శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
50 - జరాసంధునితో యుద్ధము - శ్రీకృష్ణుడు ద్వారకను నిర్మించుట
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కంసుడు మరణించిన తరువాత ఆతని భార్యలగు అస్తి, ప్రాప్తి దుఃఖముతో చాల పీడను పొందిరి. వారు తండ్రియగు జరాసంధుని యింటికి వెళ్లిరి.
దుఃఖితలైన వారిద్దరు తమ తండ్రి మగధదేశప్రభువగు జరాసంధునకు, తమకు వైధవ్యము కలిగిన కారణమునంతనూ వివరించి చెప్పిరి.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ జరాసంధుడు ఆ ఆపదను గురించి విని దుఃఖమును, కోపమును పొందెను. ఆతడు భూమిపై యాదవులు లేకుండా చేయుటకు పెద్ద ఉద్యమమును మొదలు పెట్టెను.
ఇరవై మూడు అక్షౌహిణీల సైన్యము చుట్టువారి రాగా, ఆతడు యాదవుల రాజధానియగు మథురను అన్ని దిక్కులనుండి ముట్టడించెను (21 870 ఏనుగులు, 21 870 రథములు, 65 610 గుర్రములు, 1 09 350 పదాతులు కలిసి ఒక అక్షౌహిణి. కాని, ప్రస్తుతములో ఆ పదమునకు మరింత చిన్న సైన్యము అర్థము కావచ్చును).
చెలియలి కట్టను దాటిన సముద్రమువలెనున్న ఆ సైన్యమును, దానిచే ముట్టడించబడిన తన మథురానగరమును, భయముతో తల్లడిల్లిన తన జనులను కూడ శ్రీకృష్ణుడు పరికించెను.
శ్రీహరి భగవానుడు భూభారమును తగ్గించాలనే కారణముగా మానవరూపముతో శ్రీకృష్ణుడై అవతరించెను. ఆయన ఆ దేశకాలములకు తగ్గట్లు తన అవతారము యొక్క ఉద్దేశ్యమును గురించి ఇట్లు తలపోసెను.
భటులు, గుర్రములు, రథములు, ఏనుగులతో ఇరవై మూడు అక్షౌహిణులుగా లెక్కించబడే ఈ సైన్యము మగధరాజగు జరాసంధునకు వశులై ఉండే రాజులందరికీ చెందినది. దీనినాతడు ఇక్కడకు తెచ్చినాడు. భూమికి బరువై ఉన్న ఈ సైన్యమును నిశ్చయముగా మట్టు పెట్టెదను.
మగధరాజగు జరాసంధుని మాత్రం చంపరాదు. ఎందుకంటే, అతడు మళ్లా సైన్యాలను ప్రోగు చేస్తాడు. ఇదియే నా అవతారమునకు ప్రయోజనము. భూమి బరువును తగ్గించి సత్పురుషులను రక్షించి దుష్టులను వధించుట కొరకే నేను అవతరించేను.
ఒకానొక కాలములో అధర్మము పెచ్చుమీరును. దానిని నశింపజేసి ధర్మమును రక్షించుటకై నేను ఇతరములైన (మత్స్యా ది) దేహములను కూడ స్వీకరించెదను.
శ్రీకృష్ణుడు ఈ విధముగా తలపోయుచుండగనే ఆకాశము (వైకుంఠము) నుండి రెండు రథములు వెంటనే వచ్చి నిలబడినవి. రథచోదకులతో కూడియున్న వాటియందు ధనుస్సు మొదలైన పరికరములు ఉండెను.
సనాతనములైన ప్రకాశించే ఆయుధములు కూడ అనుకోకుండా (ఈశ్వరేచ్చచే) ఉపస్థితములాయెను. వాటిని చూచి అప్పుడు ఇంద్రియాంతర్యామియగు శ్రీకృష్ణుడు బలరామునితో నిట్లనెను.
అన్నయ్యా! సర్వసమర్థుడవగు నీవు యాదవులకు రక్షకుడవు. వారికి వచ్చిపడిన ఆపదను గమనించు. ఈ రథము నీ కొరకు వచ్చినది. నీకు ప్రియములైన ఆయుధములు కూడ వచ్చినవి.
