శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

52 - రుక్మిణి శ్రీకృష్ణునకు రహస్య సందేశమును పంపుట

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- ఓ పరీక్షిన్మహారాజా! ఇక్ష్వాకువంశమును ఆనందింపజేసే ఆ ముచుకుందుని శ్రీకృష్ణుడు ఈ విధముగా అనుగ్రహించెను. అప్పుడాయన శ్రీకృష్ణునకు ప్రదక్షిణ నమస్కారములను చేసి గుహయొక్క ముఖమునుండి నిష్క్రమించెను.

ఆయన చిన్న చిన్న మనుష్యులను, పశువులను, లతలను, చెట్లను చూచి కలియుగము వచ్చినదని గ్రహించి ఉత్తరదిక్కునకు వెళ్లెను.

ఆయన తపస్సునందు శ్రద్ధ, వివేకము, అనాసక్తి గలవాడై, సందేహములను విడిచి పెట్టి మనస్సును శ్రీకృష్ణునిపై ఏకాగ్రము చేసి గంధమాదన పర్వతమును చేరుకొనెను.

ఆయన నరనారాయణుల నిలయమైన బదరికాశ్రమమును చేరి, శీతోష్ణాది సకలద్వంద్వములను సహిస్తూ శాంతుడై తపస్సుతో శ్రీహరిని ఆరాధించెను.

శ్రీకృష్ణ భగవానుడు మథురా నగరమునకు తిరిగి వచ్చి, ఆ నగరమును చుట్టువారియున్న మ్లేచ్చుల సైన్యమును సంహరించెను. ఆయన వారి సంపదను ద్వారకకు తీసుకు వెళ్లెను.

శ్రీకృష్ణుడు పురమాయించిన వ్యక్తులు ఆ సంపదను ఎద్దులపై తీసుకు వెళ్లుచుండిరి. ఇంతలో ఇరవై మూడు సైన్యముల నాయకుడై జరాసంధుడు వచ్చెను.

ఓ పరీక్షిన్మహారాజా! శత్రు సైన్యముయొక్క అధికమగు వేగమును మధువంశీయులగు బలరామకృష్ణులు చూచిరి. వారు మానవుల చేష్టను స్వీకరించి (లీలగా అనుకరిస్తూ) వేగముగా పలాయనము చిత్తగించిరి.

బలరామకృష్ణులు భయమునెరుగరు. కాని, వారు చాల భయపడిన వారు వలె ఆ అధికమగు ధనమును విడిచి పెట్టి, పద్మముల వలె కోమలములైన కాళ్లతో నడుస్తూ చాల మైళ్ల దూరము పారిపోయిరి.

సర్వసమర్థులగు బలరామకృష్ణుల ప్రభావము మగధప్రభుడగు జరా సంధునకు తెలియదు. వారిద్దరు పారిపోవుచుండుటను గాంచి బలశాలి యగు ఆతడు విరగబడి నవ్వీ, రథికుల సైన్యములతో వెంట తరిమేను.

దూరము పరుగెత్తి బలరామకృష్ణులు బాగా అలసిపోయిరి. వారు ప్రవర్షణము (ఎక్కువ వర్షము గలది) అనే ఎత్తైన పర్వతమునెక్కిరి. అచట ఇంద్రదేవుడు సర్వకాలములలో వర్షించును.

ఓ పరీక్షిన్మహారాజా! పర్వతము పై వారిద్దరు దోరుకున్న చోటును, వారి కాలీ గురుతులను కూడ జరాసంధుడు కనుగొనలేకపోయెను. అపుడాతడు పర్వతము చుట్టూ కట్టెలను పేర్చి నిప్పు పెట్టి కాల్చెను.

పదకొండు యోజనముల నిడివి గల ఆ పర్వతము యొక్క ప్రాంతభాగములు దహించబడుచుండెను. అపుడు పర్వతమునుండి వేగముగా పైకెగిరి క్రింద నేల పైకీ దుమికిరి.

ఓ పరీక్షిన్మహారాజా! యాదవశ్రేష్ఠులగు బలరామకృష్ణులు శత్రువగు జరాసంధునికి, వాని అనుచరులకు కనబడకుండా ద్వారకానగరమునకు తిరిగి వచ్చిరి. ఆ నగరమునకు సముద్రమే అగడ్త.

