శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
69 - నారదుడు శ్రీకృష్ణుని గార్హస్థ్యమును దర్శించుట
శ్రీశుక మహర్షి ఇట్లు పలికేను --- నరకుడు సంహరించబడినాడనియు, శ్రీకృష్ణుడొక్కడే చాలమంది రాజకుమార్తెలను వివాహమాడినాడనియు నారదుడు వినెను. ఆయన ఆ సందర్భమును చూడగోరెను.
ఇది అత్యాశ్చర్యము! ఒక్క శ్రీకృష్ణుడు ఒకే దేహముతో ఒకేసారి వేర్వేరు ఇళ్లయందు పదునారు వేల యువతులను వివాహమాడెను.
ఈ విధమైన ఉత్కంఠ గల నారదుడు (శ్రీకృష్ణుని గార్హ స్థ్యమును) చూచుటకై ద్వారకకు వచ్చెను, అచట ఉపవనములయందు, ఉద్యానముల యందు పక్షుల మరియు తుమ్మెదల గుంపులు నినదించుచుండెను.
ద్వారకలో నల్ల కలువలు, కమలములు, చెంగలువలు, ఎర్రదామరలు, కలువలతో నిండిన సరస్సులలో రాజహంసలు, బెగ్గురు పక్షులు బిగ్గరగా కూయుచుండెను.
ఆ ద్వారకలో స్పటికముతో వెండితో నిర్మించిన తొమ్మిది లక్షల ప్రాసాదములు ఉండెను. అవి గొప్ప పచ్చలతో, రత్నములు పొదిగిన బంగరు సామగ్రితో ప్రకాశించెను.
ఆ నగరమునందు రథమార్గములు, ఇతర మార్గములు, కూడళ్లు, అంగళ్లు విభాగముగా నిర్మించబడెను. సత్రములు, గుర్రాల శాలలు, సభలు, దేవతామందిరములతో ఆ నగరము అందముగా నుండెను. అక్కడి మార్గములు, అంగళ్లు, చిన్న వీథులు, ఇళ్ల ద్వారములయందు నీరు చల్లబ డెను. రెప రెపలాడే పతాకలు, టెక్కెములు ఎండను వారించెను.
ఆ ద్వారకలో శోభాయుక్త మైన శ్రీకృష్ణ భగవానుని అంతః (లోపలి) పురము గలదు. దానిని లోకపాలకులందరు ఆదరించెదరు. విశ్వకర్మ తన నేర్పును పూర్తిగా దానియందు ప్రదర్శించినాడు.
ఆ అంతఃపురమునకు పదహారు వేల భవనములే అలంకారము. అవి శ్రీకృష్ణుని భార్యల భవనములు. నారదుడు వాటిలో ఒక గొప్ప భవనమును ప్రవేశించెను.
ఆ భవనముయొక్క ఆధారస్తంభముల పై పగడాలను, స్తంభములపై నుండే సెజ్జలకు వైడూర్యములను, గోడలకు ఇంద్రనీలములను పొదిగిరి. ఆ భవనములోని నేల కూడ సాటిలేని కాంతితో ప్రకాశించేను.
ఆ భవనమునందు విశ్వకర్మ ముత్యాల సరులు వ్రేలాడే మేలుకట్టులను నిర్మించెను. దానియందు ఏనుగు దంతములతో చేసి శ్రేష్ఠమగు మణులచే అలంకరించబడిన ఆసనములు, శయ్యలు గలవు.
ఆ భవనమునందలి పరిచారికలు మెడలో హారమును, మంచి వస్త్రములను ధరించిరి. పరిచారకులు చొక్కా, తలపాగ, మంచి వస్త్రములు, మణుల కుండలములను ధరించిరి. .
ఓ పరీక్షిన్మహారాజా! ఆ భవనమునందు రత్నదీపముల వరుసలు చీకట్లను పారద్రోలుచుండెను. కిటికీలయందు అగరుబత్తుల ధూపమునేర్పాటు చేసిరి. బయటకు వచ్చే ఆ ధూపమును చూచి రంగు రంగుల చంద్రశాలలలోని నెమళ్లు మేఘములనే భావనతో బిగ్గరగా నాదము చేస్తూ నాట్యమాడుచుండెను.
