శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
64 - నృగ మహారాజు వృత్తాంతము
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! ఒకనాడు సాంబుడు, ప్రద్యుమ్నుడు, చారుభానుడు, గదుడు, అనిరుద్దుడు మొదలైన యాదవ యువకులు విహరించుటకై ఉద్యానవనమునకు వెళ్లిరి.
వారచట చాల సేపు ఆటలాడి దప్పిక గొన్నవారై నీటి కొరకు వెదుకు చుండగా, వారికి నీరు లేని నూతిలో అద్భుతమైన ప్రాణి ఒకటి కనబడెను.
కొండను పోలిన ఆ ఊసరవెల్లిని చూచి వారి మనస్సులు ఆశ్చర్యముతో నిండెను. వారికి దానిపై దయ కలిగి, దానిని పైకి తీసే ప్రయత్నమును కూడ చేసిరి.
ఆ యువకులు చర్మమయములైనట్టియు, పేనబడిన త్రాళ్లతో నూతిలో పడ్డ ఆ ఊసరవెల్లిని పైకి తీసే ప్రయత్నము చేసి విఫలమైరి. అపుడు వారా విషయమును ఉత్కంఠతో శ్రీకృష్ణునకు వివరించి చెప్పిరి.
పద్మములవంటి కన్నులు గల శ్రీకృష్ణ భగవానుడు జగత్తునకు రక్షకుడు. ఆయనకు అచటకు వచ్చి దానిని చూచి అవలీలగా ఎడమ చేతితో పైకి తీసెను.
పవిత్రకీర్తియగు శ్రీకృష్ణ భగవానుడు చేతితో స్పృశించిన వెంటనే ఆ ఊసరవెల్లి ఆ రూపమును విడిచి పెట్టి, పుటము పెట్టిన బంగారము వలె అందమైన కాంతి గల దేవత ఆయెను. ఆ దేవతయొక్క ఆభరణములు, వస్త్రములు, మాలలు అచ్చెరువు గొలుపుచుండెను.
ఊసరవెల్లికి ఆ జన్మ వచ్చుటకు గల కారణము మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణునకు తెలిసినదే. అయినా, జనులలో ప్రసిద్ధమగుటకై ఆయన ఇట్లు ప్రశ్నించెను -- ఓయీ! చాల శ్రేష్ఠమగు రూపము గల నీవు గొప్ప భాగ్య వంతుడవు. నీవు నిశ్చయముగా దేవతోత్తముడవని నా అభిప్రాయము.
ఓ మంగళమూర్తీ! నీవు ఏ కర్మను చేసీ ఈ (ఊసరవెల్లి) స్థితిని పొందితివి? ఇది నీకు తగి లేదు. నీ గురించి తెలియాలని మా కోరిక. మేము చెప్పదగ్గవారమని నీకనిపిస్తే ఇప్పుడు నీ గురించి చెప్పుము.
శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- అనంతమైన రూపములు గల శ్రీకృష్ణ భగవానుడీ తీరున మంచిగా ప్రశ్నించెను. ఆయన పూర్వజన్మలో నృగమహారాజు. ఆయన సూర్యుడు వలె వెలిగిపోయే కిరీటమును నేలకు ఆన్చి ఆ లక్ష్మీపతికి ప్రణమిల్లి ఇట్లు పలికెను.
నృగుడిట్లు పలికేను --- ఓ ప్రభూ! నేను నృగుడని ప్రసిద్ది గాంచిన మహారాజును, ఇక్ష్వాకువు యొక్క పుత్రుడను. దాతల గురించి పొగిడే సందర్భములో నేను నీ చెవిన పడినానా యేమి? (నీవు వినే ఉంటావు).
ఓ ప్రభూ! సకలప్రాణులలో బుద్దివృత్తులకు సాక్షిగా ఉండే నీ జ్ఞానము ఏ కాలమునందైననూ మొక్కవోదు. నీకు తెలియనిది ఏమి ఉండును? అయినప్పటికీ, నీ ఆదేశానుసారముగా చెప్పెదను.
