శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
47 - ఉద్ధవుడు గోపికలతో మాటలాడుట - భ్రమర గీతము
శ్రీశుక మహర్షి పలికెను --- శ్రీకృష్ణుని అనుచరుడగు ఉద్ధవుడు పచ్చని వస్త్రమును, పద్మముల మాలను దాల్చెను. పొడవైన చేతులు, అప్పుడే వికసించిన పద్మముల వంటి కన్నులు, పద్మమువలె ప్రకాశించే ముఖము, మణులు పొదిగిన ఉజ్జ్వలకుండలములు గల ఆయనను గోపికలు చూచిరి.
మనోహరమైన రూపము, శ్రీకృష్ణ భగవానుని వేషాలంకారములను పోలిన వేషాలంకారములు ఈతడు ఎవడు? ఎక్కడనుండి వచ్చినాడు? ఎవరివాడు? అంటూ స్వచ్ఛమగు చిరునగవు. గల గోపిలకలందరు కుతూహలముతో ఆయన చుట్టూ చేరిరి. ఆయన పుణ్యకీర్తి యగు శ్రీకృష్ణుని పద్మములవంటి పాదములను నమ్ముకున్నవాడు.
ఉద్ధవుడు లక్ష్మీపతియగు శ్రీకృష్ణుని సందేశమును తీసుకువచ్చినాడని తెలిసి గోపికలు ఆయనను ఏకాంతములో ఆసనముపై కూర్చుండబెట్టి, సిగ్గుతో కూడిన నవ్వుతో, చూపులతో, మధురభాషణముతో, అర్ఘ్యాదులతో సత్కరించిరి. తరువాత ఆయనకు నమస్కరించి వినయముతో ఇట్లు ప్రశ్నించిరి.
తమరు యాదవప్రభుడగు శ్రీకృష్ణుని అనుచరుడవనియు, ఆ ప్రభుడు తన తల్లిదండ్రులకు ప్రీతిని కలిగించగోరి పంపగా నీవు వచ్చినాడవనియు మాకు తెలియును.
అట్లు గానిచో (తల్లిదండ్రులు తప్పు), ఆయనకీ గోకులమునందు గుర్తు రాదగ్గది ఏదీ ఉన్నట్లు మాకు కనబడదు. బంధువులయందలి ప్రేమ అనే పాశమును మహర్షులు కూడ తేలికగా విడిచి పెట్టలేరు.
మానవుడు బంధువులు కానివారియందు స్నేహమును ఏదో ఒక ప్రయోజనము నిమిత్తముగా చేసి, ప్రయోజనము తీరువరకు స్నేహమును అనుకరించును. పురుషులు స్త్రీలయందు, తుమ్మెదలు పువ్వులయందు చేసే స్నేహము ఈ కోవకు చెందినదియే.
వేశ్య సొత్తు లేనివానిని, జనులు సమర్థుడు కాని విద్యాభ్యాసము పూర్తి అయిన విద్యార్థులు ఆచార్యుని, ఋత్విక్కులు దక్షిణలనిచ్చిన యజమానుని విడిచి పెట్టెదరు.
పక్షులు పళ్లు రాలిపోయిన చెట్టును, అతిథులు భుజించిన పిదప ఆ ఇంటిని, మృగములు కాలిపోయిన అడవిని విడిచి పెట్టును. జారులు స్త్రీని అనుభవించి ఆమెకు ప్రేమ ఉన్ననూ విడిచి పెట్టెదరు.
గోపికలు మనోవాక్కాయములతో గోవిందునకే అర్పితమైనవారు. శ్రీకృష్ణుని దూతయై గోకులమునకు వెళ్లిన ఉద్ధవుని యెదుట వారు లోకవ్యవహారములో ఉండే సంకోచమును విడిచి పెట్టిరి.
శ్రీకృష్ణుడు చిన్నతనమునుండి పదేళ్ల వయస్సు వరకు చేసిన ప్రీతికరమైన లీలలేవి గలవో వాటిని ఆ గోపికలు మరల మరల గుర్తు చేసుకొని గానము చేయుచుండిరి. ఇంతేగాక, వారు సిగ్గు విడిచి ఏడ్చుచుండిరి.
ఒకామె శ్రీకృష్ణునితోడి కలయికను ధ్యానించుచుండగా తుమ్మెద కనబడెను. ఆమె దానిని ప్రియుడగు శ్రీకృష్ణుడు పంపిన దూతగా కల్పించి ఇట్లు పలికెను.
