూడలను చూచిన వెంటనే ఆ ఆవులు దూడలయందలి ప్రేమకు వశమై ఒళ్లు మరచి తమను పాలించే గోపబాలకులను, వేళ్ల శక్యము కాని దారిని కూడ లెక్క చేయకుండా వేగముగా పరుగెత్తినవి. అవి పరుగెత్తే వేగమునకు చూపరులకు రెండే కాళ్లు ఉన్నవా యనిపించును. అవి అంతటా పొలను స్రవిస్తూ హుంకరిస్తూ తోకలను తలలను పైకెత్తి పరుగెడుతూ ఉంటే మెడలు మూపురములోనికి సంకోచమును పొందినవి.

అవి పర్వతమునకు క్రిందనున్న దూడలను - చేరినవి. కోట్టములో లేగలున్న ఆవులు కూడ వాటికి తమ పొదుగులలోని పాలను త్రాగించినవి. అవి దూడలను మ్రింగివేయుచున్నవా యన్నట్లు ఆస్వాదించుచుండెను.

గోపాలకులు వాటిని ఆపే ప్రయత్నమును చేసి విఫలమైరి. దానితో వారికి సిగ్గుతో బాటు పెద్ద కోపము కలిగినది. పైగా, వారు నడువ శక్యము. కాని మార్గమును కష్టముతో దాటి వచ్చిరి. వారికి ఆవులు, దూడలతో బాటు తమ పుత్రులు కూడ కనబడిరి.

తమ పుత్రులను చూచుటతోడనే ఆ గోపాలకుల హృదయములలో ప్రేమరసము ఉద్బుద్ధమై నింపివేసెను. వారి కోపము పోయి దాని స్థానములో అనురాగము ఉదయించెను. వారు పిల్లలను పైకెత్తుకోని చేతులతో - కౌగిలించుకొని పలుమార్లు నుదుటిపై ముద్దాడి సర్వోత్కృష్టమైన ఆనందముననుభవించిరి.

పెద్ద వయస్సు గల ఆ గోపాలకులకు పిల్లలను ఆలింగనము చేయుటచే మంచి సంతోషము కలిగినది. వారు కష్టము మీద మెల్లగా అక్కడనుండి నిష్క్రమించిరి. వారికి పిల్లలు గుర్తు వచ్చినప్పుడు కన్నీరు పెల్లుబుకుచుండెను.

గోకులములోని తల్లులకు, ఆవులకు స్తనపానమును విడిచి పెట్టిన సంతానముపై కూడ ప్రతిక్షణము ప్రేమ వర్ధిల్లెను. దాని వలన వారిలో పిల్లల గురించి ఉత్కంఠ పెరిగెను. దీనికి కారణము తెలియక బలరాముడిట్లు తలపోసెను.

సకలప్రాణులకు ఆత్మరూపుడైన వసుదేవపుత్రుడగు శ్రీకృష్ణునియందు వలె, నాతో సహా గోకులమునకు పిల్లలపై, దూడల పై ప్రేమ పెరుగుచున్నది. ఇట్టి ప్రేమ ఇదివరలో లేదు. ఈ అద్భుతమేమి?

ఈ మాయ ఎట్టిది? ఎక్కడనుండి వచ్చినది? దీనిని ప్రయోగించినది దేవతలా? మానవులా? లేక రాక్షసులా? నన్ను కూడ వ్యామోహ పెట్టే ఈ మాయ బహుశః నా ప్రభువగు శ్రీహరిది కావచ్చును. ఇతరము కాజాలదు.

యాదవవంశీయుడగు బలరాముడు ఈ విధముగా బాగా ఆలోచించి జ్ఞానమయమగు చూపుతో చూచెను. ఆయనకు దూడలయందు, తన వయస్సువారైన బాలకులయందు కూడ శ్రీకృష్ణ భగవానుడే గోచరించెను.

