శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

63 - శ్రీకృష్ణుడు బాణాసురునితో యుద్ధము చేయుట

శ్రీ శుక మహర్షి ఇట్లు పలి కెను --. భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! అనిరుద్ధుని బంధువులకు ఆతడు కనబడక దుఃఖిస్తూ ఉండగానే వర్షాకాలపు నాలుగు నెలలు గడిచిపోయినవి.

యాదవులకు శ్రీకృష్ణుడే దైవము. అనిరుద్ధుడు బంధించబడుట, ఆతడు చేసిన ఆ యుద్దము అనువాటిని గురించి నారదుడు చెప్పగా విని, వారు శోణితపురమునకు వెళ్లిరి.

ప్రద్యుమ్నుడు, యుయుధానుడు, గదుడు, సాంబుడు, సారణుడు, బలరామ శ్రీకృష్ణులననుసరించే నందుడు, ఉపనందుడు, భద్రుడు మొదలగువారు శోణితపురమునకు వెళ్లిరి.

యాదవశ్రేష్ఠులు పన్నెండు అక్షౌహిణీల సైన్యముతో కూడి బాణుని రాజధానిని అన్ని దిక్కులయందు లోపల బయట ముట్టడించిరి.

తన నగరముయొక్క ఉద్యానములు, ప్రాకారములు, కోట బురుజులు, ఎత్తైన కట్టడములు విరుగకొట్టబడుచుండగా చూచుచున్న బాణునకు కోపము ఆవేశించెను. ఆతడు సమానమైన సైన్యముతో యుద్దమునకై నగరమునుండి బయల్వెడలెను.

శివ భగవానుడు బాణుని ప్రయోజనము నిమిత్తముగా నంది అనే యెద్దునెక్కి బలరామ శ్రీకృష్ణులతో యుద్ధము చేసెను. ఆయనను పుత్రుడగు కుమారస్వామి, ప్రమథగణములు చుట్టువారి యుండిరి.

ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ శంకరులకు, ప్రద్యుమ్న కుమారస్వాములకు కూడ దొమ్మి యుద్ధము జరిగెను. అద్బుతమగు ఆ యుద్ధము చూచువారలకు గగుర్పాటును కలిగించెను.

కుంభాండ  కూపకర్ణులకు బలరామునితో, సాంబునకు బాణుని పుత్రునితో, సాత్యకికి బాణునితో యుద్ధము జరిగెను.

బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలగు దేవనాయకులు, మునులు, సిద్దులు, చారణులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు విమానములపై యుద్ధమును చూచుటకు వచ్చిరి.

శూరవంశీయుడగు శ్రీకృష్ణుడు శార్జమనే ధనుస్సునుండి వాడి మొనలు గల బాణములను ప్రయోగించి, శంకరుని అనుయాయులగు భూతములను, ప్రమథగణములను, యక్షులను, డాకీనీలను, రాక్షసులను, భేతాళులను, వినాయకులను, ప్రేతగణములను, మాతృగణములను, పిశాచములను, గుమ్మడికాయ ఆకారములోనుండే గణములను, బ్రహ్మరాక్షసులను కూడ తరిమి వేసెను. .

పినాకమనే ధనుస్సును ధరించిన శివుడు శార్జ్గమనే ధనుస్సును ధరించిన శ్రీకృష్ణునిపై పలు రకముల అస్త్రములను ప్రయోగించెను. ఆయన భయము, గర్వము లేకుండా శార్జ్గధనుస్సు చేతియందు గలవాడై విరుగుడు అస్త్రములతో వాటిని నిర్వీర్యము చేసెను.

శివుడు ప్రయోగించిన - బ్రహ్మాస్త్రమునకు విరుగుడుగా బ్రహ్మాస్త్రమును, వాయవ్యాస్త్రమునకు పర్వతాస్త్రమును, ఆగ్నేయాస్త్రమునకు పర్జన్యాస్త్రమును, పాశుపతాస్త్రమునకు తనదైన నారాయణాస్త్రమును శ్రీకృష్ణుడు ప్రయోగించెను.