ఆ భవనమునందు నారదమహర్షి బంగరు దండము గల వింజామరతో ఎల్లవేళలా వీచుచున్న భార్యతో గూడియున్న యాదవప్రభుడగు శ్రీకృష్ణుని చూచెను. ఆమె వద్ద తనతో సమానమైన రూపము, వయస్సు, మంచి వస్త్రములు గల దాసీలు వేయిమంది ఉండిరి.
ధర్మాత్ములందరిలో శ్రేష్ఠుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆ నారదుని చూచి గుర్తు పట్టి వెంటనే రుక్మిణీ దేవి శయ్యనుండి లేచి నిలబడెను. ఆయన కిరీటముతో అలంకరించబడిన తలను వంచి ఆయన రెండు పాదములకు దోసిలి యొగ్గి నమస్కరించి తన ఆసనముపై కూర్చుండ బెట్టెను.
శ్రీకృష్ణుడా నారదుని కాళ్లను కడిగి ఆ నీటిని తన శిరస్సు పై ధరించెను. ఎందుకంటే, ఆయన జగత్తులోని పూజనీయులలో ఉత్తముడే అయినా, సజ్జనులను పాలించేది ఆయనయే. ఆయనకు మాత్రమే బ్రహ్మ ణ్యదేవుడు (బ్రాహ్మణుడు దైవముగా గలవాడు) అనేది సార్థక నామము. ఆయన పాదములనుండి పుట్టిన గంగ సర్వమును పావనము చేయును.
పురాణపురుషుడగు శ్రీహరి నారాయణుడనే మహర్షిగా అవతరించి నరమహర్షికి సఖుడై ఇప్పుడు శ్రీకృష్ణుడై అవతరించెను. ఆయన దేవర్షి శ్రేష్ఠుడగు నారదుని శాస్త్రోక్తవిధానముచే చక్కగా పూజించెను. అప్పుడాయన మితమైన, అమృతమువలె మధురమైన వాక్కుతో సంబోధించి ఇట్లు పలికెను -- ఓ ప్రభూ! పూజనీయుడవగు నీకు నేనేమి చేయవలెను?
నారద మహర్షి ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! నిన్ను భక్తులు అధికముగా కీర్తించెదరు. సకలలోకములకు నాథుడవగు నీవు సకలసజ్జనులయెడల మైత్రిని చూపి, దుష్టులను శిక్షించుట విడ్డూరము కానే కాదు. ఎందుకంటే, నీవు నీ ఇచ్ఛచే స్వీకరించిన ఈ అవతారమునకు ప్రయోజనములు జగత్తుయొక్క మనుగడ, రక్షణ మాత్రమే గాక, సజ్జనులకు పరమకల్యాణమును కలిగించుట అని మేము బాగా యెరుగుదుము.
సర్వజ్ఞులైన బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలగువారిచే హృదయమునందు ధ్యానించబడే నీ పాదముల జంట జనులకు విముక్తిని ఇచ్చును. సంసారమనే నూతిలో పడినవారు పైకి వచ్చుటకు ఆలంబనమయ్యే నీ పాదములను నేను కనుగొంటిని. నేను నీ పాదములనే ధ్యానిస్తూ సంచరించెదను. నాకు నీ స్మృతి ఉండేట్లు అనుగ్రహించుము.
ఓ పరీక్షిన్మహారాజా! తరువాత ఆ నారదుడు యోగేశ్వరులకు కూడ ప్రభుడగు శ్రీకృష్ణ భగవానుని యోగమాయను తెలియగోరి, శ్రీకృష్ణుని మరియొక భార్యయొక్క ఇంటిని ప్రవేశించెను.
నారదునకు అక్కడ కూడ ప్రియురాలితో, ఉద్ధవునితో పాచికల జూదమునాడుచున్న శ్రీకృష్ణుడు కనబడెను. వారు అతిశయించిన భక్తితో ఆయనకు ఎదురేగి ఆసనము, అర్ఘ్యము మొదలగువాటినిచ్చి పూజించిరి.
అథాపి బ్రూహి నో బ్రహ్మన్ జన్మెతచ్ఛోభనం కురు ।
శ్రీకృష్ణుడు తెలియనివాడు వలె ఈ నారదుని ఇట్లు ప్రశ్నించెను -- తమరు ఎప్పుడు వచ్చితిరి? పూర్ణులు (విరక్తులు) అగు తమకు అపూర్ణులమగు నావంటివారితో పని యేమి ఉండును? ఓ మహర్షీ! అయినప్పటికీ మా వలన కాదగిన పనిని చెప్పడు. తద్ద్వారా ఈ జన్మ కల్యాణకరమగునట్లు చేయుడు.
