శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

35 - గోపికా యుగళ గీతము

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను - శ్రీకృష్ణుడు అడవికి వెళ్లినప్పుడు ఆయన వెంట గోపికల మనస్సు కూడ వెళ్లిపోయెడిది. వారు శ్రీకృష్ణుని లీలలను గానము చేస్తూ కష్టముగా పగళ్లను గడిపిరి.

ఓ గోపికలారా! మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుడు ఎడమ భుజము పై ఎడమచెక్కిలిని ఆన్చి పిల్లనగ్రోవిని క్రింది పెదవి పై ఆన్చి సుకుమారమగు వ్రేళ్లను దాని ఛిద్రములపై నుంచి వాయించినప్పుడు ఆతని కనుబొమలు నాట్యము చేయుచుండును. సమయములో సిద్ధులతో గూడి ఆకాశమార్గము గుండా విమానములలో వెళ్లే సిద్ధయువతులు గానమును విని ముందు ఆశ్చర్యమును పొందెదరు. వెనువెంటనే మనస్సు మన్మథుని బాణములచే పరవశము కాగా, వారు కోకముడుల సంగతి మరచిపోయి సిగ్గు పడుతూ మోహమును పొందెదరు.

ఏమర్రా! యువతులారా! ఈ చిత్రాన్ని విన్నారా! ముత్యాల హారమువంటి శ్రీకృష్ణుని చిరునవ్వు మెడలోని హారముపై ప్రతిఫలిస్తూ ఉంటుంది. (మేఘమువంటి) ఆయన వక్షఃస్థలము పై కదలని మెరుపువంటి శ్రీవత్సమున్నది. నందుని పుత్రుడగు ఈ శ్రీకృష్ణుడు పీడిత జనులకు సుఖమునిచ్చువాడు. ఈతడు వేణువును వాయించినప్పుడు గోకులమునకు చెందిన ఎద్దులు, ఆవులే గాక అడవిలోని లేళ్లు కూడ దూరమునుండి వినగానే, వాటి మనస్సు దోచివేయబడును. అవి గుంపులు గుంపులుగా చేరి కదలకుండా వినుటచే, సగము కొరికిన గడ్డి దుబ్బులు నోట్లో అటులనే ఉండును. అవి చెవులను రిక్కించి వింటూ ఉంటే నిద్ర పోతున్నాయా! చిత్రకారుడు వ్రాసిన బొమ్మయా! అన్నట్లు ఉండును.

ఓ సఖీ! మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుడు తలపై నెమలి పింఛములను, ముంగురులయందు పూల గుత్తులను చిగుళ్లను, దేహమునందు గైరికాది ధాతువుల (రాతి రంగుల) ను అలంకరించుకున్నప్పుడు ఆతని వేషము మల్లుల వేషమును పోలియుండును. బలరామునితో, గోపాలకులతో కూడి ఒకప్పుడు ఎక్కడనైతే వేణువుతో గోవులను వాటి పేర్లతో పిలుచునో, అప్పుడు నదుల ప్రవాహములాగిపోవును. నదులు కూడ గాలి మోసుకువచ్చే ఆయన పద్మములవంటి పాదముల ధూళిని కోరును సుమా! కాని, వాటికి కూడ మనవలె పుణ్యము ఎక్కువ లేదు. (అనగా, పాదములను స్పృశించే భాగ్యము లభించలేదు). వాటి చేతుల వంటి కెరటములు ప్రేమచే వణుకుచుండ, జలములు నిశ్చలములగును.

            జగత్కారణుడు, పూర్ణుడు అగు విష్ణువును వెంట ఉండే దేవతలు స్తుతించెదరు. లక్ష్మి సర్వదా ఆయనతో ఉండును. అదే విధముగా, బృందావనములో సంచరించే ఆ శ్రీకృష్ణుని వెన్నంటి ఉండే గోపాలకులు ఆయన పరాక్రమమును చక్కగా వర్ణించుచుందురు. ఆయన సంపద కూడ శాశ్వతమైనదియే. కొండ చరియలపై మేయుచున్న గోవులను ఆయన వేణువునూది పిలిచినప్పుడు అడవియందలి తీగలు, చెట్లు తమయందు పూర్ణమగు ఆనందమును ప్రకటించుచున్నవా యన్నట్లుండును. పూలతో, పళ్లతో సంపన్నములై బరువునకు వంగిన కొమ్మలు గల చెట్లు ప్రేమతో పులకించిన దేహములు కలిగి నమస్కరించే భక్తులను పోలియుండును. అవి తేనెల ధారలను వర్షించును.