శూరవంశీయుడగు శ్రీకృష్ణుడు కైలాసవాసియగు శివునిపై జృంభణాస్త్రమును ప్రయోగించి ఆయన ఆవులిస్తూ మోహమును పొందునట్లు చేసెను. తరువాత ఆయన బాణాసురుని సైన్యమును కత్తితో, గదతో, బాణములతో సంహరించెను.

ప్రద్యుమ్నుడు కుమారస్వామిని అన్ని వైపుల బాణముల సమూహములచే పీడించెను. ఆయన అవయవములనుండి రక్తము స్రవించుచుండగా, నెమలితో సహా యుద్ధమునుండి తొలగిపోయెను.

బలరాముడు ముసలముచే కొట్టగా కుంభౌండ కూపకర్ణులు గాయపడి నేల పై పడిరి. నాయకులు కొట్టబడుటచే వారి సైన్యములు అన్ని వైపులా పారిపోయినవి.

రథము పై యుద్దము చేయుచున్న బాణుడు తన సైన్యము చెల్లాచెదరగుటను చూచి అధికమగు కోపమును పొందెను. ఆతడు సాత్యకితో యుద్ధమును విడిచి పెట్టి శ్రీకృష్ణుని మీద కే దూసుకు వెళ్లాను.

యుద్దములో తాను మొనగాడనని బాగా గర్వించియున్న బాణుడు అయిదు వందల ధనుస్సులను ఒక్కసారిగా బలముగా లాగి, ఒక్కొక్క ధనుస్సునందు రెండేసి బాణములను సంధించెను.

పాపహారియగు శ్రీకృష్ణ భగవానుడు ఒకేసారి ఆ ధనుస్సులను విరుగకొట్టి, సారథిని, రథమును, గుర్రములను కూడ కొట్టి, శంఖమును పూరించేను.

బాణుని తల్లి కోటరయని ప్రసిద్ధి గాంచినది. ఆమె పుత్రుని ప్రాణములను కాపాడాలనే కోరికతో శ్రీకృష్ణుని ముందు జుట్టు విరబోసుకుని నగ్నముగ నిలబడెను.

అప్పుడు గదుని సోదరుడగు శ్రీకృష్ణుడు నగ్నయగు ఆమెను చూడకుండుటకై ముఖమును అడ్డముగా తిప్పుకొనెను. అంతలో, రథము పోయి ధనుస్సులు విరిగియున్న బాణుడు నగరములోనికి ప్రవేశించేను.

భూతగణము తరిమివేయబడెను. అప్పుడు మూడు తలలు, మూడు కాళ్లు ఉండే జ్వరము పది దిక్కులను కాల్చుచున్నదో యన్నట్లు, దశార్హవంశీయుడగు శ్రీకృష్ణునికి ఎదురుగా పరుగెత్తుకు వచ్చెను.

అప్పుడు శ్రీకృష్ణుని రూపములోనున్న నారాయణ దేవుడు ఆ జ్వరమును చూచి తన జ్వరమును విడిచి పెట్టెను. మహేశ్వరునకు, శ్రీకృష్ణ భగవానునకు చెందిన ఆ రెండు జ్వరములున్నూ యుద్ధము చేసినవి.

విష్ణుజ్వరము మ హేశ్వరజ్వరమును బలముగా పీడించెను. భయపడిన మహేశ్వరజ్వరము మరియొక అభయస్థానము లభించక ఇంద్రియాధిపతియగు శ్రీకృష్ణ భగవానుని శరణు వేడ గోరెను. అది దోసిలి యొగ్గి ఆయనను స్తుతించెను.