ఓ ప్రభూ! వీరు లోకపాలకులు కారు, మహర్షులు కూడ కారు. భేదమునకు ఆశ్రయమైన గోపాలకుల మరియు దూడల దేహమునందు , కూడ నీవు ప్రకాశించుచున్నావు. సర్వము నీవే ఎట్లు అయితివి? ఈ విషయములో గల వివేకమును చెప్పుము, అని బలరాముడు పలుకగా శ్రీకృష్ణుడు జరిగిన వృత్తాంతమును సంక్షేపముగా చెప్పెను. అప్పుడు బలరామునకు తెలిసెను.

అంతలో స్వయంభువుడగు బ్రహ్మదేవుడు వచ్చెను. ఆయనకు తన కాలమానముచే ఒక్క క్షణము మాత్రమే గడచెను. ఆ సంవత్సరకాలము నిరంతరముగా తానే సర్వము అయి ఇదివరలో వలెనే క్రీడించుచున్న శ్రీకృష్ణ భగవానుని ఆయన చూచెను.

గోకులమునందు దూడలు, బాలురు ఎందరు గలరో వారందరు నేను మాయాశక్తితో నిర్మించిన శయ్య పై నిద్రిస్తూనే ఉన్నారు. ఈ నాటికీ వారు నిద్ర లేవలేదు. ఇది నిశ్చయము.

నా మాయచే స్పృహ తప్పి ఉన్న వారు వేరు. ఇక్కడ వీరు వేరు. అక్కడ ఇక్కడ సమానముగా ఉన్నారు. వీరు ఎక్కడనుండి 1వచ్చిరి? అంతే మంది ఇచట శ్రీకృష్ణ భగవానునితో బాటు క్రీడించుచున్నారే!

ఈ విధముగా వేర్వేరుగా కనబడే దూడలు మొదలగువాటి గురించి స్వయంభువుడగు ఆ బ్రహ్మదేవుడు చాల సేపు ఆలోచించెను. కాని, ఆ ఇద్దరిలో ఎవరు- అసలైనవారు? ఎవరు కారు? అనే విషయమును ఆయన ఏ విధముగానైననూ తెలియలేకపోయెను.

మోహము లేని శ్రీకృష్ణ భగవానుని మాయ జగత్తును మోహ పెట్టును. ఆయనను తన మాయచే మోహ పెట్టబోయి బ్రహ్మదేవుడు పుట్టుక లేనివాడై కూడ తానే విశేషముగా మోహమును పొందెను.

రాత్రియందలి చీకటిని మంచు వలన కలిగిన చీకటి ఏమీ చేయలేదు. పైగా దానిలో విలీనమగును. పగలు సూర్యకాంతిలో మిణుగురు పురుగుయొక్క ప్రకాశము ఉన్నట్లే తెలియదు. అదే విధముగా, మహాపురుషునియందు మాయను ప్రయోగించినచో, ఆ తక్కువ స్థాయికి చెందిన మాయ ప్రయోగించినవాని సామర్థ్యమునే మట్టుబెట్టును.

అంతలో బ్రహ్మదేవుడు చూచుచుండగనే వెనువెంటనే దూడలు, గోపబాలురు అందరు మేఘమువంటి శ్యామవర్ణముతో పచ్చని పట్టు వస్త్రములతో కానవచ్చిరి.

వారు నాలుగు చేతులయందు శంఖము, చక్రము, గద, పద్మములను దాల్చి, కిరీటములను కుండలములను హారములను అడవి పూల మాలను ధరించియుండిరి.

వారు వక్షఃస్థలము పై శ్రీవత్సమనే పుట్టుమచ్చను, చేతులయందు బాహుపురులను, చేతులకు రత్నములు పొదిగి శంఖము వలె మూడు ధారలు గల కంకణములను, కాలియందెలను, కడియములను, నడుము త్రాళ్లను, ఉంగరములను ధరించి ప్రకాశించిరి.

గొప్ప పుణ్యాత్ములు కోమలమైన కొత్త తులసియొక్క మాలలను సమర్పించగా, వారా మాలలను కాళ్లనుండీ తలదాకా అంతటా అవయవములన్నింటియందు దాల్చిరి.

