శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

38 - అక్రూరుడు గోకులమునకు వెళ్లుట

అక్రూరుడు గొప్ప బుద్ధిశాలి. రాత్రిని మథురానగరమునందు గడిపెను. రథమునెక్కి నందుని గోకులమునకు బయలు దేరెను.

అక్రూరుడు గొప్ప పుణ్యాత్ముడు. ఆయనకు దారిలో వెళ్తూ ఉండగా, పద్మమును పోలిన కన్నులు గల శ్రీకృష్ణునియందు సర్వాతిశాయియగు భక్తి కలిగెను. ఆయన దీనినీ విధముగా తలపోసెను.

నేనీ నాడు శ్రీకృష్ణ భగవానుని చూడబోతున్నాను. ఇది దేని ఫలమో? నేను ఏమి పుణ్యమును చేసియుందును? ఏ గొప్ప తపస్సును అనుష్ఠించి యుందును? లేదా, యోగ్యునకు ఏది దానము చేసియుందును?

నేను ఇంద్రియభోగములయందు లగ్నమైనవాడను. పవిత్రకీర్తియగు శ్రీకృష్ణుని దర్శనము, శూద్రబాలకునకు వేదాధ్యయనము వలె, నాకు లభించుట చాల కష్టమని తలచెదను.

ఇట్లు తలచుట సరి కాదు. అధముడనే అయినా నాకు కూడ శ్రీకృష్ణ భగవానుని దర్శనము కలిగి తీరును. కాలప్రవాహములో అందరు కొట్టుకొనిపోవుచున్నారు. యథార్థమే. కాని, ఒక్కొక్కడు ఒక్కోచోట సంసారమనే ఆ నదిని తరించును.

ఈనాడు నా అశుభము నశించి, జన్మ కూడ సఫలమైనది. ఏలయన, యోగులచే ధ్యానించబడే పద్మమువంటి శ్రీకృష్ణ భగవానుని పాదమును నేను నమస్కరించెదను.

ఆహా! ఈనాడు కంసుడు నాకు పెద్ద అనుగ్రహమును చేసినాడు. కంసునిచే పంపబడిన నేను శ్రీకృష్ణునిగా అవతరించిన శ్రీహరియొక్క పద్మమువంటి పాదమును దర్శించగలను. ఆయన పాదపు గోళ్ల కాంతిచే పూర్వీకులు అతిక్రమించ శక్యము కాని అజ్ఞానమనే చీకటిని దాటి వేసిరి.

ఆ శ్రీహరి పాదమును బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు మరియు లక్ష్మీదేవి కూడ పూజించెదరు. గోవులను మేపుటకై అడవిలో గోపాలకులతో బాటుగా సంచరించే ఆ పాదమును భక్తులు, మహర్షులు పూజించెదరు. ఆ పాదము గోపికల వక్షఃస్థలమునందలి కుంకుమ యొక్క చిహ్నములు గలది.

లేళ్లు ప్రదక్షిణముగా తిరుగుచున్నవి. కాబట్టి, మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని ముఖము నిశ్చయముగా కనబడగలదు. ఆ ముఖము అందమైన చెక్కిళ్లు, అందమైన ముక్కు, చిరు నవ్వుతో కూడిన చూపులు, చుట్టూ దట్టని గిరజుల జుట్టుతో శోభిల్లును.

భూభారమును తగ్గించుటకై విష్ణువు స్వేచ్ఛచే మానవుడై జన్మించినాడు. ఆ సౌందర్యనిధానమగు విష్ణువు యొక్క దర్శనమీనాడు నాకు కలిగే పక్షములో, నా చూపునకు ఫలము తేలికగా లభించలేదని చెప్పుటకు వీలు లేదు.

కార్యకారణ రూపమగు జగత్తునకు ఆ శ్రీహరి సాక్షి. ఆయనయందు ఈ జగత్తును నేను చేసితీననే కర్తృత్వాభిమానము లేదు. ఆయన తన చైతన్యప్రకాశముచే అజ్ఞానమును, దాని వలన పుట్టే భేదబుద్ధిని పారద్రోలును. అయిననూ, ఆయన తన సంకల్పముచే తన మాయాశక్తి ద్వారా తనయందే ప్రాణములు, ఇంద్రియములు, బుద్ధి అనువాటితో కూడిన జీవులను ప్రకటించును. ఆయన ఆ జీవులతో (గోకులములోని) వారి గృహములయందు సంచరించుచున్నట్లు కానవచ్చును.