మహేశ్వర జ్వరమిట్లు పలికెను --- అనంతమగు శక్తి గల సర్వేశ్వరుడవు నీవే. సర్వమునకు ఆత్మవగు నీ స్వరూపము అద్వయమగు శుద్ధచైతన్యము. జగత్తుయొక్క సృష్టి స్థితిలయములకు కారణమైనది 'అని వేదములచే సూచించబడే పరబ్రహ్మ యేది గలదో అది నీవే. వికారరహితుడవగు నీకు నమస్కారము.

కాలము, అదృష్టము, కర్మ, జీవుడు, అజ్ఞానము, ద్రవ్యము, శరీరము, ప్రాణశక్తి (సూత్రాత్మ), అహంకారము, ఇంద్రియములు, పంచభూతములు, పోటీ సమాహారమైన లింగదేహము అనేవి నీ మాయ. విత్తునుండి మొలక, మొలకనుండి విత్తు వచ్చినట్లుగా, దేహమునుండి కర్మ, కర్మనుండి దేహము అనే ప్రవాహము కూడ నీ మాయయే. కాని, నీ స్వరూపమునందు మాయ లేనే లేదు. అట్టి నిన్ను శరణు వేడుచున్నాను.

నీవు లీలగా అవతారములనెత్తి దేవతలను, సజ్జనులను రక్షించి, లోకములోని ధర్మమర్యాదలను బలోపేతము చేసెదవు. ధర్మమార్గమునుల్లంఘించి హింసను చేయువారిని నీవు సంహరించెదవు. నీ అవతారము భూమియొక్క భారమును తగ్గించుటకై ఉద్దేశించబడినది.

నీ జ్వరరూపమైన తేజస్సు సహించ శక్యము కానిది. ముందు చల్లగా తరువాత దహించే ఆ జ్వరము చాల భయమును గొల్పును. దానిచే నేను తాపమును పొంది యున్నాను. ప్రాణులు ఎంతవరకైతే ఆశ చే కట్టివేయబడి నీ పాదమూలమును శరణు వేడరో, అంతవరకు వారికి తాపము తప్పదు.

కృష్ణ భగవానుడిట్లు పలికెను -- మూడు తలల ఓ జ్వరమా! నేను నీపై ప్రసన్నుడనైతిని. నీకు నా జ్వరము వలని భయము దూరమగును. మని ద్దరి సంవాదము నెవడైతే స్మరించునో, వానికి నీ వలన భయముండదు.

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలుకగా మహేశ్వరజ్వరము ప్రణమిల్లి నిషమించేను. బాణుడైతే దుష్టజనశీక్షకుడగు శ్రీకృష్ణ భగవానునితో యుద్ధము చేయుటకై రథమునెక్కి వెళ్లాను.

ఓ పరీక్షిన్మహారాజా! తరుపోత మహాకోపముతోనున్న బాణాసురుడు అనేకములగు ఆయుధములను ధరించి చక్రాయుధుడగు శ్రీకృష్ణునిపై బాణములను ప్రయోగించేను. .

ఎడతెరపి లేకుండా అస్త్రములను ప్రయోగించుచున్న ఆ బాణుని చేతులను శ్రీకృష్ణ భగవానుడు పదునైన ధార గల చక్రముతో, పెద్ద చెట్టు కొమ్మలను వలె, నరికెను.

శివ భగవానునకు భక్తుల పై దయ మెండు. శ్రీకృష్ణ భగవానుడు చక్రాయుధముతో బాణుని చేతులను నరుకుచుండగా, శివుడు ఆయన దగ్గరకు వచ్చి ఇట్లు పలికెను.

శ్రీరుద్రుడిట్లు పలికెను --- చైతన్యస్వరూపమగు పరబ్రహ్మను శబ్దబ్రహ్మయగు వేదము రహస్యము (వాక్కునకు, మనస్సునకు గోచరము కానిది) గా ప్రతిపాదించును. ఆ పరబ్రహ్మ ఆకాశము వలె అద్వయమని శుద్దమైన అంతఃకరణము గలపోరలు తెలియుదురు. అట్టి పరబ్రహ్మ నిశ్చయముగా నీవే.

