శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

82 - బలరామ శ్రీకృష్ణులను గోపాలకులు గోపికలు కలుసుకొనుట

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- తరువాతి - వృత్తాంతమును చెప్పుచున్నాను. బలరాముడు, శ్రీకృష్ణుడు ద్వారకా నగరములో నివసించుచుండిరి. ఒకనాడు కల్పాంతమునందు వలె సంపూర్ణ సూర్య గ్రహణము పట్టెను.

ఓ పరీక్షిన్మహారాజా! ఆ గ్రహణమును గురించి జనులకు ముందుగానే తెలిసెను. వారు ఈశ్వరుని ఆరాధించి తమకు మంగళమును కలిగించుకొనే కోరికతో అన్ని ప్రాంతములనుండి సమంతపంచకమనే క్షేత్రమునకు వెళ్లిరి.

పరశురాముడు ఆయుధధారులలో దిట్ట. ఆయన భూమిపై క్షత్రియులు లేకుండా చేయగోరి, ఆ సమంతపంచకమునందు రాజుల రక్తధారలతో పెద్ద కుండములను తయారుచేసేను.

అచటనే సర్వసమర్థుడగు పరశు రామ భగవానుడు యజ్ఞమును కూడ చేసెను. ఆయనకు పొసంబంధము లేదు. అయినో, లోకమునకు శిక్షణని చ్చుటకై ప్రాకృతజనుడు వలే పాపమును పోగొట్టుకొనుటకు అట్లు చేసెను.

ఆ గొప్ప తీర్థయాత్రాసందర్భములో భారతదేశములోని ప్రజలు అచటకు వెళ్లిరి. అక్రూరుడు, వసుదేవుడు, ఉగ్ర సేనుడు మొదలగు యాదవులు కూడ వెళ్లిరి.

భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! గదుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, చారుదేష్ణుడు మొదలగువారు తమ పాపములను పోగొట్టుకొన గోరి ఆ క్షేత్రమునకు వెళ్లిరి. గదుడు మరియు సేనానాయకుడగు కృత వర్మ సుచంద్రశుకసారణులతో గూడి ద్వారకారక్షణకై నిలిచియుండిరి.

వారు దేవతల విమానములను పోలిన రథములపై, కెరటముల వలె సాగిపోయే గుర్రములపై, మేఘముల వలే నినదించే ఏనుగులపై, విద్యాధరులవలె ప్రకాశించే జనులు మోసే పల్లకీల పై భార్యలతో గూడి వెళ్లిరి. గొప్ప తేజశ్శాలురగు ఆ యాదవులు బంగరు మాలలు, ప్రకాశించే పుష్పమాలలు, వస్త్రములు, కవచములు గలవారై మార్గమునందు దేవతలు వలె విశేషముగా ప్రకాశించిరి.

గొప్ప భాగ్యవంతులైన యాదవులు మిక్కిలి ఏకాగ్రమగు చిత్తముతో ఉపవాసము చేసి యథావిధిగా ఆపరశురామకుండములలో గ్రహణస్నానమును చేసిరి. పొరు పాడియావులను వస్త్రము, పుష్పమాల, బంగరు మాలలతో అలంకరించి బ్రాహ్మణులకు దానము చేసిరి. తరువాత వారు మరల విముక్తిస్నానమును చేసిరి.

  యాదవులకు శ్రీకృష్ణుడే దైవము. మాకు శ్రీకృష్ణునియందు భక్తి కలుగుగాక! అని ప్రార్థించి, వారు బ్రాహ్మణశ్రేష్ఠులకు మంచి ఆహారమునిచ్చి, వారి అనుమతితో తాము కూడ భుజించిరి.  

వారు భుజించి దట్టని నీడ గల చెట్ల మొదళ్లయందు కూర్చుండిరి. వార చటకు వచ్చిన తమ బంధువులు, మిత్రులు అయిన రాజులను చూచిరి.

వారు మత్స్య-ఉశీనర-కౌసల్య-విదర్బ-కురు-సృంజయ-కాంబోజ కేకయ-మద్ర-కుంతి-ఆనర్త- కేరళ దేశముల రాజులను చూచిరి.

వారు ఇతరదేశముల రాజులను, తమ పక్షము (పాండవులు) వారిని, పర (దుర్యోధన) పక్షమువారిని వందల సంఖ్యలో చూచిరి. మరియు వారు నందుడు మొదలైన మిత్రులను, గోపాలకులను, చాలకాలమునుండి తహతహతో ఎదురు చూస్తున్న గోపికలను కూడ చూచిరి.