శ్రీహరి గుణములు, లీలలు, అవతారములను వర్ణించే వాక్కులు సకలపాపములను పోగొట్టి పరమకల్యాణములనిచ్చును. ఆ వచనములు ప్రాణి మాత్రమును నిశ్చయముగా ఉజ్జీవింప జేసి శోభను కలిగించి పావనము చేయును. అట్టి వర్ణనలు లేని వచనముల శోభ శవము యొక్క శోభ వంటిది (వ్యర్థము) అని పెద్దల అభిప్రాయము.

జగన్నాథుడగు శ్రీహరిచే రచించబడిన ధర్మమర్యాదలను లోక పాలకులు కాపాడెదరు. వారికి సుఖమును కలిగించే ఆ ఈశ్వరుడు యాదవవంశములో అవతరించి, యశస్సును విస్తరింపజేస్తూ గోకులము నందున్నాడు. అందరికీ సకలకల్యాణములనిచ్చే ఆ యశస్సును దేవతలు గానము చేయుచున్నారు.

మహాత్ములకు పరమలక్ష్యము తండ్రియగు భగవానుడే. ముల్లోకములలో సుందరుడగు ఆ భగవానుని దర్శనము కన్నులకు పెద్ద పండుగ యగును. ఆయన దాల్చిన ఈ శ్రీకృష్ణ శ్రీకృష్ణ రూపము  లక్ష్మీదేవి యొక్క ప్రీతికి నిధానము. ఆయనను నేనీనాడు చూచెదను. ఎందుకంటే, ఈనాడు నాకు ఉదయమునుండి శుభశకునములు కలిగినవి.

బలరామకృష్ణులను చూచిన వెంటనే నేను రథము రథము దిగి వారి పాదములకు నమస్కరించెదను. వారిద్దరు జగన్నియామకులైన పురుషోత్తములు. యోగులు కూడ స్వరూపజ్ఞానమును పొందుటకై వారి పాదములను హృదయమునందు ధ్యానించెదరు. ఇంతేగాక, వారికి తోడుగా ఉండే వారి మిత్రులైన బృందావనవాసులకు కూడ తప్పనిసరిగా నమస్కరించెదను.

తన పాదముల మొదట పడిన నా తలపై ఆ సర్వేశ్వరుడు తన పద్మమువంటి చేతిని ఉంచునా? కాలమనే పాము యొక్క వేగమునకు చాల భయపడి శరణు కోరే మానవులకు ఆ చేయి అభయమునిచ్చును.

ఆ చేతియందు పూజాద్రవ్యమును సమర్పించి ఒకానొక కల్పములో కౌశీకగోత్రోత్పన్నుడగు ఇంద్రుడు, బలిచక్రవర్తి కూడ ముల్లోకముల ఆధిపత్యమును పొందిరి. ఆహా! రాసలీలయందు దివ్యపద్మము యొక్క పరిమళము ఆ చేతి యొక్క స్పర్శచే గోకులమునందలి గోపికల శ్రమ దూరమయ్యెడిది.

నేను కంసునిచే పంపబడిన దూతను. ఐనా, సర్వసాక్షియగు శ్రీకృష్ణుడు నేను శత్రువునని తలబోయడు. ఏలయన, ఆయన క్షేత్రము (దేహేంద్రియమనస్సంఘాతము) నకు సాక్షియై ప్రాణుల మనోవృత్తులను మాత్రమే గాక దేహేంద్రియములయందుండే ఈ చేష్టలను కూడ నిర్వికారమగు చూపుతో చూచుచుండును.

నేను ఏకాగ్రమగు చిత్తముతో ఆయన పొదముల మొదట దోసిలి యొగ్గి నమస్కరించెదను. అప్పుడాయన నన్ను చిరునవ్వుతో దయతో కూడిన చూపుతో చూచునా? అట్లు చూచినప్పుడు వెనువెంటనే సకలపాపములు నశించి పోవును. నేను సందేహములు తీరి, గొప్ప ఆనందమును పొందెదను.  

దయతో చూచిన తరువాత ఆయన తన పొడవైన చేతులతో బంధువునగు నన్ను కౌగిలించుకొనును. నేను ఆయన హితమును కోరువారిలో మొట్టమొదటివాడను. పైగా, నాకు ఆయన తప్ప మరియొక దైవము లేదు. ఆ ఆలింగనము వలన అదే క్షణములో నా అంతఃకరణము పావనము (తాను పవిత్రమై ఇతరులను పవిత్రము చేయగలిగేది) అగును.నాకు కర్మల బంధము కూడ శిథిలమగును.