నీకు ఆకాశము నాభి, అగ్ని నోరు, జలము రేతస్సు, ద్యులోకము తల, దిక్కులు చెవి, పృథివీ పొదము, చంద్రుడు మనస్సు, సూర్యుడు చూపు, నేను అహంకారము, సముద్రము జఠరము, ఇంద్రుడు భుజము.

నీకు చెట్టు చేమలు రోమములు, మేఘములు కేశములు, బ్రహ్మదేవుడు బుద్ధి, ప్రజాపతి జననేంద్రియము, ధర్మము హృదయము. నీవీ తీరున నిశ్చయముగా లోకములచే కల్పించబడే విరాట్ పురుషుడవు.

ఓ శ్రీకృష్ణా! నీకు స్వరూపమునుండి చ్యుతి లేదు. నీ ఈ అవతారము ధర్మరక్షణ కొరకు, జగత్తు యొక్క అభ్యుదయము కొరకు ఉద్దేశించబడినది. మేమందరము నీచే ఈయబడిన శక్తితో ఏడు లోకములనేలుచున్నాము.

నీవు రెండవది లేని ఒక్కడివి. కాలము నీనుండి ఆవిర్భవించును. నీవు జాగ్రత్స్వప్నసుషుప్తులనే మూడు అవస్థలకు మూలమైనా వాటికి అతీతమైన స్వయంప్రకాశ చైతన్యస్వరూపుడవు. సర్వమునకు నీవే కారణము; కాని, నీకు కారణము లేదు. నీవు సర్వేశ్వరుడవు. అయిననూ, నీవు సత్త్వరజస్తమోగుణములయందు వైషమ్యము ప్రకటమగుటకై నీ మాయాశక్తిచే పశుపక్ష్యాది రూపములలో ప్రకాశించుచున్నావు.

సర్వవ్యాపకుడవగు ఓ పరబ్రహ్మా! సూర్యుడు తన నీడ చే కప్పివేయబడినా ఆ నీడను, రూపములను కూడ ప్రకాశింపజేయును. ఇదే విధముగా, అహంకారము స్వయంప్రకాశమగు ఆత్మరూపుడవై ఉన్న నిన్ను కప్పివేయును. అయినా, నీవు ఆ అహంకారమును, సత్త్వరజస్తమోగుణకార్యములగు బుద్ద్యాదులను, పోటీచే ఉపహితులైన జీవులను కూడ ప్రకాశింప జేయుచున్నావు.

ఆ పరమేశ్వరుని మాయచే మోహితులైన జనులు సంతానము, భార్య, ఇల్లు, ధనము మొదలగువాటిలో తగుల్కొని యుందురు. పోరు ఒకసారి దుఃఖమనే సముద్రములో తేలి, మరల దానిలో మునిగిపోవుదురు,

ఎవడైతే కర్మాధ్యక్షుడవగు నీచే ఈయబడిన ఈ మనుష్యదేహమును పొంది కూడా ఇంద్రియజయము లేక నీ పాదములను ఆరాధించడో, అట్టి వాడు జాలిపడదగ్గవాడు. ఎందుకంటే, ఆతడు ఆత్మవంచన చేసుకున్నాడు.

నీవు ప్రియమగు ఆత్మవు, అంతర్యామివి. మరణశీలుడగు ఏ మానవుడైతే అనాత్మలు, అప్రియములు అగు ఇంద్రియభోగముల కొరకై అట్టి నిన్ను విడిచి పెట్టునో, అట్టివాడు అమృతమును విడిచి పెట్టి విష మును భక్షించుచున్నవానితో సమానము..

నీవు ప్రియతమమగు ఆత్మవు, అంతర్యామివి. నేను, బ్రహ్మ దేవుడు, దేవతలు, పవిత్రమగు అంతఃకరణము గల మహర్షులు కూడ నిన్ను అన్ని విధములుగా సర్వాత్మభావముతో శరణు వేడుచున్నారు.

