శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

72 - ధర్మరాజు రాజసూయము -  జరాసంధుని ఉద్దారము

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఒకనాడు ధర్మరాజు సభామధ్యమునందు ఆసనమునధిష్టించి యుండెను. ఆయన చుట్టూ మహర్షులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, సోదరులు, ఆచార్యులు, కుల పెద్దలు, జ్ఞాతులు, సంబంధీకులు, బంధువులు ఉండిరి. వారు వినుచుండగా ఆయన శ్రీకృష్ణుని సంబోధించి ఇట్లు పలికెను.

ధర్మరాజు ఇట్లు పలి కెను --- ఓ గోవిందా! నేను యజ్ఞములలో రాజైన రాజసూయముచే పొవనము చేసే నీ విభూతులగు దేవతల నారాధించెదను. ఓ ప్రభూ! నీవు మాకు దానిని సంపన్నము చేయుము.

ఓ పద్మనాభా! ఎవరైతే అమంగళములను నాశము చేసే నీ పాదములను శుద్ధాంతఃకరణముతో నిరంతరముగా కొలిచెదరో, ధ్యానించెదరో, కీర్తించెదరో, వారు సంసారనుంముడి విముక్తిని పొందెదరు. ఓ ఈశ్వరా! వారు కామనలను కోరినచో, వాటిని కూడ పొందెదరు. ఇతరులు దేనినీ పొందరు.

ఓ దేవదేవా! కావున, ఈ లోకమునందు నీ పాద సేవ యొక్క మహిమనీ మానవుడు తెలియవలెను. ఓ విభూ! కురుసృంజయవంశీయులలో ఎవరైతే నిన్ను సేవిస్తారో, లేదా నిన్ను సేవించరో, వారిద్దరికి కలిగే ఫలమును నీవు నిరూపించుము..

పరబ్రహ్మవగు నీవు సర్వమునందు ఆత్మరూపుడవై ఉన్నావు. ఆత్మా నందానుభవమే స్వరూపముగా గల నీకు సమదృష్టియే గాని, తనవారు పరాయివారు అనే భేదబుద్ది ఉండదు. కాని, కల్పవృక్షమును వలె నిన్ను బాగుగా సేవించువారలకు నీ అనుగ్రహము కలుగును. వారికి కలిగే ఫలము కూడ వారి సేవకు తగ్గట్లుగనే ఉండును. దీని విషయములో నీయందు పక్షపాతబుద్ధి, కఠారత మొదలగు దోషములకు తావు లేదు.

  శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను. --- శత్రువులను కృశింపజేసే ఓ ధర్మరాజా! నీవు చాల చక్కని నిశ్చయమును చేసితివి. దానిచే నీ కీర్తి లోకములలో వ్యాపించగలదు.

ఓ ధర్మరాజా! యజ్ఞములలో రాజగు ఈ రాజసూయము మహర్షులకు, పితృదేవతలకు, బంధువులకు, మాకు, సకలప్రాణులకు కూడ అభీష్టము.

రాజులనందరిని జయించి పృథివిని వశములోకి తెచ్చుకొని, సకల సామగ్రిని సంపాదించి గొప్ప యజ్ఞమైన రాజసూయమును చేయుము.

ఓ రాజా! ఈ నీ సోదరులు ఇంద్రాదిలోకపాలకుల అంశలచే జన్మించినవారు. జితేంద్రియులు కానివారిచే పొందబడని నేను జితేంద్రియుడవగు నీచే వశము చేసుకొనబడితిని.

లోకములో ఎవడైనా దేవతయే అయినా నన్ను శరణు జొచ్చిన భక్తుని తేజస్సుచే గాని, కీర్తిచే గాని, సంపదచే గాని, ప్రభావములచే గాని తిరస్కరించలేడు. రాజు ఎవడైనా తిరస్కరించలేడని వేరుగా చెప్పవలెనా?