గోపిక ఇట్లు పలికెను --- ఓ తుమ్మెదా! నీవు మోసగాడగు శ్రీకృష్ణునకు పని చేసి పెట్టుదానవు. సవతి యొక్క వక్షఃస్థలముచే నొక్కబడిన వనపూల యందు ఆమె వక్షఃస్థలమునందలి కుంకుమ అంటుకొనగా, అది నీ మీసములకు తగుల్కున్నది. నీవు అట్టి మీసములతో మా పాదములను తాకవద్దు. మథురానగరములోని నాగరికయువతుల ప్రసాదమైన కుంకువును మథురానగరాధిపతియగు శ్రీకృష్ణుడే ధరించి యాదవుల సభలో అపహాస్యము పాలు అగును. అట్టి (కుంకుమ గల) వానికి నీవు ఇట్టి (కుంకుము గల, దూతవు.
నీవు తేనెను త్రాగి పూవులను విడిచి పెట్టే మోసగాడవు. శ్రీకృష్ణుడు హడ నీవంటి నీవంటి మోసగాడే. ఆతడు మోహమును కలిగించే అధరామృతమును ఒక్కసారి మాచే పానము చేయించి వెంటనే మమ్ములను విడిచిపెట్టినాడు. ఆ లక్ష్మీదేవియైతే ఇతగాడిని ఎట్లు సేవించు చున్నది చెప్పుమా? అయ్యో! పవిత్రమగు కీర్తి గలవాడు అనే నారదా దుల పొగడ్తలచే ఆమె మనస్సు దోచివేయబడి మోసపోయినది కాబోలు!
ఓ తుమ్మెదా! నీవు అడవిలో నివసించే యెదుట యాదవప్రభుడగు శ్రీకృష్ణుని గురించి అధికప్రసంగమేల చేసెదవు? ఆయన మాకు పాతవాడే. ఆ అర్జునమిత్రునకు కొత్తగా మథురానగర యువతులు సఖురాండ్రైనారు. పోయి వాళ్ల దగ్గర ఆయన ప్రసంగమును గానము చేయుము. ఆయన వారి హృదయములలోని దుఃఖమును పోగొట్టి వారికి ప్రియుడైనాడు. వారు నీకు నీవు కోరిన దానిని ఇచ్చెదరు.
శ్రీకృష్ణుడు మోసగాడు. వాని అందమైన చిరునవ్వునకు, కనుబొమల ఏగుపునకు లొంగిపోని స్త్రీ స్వర్గమునందు కాని, భూలోకమునందు కాని, పాతాళమునందు కాని ఎవరు గలరు? (ఎవ్వరూ లేరు). సాక్షాత్తుగా లక్ష్మీదేవి వాని పాదధూళిని సేవించుచున్నది. వానికి నూ లెక్క (యెంత? (ఏమీ కాదు). కానైతే, దానికి ఉత్తమశ్లోకుడు (గొప్ప కీర్తి గలగాడు) అనే బిరు చము గలదు. ఆ బిరుదము దీసులపై దయ చూపువానికి మాత్రమే సార్ధకమగును సుమా! (శ్రీకృష్ణుడట్లు చేయుట లేదు గనుక, వానికి ఆ వీరుడు స్వర్గమని వానితో చెప్పుము).
ఓ తుమ్మెదా! నీ నక్కవినయములు కట్టి పెట్టు. నీ తల పైనున్న నా కాలిని విడిచి పెట్టుము. ఇట్టి దూతకార్యములను, ప్రియవచనములను ఆ మోసగాడగు శ్రీకృష్ణుని వద్ద నేర్చి పండితుడవైనావని నాకు తెలియును, శ్రీకృష్ణుడు చపలచిత్తుడు. ఆయన కొరకు మేము పిల్లలను, భర్తలను, పర లోకమును కూడ వదిలి పెడితే, ఆయన మమ్ములనీ బృందావనములో విడిచి పెట్టినాడు. వానితో సంధి చేసుకొని మేము పొందేది ఏమున్నది?