జగత్తు యొక్క సృష్టి స్థితిలయములకు కారణమైన నీవు ద్వంద్వములకు అతీతుడవు, నిర్వికారుడవు. హితకారీవగు నీవు ఆత్మను మరియు దైవమవు. రెండవది లేని ఒకే ఒక స్వయంప్రకాశచైతన్యము నీ స్వరూపము. జగత్తు, జీవులు నీయందే ఆశ్రయించి ఉన్నారు. అట్టి నిన్ను సంసారమునుండి విముక్తి కొరకై సేవించేదము.

ఈ బాణుడు నాకు ఇష్టుడు, కృపాపాత్రుడు అగు అనుచరుడు. ఓ దేవా! నేను వీనికి అభయమునిచ్చి యుంటిని. కాబట్టి, నీవే విధముగానైతే రాక్షసరాజగు ప్రహ్లాదునిపై నిశ్చయముగా అనుగ్రహమును చూపితివో, అదే విధముగా వీనిపై అనుగ్రహమును చూపుము.

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను --- ఓ శివ భగవానుడా! నీవు మాతో చెప్పిన విధముగానే నీకు ప్రియము (బాణుని అభయము) ను చేసెదము. వీని బాహువులు నరకబడవలెనని నీవు చేసిన నిశ్చయము బాగున్నది. నేను దానిని అనుమోదించినాను.

ఈ బాణాసురుడు ప్రహ్లాదపుత్రుడగు విరోచనుని పుత్రుడైన బలియొక్క పుత్రుడు. నీ వంశములో పుట్టినవానిని నేను సంహరించనని నేను ప్రహ్లాదునకు వరమిచ్చితిని. కావున, ఈతడు నాకైననూ వధ్యుడు కాడు.

వీని గర్వమునడంచుటకై నేను చేతులను నరికితిని. భూమికి బరువగుటచే వీని సైన్యమును కూడ సంహరించితిని.

వీనికి మీగిలియున్న నాలుగు చేతులకు ముసలిదనము గాని, మరణము గాని ఉండదు. ఈ బాణాసురుడు నీ అనుచరులలో ప్రముఖుడు కాగలడు. వీనికి దేనివలనైననూ భయము ఉండదు.

ఆ బాణాసురుడీ విధముగా అభయమును పొంది శ్రీకృష్ణునకు తలవంచి నమస్కరించెను. ఆతడు ప్రద్యుమ్నపుత్రుడగు అనిరుద్దుని పెళ్లికూతురగు ఉషతో సహా రథమెక్కించి ఆదరముతో తీసుకు వచ్చెను.

అనిరుద్దుడు మంచి వస్త్రములతో బాగుగా అలంకరించుకొనెను. ఒక అక్షా హిణీ సేన ఆతనిని చుట్టువారి ముందు నడువగా, శ్రీకృష్ణుడు శివుని అనుమతి తీసుకొని వెళ్లాను.

రాజధానియగు ద్వారకలో పౌరులు, మిత్రులు, బ్రాహ్మణులు శంఖముల, తప్పెట్ల, భేరీల ధ్వనులతో శ్రీకృష్ణునకు ఎదురేగిరి. వీథులలో, కూడళ్లలో నీరు చల్లీ, జెండాలతో, తోరణములతో చక్కగా అలంకరించబడిన నగరమును ఆయన ప్రవేశించెను.

ఈ విధముగా శ్రీకృష్ణుడు విజయమును పొందుటను, శంకరునితో యుద్ధము చేయుటను గూడ ఎవడైతే ఉదయమే నిద్ర లేచి మంచిగా స్మరించునో, వానికి పరాజయము ఉండదు.

శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో బాణాసురునితో శ్రీకృష్ణుని యుద్ధమును వర్ణించే అరువది మూడవ అధ్యాయము ముగిసినది.