నీవు రథము నెక్కి ఈ సైన్యమును మట్టుబెట్టి నీ వారిని ఆపదనుండి కాపాడుము. ఎందుకంటే, మనిద్దరి అవతారమునకు ప్రయోజనమిదియే. మనము సజ్జనులకు సుఖమును కలిగించుటకై అవతరించితిమి. ఇరవై మూడు - అక్షౌహిణీల సేన రూపములోనున్న భూభారమును తొలగించుము.
దశార్చవంశీయులగు బలరామకృష్ణులీ విధముగా సంప్రదించుకొనిరి. అప్పుడు వారు కవచములను దాల్చి గొప్ప ఆయుధములతో కూడినవారై రథము పై మథురానగరము బయటకు వచ్చిరి. వారి చుట్టూ చిన్న సైన్యము ఉండెను. దారుకుడు రథమును నడుపగా, శ్రీకృష్ణుడు పాంచజన్యమును పూరించెను.
ఆ శంఖధ్వని వలన శత్రు సైనికుల గుండెలలో భయము వలని వణుకు పుట్టెను. మగధదేశప్రభువగు జరాసంధుడు వారిద్దరిని చూచెను. ఆతడు శ్రీకృష్ణుని సంబోధించి, నీవు పురుషులలో అధముడవని పలి కెను.
నీవు ఒంటరివి, కుర్రవాడివి. నీతో యుద్ధము చేయుట సిగ్గు చేటు. నీతో యుద్ధము నాకు సుతరాము ఇష్టము కాదు. నీవు దాగియుండి మేనమామను చంపినవాడివి. నీతో నేను యుద్ధము చేయను.
ఓ బలరామా! నీకు శ్రద్ధ (శక్తి) ఉంటే ధైర్యము దాల్చి యుద్ధము చేయుము. నా బాణములు నీ దేహమును ముక్కలు ముక్కలు చేయగా, స్వర్గమునకు పోయెదవు. లేదా, నన్ను సంహరించుము.
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ మగధరాజా! శూరులు నిశ్చయముగా పౌరుషమును ప్రదర్శింతురే గాని, గొప్పలు చెప్పుకోరు. నీవు (అల్లుడి మరణముచే) దుఃఖిస్తున్నావు, మరణించ బోతున్నావు (గోరుచున్నావు). నీ మాటను మేము పట్టించుకోము.
మధువంశీయులగు ఆ బలరామకృష్ణులను జరాసంధుడు (జరచే సంధించబడిన దేహము గలవాడు) బలశాలియగు పెద్ద సైన్యసమూహముతో - వాయువు మేఘములతో సూర్యుని, దుమ్ముతో అగ్నిని వలె - ఎదురుగా వచ్చి కప్పివేసెను. వారితో బాటు వారి సైన్యము, రథములు, సారథి, జెండాలు కూడ కనబడలేదు.
నగరమునందలి బురుజులను, మేడలను, నగరద్వారములను ఎక్కి స్త్రీలు చూచుచుండిరి. వారికి యుద్ధములో గరుడుని గుర్తుతో కూడిన జెండా గల శ్రీకృష్ణుని రథముగాని, తాటి చెట్టు గుర్తు గల జెండాతో కూడిన బలరాముని రథము గాని కానరాలేదు. వారు దుఃఖముచే పీడించబడి మూర్ఛిల్లిరి.
శత్రు సేనలనే మేఘములు మాటిమాటికీ తమ సేన పై కురిపిస్తున్న బాణముల వర్షము సుతరాము సహించ శక్యము కాకుండెను. సైన్యము పీడను పొందుట గాంచిన శ్రీకృష్ణుడు శార్ జ్ఞమనే ధనుస్సును టంకారము చేసెను. ఆ ధనుస్సును దేవతలు, రాక్షసులు కూడ ఆదరించెదరు.
అప్పుడు శ్రీకృష్ణుడు అమ్ముల పొదీనుండి వాడి బాణముల గుట్టలను లాగి, ధనుస్సు పై ఎక్కు పెట్టి విడిచి పెడూ రథములను, ఏనుగులను, గుర్రములను, పదాతులను ఎడతెరపి లేకుండా కొట్టెను. ఆ ధనుస్సు గిర గిర తిరిగే కొరివివలె నుండెను.