ఆ నారదుడైతే మాటలాడకుండా లేచి మరియొక భవనమునకు వెళ్లెను. అక్కడ కూడ చిన్న పిల్లలైన పుత్రులను ముద్దాడుచున్న శ్రీకృష్ణుడు కనబడెను. అక్కడనుండి ఇంకో గృహమునకు వెళ్లగా, స్నానమునకు సంసిద్ధుడగుచున్న శ్రీకృష్ణుడు కనబడెను.
ఆయన ఒక గృహములో ఆహవనీయము మొదలైన యజ్ఞాగ్నులను హోమము చేయుచుండెను. మరియొక గృహములో దేవపిత్రాది పంచయజ్ఞములతో దేవాదులను ఆరాధించుచుండెను. ఇంకో గృహములో బ్రాహ్మణసంతర్పణ చేయుచుండెను. మరో గృహములో బ్రాహ్మణభోజనమైన పిదప తాను ప్రసాదమును భుజించుచుండెను.
ఆయన ఒక గృహములో సంధ్య వార్చుచుండెను. ఇంకో గృహములో గాయత్రిని జపించుచుండెను. మరో గృహములో మౌనియై ఉండెను. ఇంకొకచోట కత్తిని, డాలును పట్టి కత్తిని త్రిప్పుతూ గెంతుచుండెను.
గదుని సోదరుడగు శ్రీకృష్ణుడు ఒక చోట గుర్రములను, ఇంకో చోట ఏనుగులను స్వారీ చేయుచుండెను. ఇంకో చోట రథముపై తిరుగుచుండెను. ఒక గృహములో ఆయన శయ్యపై పరుండెను. మరో గృహములో స్తోత్రపాఠకులాయనను స్తుతించుచుండిరి.
శ్రీకృష్ణుడు ఒక గృహమునందు ఉద్ధవుడు, సాత్యకి మొదలగు మంత్రులతో కలిసి సంప్రదించుచుండెను. ఇంకోచోట ఆయన వేశ్యాయువతులు చుట్టువారియుండ జలక్రీడలాడుచుండెను.
ఒక చోట శ్రీకృష్ణుడు గోవులను చక్కగా అలంకరించి శ్రేష్ఠులైన బ్రాహ్మణులకు దానము చేయుచుండెను. ఇంకోచోట ఆయన మంగళకరములైన ఇతిహాసములను, పురాణములను వినుచుండెను.
శ్రీకృష్ణుడు ఒకప్పుడు ఒక భవనములో ప్రియురాలితో గూడి హాస్యప్రసంగము చేసి నవ్వుచుండెను. ఆయన ఒకచోట ధర్మమును, ఇంకో గృహములో (ధర్మసమ్మతములైన) అర్థకామములను సేవించుచుండెను.
ఒకచోట ఆయన ఏకాంతములో కూర్చుండి ప్రకృతికి అతీతుడగు పరమాత్మను ధ్యానించుచుండెను. మరియొకచోట ఆయన పెద్దలకు అభీష్టములైన భోగములనిచ్చి పరిచర్యలను చేస్తూ సేవ చేయుచుండెను.
శ్రీకృష్ణుడు ఒకచోట కొందరితో విభేదించుచూ, మరియొకచోట మరికొందరితో సంధిని చేయుచుండెను. ఇంకోచోట ఆయన బలరామునితో సత్పురుషుల యోగ క్షేమముల గురించి సంప్రదించుచుండెను.
శ్రీకృష్ణుడు తగిన సమయములో పుత్రులకు వారికి తగ్గ భార్యలతో, కుమార్తెలకు కూడ వరులతో, యథావిధిగా వివాహమును వైభవోపేతముగా చేయుచుండెను.
యోగేశ్వరులగు సనకాదులకు ప్రభుడగు శ్రీకృష్ణుడు తన పుత్రులను, పుత్రికలను పంపుట, తీసుకువచ్చుట అనే సందర్భములలో గొప్ప - ఉత్సవములను చేయుచుండెను. వాటిని చూచి జనులు విస్మితులైరి.