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాటను విని ధర్మరాజు చాల సంతోషించెను. పద్మమువంటి ఆయన ముఖము వికసించెను. విష్ణువుయొక్క తేజస్సుచే వర్ధిల్లజేయబడిన తమ్ములనాయన దిక్కులను జయించుడని నియోగించెను.

ధర్మరాజు దక్షిణదిక్కునందు సృంజయదేశవీరులతో బాటు సహదేవుని, పడమర దిక్కునందు మత్స్యవీరులతో బాటు నకులుని, ఉత్తరమునందు కేకయులతో బాటు అర్జునుని, తూర్పునందు మద్రవీరులతో బాటు భీమ సేనుని నియోగించెను.

ఓ రాజా! ఆ వీరులు బలముతో రాజులను జయించి దిక్కులనుండి చాల ధనమును యాగము చేయబోయే ధర్మరాజు కొరకు తీసుకువచ్చిరి.

జరాసంధుడింకనూ జయించబడ లేదని విని చింతిల్లుచున్న ధర్మరాజునకు సర్వజగత్కారణుడగు శ్రీకృష్ణభగవానుడు, ఇదివరలో ఉద్ధవుడు చెప్పిన ఉపాయమునే చెప్పెను.

నాయనా! పరీక్షిత్తూ! భీమ సేనుడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు ముగ్గురు బ్రాహ్మణ వేషములను దాల్చి, బృహద్రథుని పుత్రుడగు జరాసంధుడు ఉండే గిరివ్రజమునకు వెళ్లిరి.

గృహస్థులు అతిథులకు భోజనము పెట్టే మధ్యాహ్నవేళయందు ఆ ముగ్గురు క్షత్రియులు బ్రాహ్మణవేషముతో బ్రాహ్మణభక్తుడగు జరాసంధుని ఇంటికి వెళ్లి, యోగ్యమగు రీతిలో ఇట్లు యాచించిరి.

రాజా! మేము దూరము పయనించి వచ్చిన అతిథులమని తెలియుము. మేము దేనిని కోరెదమో, దానిని మాకిమ్ము. నీకు మంగళమగు గాక!

 సహనశక్తి గలవారికి సహింప శక్యము కానిది ఏది?(ఏదీ లేదు). దుష్టులు చేయలేనిది ఏది?(ఏదీ లేదు). దాతలు ఈయలేనిది ఏది?(ఏదీ లేదు). సమదృష్టి గలవారికి పరుడెవరు? (ఎవరూ లేరు).

  ఎవడైతే తాను సమర్ధుడై యుండి అనిత్యమగు శరీరముతో సత్పురుషులచే గానము చేయబడే నిత్యమైన కీర్తిని సంపాదించడో, అట్టివాడు నిందించదగినవాడు. ఆతడు నిశ్చయముగా శోచనీయుడు.

ఏలయన, హరిశ్చంద్రుడు, రంతిదేవుడు, ముద్దలుడు, శిబి, బలి, కిరాతుడు, పావురము మొదలైన అనేకులు అనిత్యమగు జీవితమును త్యాగము చేసి నిత్యమగు మోక్షమును పొందిరి. (ముద్గలుడు కళ్లములో ఏరి సంపాదించిన గింజలతో వచ్చిన ఆహారమును దానము చేసెను. పావురము అతిథియగు కిరాతునకు తన మాంసమునీయగా, ఆ కిరాతుడు విరక్తుడై మహాప్రస్థానముచే జీవితమును త్యాగము చేసెను).

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- వారి కంఠస్వరములు, ఆకారములు, నారిత్రాడు తగిలి కాయలు కాచిన ముంజేతులు అనువాటిని బట్టి వారు క్షత్రియులనియు, యాచనను బట్టి నికృష్టులనియు, తాను ఇదివరలో . చూచినవారేననియు జరాసంధుడు గుర్తు పట్టి ఇట్లు తలపోసెను.

వీరు నిశ్చయముగా నికృష్ణ క్షత్రియులే. కాని, బ్రాహ్మణవేషములను వేసుకున్నారు. దేహమును విడిచి పెట్టుట చాల కష్టము. అయినా, వీరు కోరితే దేహమును కూడ ఇచ్చివేసెదను.

