శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
20 - వర్ష శరదృతువుల వర్ణనము
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- బలరాముడు ప్రలంబాసురుని సంహరించుట, శ్రీకృష్ణుడు తమకు కార్చిచ్చునుండి విముక్తిని కలిగించుట అనే వారిద్దరి ఆ రెండు అద్బుతములగు లీలలను గురించి గోపాలకులు గోపికలకు వివరించి చెప్పిరి.
వారు చెప్పిన వృత్తాంతమును గోపాలకులలోని పెద్దలు మరియు గోపికలు కూడ శ్రద్దగా విని ఆశ్చర్యమును పొందిరి. శ్రీకృష్ణ బలరాములు గోకులములో అవతరించిన దేవనాయకులని వారు తలపోసిరి
తరువాత సకలప్రాణులను వర్దిల్ల జేసే వర్షకాలము ఆరంభమయ్యెను. మెరుపులతో దిక్కులు ప్రకాశించగా, ఆకాశతలము మేఘగర్జనలతో ప్రతిధ్వనించెను.
మెరుస్తూ గర్జించే నల్లని దట్టని మేఘములు ఆకాశమును కప్పివేయుటచే సూర్యచంద్రాదులు కానవచ్చుట లేదు. అట్టి ఆకాశము సత్త్వరజస్తమోగుణములచే కప్పివేయబడిన సగుణబ్రహ్మ (జీవుడు) వలె ప్రకాశించెను. (మెరుపు సత్త్వము వంటిది, గర్జన రజోగుణము వంటిది, కప్పివేయుట తమోగుణ లక్షణము).
సూర్యుడు తన కిరణములతో నిరంతరముగా ఎనిమిది మాసములు భూమినుండి నీరు రూపములో నుండే సంపదను గ్రహించెను. వర్షకాలము రాగానే మేఘుడా నీటిని విడిచి పెట్ట నారంభించెను.
వేగవంతమైన గాలిచే కదల్చివేయబడిన మెరుపులతో కూడిన మేఘములు, దయాళువులగు వ్యక్తులు వలే, ఈ జగత్తునకు ప్రీతిని కలిగించి ప్రాణుల ప్రాణములను నిలబెట్టే నీటిని విడిచి పెట్టినవి.
కామన సిద్ధించుట కొరకై తషస్సు చేసిన వ్యక్తియొక్క దేహము ముందు తపస్సుచే చిక్కి, కామన సిద్దించిన తరువాత పుష్టమగును. అదే విధముగా, నేల ముందు వేడికి ఎండినది. తరువాత వానదేవుడు బాగా తడుపగా, నేల మరల పుష్టము (పచ్చన) ఐనది.
కలియుగములో పాపప్రభావముచే వేదవిరుద్ధములైన శాస్త్రములు ప్రాచుర్యమును పొంది వేదములు మూలపడును. అదే విధముగా, సాయంసంధ్యలయందు చీకటీచే మిణుగురు పురుగులు ప్రకాశించు చున్నవే గాని, నక్షత్రచంద్రాది జ్యోతిర్మండలములు ప్రకాశించుట లేదు.
వేదవేత్తలు కర్మకాలములో మౌనముగా నుండి తరువాత వేదాధ్యయన మును మొదలిడెదరు. అదే విధముగా, చప్పుడు లేకుండా ఉన్న కప్పలు మేఘముల గర్జనలను విని బెక బెక ధ్వనులను చేయజొచ్చినవి.
ఇంద్రియములు వశములో లేని వ్యక్తియొక్క దేహారోగ్యము క్షీణించి సంపదలు నష్టమగును. అదే విధముగా, (వర్షకాలములో) గట్లను తెంచుకొని ప్రవహించే చిన్న నదులు తరువాతి కాలములో ఎండిపోవును.
సంపన్నులైన మానవుల చుట్టూ రంగు రంగుల విలువైన వస్తువులు ఉండును. అదే విధముగా, పచ్చని లేత గడ్డి పరకలచే నేల పచ్చగను, ఆరుద్ర పురుగులతో ఎర్రగను, కుక్క గొడుగులచే చేయబడిన నీడ మరియు తెలుపు కలదిగను, అనేకములైన రంగులను కలిగి యుండెను.
పొలములు పంటల సంపదలతో కృషీవలులకు ఆనందమును కలిగించినవి. లాభనష్టములు దైవాధీనములని గుర్తించని ధనికులకైతే వర్షములు మనస్తాపమునే మిగిల్చినవి.
భక్తులు శ్రీహరిని సేవించి సంపన్నముగా నుందురు. అదే తీరున, నీటి యందు నివసించే చేపలు మొదలైనవి, నేలపై ఉండే పశువులు మొదలైన సకలప్రాణులు కొత్త నీటిని సేవించి రమ్యమైన రూపమును దాల్చినవి.