ఒకరినొకరు చూచుటచే కలిగిన హర్షముయొక్క వేగముచే వారి హృదయములు, పద్మములవంటి ముఖములు బాగా విప్పారి శోభిల్లెను. వారు పరస్పరము గట్టిగా కౌగిలించుకున్నప్పుడు శరీరము గగుర్పాటును పొంది కన్నులగుండా ఆనందబాష్పములు ప్రవహించేను. ఆనందముతో వారి మాట గద్గదమాయెను.

ఒకరినొకరు చూచినప్పుడు అతిశయించిన ప్రేమ వలన పుట్టిన చిరునవ్వు వారి కన్నుల స్వచ్చమగు కటాక్షములకు తోడాయేను. ఆ స్త్రీలు ప్రేమతో నీరు నిండిన కన్నులు గలవారై, కుంకుమ ముద్ద అలదిన స్తనములు నొక్కుకొనునట్లుగా బాహువులతో ఒకరినొకరు కౌగిలించుకొనిరి.

తరువాత ఆ యాదవులు పెద్దలకు నమస్కరించి పిన్నలచే నమస్కరించబడిరి. వారు పరస్పరము స్వాగతము పలికి, కుశలప్రశ్నలను వేసి, శ్రీకృష్ణుని గాథలను చెప్పుకుంటూ వినుచుండిరి.

కుంతి వసుదేవుడు మొదలగు సోదరులను, శ్రుతదేవి మొదలైన చెల్లెళ్లను, వారి పుత్రులైన, బలరామాదులను, శూరుడు మొదలగు తల్లిదండ్రులను, దేవకి మొదలగు సోదరభార్యలను చూచి వారితో ప్రేమపూర్వకముగా కబుర్లాడి మనస్సులోని క్లేశములను విడిచి పెట్టెను.  

కుంతి ఇట్లనెను --- పెద్దన్నా! నేను పుణ్యము చేసినదానను కానని నా తలంపు. ఎందుకంటే, మీరు సత్పురుషులే అయినా, ఆపదలలోనైనా నన్ను స్మరించకుంటిరి.

ఎవనికి దైవము ప్రతికూలముగనుండునో, అట్టి తమ వ్యక్తిని మిత్రులు, జ్ఞాతులు, పుత్రులు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు కూడ మరచెదరు.

వసుదేవుడిట్లు పలి కెను -- అమ్మా! మేము దైవము చేతిలో ఆట బొమ్మలైన మానవులము. మమ్ము తప్పు పట్టకుము. మనిషి ఈశ్వరుని వశములోనుండి పని చేయును; లేదా, ఈశ్వరునిచేతనే చేయించబడును.

ఓ చెల్లీ! కంసునిచే పీడించబడిన మేము పలు దిక్కులకు పారిపోతిమి. ఇప్పుడిప్పుడే దైవము మమ్ము మరల స్వస్థానమునకు తెచ్చినాడు.

శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను -- వసుదేవుడు, ఉగ్రసేనుడు, అక్రూరుడు మొదలగువారు అచటకు వచ్చిన రాజులను సత్కరించిరి. ఆ రాజులు శ్రీకృష్ణ భగవానుని దర్శనము వలన మహానందమును పొంది సంతోషముగా నుండిరి.

ఓ పరీక్షిన్మహారాజా! భీష్ముడు, ద్రోణుడు, అంబికాపుత్రుడగు ధృతరాష్ట్రుడు, దుర్యోధనాదులతో కూడిన గాంధారి, భార్యలతో కూడిన పాండవులు, కుంతి, సృంజయుడు, విదురుడు, కృపాచార్యుడు, కుంతిభోజుడు, విరాటుడు, భీష్మకుడు, గొప్పవాడగు నగ్నజిత్తు, పురుజిత్తు, ద్రుపదుడు, శల్యుడు, ధృష్టి కేతువు, కాశీరాజు, దమ ఘోషుడు, విశాలాక్షుడు, మీథిలామద్ర కేకయరాజులు, యుధామన్యువు, సుశర్మ, కొడుకులతో కూడిన బాహ్లికుడు, ఇతరరాజులు, ధర్మరాజు అనుయాయులగు రాజులు అందాల రాశియగు శ్రీకృష్ణుని రూపమును, ఆయన భార్యలను చూచి ఆశ్చర్యచకితులైరి.