ఆ బాణములచే ఏనుగుల కుంభస్థలములు, గుర్రముల మెడలు తెగి. రాశులుగా నేలగూలినవి. రథముల టెక్కెములు విరిగి గుర్రములు, సారథులు, రథికులు హతులైరి. పదాతుల చేతులు, కాళ్లు, తలలు తెగినవి.
పదాతులు, ఏనుగులు, గుర్రములు తెగగొట్టబడగా వాటి దేహములనుండి వందలాది రక్తపుటేరులు బయల్దేరినవి. వాటియందు పదాతుల భుజములు నీటి పాములను, వారి తలలు తాబేళ్లను పోలియుండెను. ఆ యేరులు చంపబడిన ఏనుగుల దేహములనే ద్వీపములచే, గుర్రములనే మొసళ్లచే వ్యాపించబడి యుండెను.
ఆ రక్తపుటేరులలో (తెగిన) చేతులు, తొడలే చేపలు కాగా, చచ్చి పడిన జనుల జుట్టే నాచు ఆయెను. అవి ధనుస్సులనే తరంగములచే, ఆయుధములనే లతలచే వ్యాపించబడి యుండెను. వాటియందలి డాళ్లు సుడిగుండములవలే భయమును గొల్పగా, యోధుల మిక్కిలి విలువైన గొప్ప మణుల ఆభరణములు యేరులలోని రాళ్లను, మొరమును పోలేను. శ్రీకృష్ణుడు యుద్ధములో భయస్వభావము గలవారికి భీతిని, వీరులకు పరస్పరము ఉత్సాహమును, కలిగించే రక్తపుటేరులు పారునట్లు చేసెను.
హద్దులు లేని పరాక్రమము గల బలరాముడు మిక్కిలి గర్వించిన శత్రువులను ముసలాయుధముతో చావగొట్టెను. ఓ రాజా! మగధప్రభుడగు జరాసంధునిచే రక్షించబడే ఆ సైన్యము . సముద్రము వలె ప్రవేశించ శక్యము కానిది, భీతిని గొల్పునది, అగాధమైన విక్రమము గలది. అంతము కానరాని ఆ సైన్యమును వారు మట్టుబెట్టిరి. వసుదేవపుత్రులగు బలరామ కృష్ణులు జగన్నాయకులు. వారికి ఆ పని కేవలము క్రీడ మాత్రమే.
అనంతగుణసంపన్నుడగు భగవానుడు తన లీలచే ముల్లోకములను సృష్టించి, పాలించి, ఉపసంహారము చేయును. ఆయన శత్రు సైన్యమును మట్టుబెట్టుట విడ్డూరము కాదు. కాని, మానవులననుకరించే ఆయన లీల వర్ణించబడుచున్నది.
జరాసంధుడు గొప్ప బలవంతుడే. కానీ, ఆతడు సైన్యము సంహరించబడగా రథమును కోల్పోయి ప్రాణములతో మిగిలి ఉండెను. బలరాముడాతనిని బలముతో సింహము సింహమును వలె పట్టుకొనెను.
జరాసంధుడు శత్రువులను దునుమాడినవాడే. కాని ఇప్పుడు పరాజితుడైన శత్రువు అయినాడు. వానిని బలరాముడు వరుణపాశములతో మాత్రమే గాక, మనుష్యులు వాడే త్రాళ్లతో కూడ కట్టి వేయుచుండగా, శ్రీకృష్ణుడు నివారించెను. వానిచే పని (దుష్టులను ప్రోగుచేయుట) జరగాలని ఆయన ఆకాంక్ష.