వారు రజోగుణము వంటి ఎర్రని ఓరచూపులు గల చూపులతో తమ భక్తుల ప్రయోజనములకు సృష్టికర్తలు వలె, సత్త్వగుణమువంటి వెన్నెల వలె స్వచ్చమైన చిరునగవులతో వాటిని పాలించువారు వలె నుండిరి.

బ్రహ్మదేవునితో మొదలిడి గడ్డిపోచవరకు ఉండే కదిలే మరియు కదలని దేహధారులందరు నాట్యము, గానము మొదలైన పూజావిధులతో వారిని వేర్వేరుగా ఉపాసించుచున్నారు.

అణిమ (సూక్ష్మరూపమును పొందుట), లఘిమ (తేలిక యగుట), ప్రాప్తి (దేనినైననూ పొందగల్గుట), ప్రాకామ్యము (మొక్కవోని ఇచ్చాశక్తి), మహిమ (పెద్ద రూపమును పొందే శక్తి), ఈశిత్వము (శాసించే శక్తి), వశిత్వము (ఇంద్రియనిగ్రహము), కామావసాయిత (నిష్కామత్వము) అనే ఎనిమిది సిద్దులు; మాయాశక్తి, క్రియాశక్తి మొదలైన శక్తులు; మహత్తు (సమష్టి బుద్ది), సూత్రము (సమష్టి ప్రాణము), సమష్టి అహంకారము, మనస్సు, కన్ను ముక్కు చెవి నాలుక చర్మము అనే ఐదు జ్ఞానేంద్రియములు, కాలు చేయి మాట విసర్జనేంద్రియము జననేంద్రియము అనే ఐదు కర్మేంద్రియములు, పృథివి జలములు అగ్ని వాయువు ఆకాశము అనే పంచభూతములు, శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనే తన్మాత్రలు, వెరసి ఇరవై నాలుగు తత్త్వములు మూర్తులను దాల్చి వారిని చుట్టుపారి యున్నవి.

కాలము, స్వభావము (పదార్థముల సహజధర్మము), (వాసనలకు మూలమునందుండే) సంస్కారము, కామనలు, కర్మలు (అదృష్టము), సత్త్వరజస్తమోగుణములు, పదార్థముల జాతి మొదలైనవి రూపు దాల్చి వారిని ఉపాసించెను. వారి ముందు వాటి మహిమ వెలవెల బోయెసు.

వారు పరిచ్ఛేదములు లేని సత్య-జ్ఞాన-ఆనందస్వరూపమనే ఒకే ఒక (చేతనజడవిభాగము లేని) తత్త్వముయొక్క మూర్తులు. ఉపనిషత్తుల విద్వాంసులు కూడ వారి గొప్ప మహిమను తెలియజాలరు. ఇది నిశ్చితము.

ఈ విధముగా స్వయంభువుడగు బ్రహ్మదేవునకు గోపబాలకులు, గోవులు అన్నీ ఏకకాలమునందు పరబ్రహ్మ (శ్రీకృష్ణ) రూపులుగా కనబడిరి. కదిలే మరియు కదలని ప్రాణులతో నిండియున్న ఈ జగత్తంతా ఆ పరబ్రహ్మయొక్క చైతన్యప్రకాశము చేతనే ప్రకాశించుచున్నది.

అప్పుడు వారి తేజస్సుచే స్వయంభువుడగు బ్రహ్మదేవుని పదకొండు ఇంద్రియములు (ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు) అతిశయించిన ఆశ్చర్యముచే అలజడి పొంది స్తబ్దములైనవి. గోకులాధిష్ఠాత్రియగు దేవత వద్దనుండే బొమ్మవలే ఆయన మిన్నకుండెను.