తరువాత బలరామ శ్రీకృష్ణులచే ఆ రాజులు సత్కరించబడిరి. వారానందముతో, శ్రీకృష్ణునకు తనవారైన యాదవులను కొనియాడిరి.

ఆహా! భోజప్రభుడవగు ఓ ఉగ్రసేనా! ఈ లోకమునందు మానవులలో మీరే సఫలమైన జన్మ గలవారు. ఏలయన, యోగులకైననూ దర్శింప శక్యము కాని శ్రీకృష్ణుని మీరు సర్వదా చూచెదరు.

 వేదములచే కొనియాడబడిన శ్రీకృష్ణ భగవానుని కీర్తి, ఆయన పాదములను కడిగిన నీరు గంగ, ఆయన .వాక్కు అయిన వేదము కూడ ఈ జగత్తును మిక్కిలి పవిత్రము చేయుచున్నవి. భూమి యొక్క శక్తిని కలికాలము నశింపజేసినా, ఆయన పద్మములవంటి పొదముల స్పర్శచే శక్తి ఆవిర్భవించిన భూమి మనకు సకలపురుషార్థములను వర్షించుచున్నది.

నిమీరు ప్రవృత్తిమార్గమునందున్నా శ్రీకృష్ణ భగవానుని చూచి స్పృశించెదరు;, ఆయనతో కబుర్లాడుతూ కలిసి నడిచెదరు; ఆయనతో కలిసి తిని కూర్చుండి నిద్రించెదరు; మీకు ఆయనతో వివాహబంధముతో కూడిన దైహికసంబంధము గలదు. స్వర్గమోక్షముల అన్వేషణను విరమింపజేసే ఆయన స్వయముగా మీ ఇంటిలో ఉన్నాడు.

 శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణుడు, బలరాముడు మొదలైన యాదవులు ఆ సమంతపంచకమునకు వచ్చిరని తెలిసి నందుడు వారిని చూడగోరెను. గోపాలకులు బళ్లపై సామగ్రిని సర్దుకొని బయలుదేరిరి. ఆయన వారితో గూడి అచటకు విచ్చేసేను.

ముఖ్యప్రాణము రాగానే అవయవముల చేష్టలు ఆరంభమగును. అదే విధముగా, ఆ నందుని చూచి యాదవులు హర్షముతో లేచి నిలబడిరి. చాల కాలము తరువాత చూచుటచే వ్యాకులమైన చిత్తము గల యాదవులాయనను గట్టిగా కౌగిలించుకొనిరి.

వసుదేవుడు చాల ప్రీతి జెంది ప్రేమకు పరవశుడై నందుని కౌగిలించుకొనెను. ఆయన కంసుడు పెట్టిన బాధలను, శ్రీకృష్ణుని నందగోకులములో దాచి పెట్టుటను కూడ గుర్తు చేసుకొనెను.

కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! బలరామ శ్రీకృష్ణులు తల్లిదండ్రులను నమస్కరించి కౌగిలించుకొనిరి. ప్రేమ వారి కళ్లు నీటితో నిండి కంఠము గద్గదమగుటచే ఏమీ మాటలాడ లేకపోయిరి.

గొప్ప పుణ్యాత్మురాలగు యశోద మరియు నందుడు ఆ కొడుకులిద్దరిని తమ ఒడిలో కూర్చుండబెట్టుకొని, చేతులతో కౌగిలించుకొని దుఃఖములను (కన్నీళ్లను) విడిచి పెట్టిరి.

రోహిణి మరియు దేవకి గోకులరాణియగు యశోదను కౌగిలించుకొనిరి. యశోద చూపిన మైత్రీ (పుత్రుని రక్షించుట) గుర్తుకు వచ్చి, వారిద్దరి కళ్లలో నీరు ఉబికి కంఠములు రుద్దములాయెను. వారామెతోనిట్లనిరి.

ఓ గోకులరాణీ! ఇందైశ్వర్యము లభించినా మీ ఇద్దరి (యశోదానందుల) ప్రేమను ఎవతే మరువగలదు? మీ ప్రేమకు ప్రతిగా చేయదగ్గది ఈ లోకములో లేదు. మీ ఋణమును తీర్చుట శక్యము కాదు.