క్రూర (కిరాత) స్వభావము గల ఈతడు రామావతారములో వానరరాజగు వాలిని వేటగాడు వలె (దాగియుండి) సంహరించెను. ఇంతేగాక, ఒక స్త్రీకి వశుడై తనను ప్రేమించుచున్న మరియొక (శూర్పణఖ) ను వికృత రూపము గలదానినిగా చేసెను. ఈతడు మహాబలి సమర్పించిన పూజాదికమును కాకి వలె స్వీకరించి ఆతనిని పాశములచే బంధింప జేసెను. కావున, ఈ నల్లవాని స్నేహములు మనకిక వద్దు. కాని, వాని లీలల ప్రసంగమును విడువ లేకున్నాము.
ఆ శ్రీకృష్ణుని అవతారచరితములనే లీలలు చెవులకు అమృతము పలె నుండును. ఆ అమృతము యొక్క ఒక్క బిందువునైననూ ఒక్కసారి ఆస్వాదించిన వ్యక్తికి సుఖదుఃఖది ద్వంద్వములయందలి ఆసక్తి కడిగివేయబడును. అట్టివారు లౌకికజీవనములో ఇమడలేక గాలిలో కలిసిపోయెదరు. ఇట్టివారు ఎంతోమంది ఈ లోకములో ఇల్లును, దీనులైన కుటుంబములోని వ్యక్తులను విడిచి పెట్టి సుఖము లేకుండా పక్షులవలె భిక్షాటనము చేస్తూ జీవించెదరు. (ఈయనను నమ్ముకున్నవారి గతి యింతే).
ఓ దూతా! కృష్ణ సారమృగము యొక్క ప్రియురాండ్రైన ఆడు లేళ్లు వేటగాని గానమును విని అది మోసమని తెలియక వాని వలలో పడి దుఃఖించును. అదే విధముగా, మేము కూడ ఇతగాడి అసత్యవచనములను సత్యములని నమ్మి ఈ పరిస్థితిని పలుమార్లు చూచితిమి. ఈతని చేతి గోళ్ల స్పర్శచే ప్రేమ అధికమై పీడనే పొందితిమి. చాలు చాలు. ఇంకేదైనా వార్తను చెప్పుము.
ఓయీ! నీవు శ్రీకృష్ణుని ప్రియమిత్రుడవు గదా! ప్రియుడగు శ్రీకృష్ణుడు పంపగా మరల విచ్చేసినావా? నీకేదేని కోరిక ఉన్నచో కోరుకొనుము. నిన్ను గౌరపించుట నా ధర్మము. ఇప్పుడు నీవు మమ్ములను ఆ శ్రీకృష్ణుని వద్దకు తీసుకుపోయెదవా? అది సరియగునా? సరియగునా? ఆయన ఇప్పటికే జతగట్టి యున్నాడు. ఆతనికి ఆ జత విడువ శక్యము కాదు. ఓ ప్రియదర్శనా! ఆతనికి తోడుగా వక్షఃస్థలము పై లక్ష్మీదేవి అనే సుందరి ఎల్లవేళలా కాపురమున్నది సుమా!
ఓ ప్రియదర్శనా! పూజనీయుడగు నందుని కొడుకు ఇప్పుడు మథురానగరిలోనే ఉన్నాడా? ఆతడు తండ్రి యింటిని, బంధువులను, గోపాలకులనైనా స్మరించునా? దాసీలమగు మాగురించి ఎప్పుడైనా మాటలాడునా? ఆతడు అగురువు యొక్క పరిమళము గల భుజమును మా తలపై ఎప్పుడు ఉంచగలడు?
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- గోపికలు శ్రీకృష్ణుని చూచుటయందు ఈ విధమైన ఉత్కంఠను కలిగియున్నారనే విషయమును చూచిన ఉద్ధవుడు అప్పుడు వారిని ప్రియుడగు శ్రీకృష్ణుని సందేశవాక్యములతో ఓదార్చి ఇట్లు పలికెను.
ఉద్ధవుడిట్లు పలికెను --- ఆహా! మీరు నిశ్చయముగా కృతార్థులు. మిమ్ములను లోకములు పూజించును. ఎందుకంటే, మీ మనస్సు శ్రీకృష్ణ భగవానునియందు ఇంతగా సమర్పితమైనది.
దానములు, వ్రతములు, తపస్సులు, హోమములు, జపములు, వేదాధ్యయనము, ఇంద్రియనిగ్రహము, ఇతరములగు కల్యాణ సాధనములు పరిపక్వమైనప్పుడు శ్రీకృష్ణునియందు భక్తి కలుగును.