అసాధారణమగు మహిమ గల పరబ్రహ్మ తర్కమునకు గోచరము కాదు. స్వప్రకాశానందస్వరూపమైన పరబ్రహ్మ పుట్టుక లేని మాయాశక్తికంటె అతీతమైనది. ఉపనిషత్తులు పరబ్రహ్మకంటే విలక్షణమైన అసత్ ను నిషేధించుట ద్వారా పరబ్రహ్మను ప్రతిపాదించును. అట్టి పరబ్రహ్మను తెలియుట సరస్వతీనాథుడగు బ్రహ్మదేవునకు కూడ చేత కాలేదు. ఇది యేమి? అని ఆయన మోహితుడు' కాగా, పుట్టుక లేని శ్రీకృష్ణ పరబ్రహ్మ వెంటనే పుట్టుక లేని మాయ అనే తెరను తప్పించెను.

మాయను తొలగించుట వలన బాహ్యదృష్టి తిరిగి కలిగినది. ఆయన శవము వలె లేచి నిలబడి కష్టముగా కన్నులను తెరచి తనను, ఈ జగత్తును కూడ చూచెను.

వెనువెంటనే చుట్టూ దిక్కులను చూచుచున్న బ్రహ్మదేవునకు ఎదురుగానున్న బృందావనము కనబడెను. జనులకు బ్రదుకు దెరువును కల్పించే చెట్లతో దట్టముగానున్న ఆ బృందావనము లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుని నివాసస్థానము.

సహజసిద్ధమైన నివారించ శక్యము కాని వైరము గల మానవులు, పెద్దపులి మొదలగు కూరజంతువులు కూడ బృందావనమునందు కలిసి మిత్రులు వలే జీవించును. అది శ్రీకృష్ణ భగవానుని నివాసస్థానమగుటచే అచటనుండి క్రోధము, లోభము, భయము మొదలైనవి పారిపోయినవి.

ఆ బృందావనమునందు సకలజగన్నాథుడగు బ్రహ్మదేవుడు ఇదివరలో వలెనే గోపాలకుల వంశములోని పిల్లవానివలె నటించుచున్న అవినాశి పరబ్రహ్మను చూచెను. రెండవది లేనిది, సర్వజ్ఞము అగు ఆ పరబ్రహ్మ శ్రీకృష్ణ రూపములో ఒంటరిగా ఇదివరలో వలెనే చేతిలో అన్నపు ముద్దను కలిగియుండెను. ప్రకృతికి అతీతమైన ఆ పరబ్రహ్మ దూడలను, మిత్రులైన గోపబాలకులను చుట్టూ వెదుకుచుండెను.

బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని చూచి వెంటనే తన హంసవాహనమునుండి దిగి, బంగరు దండమువంటి దేహము నేలపై పడునట్లుగా సాష్టాంగనమస్కారమును చేసెను. ఆయన శ్రీకృష్ణుని రెండు పాదములకు తన నాలుగు కిరీటముల కొనలు తగులునట్లుగా నమస్కరించి, ఆనందముతో స్రవించే కన్నీరే దివ్యజలములు కాగా అభిషేకించెను.

ఇదివరలో తాను చూచిన శ్రీకృష్ణుని మహిమను బ్రహ్మదేవుడు పలుమార్లు తలచుకొనుచుండెను. ఆయన చాల సేపు మరల మరల లేచి లేచి ఆయన రెండు కాళ్లపై పడుతూ ఉండెను.

తరువాత బ్రహ్మదేవుడు మెల్లగా పైకి లేచి కళ్లను తుడుచుకొని మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని తల పైకెత్తి చూచెను. ఆ బ్రహ్మదేవుడు వినయముతో తలను వంచి దోసిలి యొగ్గి కొద్దిగా వణుకుతూ ఏకాగ్రచిత్తము గలవాడై బొంగురువోయిన కంఠముతో స్తుతించెను.

శ్రీమద్భాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్దములో బ్రహ్మదేవుడు వ్యామోహమును పొందుటను వర్ణించే పదమూడవ అధ్యాయము ముగిసినది.