మగధదేశప్రభుడగు ఆ జరాసంధుడు కూడ బలరామకృష్ణులు దహించబడినారని తప్పుగా తలపోసెను. ఆతడు మిక్కిలి పెద్దదైన తన సైన్యమును మళ్లించుకొని మగధదేశమునకు వెళ్లిపోయేను.

రేవతుని పుత్రుడగు కకుద్మి ఆనర్తదేశాధిపతి, శ్రీమంతుడు. ఆయన బ్రహ్మదేవుని ప్రోత్సాహముచే తన కుమార్తెయగు రేవతిని బలరామున కిచ్చి వివాహము చేసెనని ఇదివరలో (9 వ స్కంధము) చెప్పడమైనది.

కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ భగవానుడు కూడ  సకలజనులు చూచుచుండగా చేదిదేశాధిపతియగు శిశుపాలుని పక్షమునకు చెందిన శాల్వుడు, దంతవక్తుడు మొదలగు రాజులను తన బలముచే పరాభవించెను. అపుడాయస, కశ్యపుని పుత్రుడగు గరుడుడు అమృతమును పొందినట్లుగా, స్వయంవరమునందు రుక్మిణిని వివాహమాడెను. భీష్మకుని కుమార్తెయగు రుక్మిణి లక్ష్మీదేవి అవతారము.

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- శ్రీకృష్ణ భగవానుడు భీష్మకుని కుమార్తె, అందమగు ముఖము గలది అగు రుక్మిణిని రాక్షసవిధానము (యుద్ధములో శత్రువులను జయించి) చే వివాహమాడెనని వినియున్నాను.

పూజనీయుడవగు ఓ శుకమహర్షీ! శ్రీకృష్ణుడు అమితమగు తేజస్సు గలవాడు. ఆయన మగధదేశప్రభుడగు జరాసంధుడు, శాల్వుడు, దంతవక్తుడు మొదలగువారిని జయించి కన్యయగు రుక్మిణిని తీసుకుపోయిన వృత్తాంతమును విన గోరుచున్నాను.

ఓ శుకమహర్షీ! శ్రీకృష్ణుని గాథలు పావనములు, తియ్యనివి, జనుల పాపములను పోగొట్టునవి, నిత్యనూతనములు. విద్యల మర్మము తెలిసినవాడెవ్వాడు వాటిని వింటూ తృప్తిని జెందును? (చెందడు).

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- విదర్బదేశమును భీష్మకుడని ప్రసిద్ది చెందిన గొప్ప రాజు పాలించెను. ఆయనకు ఐదుగురు కొడుకులు, ఒక అమ్మాయి కలిగిరి. ఆమె గొప్ప సుందరి.

పెద్ద కొడుకు రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహుడు, రుక్మకేశుడు, రుక్మమాలి తరువాతి వారు. ఉత్తమురాలగు రుక్మిణి వారి సోదరి.

ఇంటికి వచ్చినవారు మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని అందమును, పరాక్రమమును, గుణములను, సంపదను గానము చేయుచుండగా ఆమె దగ్గరగానుండి వినెను. ఆమె ఆయనయే తనకు తగిన భర్తయని తలచెను.

తెలివితేటలు, సౌభాగ్యచిహ్నములు, దాతృత్వము, అందము, సచ్చీలము, సద్గుణములు అనువాటికి ఆమె నిధి. ఆమె తనకు తగిన భార్య అని, ఆమెను వివాహమాడవలెననియు శ్రీకృష్ణుడు కూడ నిశ్చయించెను.

ఓ పరీక్షిన్మహారాజా! రుక్మిణిని శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేయాలని బంధువుల ఆకాంక్ష. శ్రీకృష్ణుని ద్వేషించే రుక్మి వారి ఆకాంక్ష నిరాదరణ చేసెను. సోదరిని శ్రీకృష్ణునకు కాకుండా చేదిదేశాధిపతియగు శిశుపాలునకిచ్చి వివాహము చేయాలని ఆతని సంకల్పము.

విదర్భరాజకుమారియగు రుక్మిణీ సుందరి. ఆమె చూపు నల్లనయ్య పై ఉండెను. రుక్మి తలంపు తెలిసి ఆమె మనస్సు చాల చేడిపోయెను. ఆమె ఆలోచించి ఆప్తుడైన ఒకానొక బాపని వెంటనే శ్రీకృష్ణుని వద్దకు పంపెను.