ఉత్తమకీర్తియగు శ్రీకృష్ణ భగవానునియందు మీరు సర్వోత్తమమైన భక్తిని చేసిరి. ఇది మంగళము. ఇట్టి భక్తి మునులకు కూడ సాధ్యము కాదు.
మీరు పుత్రులను, భర్తలను, దేహాభిమానమును, తమ వారిని, ఇళ్లను కూడ విడిచి పురుషోత్తముడగు శ్రీకృష్ణుని వరించిరి. ఇది మంగళము.
ఓ గొప్ప భాగ్యవతులారా! శ్రీకృష్ణుని యథార్థతత్త్వము ఇంద్రియగోచరము కాని సర్వాత్మత్వము. దానిని మీరు పొందిరి. మీ విరహము కారణముగా ఈ సందర్భమును కనుట అనేది నాకు గొప్ప అనుగ్రహమైనది.
ఓ మంగళవతులారా! శ్రీకృష్ణ ప్రభునకు రహస్యకార్యములను చేసి పెట్టే నేను ఆయన సందేశమును తీసుకొని వచ్చినాను. మీకు ప్రియుడగు శ్రీకృష్ణుని సందేశము మీకు సుఖమును కలిగించగలదు. వినుడు.
శ్రీకృష్ణ భగవానుడిట్లు చెప్పెను -- సర్వమునకు ఆత్మ (సారతత్త్వము) నేనే. కాబట్టి నాకు ఎప్పుడైననూ ఎక్క డైననూ మీ వియోగము లేనే లేదు. ఆకాశము, వాయువు, అగ్ని, జలములు, పృథివి అనే పంచభూతములు ప్రాణులన్నింటియందు వ్యాపించి యున్నవి. అదే విధముగా, మనస్సు, ప్రాణాపానాదులు, ఇంద్రియములు, పంచభూతములు, సత్త్వరజస్తమోగుణములు ఆనువాటికి అధిష్ఠానముగా నేనే ఉన్నాను.
నేను నా మాయాశక్తి యొక్క ప్రభావముచే నన్ను నాయందే నాచేతనే పంచభూతములు, ఇంద్రియములు, సత్త్వరజస్తమోగుణముల రూపముగా క్రమముగా సృష్టించి, పాలించి, ఉపసంహరించెదను.
జ్ఞానఘనమగు ఆత్మయందు ధర్మాధర్మముల స్పర్శ గాని, సత్త్వ రజస్తమోగుణముల అనువృత్తి గాని లేదు. ఆత్మ దేహేంద్రియాదులకంటె విలక్షణము. మాయాశక్తి జాగ్రత్స్వప్నసుషుప్తులనే మూడు అవస్థలుగా ప్రకటమగుచున్నది. ఆ అవస్థల సాక్షిగా ఆత్మ అనుభవమునకు వచ్చును.
నిద్ర లేచినవాడు మిథ్యయే అయిన స్వప్నమును గురించి ధ్యానించును. అదే విధముగా మనస్సు మిథ్యయే అయిన ఇంద్రియవిషములగు శబ్దాదులను ధ్యానించును. దేహేంద్రియాదుల మనుగడ కూడ మనస్సు యొక్క చలనము పైననే ఆధారపడును. అట్టి మనస్సును మనము జాగరూకులమై నిగ్రహించవలెను.
నదులు అంతమయ్యేది. సముద్రములోనే. అదే విధముగా వివేకవంతులకు వేదముచే చెప్పబడిన సాధనకలాపము, కర్మయోగము, జ్ఞాసయోగము, త్యాగము, తపస్సు, ఇంద్రియనిగ్రహము, సత్యము అనువాటికి అన్నింటికీ పర్యవసానము (ఫలము) ఈ మనోనిగ్రహమే.
ప్రియుడనగు నేను మీ కన్నులకు దూరముగా నుండుట వాస్తవమే. మీరు సన్నే నిరంతరముగా ధ్యానిస్తూ మనస్సుతో నా సన్నిధిని అనుభవించాలనే ఆకాంక్షతో మాత్రమే నేను మీకు దూరముగా నున్నాను.
స్త్రీలకు దూరమునకు వెళ్లిన ప్రియతమునియందు ఏ విధముగానైతే మనస్సు ఏకాగ్రమై నిలుచునో, ఆ విధముగా దగ్గరగా కంటికి కనబడుతూ ఉండేవానియందు మనస్సు నిలబడదు.