            ఓ సఖీ! అందగాళ్లలో అందగాడగు శ్రీకృష్ణ .భగవానుడు అందమైన తిలకమును దిద్దుకొని వనమాలను ధరించును. ఆ వనమాలయందలి దివ్యమగు పరిమళము గల తులసియొక్క తేనెచే మత్తెక్కిన తుమ్మెదలు గుంపులుగా చేరి బిగ్గరగా ఝంకారమును చేయును. ఆయనకు ధ్వనియందు ప్రీతి. ఆయన ఆ ధ్వనిని సమ్మానిస్తూ వేణువును పెదవులకానించి పాడును. ఆ మధురగానముచే సరస్సునందలి బెగ్గురు పక్షులు, హంసలు, ఇతరపక్షుల మనస్సు దోచివేయబడును. కూతలను మానివేసి మనస్సును నిగ్రహించుకొని శ్రీకృష్ణుని వద్దకు వచ్చి కన్నులను మూసుకొని (యోగీశ్వరుల వలె) దగ్గరగా కూర్చుండును.

ఓ గోకుల దేవతలారా! మాల, కర్ణాభరణముల విలాస గల శ్రీకృష్ణుడు బలరామునితో గూడి గూడి గోవర్ధన పర్వతముయొక్క చరియలయందు సంచరించును. ఆయనకు హర్షము కలిగినప్పుడు వేణువును ఊది జగత్తునకు హర్షమును కలుగజేస్తూ వేణుధ్వనితో నినదింప జేయును. అప్పుడు మేఘము (జగత్తునకు) పెద్దయగు శ్రీకృష్ణుని యెదుట అల్లరి యగునేమో అనే శంక గలదై, వేణునాదముననుసరిస్తూ మెల్ల మెల్లగా గర్జించును. అంతేగాక, అది తన ప్రియమిత్రుడగు (తన వలె నల్లనివాడు) శ్రీకృష్ణుని పై పూలవానవంటి నీటి బిందువులను కురిపించి, తన నీడతో గొడుగు పట్టును.

ఓ యశోదా! నీ కొడుకు పలు రకముల గోపాలకుల ఆటలలో దిట్ట. ఆతడు దొండపండువంటి పెదవి పై పిల్లన గ్రోవిని ఆన్చి పాడును. ఆతడు వేణువాదనములోని వివిధ ప్రకారములను తనకు తానుగా అభ్యాసము చేసినాడు. ఆతని ఆ పాటను ఇంద్రుడు, శివుడు, బ్రహ్మదేవుడు మొదలైన దేవనాయకులు ఆయా సమయములలో మెడలను వంచి వినుచుందురు. వారి  చిత్తము దానిచే ఆకర్షించబడును. కాని, వారు ఎంతటి సంగీతనిపుణులైనా, గానము యొక్క స్వరతత్త్వము తెలియక (రాగతాళములను గుర్తు పట్టలేక) వ్యామోహపడుచుందురు.

జెండా వజ్రము, పద్మము, అంకుశము అనే
చిహ్నములు కలిగి పద్మపు రేకులను పోలిన అడుగులతో శ్రీకృష్ణుడు
నడిచి వెళ్లుచుండగా, నేలకు పశువుల డెక్కల వలన కలిగిన నొప్పి
దూరమగును. ఆయన ఏనుగు వలె ఠీవిగా నడుస్తూ వేణువును వాయిస్తూ
వెళ్లును. ఆయన వెళ్తూ మాకేసి విలాసతో కూడిన చూపులను విసురును.
దానిచే మాయందు ప్రేమావేశము కలిగి మేము చెట్లవలె చేష్టలుడిగి
యుండుము. ఆ మోహముచే మాకు జుట్టు ముడి ఊడినదని గాని, కొంగు
జారినదని గాని తెలియకుండును.