ఆ బ్రాహ్మణుడు ద్వారకానగరమును చేరెను. ద్వారపాలకులు ఆయనను లోపలికి ప్రవేశ పెట్టిరి. బంగరు సింహాసనముపై కూర్చున్న జగత్కారణుడగు పురుషోత్తముడు ఆయనకు కనబడెను.

శ్రీకృష్ణుడు బ్రాహ్మణభక్తులలో అగ్రేసరుడు. ఆయన ఆ బ్రాహ్మణుని చూడగానే తన ఆసనమునుండి దిగి వచ్చి ఆయనను కూర్చుండబెట్టెను. ఆయన తనను స్వర్గలోకవాసులగు దేవతలు పూజించే విధముగా, ఆ బ్రాహ్మణుని పూజించెను.

ఆ బ్రాహ్మణుడు భుజించి విశ్రాంతి తీసుకొనెను. సత్పురుషులకు శరణు అగు శ్రీకృష్ణుడు ఆయన వద్దకు వచ్చి చేతితో కాళ్లను కంగారు పడకుండా మెల్లగా నొక్కుతూ ఇట్లు ప్రశ్నించెను.

ఓ బ్రాహ్మణశిరోమణీ! ఎక్కువ కష్ట పడకుండా లభించినదానితో తమరి మనస్సు ఎల్లప్పుడు సంతోషపడును. పెద్దలకు సమ్మతమైన ధర్మమును తమరు తేలికగా ఆచరించగల్గుతున్నారా?

ఎందుకంటే, ఎప్పుడైతే బ్రాహ్మణుడు ఏదో ఒకదానితో సంతోషపడి తన ధర్మమునుండి జారిపోకుండా జీవించునో, అప్పుడా ధర్మము వీనికి సకలకామనలను సంపాదించి పెట్టును. ఆ బ్రాహ్మణుడీ జగత్తునకు సకలకామనలను సంపాదించి పెట్టును.

దేవేంద్రుడైననూ సంతోషము లేనివాడై మరల మరల లోకములను తిరగవలసియుండును. ఏమీ లేనివాడైననూ సంతోషము గలవాడై అవయవములయందే విధమైన తాపము లేకుండా సుఖముగా నుండును.

తనంత తానుగా లభించినదానితో సంతోషించి, సదాచారనిష్టులై ప్రాణులకు మిక్కిలి హితమును చేస్తూ, అహంకారము లేకుండా శాంతులై ఉండే వేద వేత్తలకు నేను పలుమార్లు తల వంచి నమస్కరించుచున్నాను.

ఓ బ్రాహ్మణా! మీకు రాజు వలన సుఖము కలుగుచున్నదా? ఏ దేశములోనైతే పాలించబడే ప్రజలు సుఖముగా జీవించెదరో, ఆ రాజు నాకు నిశ్చయముగా ప్రీతిపాత్రుడగును.

తమరు దేనిని కోరి ఎక్కడనుండి ఇక్కడకు తరింప కష్టమైన సముద్రమును దాటి వచ్చిరో, ఆ సర్వమును నాకు -- రహస్యము కానిచో -- చెప్పడు. నేను మీకు ఏమి పనిని చేసి పెట్టవలెను?

లీల నిమిత్తముగా శ్రీకృష్ణుడై అవతరించిన పరమేశ్వరుడీ విధముగా అడుగదగిన ప్రశ్నలను అడుగగా, ఆ బ్రాహ్మణుడు ఆయనకు విషయమునంతనూ వివరించి చెప్పెను.

రుక్మిణి ఇట్లు పలికెను --- ఓ అచ్యుతా! నీవు త్రిలోకసుందరుడవు. నీ గుణములు వినువారల హృదయములో చెవి రంధ్రముల గుండా ప్రవేశించి తాపమును పోగొట్టు నని విన్నాను. చూపు గలవారి కళ్లకు నిన్ను చూచుట సకలపురుషార్థ ప్రాప్తియని విన్నాను. నా మనస్సు సిగ్గు విడిచి నిన్ను ప్రేమించుచున్నది.