సకలవృత్తులను విడిచి పెట్టి మనస్సును పూర్ణముగా నాయందు ఏకాగ్రము చేసి ఎల్లవేళలా నన్నే స్మరించుడు. మీరు తొందరలో నన్ను పొందగలరు.
ఓ పుణ్యవతులారా! గోకులములో ఉంటూ, నేను బృందావనములో క్రీడించినప్పుడు నాతో రాసక్రీడలో పాల్గొనని గోపికలు నా లీలలనే ధ్యానిస్తూ నన్ను పొందిరి.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ప్రియతముడగు శ్రీకృష్ణుడు పంపిన ఈ సందేశమును విని ఆ గోపికలు ఆనందమును పొందిరి. వారికి ఆ, సందేశము లీలలు గుర్తుకు వచ్చెను. ఉద్ధవునితో నిట్లనిరి.
గోపికలిట్లు పలికిరి --- యాదవులకు శత్రువై పాపములను చేసిన కంసుడు వాని అనుచరులతో సహా వధించబడినాడు. ఇది మంగళము. శ్రీకృష్ణ భగవానుని ఆప్తులు సకలసంపదలను పొందినారు. వారితో కూడి ఆయన క్షేమముగా నున్నాడు. ఇది మంగళము.
ఓ ప్రియదర్శనా! గదుని తమ్ముడగు శ్రీకృష్ణుని మేము ప్రేమ నిండిన చూపులతో, సిగ్గుతో కూడిన చిరునవ్వుతో, కోరికలను తీర్చే చూపులతో సత్కరించితిమి. ఆయన మథురానగరములోని యువతులకు ప్రీతిని కలిగించుచున్నాడా?
ప్రేమ అనే కళ బాగా తెలిసిన శ్రీకృష్ణుడు సుందరమైన యువతులకు ప్రియుడు అగును. వారు తమ పలుకులతో, విలాసలతో ఆయనను సత్క రించెదరు. ఆయన వారికి వశము కాకుండా ఎట్లుండును? (వశమగును).
ఓ సజ్జనుడా! గోవిందుడు నగరమునందలి యువతుల సభామధ్యమునందు యథేచ్ఛగా విహరిస్తూ కబుర్లాడుచుండును. ఆ ప్రసంగముల మధ్యలో పల్లెటూరివారమగు మమ్ములను స్మరించునా?
అందరిచే కొనియాడబడే మనోహరములైన లీలలు గల శ్రీకృష్ణుడు బృందావనములో నుండెడివాడు. అప్పుడు తెల్ల కలువలు; తెల్ల గన్నేరు పువ్వులు, చంద్రునితో సుందరమైన అడవిలో రాససభ జరిగెడిది. మా కాలియందెల ధ్వనితో నినదించే ఆ సభలో ఆతడు ప్రియురాండ్రమగు మాతో రమించెడివాడు. ఆ రాత్రులను ఆతడు ఒకప్పుడైనా స్మరించునా?
దాశార్హవంశీయుడగు శ్రీకృష్ణుని నిమిత్తముగా మేము దుఃఖముతో తపించబడుచున్నాము. పర్జన్యాధిపతియగు ఇంద్రుడు మేఘములతో వచ్చి అడవిని ఉజ్జీవింపజేయును. అదే విధముగా ఆతడు వచ్చి తన కరచరణాదులతో మమ్ములను ఉజ్జీవింప జేయునా?
శ్రీకృష్ణుడు ఇక్కడికి ఎందుకు వచ్చును? (రాడు). ఆతడు శత్రువును వధించి రాజ్యమును పొందినాడు. మహారాజకన్యలను వివాహమాడి సుఖించును. ఆతని చుట్టూ బంధువులు ఉండెదరు.
శ్రీకృష్ణుడు మహాత్ముడు, లక్ష్మీపతి. ఆయన సిద్ధించినవాడు, మనోనిగ్రహము గలవాడు. ఆయనకు అడవిలో నివసించే మనము గాని, ఇతర స్త్రీలు గాని చేసే ఉపకారమేమున్నది?
ఆశ లేకుండుట గొప్ప సౌఖ్యమని వేశ్యయగు పింగళ కూడ చెప్పెను. మనకా విషయము తెలియును. అయిననూ, మాకు శ్రీకృష్ణునియందు అతిక్రమించ శక్యము కాని అట్టి ఆశ గలదు.