ఆలింగనము తరువాత నేను నమస్కరించి చేతులు జోడించి నిల బడెదను. అప్పుడు గొప్ప కీర్తి గల శ్రీకృష్ణుడు నన్ను, తండ్రీ! అక్రూరా! అని పలుకరించును. అదే క్షణములో మా కుటుంబము వారమందరము సఫలమగు జన్మ గలవారమగుదుము. సర్వోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు ఎవనినైతే సుతరాము ఆదరించడో, అట్టివాని ఆ జన్మ నిందార్హము.

ఒకడు ప్రియుడని గాని, మరియొకడు అధికముగా హితమును చేసినవాడని గాని, ఒకడు ద్వేషించదగినవాడని గాని, మరియొకడు ఉపేక్షించదగినవాడని గాని లేనే లేదు. కల్పవృక్షము తనను ఆశ్రయించినవారి కోరికలను మాత్రమే ఈడేర్చును. అదే విధముగా, భక్తులు ఆయనను ఏ విధముగా సేవిస్తే, వారిని ఆయన అదే విధముగా సేవించును.

ఇంతేగాక శ్రీకృష్ణుని అన్నగారు, యదుకుల శ్రేష్ఠుడు అగు బలరామునకు నేను దోసిలియొగ్గి నమస్కరించెదను. ఆయన నవ్వుతూ నన్ను కౌగిలించుకొని నా రెండు చేతులను పట్టుకొని ఇంటిలోనికి తీసుకు వెళ్లును. తరువాత ఆయన నాకు సకలసత్కారములను చేయును. తన బంధువుల యెడల కంసుని చేష్టను గురించి ఆయన నన్ను ప్రశ్నించును.

శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను  -  -  ఓ రాజా! శ్వఫల్కుని పుత్రుడగు అక్రూరుడు ఈ విధముగా దారిలో శ్రీకృష్ణుని ధ్యానిస్తూ, సూర్యుడు అస్తపర్వతమును చేరుసరికి రథము పై గోకులమును చేరుకొనెను.

అక్రూరుడు గోకులమునందు శ్రీకృష్ణుని (అరి)కాలి గురుతులను చూచి పద్మము, ధాన్యపు గింజ, అంకుశము, జెండా మొదలగు చిహ్నములను బట్టి గుర్తు పట్టెను. ఆ శ్రీకృష్ణుని స్వచ్ఛమైన పాదముల రేణువులను సకలలోకపాలకులు తమ కిరీటములతో సేవించెదరు. ఆ భూమికే అలంకారములాయెను.

ఆ కాలి గురుతులను చూడగానే వర్ధిల్లిన ఆనందముతో ఆ అక్రూరుడు పరవశుడాయెను. ప్రేమతో ఆయనకు గగుర్పాటు కలిగి కళ్లు నీటితో నిండగా చూపు కానరాలేదు. ఆయన రథమునుండి దిగి, ఆహా! ఇవి శ్రీకృష్ణ ప్రభుని పాద రేణువులు, అంటూ వాటియందు దొర్లెను.

కంసుని సందేశముతో మొదలిడి అక్రూరుడు డాంబీకమును, భయమును, దుఃఖమును విడిచి పెట్టి శ్రీకృష్ణ భగవానుని చిహ్నములను చూచి భక్తిని పొందుట అనేది యేది గలదో, ఇదియే దేహధారులకు పురుషార్థము. శ్రీహరి కీర్తనమును వినుట, ధ్యానించుట మొదలగు సాధనల వలన కూడ ఇట్టి భక్తి కలుగును.

శ్రీకృష్ణుడు పచ్చని వస్త్రమును, బలరాముడు నీలవస్త్రమును ధరించి పాలు పితికే చోట పాలను పితుకుచుండిరి. శరత్కాలపద్మములను పోలిన కళ్లు గల వారిద్దరిని అక్రూరుడు చూచెను.

బలరాముడు తెల్లని వాడు శ్రీకృష్ణుడు నల్లనివాడు. సౌందర్యమునకు నిధానములైన వారిద్దరికి ఇంకనూ యౌవనము రాలేదు. పొడవాటి చేతులు, అందమైన ముఖము గల వారిద్దరు అందగాళ్లలో శ్రేష్ఠులు. వారికి గున్న యేనుగు ఠీవివంటి ఠీవి గలదు.

జెండా, వజ్రము, అంకుశము, పద్మము అనువాటి గుర్తులు గల కాలి ముద్రలతో వారిద్దరు గోకులమును ప్రకాశింప జేయుచుండిరి. పెద్ద మనసు గల వారి చూపులలో దయ, చిరునవ్వు తొణికిసలాడుచుండును.