పరిణతి లేని సాధకుని చిత్తము కామవాసనలతో నిండి భోగములయందాసక్తమై యుండుటచే కల్లోలితమగుచుండును. అదే విధముగా, నదులు వచ్చి కలియుచున్న సముద్రము గాలిచే లేచిన కెరటములతో కల్లోలముగా నుండెను.
ఇంద్రియగోచరము కాని స్వరూపము గల శ్రీహరిని మనస్సులో నిలుపుకున్న భక్తులను ఆపదలు ఏమీ చేయలేవు. అదే విధముగా, వర్షధారలచే కొట్టబడుచున్ననూ, పర్వతములు వ్యథను పొందలేదు.
వేదవేత్తలు వేదమును నిరంతరము అభ్యసించనిచో, ఆ మంత్రములు సందేహములో పడి నష్ణమగును. అదే విధముగా, గడ్డి మొలిచి మార్గములను కప్పివేసినది. వాటిని ఎవ్వరూ బాగు చేయలేదు. అవి గుర్తు పట్ట వీలు లేకుండా నుండెను.
పడుపు వృత్తి చేసే స్త్రీల ప్రేమ నిలకడగా నుండదు. వారు గుణవంతులగు పురుషులపై స్థిరమైన ప్రేమను చూపరు. అదే విధముగా, మెరుపులు లోకమునకు హితమును చేసే మేఘములయందు స్థిరముగా నుండవు.
సత్త్వరజస్తమోగుణముల కార్యమగు ప్రపంచమునందు నిర్గుణమే ఐనా పరబ్రహ్మ (సత్తాస్పూర్తుల రూపముగా) ప్రకాశించుచున్నది. అదే విధముగా, ఇంద్రధనుస్సు గుణము (నారి త్రాడు) లేనిదే ఐనా శబ్దగుణము (మేఘగర్జన) గల ఆకాశమునందు ప్రకాశించేను.
ఆత్మ చైతన్యముచే ప్రకాశింపజేయబడే నేను అనే మనోవృత్తి ఆ పూర్ణ ఆత్మనే కప్పివేయును. అదే విధముగా, తన వెన్నెలలచే ప్రకాశింపజేయ బడే మేఘములు కప్పివేయగా, నక్షత్రరాజగు చంద్రుడు ప్రకాశించలేదు.
ఇంటి వ్యవహారములలో తాపమును పొంది విరక్తు లైన సాధకులకు శ్రీహరి భక్తుల రాక పండుగ. అదే విధముగా, మేఘముల రాక నెమళ్లకు పండుగ. అవి ఆనందిస్తూ నాట్యమాడి మేఘములను అభినందించినవి.
ముందులో తపస్సుచే చిక్కి అలసి తరువాత భోగములను సేవించే వ్యక్తులు స్థూలము మొదలైన అనేకరూపముల దేహములను కలిగియుందురు. అదే విధముగా, ముందు వేసవిలో ఎండకు ఎండిన చెట్లు వ్రేళ్లతో నీళ్లను త్రాగి, చిగుళ్లు ఆకులు మొదలైన అనేకములగు అవయవములను పొందుచున్నవి.
ఓ రాజా! ఇంటిలోని పనులు మనస్సునకు అశాంతిని మాత్రమే కలిగించును. ఐననూ, కలుషితమైన అంతఃకరణము గలవారై భోగాసక్తి గల గృహస్థులు ఇంటిలోనే ఉండెదరు. అదే విధముగా, గట్లు తెగి సరస్పులు కలుషితములైననూ, బెగ్గురు పక్షులు వాటియందే నివసించెను.
కలికాలములో వేద విరోధుల తప్పుడు సిద్దాంతములు వేదప్రతిపాద్యమైన మర్యాదలను భగ్నము చేయును. అదే విధముగా, పర్జన్యాధిపతియగు ఇంద్రుడు వర్షించుచుండ, నీటి ప్రవాహములు గట్లను త్రెంచివే సెను.
వేదవేత్తలచే ప్రేరితులై రాజులు ఆయా కాలములయందు దానములతో ప్రజల కోరికలను తీర్చెదరు. అదే విధముగా, ఆ వర్షకాలమునందు గాలులచే ప్రేరితములై మేఘములు ప్రాణులకు అమృతమువంటి నీటిని విడిచి పెట్టినవి.
ఈ విధముగా మంచి వర్షములు పడుటచే ఆ బృందావనము పండిన ఖర్జూరములతో మరియు నేరేడు పళ్లతో సమృద్ధమై యుండెను. శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో, గోవులతో, గోపాలకులతో కూడి విహరించుటకై ఆ వనమును ప్రవేశించెను.