ఇంద్రుని కొరకై సంపదను లాగుకొనగోరి విష్ణువు బ్రహ్మచారి వేషముతో బలిచక్రవర్తిని రాజ్యాధికారమునుండి, సంపదలనుండి జారిపోవునట్లు చేసెను. ఆ బలియొక్క స్వచ్చమైన కీర్తి దిక్కులలో నిశ్చయముగా వ్యాపించి ఈనాటికి వినవచ్చుచునే యున్నది. ఆ చక్రవర్తి ఈతడు విష్ణువు అని తెలిసినా, వద్దని శుక్రుడు వారించుచున్నా, భూమిని బ్రాహ్మణరూపధారియగు విష్ణువునకు దానము చేసెను.

 ఈ దేహము ప్రతిక్షణము నశిస్తూనే ఉంది. దీనితో జీవించినందులకు వేదవేత్తలకు సేవ చేసి గొప్ప కీర్తిని సంపాదించవలెను. అట్లు చేయగోరని నికృష్ట క్షత్రియుడు జీవించి యేమి లాభము?

 ఈ విధమగు ఔదార్యముతో నిండిన బుద్ధి గల జరాసంధుడు శ్రీకృష్ణార్జునభీములతోనిట్లనెను -- ఓ వేద వేత్తలారా! కోరికను కోరుడు. నేను నా తలనైననూ మీకు ఇచ్చెదను.

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ మహారాజా! నీకిష్ట మైనచో మాకు ద్వంద్వయుద్ధమునిమ్ము. మేము యుద్ధమును కోరే క్షత్రియులమే కాని, ఆహారమును కోరువారము కాము..

ఈతడు కుంతీపుత్రుడు భీముడు. ఈతడైతే భీముని తమ్ముడు అర్జునుడు. నేను వీరిద్దరి మేనమామ పుత్రుడను, నీ శత్రువును, కృష్ణుడనని తెలియుము.

ఈ విధముగా విన్నవించబడిన మగధరాజగు జరాసంధుడు బిగ్గరగా నవ్వెను. అప్పుడాతడు కోపముతో నిట్లనెను - మూర్ఖులారా! అటైనచో, మీకు యుద్ధమునిచ్చెదను.

నీవు భయస్వభావుడవు. యుద్దములో అస్థిరమైన మనస్సు గలవాడవు. నీవు నీ నగరమైన మథురను విడిచి సముద్రములో తల దాచుకొంటివి. నేను నీతో యుద్దము చేయను.

ఈ అర్జునుడైతే వయస్సులో నాతో సమానుడు కాదు. ఈతడు అధికబలము లేనివాడు. కావున, ఈతడు నాకు యుద్ధములో సమమైన ఉజ్జీ కాలేడు. భీముడు నాతో సమానమైన బలము గలవాడు.

జరాసంధుడిట్లు పలికి పెద్ద గదనొకదానిని భీమునకిచ్చి, తాను మరో గదను తీసుకొని నగరము బయటకు వెళ్లాను.

తరువాత యుద్దగర్వము గల ఆ వీరులిద్దరు చదునైన యుద్ధరంగము నందు కలుసుకొని ఒకరినొకరు వజ్రములవంటి గదలతో కొట్టుకొనిరి.

రంగస్థలమునందలి నటులు వలే కుడి యెడమలయందు పలురకముల గదాయుద్ధగతులను చేస్తున్న వారిద్దరి ద్వంద్వయుద్ధము శోభిల్లెను.

ఓ పరీక్షిన్మహారాజా! అప్పుడు ఏనుగులు దంతములతో ఢీకొన్నట్లుగా వారు విసరుచున్న గదల చటచట ధ్వని పిడుగుపాటును పోలియుండెను.