భూమిపై ఇసుక రేణువులు ఎన్నో, దివిలో తారకలెన్నో, వర్షధారలు ఎన్ని పడునో, అన్ని గోవులను నేను దానము చేసితిని.
నేను వయస్సులో ఉండి పాలిచ్చే కపిలగోవులను దూడలతో సహా దానము చేసితిని. నేను న్యాయముగా సంపాదించిన ఆ గోవులు మంచి జాతికి చెందినవి. అందమైన ఆ గోవులు మంచి నడవడి గలవి. వాటి కొమ్ములకు బంగారముతో, డెక్కలకు వెండితో తొడుగులను వేసి, వస్త్ర ములను కప్పి, మాలలను ఆభరణములను అలంకరించి దానము చేసితిని.
నేను యువకులైన శ్రేష్ఠ బ్రాహ్మణులకు అలంకారములనిచ్చి గోవులను దానము చేసితిని. వారి కుటుంబములు దారిద్యముచే కష్టపడుచున్ననూ, వారు సద్గుణములు శీలము గలవారు. కపటము లేని నియమనిష్ఠలు గల ఆ బ్రాహ్మణులు తపస్సునకు పెట్టిన పేరు. వారు సమచిత్తులై దాచుకోకుండా వేదమును బోధించెడివారు.
నేను ఎద్దులను, భూమిని, బంగారమును, ఇళ్లను, గుర్రములను, ఏనుగులను, దాసీలతో కూడిన కన్యలను, నువ్వులను, వెండిని, శయ్యలను, వస్త్రములను, రత్నములను, ఇంటి సామగ్రిని, రథములను దానము చేసితిని. యజ్ఞములను చేసి ఈశ్వరుని ఆరాధించితిని. నూతులను త్రవ్వించుట మొదలైన పూర్తకర్మలను కూడ అనుష్ఠించితిని.
ఒక శ్రేష్ట బ్రాహ్మణుని గోవు దారితప్పి నా గోవుల మందలో కలిసినది. ఆ విషయము తెలియని నేను దానిని బ్రాహ్మణునకు దానము చేసితిని.
దానమును తీసుకున్న బ్రాహ్మణుడు ఆ గోవును తోలుకొనిపోవు చుండగా దాని స్వామియగు బ్రాహ్మణుడు చూచి, ఈ గోవు నాది అని చెప్పెను. ఆ బ్రాహ్మణుడు, ఇది నాది, నాకు నృగమహారాజు ఇచ్చినాడు, అని బదులు చెప్పెను.
తమ పనిని చక్కబెట్టుకొనే ఆ బ్రాహ్మణులిద్దరు దెబ్బలాడుకుంటూ నాతో " -- నీవు చోరీ చేసి దానము చేసితివి -- అని పలికిరి. వారి ఆ మాటను విని నాకు తల తిరిగిపోయెను.
ధర్మసంకటములో పడిన నేను ఆ బ్రాహ్మణులిద్దరినీ జాగ్రత్తగా అనునయించే యత్నమును చేసితిని. లక్ష గొప్ప గోవులనిచ్చెదను, ఈ గోవును నాకిమ్ము, అని వారిని కోరితిని.
నేను మీ సేవకుడను. తెలియక తప్పు చేసితిని. మీరిద్దరు నన్ను అనుగ్రహించుడు. అమంగళకరమగు నరకములో పడిపోవుచున్న నన్ను మీరు ఆపదనుండి గట్టెక్కించుడు.
ఓ రాజా! నేను ' నిశ్చయముగా ఈ గోవుకు బదులుగా లక్ష గోవులనైననూ తీసుకోను, అని చెప్పి ఆ గోవుయొక్క యజమాని వెడలిపోయెను. లక్ష కంటే అధికముగా మరో పది వేల గోవులనిచ్చినా నాకు అక్కర లేదు, అంటూ రెండవ బ్రాహ్మణుడు నిషమించెను.