బలరామకృష్ణులు శ్రేష్ఠమైన మరియు మనోహరములైన లీలలను నెర పెడివారు. వారు స్నానము చేసి స్వచ్ఛమగు వస్త్రములను దాల్చి పవిత్రమగు దేహమునకు హారమును, వనమాలను కూడ ధరించి యుండిరి.

కాలమునకు అతీతులగు శ్రీహరి సంకర్షణులే జగత్తునకు కారణముగు పురుషుడు మరియు ప్రకృతి. జగద్రక్షకులగు వారిద్దరు జగత్తు యొక్క రక్షణకొరకై పూర్ణస్వరూపముతో శ్రీకృష్ణ బలరాములుగా అవతరించినారు.

ఓ రాజా! బలరాముడు బంగారముచే వ్యాపించబడిన వెండి పర్వతము వలె, శ్రీకృష్ణుడు బంగారముతో నిండిన ఇంద్రనీలపర్వతము వలె ప్రకాశిస్తూ, తమ కాంతిచే దిక్కుల చీకట్లు తొలగునట్లు చేయుచుండిరి.

ప్రేమచే పరవశుడైన ఆ అక్రూరుడు రథమునుండి వేగముగా దిగి, బలరామ శ్రీకృష్ణుల పాదముల వద్ద సాష్టాంగ నమస్కారమును చేసెను.

ఓ పరీక్షిన్మహారాజా! భగవానుని దర్శనముచే కలిగిన ఆనందబాష్పములతో అక్రూరుని కళ్లు అంతటా నిండిపోయెను, ఆతని శరీరమంతయు రోమాంచముతో వ్యాపించబడెను. ఆతడు వేగిరపాటు, డగ్గుత్తికల వలన తన పేరును చెప్పలేకపోయెను.

శరణాగతవత్సలుడగు శ్రీకృష్ణ భగవానునకు ఆయన అక్రూరుడని తెలిసిపోయెను. చక్రముతో కాయ కాసిన చేతితో ఆయన అక్రూరుని అభిముఖముగా దగ్గరకు లాగి కౌగలించుకొనెను.

పెద్ద మనసు గల బలరాముడు కూడ తనకు నమస్కరించిన అక్రూరుని కౌగిలించుకొనెను. ఆయన ఒక చేతిని, తమ్ముడు రెండవ చేతిని పట్టుకొని, ఆయనను ఇంటిలోనికి తీసుకు వెళ్లిరి.

తరువాత శ్రీకృష్ణుడు ఆయన ప్రయాణము బాగా సాగుటను గురించి ప్రశ్నించి, ఆయనకు మంచి ఆసనమును ఇచ్చి, యథావిధిగా రెండు కాళ్లను కడిగి, మధుపర్కము (తేనె మొదలైన మంగళద్రవ్యము) ను తీసుకువచ్చి సమర్పించెను.

సర్వసమర్థుడగు భగవానుడు అతిథియగు అక్రూరునకు ఒక గోవును సాదరముగా సమర్పించెను. తరువాత ఆయనకు కాళ్లను ఒత్తి అలసట తీరునట్లు చేసెను. తరువాత ఆయనకు అనేకరుచులు గల పవిత్రమైన ఆహారమును తెచ్చి శ్రద్ధతో సమర్పించెను.

బలరాముడు గొప్ప ధర్మవేత్త. ఆయన అక్రూరునకు భోజనము చేసిన తరువాత ప్రేమతో తాంబూలద్రవ్యములను, గంధమును, పుష్ప మాలలను సమర్పించి, ఆయనకు గొప్ప ఆనందమును కలిగించెను.

సత్కారమును పొందియున్న అక్రూరుని నందుడిట్లు ప్రశ్నించెను  ---  ఓ యాదవా। కంసుడు పరమక్రూరుడు. ఆతడు జీవించియుండగా, కసాయి కాపలాదారుగా గల గొర్రెలు వలె, మీరు ఎట్లు ఉన్నారు?

కంసుడు కేవలము కేవలము తన ఇంద్రియభోగములే ప్రధానముగా గల దుష్టుడు. ఆతడు ఆక్రోశించుచున్న తన చెల్లెలి పుత్రులను చంపినాడు. ఆతనిచే పాలించబడే ప్రజలు మీరు. మీ క్షేమమును గురించి ఏమని విచారించవలెను?

నందుని అక్రూరుడు ముందే క్షేమసమాచారమునడిగెను. నందుడీ విధముగా మధురమగు వచనముతో బాగా సత్కరించగా, అక్రూరుడు మార్గమును దలి అలసటను విడిచి పెట్టెను.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము

పూర్వార్ధములో అక్రూరుడు గోకులమునకు వెళ్లుటను వర్ణించే

ముప్పది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (38).