పుణ్యకీర్తియగు శ్రీకృష్ణుని ఏకాంతవార్తను విడిచి పెట్టుటకు ఎవడు ఉత్సాహపడును? (ఎవడైననూ విడిచి పెట్టడు). ఆయన కోరకున్ననూ లక్ష్మీదేవి ఆయన దేహమును ఏనాడైననూ విడిచి పెట్టదు.
ఓ ఉద్ధవప్రభూ! ఈ నదులు, పర్వతములు, అడవులలోని ప్రదేశములు, గోవులు, వేణునాదములు, బలదేవుడు తోడుగా గల శ్రీకృష్ణునిచే సేవించబడినవియే.
అయ్యో! శోభకు నిలయములైన ఆ నందగోపుని పుత్రుడగు శ్రీకృష్ణుని కాలి గురుతులచే ఈ ప్రదేశములు ఆయననే మరల మరల గుర్తుకు తెస్తున్నవి. మేమాతనిని సుతరాము మరువ లేకున్నాము.
అందమైన నడకతో, మనోరథములను పూరించే చిరునవ్వుతో, విలాసలతో కూడిన చూపులతో ఆ శ్రీకృష్ణుడు మా మనసులను దోచినాడు. మేమాయనను ఎట్లు మరువగలము? (మరువలేము).
ఓ గోవిందా! మాకు, లక్ష్మీదేవికి, గోకులమునకు రక్షకుడవు నీవే. దుఃఖములను పోగొట్టువాడా! దుఃఖసముద్రములో మునిగిపోవుచున్న గోకులమును ఉద్ధరించుము.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణుని సందేశవచనములచే గోపికల విరహతాపము దూరమ య్యేను. తరువాత వారు శ్రీకృష్ణుని స్వరూపము ఇంద్రియగోచరము కాద నియు, ఆయన ఆత్మరూపుడనియు తెలుసుకొని, ఉద్ధవుని పూజించిరి.
ఉద్ధవుడు గోపికల శోకములను పోగొడుతూ అక్కడనే కొన్ని మాసములు నివసించెను. ఆయన శ్రీకృష్ణుని లీలల గాథలను గానము చేస్తూ గోకులమును రమింప జేసెను.
ఆ ఉద్దవుడు సందుని గోకులములో ఎన్ని రోజులుండెనో, అన్ని రోజులు శ్రీకృష్ణుని ప్రసంగమును చేసెను. దానిచే, గోకులవాసులకు ఆ రోజులు క్షణములుగా గడిచిపోయెను.
ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుని శరణు జొచ్చిన భక్తుడు. ఆయన నదులను, అడవులను, పర్వతములను, లోయలను, పుష్పించిన చెట్లను చూస్తూ, గోకులవాసులకు శ్రీకృష్ణుని స్మరింపజేస్తూ విహరించెను.
ఈ పైన చెప్పినది మొదలుగా గల ప్రకారములచే గోపికల మనస్సు శ్రీకృష్ణునియందు లగ్నమై వ్యాకులపడెను. దానిని చూచిన ఉద్ధవుడు గొప్ప ప్రీతిని పొంది వారికి నమస్కరిస్తూ ఈ గీతిని గానము చేసెను.
సర్వాత్మరూపుడగు గోవిందునియందు ఈ గోపికల ప్రేమ దృఢముగా నెలకొన్నది. ఈ భూలోకములో కేవలము ఈ గోపికల జన్మ మాత్రమే సార్థకమైనది. సుసారము వలన భయపడే మేము, మహర్షులు కూడ అట్టి ప్రేమనే కోరుచున్నాము. శ్రీకృష్ణ భగవానుని గాథలయందు ప్రీతి గల వానికి పలు బ్రహ్మదేవుని జన్మలను పొందిననూ లాభమేమున్నది? (ఏమీ లేదు).
అడవులలో తిరుగుతూ శిష్టాచారము నెరుగని ఈ స్త్రీలు యెక్కడ? శ్రీకృష్ణ పరమాత్మ యందు వీరి ఇట్టి నిశ్చలమగు ప్రేమ యెక్కడ? (అసంభవమనుకున్నది సంభవమైనది), నిరంతరమగు భక్తిని చేయువాడు అజ్ఞానియే అయినా, బాగుగా వినియోగించబడిన శ్రేష్ఠమైన మందు (అమృతము) వలె, ఈశ్వరుడు వానికి స్వయముగా విస్తృతమగు శ్రేయస్సును కలిగించుననుటలో సందేహము లేదు.