ఓ దేవాధిదేవా! నీవు జగన్నాథుడవు. ఇంతలో నా జీవితము సమాప్తమైనది. నన్ను యముని కింకరులు యమలోకమునకు కోనిపోయిరి. అచట యముడు నన్నిట్లు ప్రశ్నించెను.
ఓ రాజా! నీవు ముందుగా పాపముననుభవించేదవా? లేక, పుణ్యమునా? నీవు చేసిన దానధర్మములకు, నీకు లభించే ప్రకాశవంతమైన లోకములకు అంతము నాకు కనబడుట లేదు.
ఓ దేవా! ముందుగా నేను పాపముననుభవించెదనని నేను చెప్పగా, పడిపో! అని యముడు పలికెను. ఓ శ్రీకృష్ణ ప్రభూ! అంతలో నేను పడిపోతూ, ఊసరవెల్లి రూపమును పొందితినని గుర్తించితిని.
శ్రీకృష్ణా! నేను బ్రాహ్మణభక్తుడనైన దాతను. నీ సేవకుడనగు నేను నీ దర్శనమును కోరుచుంటిని. నాకిప్పటికీ పూర్వజన్మస్మృతి నశించలేదు.
ఓ ప్రభూ! గొప్ప యోగులు ఉపనిషత్తు (అభేదదృష్టి) అనే దృష్టితో పవిత్రమైన అంతఃకరణమునందు పరమాత్మవగు నిన్ను భావన చేసెదరు.
అట్టి నీవు పెద్ద ఆపదచే వివేకమును కోల్పోయి ఉన్న నా కంట ఎట్లు బడితివి? ఇంద్రియగోచరము కాని దేముడు నాకు ప్రత్యక్ష మైనాడు. ఎవని కైతే సంసారబంధమునుండి విముక్తి కలిగే వేళ వచ్చునో, వానికి నీవు దర్శనమిచ్చెదవు.
ఓ దేవాధిదేవా! నీవు జగన్నాథుడవు. ఓ గోవిందా! పురుషోత్తమా! నారాయణా! ఇంద్రియములను ప్రవర్తిల్లజే సేది నీవే. నీ కీర్తి పావనము చేయును. నీకు స్వరూపచ్యుతి గాని, నాశము గాని లేవు. .
ఓ శ్రీకృష్ణా! నేను స్వర్గలోకమునకు వెళ్లుచున్నాను. ఓ ప్రభూ! నాకు అనుమతినిమ్ము, నేను ఎక్కడ ఉన్నా, నా మనస్సు నీ పాదములనే ఆశ్రయించుగాక!
సర్వమునకు ఉపాదానమైన అనంతశక్తి గల పరబ్రహ్మ నీవే. నీవు వసుదేవుని పుత్రుడగు శ్రీకృష్ణుడవై అవతరించి యోగులను కాపాడు చున్నావు. నీకు అనేక నమస్కారములు.
నృగుడిట్లు పలికి ఆ శ్రీకృష్ణునకు ప్రదక్షిణము చేసి, ఆయన పాదములను శిరస్సుతో స్పృశించి నమస్కరించి, అనుమతి తీసుకొనెను. జనులు చూచుచుండగనే ఆయన గొప్ప విమానమునధిష్ఠించెను.
దేవకి పుత్రుడగు శ్రీకృష్ణ భగవానునకు బ్రాహ్మణుల యెడల ప్రేమ మెండు. ఆ ధర్మాత్ముడు క్షత్రియులకు శిక్షణనిచ్చుటకై చుట్టూ ఉన్న జనమునుద్దేశించి ఇట్లు పలికేను.
బ్రాహ్మణుల సొత్తును కొంచెము అనుభవించినా, అది అగ్ని కైననూ, అగ్నివంటి తేజశ్శాలురకైననూ, జీర్ణము చేసుకొనుట చాల కష్టము. మేము ప్రభువులమని విర్రవీగే రాజులకు మరింత కష్టమని వేరుగా చెప్పవలెనా?