లోకనాయకులగు బలరామకృష్ణులు ఆ జరాసంధుని విడిచి పెట్టిరి. వీరులలో ఎన్నబడే ఆతడు సిగ్గు పడి తపస్సు చేయాలని సంకల్పించెను. కాని, దారిలో రాజులాతనిని నివారించిరి. నీకు యాదవుల చేతిలో ఈ పరాజయము నీ కర్మయొక్క బంధము వలననే ప్రాప్త మైనది, అని వారాతనికి యథార్థమును బోధించే పదములు గల వాక్యములతో నచ్చజెప్పిరి. వారాతనికి - రాజనీతి వచనములను మాత్రమే గాక, లౌకికదృష్టాంతములను కూడ చెప్పిరి.
సైన్యములన్నింటినీ సంహరించి శ్రీకృష్ణ భగవానుడు బృహద్రథపుత్రుడగు మగధరాజును ఉపేక్ష చేసి విడిచి పెట్టెను. అప్పుడు జరాసంధుడు మనస్సు చేడి మగధదేశమును చేరెను.
శ్రీకృష్ణుడు తన సైన్యము చెక్కు చెదరకుండా సముద్రమువంటి శత్రు సైన్యమును తేలికగా దాటివే సెను. దేవతలాయన పై పూలవాన కురిపించి ప్రశంసించిరి.
మథురానగరవాసుల మనస్సులలోని భయము పోయి ఆనందము నిండెను. వారాయనను కలుసుకొనిరి. సూతులు (కథావాచకులు), మాగధులు (వంశమును పొగుడువారు), వందులు (స్తోత్రపాఠకులు) ఆయన కీర్తిని గానము చేయుచుండిరి.
శ్రీకృష్ణ ప్రభుడు మథురానగరమును ప్రవేశించుచుండగా, పెద్ద సంఖ్యలో శంఖములు, దుందుభులు, భేరీలు, వాద్యములు, వీణలు, పిల్లన గోవులు, మద్దెళ్లు మ్రోగినవి. ఆ నగరమును వీధులలో నీళ్లను జల్లి పతాకలతో అలంకరించిరి. ఉత్సవముతో అంతటా వందనమాలలను కట్టిరి. వేద ఘోషతో నగరము మారు మ్రోగెను.
నగరములోని స్త్రీలు ఆయనపై పూలమాలలను, పెరుగును, అక్షతలను, మొలకలను చల్లిరి. వారు ప్రేమతో విప్పారిన కళ్లతో ఆయనను స్నేహపూర్వకముగా చూచుచుండిరి.
యుద్దభూమియందు పడిన ధనము, వీరుల ఆభరణములు లెక్క లేనంత ఉండెను. దానినంతను తీసుకువచ్చి శ్రీకృష్ణ ప్రభుడు యాదవప్రభువగు ఉగ్రసేనుని కొరకు సమర్పించెను.
మగధప్రభువగు జరాసంధుడీ విధముగా అంతే అక్షౌహిణీల సేనతో యాదవులపై పది హేడు సార్లు దండెత్తాను. వారిని శ్రీకృష్ణుడు రక్షించెను.
శ్రీకృష్ణుని తేజస్సు కారణముగా యాదవులు ఆ మగధరాజు సైన్యమునంతనూ మట్టుబెట్టిరి. కాని, జరాసంధుని శత్రువులైన యాదవులు ఆతనిని మాత్రము విడిచి పెట్టగా, ఆతడు తన నగరమునకు వెళ్లెను.
జరాసంధునితో పద్దెనిమిదవ యుద్దము రాబోవుచుండగా, ఆ మధ్యలో కాలయవనుడనే వీరుడు హఠాత్తుగా మథురలో దర్శనమిచ్చెను. వానినచటకు నారదుడే పం పెను.
మానవలోకములో కాలయవనునితో సమానమైన బలము గలవాడు లేడు. కాని, యాదవులు తనతో సమానులని (నారదుని వలన) విని ఆతడు మూడు కోట్ల మ్లేచ్ఛులతో వచ్చి మథురానగరమును ముట్టడించెను.
బలరాముడు తోడుగా గల శ్రీకృష్ణుడా కాలయవనుని చూచి ఇట్లు తలపో సెను -- అయ్యో! యాదవులకు నిశ్చితముగా రెండు (కాలయవన జరాసంధుల) వైపులనుండి పెద్ద దుఃఖము వచ్చి పడినది.