రెండు యేనుగులు రెట్టించిన కోపముతో జిల్లేడు కొమ్మలతో పోట్లాడినప్పుడు అవి ముక్కముక్కలగును. అదే విధముగా, వారిద్దరు ఒకరిపై నొకరు గదలను గట్టిగా విసరుచుండగా, అవి వారి భుజస్కంధములు, పార్శ్వములు, కాళ్లు, చేతులు, తొడలు, కొంకులకు తగిలి నుగ్గు నుగ్గైనవి

ఈ విధముగా గదలు రెండు విరిగిపోగా, మానవులలోనే వీరులగు ఆ జరాసంధభీములు కోపముతో ఇనుముయొక్క తాకిడి గల తమ పిడికిళ్లతో కొట్టుకొనిరి. వారిద్దరు ఏనుగులవలె కొట్టుకుంటూ ఒకరినొకరు చరుపు వేసి కొట్టుట వలన పుట్టిన శబ్దము వర్షము లేని మేఘగర్జన, పిడుగుపాటుల వలె కఠోరముగా నుండెను.

ఓ పరీక్షిన్మహారాజా! సమానమైన శిక్షణ, శరీరపాటవము, మనశ్శక్తి గల వారిద్దరు ఈ విధముగా కొట్టుకొనుచుండిరి. వారి వేగము క్షీణించలేదు. సాటి లేని ఆ యుద్ధములో గెలుపు-ఓటములు తేలకుండెను.

ఓ పరీక్షిన్మహారాజా! అక్కడ వారిద్దరు రాత్రి మిత్రుల వలె ఉంటూ ఈ తీరున యుద్ధము చేయుచుండగా, ఇరవై ఏడు దినములు గడచినవి.

ఓ పరీక్షిన్మహారాజా! ఒకనాడు భీముడు మేనమామ కొడుకైన శ్రీకృష్ణునితో నిట్లనెను -- ఓ భగవానుడా! యుద్దములో జరాసంధుని జయించే శక్తి నాకు లేదు.

శత్రువగు జరాసంధుని జన్మమరణములు, జర అనే రాక్షసి వానికి జీవితమునిచ్చిన విధి శ్రీకృష్ణ భగవానునకు తెలియును. ఆయన కుంతీపుత్రుడగు భీముని తన తేజస్సుతో వర్ధిల్లజేస్తూ ఆలోచించెను.

శత్రువును వధించే ఉపాయమును గురించి లోతుగా ఆలోచించి, శ్రీకృష్ణుడు కొమ్మను చీలుస్తున్నాడా యన్నట్లు భీమునకు సైగ చేసెను.

మహాబలశాలియగు భీముడు శత్రువిజేతలలో దిట్ట. ఆయన ఆ సైగను అర్థము చేసుకొని శత్రువును రెండు కాళ్లతో పట్టుకొని నేలపై పడవైచెను.

ఆ భీముడు జరాసంధుని ఒక కాలిని తన కాలితో తొక్కిపట్టి, రెండో కాలిని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని, పెద్ద యేనుగు కొమ్మను చీల్చినట్లుగా, గుదమునుండి చీల్చివేసెను.

ఒకే కాలు, తోడ, వృషణము, పార్శ్వము, స్తనము, భుజము, చేయి, కన్ను, కనుబొమ, చెవి కల రెండు ముక్కలను జనులు చూచిరి.

మగధప్రభుడగు జరాసంధుడు సంహరించబడగా జనులు పెద్ద హాహాకారమును చేసిరి. శ్రీకృష్ణార్జునులు భీముని కౌగిలించి ప్రశంసించిరి.

సర్వశక్తిమంతుడగు శ్రీకృష్ణ భగవానుడు ప్రాణులను కాపాడును. ఆయన స్వరూపము ఇంద్రియగోచరము కాదు. ఆయన ఆ జరాసంధుని పుత్రుడగు సహదేవుని మగధదేశమునకు రాజుగా అభిషేకించెను. మగధ రాజగు జరాసంధునిచే బంధించబడిన రాజులను ఆయన విడిపించెను.

శ్రీమద్భాగవతము పదవ స్కంధములో జరాసంధుని ఉద్దారమును

వర్ణించే డెబ్బది రెండవ అధ్యాయము ముగిసినది (72).

* * * * *