హాలాహలమునకు విరుగుడు కలదు. కావున, అది విషమని నేను అనుకోను. కాని, ఈ భూలోకములో బ్రాహ్మణుని సొత్తు అనేది నిశ్చయముగా విషము. దానికి విరుగుడు లేదు.
విషము భక్షించినవానిని మాత్రమే హింసించును. నీళ్లు చల్లితే నిప్పు చల్లారును. కాని, బ్రాహ్మణుని సొత్తు అనే అరణినుండి పుట్టే అగ్ని సమూలముగా వంశమును నశింపజేయును.
ఎవడైతే బ్రాహ్మణుని పూర్తి అనుమతి లేకుండా ఆయన సొత్తును - అనుభవించునో, ఆతడు, వానీ సంతానము, వారి సంతానము అనే మూడు తరములు నశించును. బ్రాహ్మణుని సొత్తును హఠము. చేసి బలప్రయోగముతో అనుభవించినచో, పది గడచిన తరములు, పది రాబోవు తరములు వినాశమును పొందును.
కొందరు మూర్ఖులైన రాజులు రాజసంపదచే వివేకమును కోల్పోయి నరకమునకు హేతువైన బ్రాహ్మణుని సొత్తును మంచిదని తలపోయుదురు. వారు తాము నరకములో పడుతున్నామని తెలుసుకోరు.
రాజులు ధర్మమునుల్లంఘించి కుటుంబీకులైన బ్రాహ్మణుల వాటాను అపహరించి వారి జీవికకు విఘాతమును కలిగించినచో, ఉదారస్వభావు లగు ఆ బ్రాహ్మణులు దుఃఖించెదరు. పోరీ కన్నీళ్లకు ఎన్ని ధూళి కణములు తడి యగునో అన్ని సంవత్సరముల కాలము ఆ రాజులు, వారి వంశీయులు కూడ నిరంతరముగా కుంభీపాకము (బానలలోని మరిగే నూనెలో పారవేసే) లనే నరకములయందు యాతనలననుభవించెదరు.
ఎవడైతే తాను ఇచ్చినది గాని, ఇతరులు ఇచ్చినది గాని, బ్రాహ్మణుని జీవికను అపహరించునో, అట్టివాడు అరవై వేల సంవత్సరములు మలమునందు క్రిమియై పుట్టును.
బ్రాహ్మణుని సొత్తు నా సొత్తులోనికి రాకుండు గాక! బ్రాహ్మణుని సొత్తుకు ఆశపడే మానవులు అల్పాయుష్కులై పరాజయములను పొందెదరు. రాజులైతే రాజ్యమును కోల్పోయెదరు. మరణించి వారు ఇతరులకు భయమును కలిగించే విషసర్పములై పుట్టెదరు.
ఓ ఆత్మీయులారా! వేదవేత్త యైన బ్రాహ్మణుడు అపరాధమునే చేసినా, ఒకచో కొట్టినా, లేదా అధికముగా తిట్టినా, మీరాయనకు ద్రోహమును చేయనే వద్దు. పైగా, ఆయనకు సర్వదా నమస్కరించుడు.
నేను మూడు పూటలా ఏకాగ్రమగు చిత్తముతో వేదవేత్తలగు బ్రాహ్మణు లకు నమస్కరించెదను. అదే విధముగా, మీరు కూడ నమస్కరించుడు. దీనికి విరుద్దముగా నమస్కరించనివానిని నేను శిక్షించెదను.
గోవు బ్రాహ్మణునిది అని తెలియక దానము చేసి ఈ నృగమహారాజు పతితుడైనాడు. అదే విధముగా, బ్రాహ్మణుని సొత్తు తనను అపహరించువానిని నిశ్చయముగా అధఃపతితుని చేయును.
సకలలోకములను పావనము చేసి మోక్షమునిచ్చే శ్రీకృష్ణ భగవానుడు ద్వారకావాసులకీ విధముగా ఉపదేశించి, తన మందిరములో ప్రవేశించెను.
శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో నృగమహారాజు వృత్తాంతమును వర్ణించే అరువది నాల్గవ అధ్యాయము ముగిసినది.