పాలిచ్చే ఆవులు అధికమగు పొదుగుయొక్క బరువుచే మెల్లగా నడచుచుండెను. కాని, శ్రీకృష్ణ భగవానుడు ప్రేమతో పిలువగా, పొదుగులనుండి పాలు స్రవించుచుండగా, అవి వడివడిగా నడచినవి.
అడవియందుండే పశుపక్ష్యాదులు మహానందముతో నుండెను. పర్వతమునుండి జలపాతములేర్పడెను. శ్రీకృష్ణుడు తేనెలను జాలువార్చే
వర్షము కురియుచుండగా శ్రీకృష్ణ భగవానుడు ఒకనాడు చెట్టు తొర్రలో, మరియొకనాడు కొండ గుహలో కూర్చుండి దుంపలను, వేళ్లను, పళ్లను తీంటూ ఆనందించేను.
గోపబాలకులతో కలిసి తినుట శ్రీకృష్ణునకు ప్రియము. ఆయన వారితో, బలరామునితో కలిసి, నీటికి దగ్గరలో రాతిపై కూర్చుండి, ఇంటినుండి తెచ్చుకున్న పెరుగన్నమును తినెను.
ఎద్దులు, లేగ దూడలు కడుపు నిండా గడ్డి మేసి పచ్చిక బయలు పై చక్కగా కూర్చుండి కళ్లు మూసుకొని నెమరు వేయుచుండెను. ఆవులు తమ పొదుగుయొక్క బరువుతో శ్రమను కలిగియుండెను. తన మాయా శక్తిచే వర్ధిల్ల జేయబడిన ఆ వర్షర్తుశోభ సకలప్రాణులకు ఆనందమును కలిగించుచుండెను. దానిని చూచి శ్రీకృష్ణ భగవానుడు మెచ్చుకొనెను.
శ్రీకృష్ణ భగవానుడు, బలరాముడు ఈ విధముగా ఆ గోకులములో నివసించుచుండిరి. ఇంతలో శరత్కాలము వచ్చెను. ఆకాశములో మేఘములు తొలగిపోయెను. గాలి మెల్లగా వీచెను. నీరు తేటపడెను.
యోగమార్గమునుండి జారిపోయిన వారు మరల యోగమునభ్యసించినప్పుడు వారి మనస్సులు ప్రసన్నములగును. అదే విధముగా పద్మములను వికసింప జేసే శరత్కాలము కారణముగా నీరు తన సహజమైన స్వచ్ఛత్వమును, మాధుర్యమును తిరిగి పొందెను.
శ్రీకృష్ణునియందలి భక్తి బ్రహ్మచర్యము. మొదలైన నాలుగు ఆశ్రమముల వారికి అశుభమును తొలగించును. అదే విధముగా, శరత్కాలము ఆకాశమునుండి మేఘములను, నేలనుండి బురదను, నీళ్లనుండి కాలుష్యమును తొలగించెను. శరత్కాలమునందు ప్రాణులు గుంపులుగా కాకుండా రద్దీ లేకుండా విడివిడిగా జీవించును.
కామనలను విడిచి పెట్టిన సాధకులు వాసనలు తొలగి ప్రసన్నమగు మనస్సుతో అధికముగా రాజిల్లేదరు. అదే తీరున, మేఘములు తమ సొత్తు (నీరు) నంతనూ విడిచి పెట్టి తెల్లని కాంతితో అధికముగా ప్రకాశించెను.
జ్ఞానులు అమృతమువంటి జ్ఞానమును ఒక కాలములో ఇచ్చెదరు, మరియొకప్పుడు ఈయరు. అదే విధముగా, పర్వతములు ఒకచోట నిర్మలమగు నీటిని ఇచ్చి, మరియొక చోట మానివేసినవి.
ఇంద్రియభోగములయందు తగుల్కొని ఇల్లే సర్వము అని భావించే జనులు తమకు ప్రతి దినము తరిగిపోవుచున్న ఆయుర్దాయమును గురించి తెలియజాలరు. అదే విధముగా, లోతు లేని నీటిలో సంచరించే ప్రాణులు రోజు రోజుకీ క్షీణిస్తున్న నీటిని గురించి ఏ మాత్రమూ తెలియకున్నవి.
దరిద్రుడు, దీనుడు, ఇంద్రియజయము లేనివాడు అగు కుటుంబీకుడు అనేకమనస్తాపములను పొందును. అదే విధముగా, మెరక నీటిలోనున్న ప్రాణులకు శరత్కాలసూర్యుని తాపము తప్పలేదు.
వివేకమునభ్యసించే సాధకులు దేహేంద్రియాదులయందు అహంకార మమకారములను క్రమముగా విడిచెదరు. అదే తీరున, నేలలు బురదను, మొక్కలు లేతదనమును, కాయలు పచ్చిని మెల్లమెల్లగా విడిచి పెట్టినవి.