ఓ పూజనీయురాలా! ఈ బలరామ శ్రీకృష్ణులు కన్న తల్లిదండ్రులనెరుగరు. వారికి మీరే తల్లిదండ్రులు. వారిని మీకు అప్పజెప్పగా మీరే వారిని కంటికి రెప్పలా పోషించి పాలించి ప్రేమను జూపి అభివృద్ధిని కలిగించితిరి. వారు మీ వద్ద ఎట్టి భయమైనా లేకుండా నివసించిరి. సత్పురుషులకు స్వపరభేదము ఉండదు.

గోపికలందరు కూడ చాలకాలము తరువాత ప్రియతముడగు శ్రీకృష్ణుని చూచిరి. ఆయనను చూచునప్పుడు కంటికి రెప్పపాటును పెట్టిన బ్రహ్మదేవుని వారు తిట్టుచుందురు. వారాయనను చూపులతో హృదయములో ప్రతిష్టించి గట్టిగా కౌగిలించుకొని ఆయనతో ఐక్యమును పొందిరి. అది సర్వదా యోగనిష్ఠ గలవారికైననూ పొంద శక్యము కాదు.

అట్టి భావైక్యమును పొందియున్న ఆ గోపికలను శ్రీకృష్ణ భగవానుడు ఏకాంతములో కలిసి కౌగిలించి కుశలప్రశ్నలను వేసి నవ్వుతూ ఇట్లనెను.

ఓ చెలికత్తెలారా! శత్రుపక్షీయులను నశింపజేసి నా వారలకు ప్రయోజనములను చేకూర్చుటపై నా మనస్సు లగ్నమయ్యెను. అందుకొరకై వెళ్లిన నేను విలంబమే చేసితిని. నేను మీకు గుర్తు ఉన్నానా?

నేను కృతజ్ఞుడను కాననే చిన్న శంకతో మీరు నా గురించి చెడుగా తలపోయుట లేదు గదా? భగవంతుడు నిశ్చయముగా ప్రాణులను కలిపి విడదీయుచుండును.

గాలి మేఘముల గుంపును, గడ్డిని, దూదిని, ధూళిని కలిపి మరల అంతటా చెల్లాచెదరు చేయును. అదే విధముగా, సృష్టికర్త (కాలము) ప్రాణులను కలిపి విడదీయును.

నాయందలి భక్తి ప్రాణులకు మోక్షమునీయ సమర్థమగుచున్నది. ఇది నిశ్చయము. నన్ను పొందునట్లు చేసే నాయందలి భక్తి పూజనీయలగు మీకు కలుగుట అనేది మంగళము.

యువతులారా! ఎందుకంటే, జగత్తులో సకలపదార్థములు పృథివి జలము-అగ్ని-వాయువు-ఆకాశములనే పంచభూతములనుండి పుట్టి వాటి లోనే విలీనమగును. అదే విధముగా, సకలప్రాణులు నానుండి పుట్టి నాలో విలీనమగును. ప్రాణుల లోపల (అంతర్యామి), బయట (కాలము) నేనే.

ఈ విధముగా జగత్తులోని భౌతికపదార్థములు, ప్రాణుల దేహములు పంచభూతములయందు ప్రతిష్ఠ గలవి. పరమాత్మ వాటియందు భోక్తయగు జీవుడు రూపముగా వ్యాపించియున్నాడు. పాంచభౌతికదేహము, భోక్తయగు జీవుడు అనే రెండు వాటికి అతీతమైన అవినాశియగు నాయందు ప్రకాశించుచున్నవని తెలియుడు.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా శ్రీకృష్ణుడు గోపికలకు ఆత్మతత్త్వమునుపదేశించి వివేకవతులుగా చేసెను. వారాయననే నీరంతరముగా స్మరించుటచే వారిలోని పరిచ్చీన్నభావము నశించి, వారాయనను ఆత్మరూపముగా పొందిరి (జీవన్ముక్తులైరి).

ఆ గోపికలైతే ఇట్లు పలికిరి -- ఓ పద్మనాభా! లోతైన జ్ఞానము గల సనకాది యోగీశ్వరులు కూడ నీ పాదపద్మమును హృదయములో ధ్యానించెదరు. సంసారమనే నూతిలో పడినవారలకు నీ పాదము పైకి వచ్చే ఆలంబనమగుచున్నది. అట్టి నీ పాదము ఇంటి పనులలో ఉన్నా మాకు మనస్సులో ఎల్లవేళలా ప్రకాశించు గాక!

శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో బలరామ శ్రీకృష్ణులను గోపాలకులు గోపికలు కలుసుకొనుటను వర్ణించే ఎనుబది రెండవ అధ్యాయము ముగిసినది (82).