ఓ శ్రీకృష్ణా! మోక్ష ప్రదాతవు నీవు మానవులలో శ్రేష్ఠుడవు. కులము, శీలము, రూపము, విద్య, వయస్సు, సంపద, తేజస్సు అనువాటిలో నీకు నీవే సాటి. మానవలో కముయొక్క మనస్సులకు నీవు ఆహ్లాదమును కలిగిం చెదవు. సద్గుణసంపన్న, ధైర్యము గలది, కులస్తీ అగు ఏ కన్య యుక్త వయస్సు వచ్చినప్పుడు నిన్ను వరించకుండును? (నిన్నే వరించును).

ఓ ప్రభూ! కాబట్టి నేను నిన్నే భర్తగా వరించి నా దేహేంద్రియాదులను కూడ నీకే సమర్పించినాను. నీవిచటకు విచ్చేసి నన్ను నీ భార్యగా చేసుకొనుము. పద్మములవంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! నేను వీరుడవగు నీ దానను. మృగరాజగు సింహము యొక్క భాగమును నక్క వలే, చేదిదేశాధిపతియగు శిశుపాలుడు దగ్గరకు వచ్చి నన్ను స్పృశించరాదు.

నూతులు త్రవ్వించుట మొదలగు సేవా కార్యములు, యజ్ఞయాగాది కర్మలు, దానములు, నియమములు, వ్రతములు, దేవతలను బ్రాహ్మణులను గురువులను పూజించుట, తీర్థస్నానము మొదలగువాటి ద్వారా నేను ప్రకృతికి ప్రభువగు భగవానుని ఆరాధించి యున్నచో, గదుని , సోదరుడగు శ్రీకృష్ణుడు వచ్చి నన్ను వివాహమాడు గాక! దమఘోషుని పుత్రుడగు శిశుపాలుడు, శాల్వుడు మొదలగువారు నన్ను స్పృశించరాదు.

ఓ శ్రీకృష్ణా! నీకు పరాజయము లేదు. నా పెళ్లికి ముహూర్తము రేపు సేనాధ్యక్షులు చుట్టువారి రాగా నీవు రహస్యముగా విదర్బదేశమునకు రమ్ము. చేదిరాజగు శిశుపాలుని, మగధరాజగు జరాసంధుని, వారి సైన్యములను పరాభవించుము. పరాక్రమమే నాకు కట్నము. నన్ను బలాత్కారముగా తీసుకుపోయి రాక్షసవిధి ( పెద్దల అభిమతమును త్రోసిపుచ్చి బలప్రదర్శనతో చేసుకునే పెళ్లి) చే వివాహమాడుము.

బంధువులను సంహరించకుండా అంతఃపురములో సంచరించే నిన్ను నేను యెట్లు వివాహమాడవలెను? అని అంటావేమో! ఉపాయమును చెప్పెదను. ముందు రోజు కొత్త పెళ్లికూతురు కులదేవి దర్శనమునకై వెళ్లును. ఈ యాత్ర చాల గొప్పది. ఈ సందర్భములో కొత్త పెళ్లి కూతురు అంతఃపురము బయటకు వచ్చి పార్వతీదేవి దర్శనమునకు వెళ్లును.

పద్మములవంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! మహాత్ములు తమ అజ్ఞానమును పోగొట్టుకొనుటకై ఉమాపతియగు శివుడు వలె నీ పద్మములవంటి పాదముల ధూళితో స్నానమును కోరెదరు. అట్టి నీ అనుగ్రహము నాకు లభించని పక్షములో నేను ప్రాణములను విడిచెదను. నా ప్రాణములు వ్రతోపవాసముచే చిక్కియే యున్నవి. ఈ జన్మలో కాకున్ననూ, నీ అనుగ్రహము నాకు వంద జన్మలచేనైననూ కలుగు గాక!

బ్రాహ్మణుడిట్లు పలికెను --- ఓ యాదవప్రభూ! నేను తీసుకువచ్చిన ఈ విధమైన ఈ రహస్యసందేశములను తమరు విచారించి, ఈ విషయములో ఏది కర్తవ్యమో దానిని వెనువెంటనే అమలు చేయుడు.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో రుక్మిణి శ్రీకృష్ణునకు రహస్యసందేశమును పంపుటను వర్ణించే ఏబది రెండవ అధ్యాయము ముగిసినది (52).