ఈ రోజు మనలను గొప్ప బలము గల ఈ కాలయవనుడు ముట్టడించుచున్నాడు. నేడో, రేపో, లేక ఎల్లుండో మగధరాజగు జరాసంధుడు కూడ రాగలడు.
మనమిద్దరము వీనితో యుద్ధము చేయుచుండగా బలశాలియగు జరాసంధుడు వచ్చినచో, మన బంధువులను సంహరించును. లేదా, తన నగరమునకు బలాత్కారముగా తీసుకొనిపోవును.
కాబట్టి ఈనాడే మానవులు ప్రవేశించ శక్యము. కాని కోటను నిర్మించేదము. దానిలో బంధువులను చక్కగా ఉంచి, కాలయవనుని సంహరింప జేసెదము.
శ్రీకృష్ణ భగవానుడీ విధముగా సంప్రదించి సముద్రమధ్యములో పన్నెండు యోజనముల నిడివి గల కోటను, అన్ని అద్భుతములతో కూడిన నగరమును నిర్మింపజేసెను.
ఆ నగరములో విశ్వకర్మయొక్క విజ్ఞానమును సూచించే శిల్ప నైపుణ్యము నిశ్చయముగా దర్శనమిచ్చును. రాజమార్గములు, కూడళ్లు, వీథులు వాస్తుశాస్త్రమునుల్లంఘించకుండా నిర్మించబడెను.
ఆ నగరమునందలి ఉద్యానములలో దేవతావృక్షములు (హరిచందనము, మందారము, పారిజాతము మొదలైనవి, లేదా మామిడి, కడిమి, మోదుగ మొదలైనవి), లతలు (పగడపు లతలు ఇత్యాదులు) ఉండేను. నగరసమీపములో రంగు రంగుల అడవులు ఉండెను. నగరములోని బురుజులు నగరద్వారములు స్పటికముతో చేయబడి బంగరు శిఖరములతో ఆకసమునంటుచుండెను.
ఆ నగరములో వెండి-ఇత్తడులతో చేసిన కొట్టులపై బంగరు కలశములతో అలంకరించిరి. బంగరు గృహములలో నేలలపై గొప్ప పచ్చలను పొదిగిరి.
ఆ నగరములో వాస్తు దేవతల మందిరములు, చంద్రశాలలు కూడ నిర్మించబడినవి. నాలుగు వర్ణముల జనులచే వ్యాపించబడియున్న ఆ నగరము యాదవనాయకుల ఇళ్లతో శోభిల్లెను.
మహేంద్రుడు శ్రీహరికి సుధర్మ అనే దేవసభను, పారిజాతవృక్షమును కూడ పంపించెను. ఆ సభయందు కూర్చున్న మానవునకు వృద్దాప్యము మొదలైన మర్త్యధర్మములనుండి విముక్తి కలుగును.
వరుణుడు మనోవేగము గల తెల్లని గుర్రములను పం పెను. వాటికి ఒక చెవి నల్లగానుండును. కుబేరుడు ఎనిమిది నిధులను, ప్రతి లోకపాలుడు తన విభూతులను పంపెను.
ఓ పరీక్షిన్మహారాజా! లోకపాలకులు తమ అధికారములను నిర్వహించుటకై శ్రీహరి భగవానుడు వారికి ఆయా శక్తులను, సిద్దులను ఇచ్చియుండెను. ఆయన భూమియందవతరించగా, వారు వాటినన్నింటినీ ఆయనకు తిరిగి సమర్పించిరి.
భక్తుల దుఃఖములను పోగొట్టే శ్రీకృష్ణుడు యోగమాయ యొక్క మహిమచే సకలజనులను ఆ ద్వారకకు తీసుకుపోయేను. ఆయన బలరామునితో సంప్రదించి మథురలోని జనులకు రక్షకునిగా ఆయనను ఉంచెను. అపుడాయన- పద్మముల మాలను ధరించి ఆయుధములు లేకుండా నగరద్వారమునుండి నిష్క్రమించెను.
శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములోశ్రీకృష్ణుడు ద్వారకను నిర్మించుటను వర్ణించే ఏబదియవ అధ్యాయము ముగిసినది (50).