రాసక్రీడయందు ఈ శ్రీకృష్ణుడు దండమువంటి తన భుజములతో గోపాంగనలు కంఠమును కౌగిలించినప్పుడు, వారి మనోరథములు పూర్ణమై అనుగ్రహము (ప్రసన్నత) ఆవిష్కృతమయ్యెడిది. ఆశ్చర్యము! అట్టి అనుగ్రహము ఆయనయందు ఏకాంతమగు ప్రేమ కలిగి వక్షఃస్థలమునందు నిత్యనివాసము చేసే లక్ష్మీదేవికి కలుగలేదు. పద్మముల సుగంధము, కాంతి గల దేవతా స్త్రీలకు ఆ అనుగ్రహము కలుగలేదు. ఇతర స్త్రీల గురించి చెప్పునదేమున్నది?
శ్రుతులు మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని పొందే మార్గమును వెదుకుచునే యుండును. గోపికలు బంధుజనమును, పెద్దల ధర్మమును కూడ విడిచి పెట్టి అట్టి ప్రేమ మార్గమును సేవించిరి. ఆహా! నేను బృందావనములో ఈ గోపికల పాదధూళిని సేవించే పొదలు, తీగలు, మొక్కలలో ఏదో ఒకటి అగుదును గాక!
శ్రీకృష్ణ భగవానుని పద్మమువంటి పాదమును లక్ష్మీదేవి, పొందబడిన మనోరథములు గల బ్రహ్మదేవుడు ఇంద్రుడు మొదలగువారు పూజించెదరు. మరియు యోగిరాజులు కూడ హృదయమునందు ఆ పాదమునే ధ్యానించెదరు. గోపికలు రాససభయందు ఆ పాదమును వక్షః లమునందుంచుకొని కౌగిలించి తాపమును విడనాడిరి.
శ్రీహరి లీలలతో కలిపి గోపికల చరితము గానము చేయబడును. ఆ గానముచే ముల్లోకములు పవిత్రమగును. అట్టి నందగోకులమునందలి గోపికల పాదధూళికి నేను మరల మరల నమస్కరించుచున్నాను.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- తరువాత దాశార్హవంశీయుడగు ఉద్ధవుడు గోపికలు, యశోద, నందుడు, గోపాలకుల వద్ద సెలవు తీసుకొని ప్రయాణమునకు సిద్ధమై రథమునెక్కెను.
నందుడు, సుదాముడు మొదలగువారు చేతులలో అనేకములగు బహుమతులను పట్టుకొని బయలుదేరుచున్న ఉద్ధవుని వద్దకు వచ్చి ఇట్లు పలికిరి. ప్రేమ వలన వారి కన్నులలో నీరు ఉబుకుచుండెను.
మా మనోవృత్తులు శ్రీకృష్ణుని పద్మమువంటి పాదమునందు నిలిచియుండునవి, వాగింద్రియము ఆయన మాటలను పలుకునది, దేహము ఆయనకు నమస్కరించుట, ప్రదక్షిణము చేయుట మొదలగువాటిని చేయునది అగుగాక!
కర్మల కారణముగా ఈశ్వర సంకల్పముచే మేము ఏవో జన్మలను పొంది పుణ్యకార్యములను, దానములను చేయుదుము. పుణ్యము యొక్క ప్రభావముచే మాకు సర్వేశ్వరుడగు శ్రీకృష్ణునియందు ప్రేమ కలుగుగాక!
ఓ పరీక్షిన్మహారాజా! గోపాలకులు శ్రీకృష్ణునియందలి భక్తిచే ఉద్ధవుని ఈ విధముగా సత్కరించిరి. ఆయన శ్రీకృష్ణునిచే రక్షించబడే మథురా నగరమునకు తిరిగి వచ్చెను.
ఉద్ధవుడు శ్రీకృష్ణునకు నమస్కరించి గోకులవాసుల భక్తి యొక్క ఆధిక్యమును గురించి చెప్పెను. వసుదేవుడు, బలరాముడు, ఉగ్రసేన మహారాజులకు ఉద్ధవుడు తాను తెచ్చిన బహుమతులనిచ్చెను.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో
ఉద్ధవుడు గోపికలతో మాటలాడుటను, భ్రమరగీతమును వర్ణించే
నలుబది ఏడవ అధ్యాయము ముగిసినది (47).