శ్రీకృష్ణునకు పరిమళభరితమగు తులసిమాలయందు ప్రీతి మెండు. ఆతడు గోవులను లెక్కించుటకై మణుల మాలను దగ్గర పెట్టుకొనును. ఆయన ఒకచోట ఆ మాలతో గోవులను అన్ని వైపులా లెక్కిస్తూ, ప్రియుడగు గోపబాలకుని భుజముపై చేతిని వేసి ఏదో ఒక సమయములో వేణువును వాయించెను. ఆ వేణుగానము ఆడు లేడుల చిత్తములను దోచివేయును. తమ జతలైన మగ లేడులను విడిచి పెట్టి, ఇంటియందు ఆశను వదులుకున్న గోపికలు వలె, సద్గుణపుంజములకు సముద్రమువంటివాడగు శ్రీకృష్ణుని వద్దకు చేరి అచటనే నిలిచియుండెను.

పుణ్యాత్మురాలవగు ఓ యశోదా! నందుని పుత్రుడు, నీ ముద్దుల
బిడ్డడు అగు శ్రీకృష్ణుడు ప్రేమించువారలకు హర్షమును కలిగిస్తూ
యమునానదీ తీరమునందు విహరించెను. అతడు గన్నేరు పూల మాలతో
ఉత్సవమునకు తగ్గ వేషమును దాల్చెను. ఆతని చుట్టూ గోపాలకులు,
గోధనము ఉండెను. అప్పుడు గాలి చందనపు స్పర్శతో ఆయనను
సష్మూనిస్తూ మెల్లగా అనుకూలముగా వీచును, గంధర్వుల గణములు
స్తోత్రములను పఠిస్తూ ఆయనను చుట్టువారి వాద్యములు, గీతములు,
ఉపహారములతో సేవించచరు.

యశోద గర్భమునందు జన్మించిన ఈ శ్రీకృష్ణ చంద్రుడు
గోకులమునకు గోవులకు హితమును చేయువాడు. కావుననే,
గోవర్ధమునెత్తినాడు. ఈతడు సాయంకాలము గోసంపదనంతనూ మందగా
చేసి వేణువును వాయించుకుంటూ వస్తూ ఉంటే, వెంట వచ్చే గోపాలకులు
ఆతని కీర్తిని గానము చేయుచుండిరి. మారమునందు పెద్దలు కూడ ఆతని
పాదములకు నమస్కరించుచున్నారు. ఆతడు అలసినా కాంతి తగ్గలేదు.
డెక్కల ధూళిచే వ్యాప్తమైన మాలను ధరించియున్న ఆతని దగ్శనము
కన్నులకు పెద్ద పండువయే. ఈ శ్రీకృష్ణ చంద్రుడు మిత్రులమైన మన
మనోరథములను పరిపూర్ణము చేయు కోరికతో వచ్చుచున్నాడు.

తన మిత్రులకు సమ్మానమునిచ్చే ఈతడు ఇంటికి వచ్చే ఆనందముచే కొంచెము స్వాధీనత తప్పిన కన్నులు గలవాడు. వనమాలను దాల్చిన ఈతని ముఖము ప్రత్తి జడవలె జడవలె పాలిపోయి ఉన్నది. అయినా, బంగరు కుండలముల కాంతి సుకుమారమగు చెక్కిలిని అలంకరింప జేయుచునే యున్నది. యాదవులకు ప్రభుడగు ఈతడు గజేంద్రుని ఠీవితో నడుస్తూ వచ్చుచున్నాడు, గోకులమునకు, గోవులకు పగటి తాపము సాయంకాల మగుసరికి చంద్రునివంటి ఈతని దర్శనముచే తొలగిపోవుచున్నది.   

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! గోకులమునందలి స్త్రీలకు శ్రీకృష్ణుడే జీవితము, ఆతని దర్శనమే గొప్ప ఉత్సవము. వారి మనస్సు ఆయనయందే లగ్నమయ్యెడిది. వారు పగటియందు కూడ ఆయన లీలలనే గానము చేస్తూ ఆనందించెడివారు.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము పూర్వార్ధములో

గోపికా యుగల గీతమును వర్ణించే ముప్పది ఐదవ

అధ్యాయము ముగిసినది (35).