కర్మాసక్తినుండి బాగుగా మనస్సు నివృత్తము కాగా, మననశీలుడగు సాధకుడు వేదాధ్యయనము (కర్మకాండ) నుండి నివృత్తుడగును. అదే విధముగా, శరత్కాలము రాగానే సముద్రములోని నీరు (అధికమగు) కదలిక లేనిదాయెను; సముద్రము నిశ్శబ్దముగా నుండెను.
యోగులు ఇంద్రియముల గుండా జారిపోయే జ్ఞానమును ఇంద్రియనిగ్రహముతో రక్షించెదరు. అదే విధముగా, కృషీవలులు గట్టి గట్లను కట్టి వరి పొలములనుండి నీరు వెళ్లిపోకుండా నిలువరించిరి.
ఆత్మజ్ఞానము దేహమునందలి అహం-మమకారముల వలన కలిగే తాపమును పోగొట్టును. మోక్షప్రదుడగు శ్రీకృష్ణ భగవానుడు యశోద మొదలైన గోకులస్త్రీలకు తాను అడవికి వెళ్లుట వలన కలిగిన క్లేశమును పోగొట్టెను. అదే విధముగా, ప్రాణులకు శరత్కాల సూర్యుని కిరణముల వలన కలిగిన తాపములను చంద్ర భగవానుడు పోగొట్టెను.
సత్త్వగుణప్రధానమగు మనస్సులో భగవద్రూపమగు వేదము యొక్క తాత్పర్యము ప్రకాశించును. మొగిళ్లు లేకుండా నక్షత్రములతో నిర్మలముగా ప్రకాశించే శరత్కాల-ఆకాశము అట్టి చిత్తమువలె శోభిల్లెను.
భూలోకములో యాదవనాయకుడగు శ్రీకృష్ణుడు యాదవుల సమూహముచే చుట్లువారబడి ప్రకాశించెను. అదే విధముగా, ఆకాశములో పూర్ణమగు కళలు గల చంద్రుడు నక్షత్రముల రాశులతో శోభిల్లెను.
అడవి పూల మీదుగా వీచే గాలియందు. చల్లదనము, వేడి సమపాళ్లలో నుండెను. అది తగిలి జనుల తాపము, శ్రీకృష్ణుని ఎత్తుకున్న యశోదా మొదలగువారి తాపము వలె, దూరమయేను. కాని, నీకుసువిచే ఆకృష్టమైన మనస్సు గల గోపికలకు ఆయన లేనప్పుడు కలిగిన క్లేశమును ఆ గాలి పోగొట్టలేదు.
ఈశ్వరుని ఆరాధించుటకై సమర్థుడగు వ్యక్తి చేసే క్రియలను వాటి ఫలములు వెదుకుకుంటూ వచ్చును. అదే విధముగా, శరత్కాలప్రభావముచే ఎద్దులు ఆవులను, జంతువులు, పక్షులు తమ జంటలను వెదుకుచుండెను. స్త్రీలు నిండా పూల మాలలను ధరించిరి.
ఓ పరీక్షిన్మహారాజా! రాజు కారణముగా చోరులు తప్ప జనులు నిర్భయముగా నుండెదరు. అదే విధముగా, సూర్యుడు ఉదయించగానే పద్మములు వికసించినవి. కాని, కలువలు ముడుచుకొనియే యున్నవి.
నగరములలో, పల్లెలలో కొత్త పంటలు వచ్చిన సందర్భములో వైదికులు యజ్ఞములను చేయుచుండిరి. లౌకికులు వీధి నాటకములు మొదలైన కన్నులకు పండువ చేసే గొప్ప ఉత్సవములను చేయుచుండిరి. ఆ యజ్ఞములతో, ఉత్సవములతో, శ్రీహరి అంశలైన బలరామకృష్ణులతో, మరియు కోతకు వచ్చిన పంటలతో భూమి అతిశయించి శోభిల్లెను.
యోగసిద్ధులు సమయము వచ్చినప్పుడు తమకు యోగ్యమైన దేవాది దేహములను పొందెదరు. అదే విధముగా, వరముల కారణముగా ఆగిపోయిన వర్తకులు శరత్కాలము రాగానే బయలు దేరి వర్తకములను చేసిరి. మునులు మహాత్ముల దర్శనమునకు, వేదాధ్యయనము పూర్తి అయిన బ్రహ్మచారులు ఇళ్లకు (వివాహము కొరకై), రాజులు శత్రుజయము కొరకు బయల్వెడలి, ఆయా ప్రయోజనములను బడసిరి.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము పూర్వార్ధములో వర్ష శరదృతువులను వర్ణించే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20).