ఒకచోట ఆయన గొప్ప దక్షిణలు గల యజ్ఞములతో సకలదేవతల నారాధించు చుండెను. ఇంకోచోట ఆయన నూతులు, సత్రములు, మఠములు, ఆలయములు ఇత్యాది పూర్తధర్మముల ననుష్ఠించుచుండెను.
ఒకచోట ఆయన యాదవశ్రేష్ఠులు చుట్టువారి రాగా సింధుదేశీయమగు గుర్రమునెక్కి వేటాడుతూ, దానిలో యోగ్యములైన పశువులను వధించెను.
యోగమాయను శాసించే శ్రీకృష్ణుడు ఒకచోట అమాత్యులు, సేనానాయకులు మొదలగు ప్రకృతులయందు, అంతఃపురములోని గృహములు ఇత్యాదులయందు జనుల ఆయా మనోభావములను అరయుటకై తన అసలు రూపము కనబడకుండా సంచరించుండగా నారదుడు కనుగొనెను.
మానవదేహమును పొంది మానవచేష్టలను చేయుచున్న ఇంద్రియాధిపతియగు శ్రీకృష్ణ భగవానుని యోగమాయయొక్క వైభవమును నారదుడు కళ్లారా చూచెను. తరువాత ఆయన నవ్వుతున్నాడా అన్నట్లు శ్రీకృష్ణునితో నిట్లనెను.
ఓ యోగేశ్వరా! నీ యోగమాయలు మాయావులగు బ్రహ్మాదులకు కూడ దర్శించుట శక్యము కాదు. కాని, నీ పొదములను సేవించుటచే నాకు నీ యోగమాయలు హృదయములో ప్రకాశించి తెలిసినవి.
దేవ - దేవా! నీ కీర్తి లోకములయందు వ్యాపించినది. లోకములను పావనము చేసే నీ లీలను బిగ్గరగా కీర్తిస్తూ లోకములను పర్యటించటకు నాకు అనుజ్ఞనిమ్ము.
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ మహర్షీ! నేను ధర్మమును ఉపదేశించి, స్వయముగా ఆచరించి, ప్రోత్సహించెదను. ఈ మానవలోకమునకు ఆ ధర్మములో శిక్షణనిచ్చుటకై నేను దానిని అనుష్ఠించుచున్నాను. ఓ పుత్రా! నా మాయచే నీవు మోహపడవద్దు.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా ఒకే శ్రీకృష్ణుడు ఒకే కాలములో సకలభవనములయందు ఉంటూ గృహస్థులు ఆచరించే పవిత్రమైన
శాస్త్రోక్త కర్మలను చేస్తూండగా, నారదుడు చూచెను.
ఈ విధముగా ఉత్కంఠ కలిగిన నారద మహర్షి అనంతశక్తియగు శ్రీకృష్ణ భగవానుని యోగమాయయొక్క గొప్ప మహిమను పలుమార్లు చూచి ఆశ్చర్యపడెను.
ఈ తీరున ధర్మార్థకామములయందు శ్రద్ధ గల శ్రీకృష్ణుడు నారదుని బాగుగా సత్కరించెను. ఆయన ప్రీతి జెంది శ్రీకృష్ణుడినే స్మరిస్తూ వెళ్లెను.
ఓ పరీక్షిన్మహారాజా! నారాయణుడీ విధముగా సకలప్రాణుల అభ్యుదయము కొరకై యోగమాయను స్వీకరించి మానవుల రీతిని అనుకరించుచుండెను. పదునార వేల గొప్ప యువతులు సిగ్గుతో కూడిన ప్రేమతో చూస్తూ నవ్వుతూ సేవించగా, ఆయన విహరించెను.
ఓ పరీక్షిన్మహారాజా! ఈ జగత్తుయొక్క సృష్టిస్థితిలయములకు కారణము శ్రీహరి. ఆయన ఈ శ్రీకృష్ణావతారములో చేసిన లీలలు ఇతరులకు శక్యమైనవి కావు. వాటిని ఎవడైతే గానము చేయునో, లేదా వినునో, లేదా ప్రశంసించునో, అట్టివానికి భగవానునియందు మోక్షమునిచ్చే భక్తి కలుగును.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో
నారదుడు శ్రీకృష్ణుని గార్హస్థ్యమును దర్శించుటను వర్ణించే
అరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది.
