శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

7 - శకటాసుర సంహారము - తృణావర్తుని ఉద్ధారము

పరీక్షిన్మహారాజు ఇట్లు పలి కెను -- ఓ ప్రభూ! జగన్నియామకుడగు శ్రీహరి భగవానుడు ఏయే అవతారములతో చెవులకు ఇంపైన లీలలను చేయునో, అవి మాకు మనోహరములే.

శ్రీహరి లీలలను శ్రవణము చేసే వ్యక్తికి మనస్సునందలి గ్లాని (అందువలననే) మనస్సు శీఘ్రముగా శుద్ధమగును. ఇంతేగాక, శ్రీహరియందు భక్తి, శ్రీహరి భక్తులతో మైత్రి కలుగును. నేను యోగ్యుడనని తమరు భావించే పక్షములో, మనోహరమైన అట్టి శ్రీహరి గాథనే చెప్పుడు.

శ్రీకృష్ణుడు మానవునిగా జన్మించి మానవుల జీవన శైలినే అనుకరిస్తూ చేసిన మరియొక ఆశ్చర్యకరమగు బాలచేష్ఠను కూడ చెప్పడు.

శ్రీ         శుక మహర్షి ఇట్లు పలి కెను --- బాలకృష్ణుడు పరుండి తిరగబడే సామర్థ్యమును పొందిన రోజు జన్మనక్షత్రము (రోహిణి) కూడ కలిసి వచ్చెను. ఆనాడు అభిషేకించే ఉత్సవమును తల పెట్టగా, యువతులు సమావేశమైరి. వారి మధ్యలో యశోద పుత్రునకు అభిషేకమును చేయగా, వేదవేత్తలు మంత్రములను పఠించిరి. వాటికి వాద్య ఘోష, పాటలు తోడయ్యెను.

బాలకృష్ణుని స్నానము, అలంకారము మొదలైనవి పూర్తి అయ్యెను. వేదవేత్తలకు భుజించదగిన ఆహారమును, వస్త్రములను, మాలలను, నచ్చిన ఆవులను ఇచ్చి సత్కరించగా, వారు రక్షాబంధనము మొదలైనవి పూర్తి చేసిరి. బాలకృష్ణుని కళ్లలో నిద్ర వ్య క్తము కాజోచ్చెను. అప్పుడు నందుని భార్యయగు యశోద మెల్లగా పిల్లవానిని పరుండబెట్టెను.

పిల్లవాడు తిరగబడ్డప్పుడు చేసే ఉత్సవమునందలి ఉత్సాహముతో మనస్సు నిండిపోగా, పెద్ద మనస్సు గల ఆ యశోద విచ్చేసిన గోకులవాసులకు సత్కారములను చేయుచుండెను. ఆమెకు తన పుత్రుని ఏడ్పు సుతరాము వినబడనే లేదు. పాలను కోరి ఏడ్చుచున్న బాలకృష్ణుడు రెండు కాళ్లతో పైకీ తన్నెను.

బండి క్రింద కట్టిన ఊయలలో పరున్న బాలకృష్ణుడు చిగుళ్లవలే మెత్త నైన బుల్లి కాళ్లతో తన్నగా బండి తిరగబడెను. దానియందు కంచు-ఇత్తడి పాత్రలలోని అనేకములైన ద్రవాహారములు నేలపాలయ్యెను. చక్రములు, ఇరుసు తల్లక్రిందులై కూబరము (నోగ) విరిగెను.

పిల్లవాడు తిరగబడ్డప్పుడు చేసే ఉత్సవమునకు విచ్చేసిన గోకుల స్త్రీలతో కూడిన యశోద, నందుడు మొదలగువారు కూడ ఆ అద్భుతమును చూచి కంగారు పడిరి. బండి తనంత తాను ఎల్లా తిరగబడింది? (అని వారు ఆశ్చర్యపడిరి).

గోపాలకులకు, గోపికలకు బండి తిరగబడిన కారణంకనూ నిర్ధారణ కాలేదు. వారితో పిల్లలు ఇట్లు చెప్పిరి -- ఈ బాలకృష్ణుడు ఏడుస్తూ కాలితో తన్ని దీనిని తల్లక్రిందులు చేసినాడు. దీనిలో సందేహము లేదు.

పిల్లలు అల్లాగే చెప్తారు, అది సంభవమా? అంటూ గోపాలకులు వారి మాటలను నమ్మలేదు. అది యుక్తమే. ఆ బాలకృష్ణుని ఊహకందని శక్తి గురించి వారికి తెలియదు.

పిల్లవానికి గాలి సోకినదని శంకించిన యశోద ఏడుస్తున్న బాలకృష్ణుని తీసుకొని పాలను తావించెను. వేదవేత్తలు (గ్రహములను దూరము చేసే) సూక్తములను పఠించి పిల్లవానికి మంగళవాచనమును చేసిరి.

గోపాలకులు బండికి భాగములనమర్చి ఇదివరలో వలెనే పెరుగు మొదలైన ఉపహారములనుంచి సిద్ధము చేసిరి. వేదవేత్తలు హోమము చేసి పెరుగు, అక్షతలు, దర్భలు, జలములతో బండిని (ఈశ్వరుని) పూజించిరి.

అసూయ (ఇతరుల గుణములను దోషములుగా చూచుట), అసత్యము, డాంబీకము, ఈర్ష్య (ఇతరుల ఉన్నతిని ఓర్వలేకుండుట), హింస, గర్వము లేని సత్యస్వభావులగు వేదవేత్తలు చేసే ఆశీర్వచనములు నిష్పలములు కావు.

ఈ విధముగా నిశ్చయించుకొని నందగోపుడు బాలకృష్ణుని తీసుకొని బ్రాహ్మణోత్తములచే అభిషేకము చేయించెను. పవిత్రమగు ఓషధులు కలిపిన ఆ ఆభిషేకజలములు సామవేద-ఋగ్వేద-యజుర్వేదమంత్రములచే అభిమంత్రించబడినవి. తరువాత పుణ్యాహవాచనమును చేయించి, హోమమును కూడ చేసి, బ్రాహ్మణులకు గొప్ప రుచి గల ఆహారమును సమర్పించెను. 

ఆయన పుత్రుని క్షేమము కొరకై అన్ని మంచి లక్షణములతో గూడిన ఆవులను వస్త్రములు, పుష్పమాలలు, బంగరు మాలతో సహా ఇచ్చెను. ఆ వేదవేత్తలు ఆశీర్వచనములను పలికిరి.

మంత్రవిదులైన వేదవేత్తలు ఇంద్రియనిగ్రహమును కలిగియుందురు. వారు చేసిన ఆశీస్సులు అటులనే ఫలించును. అవి ఎన్నటికీ నిష్ఫలములు కావనేది తెలిసిన విషయమే.

ఒకనాడు బాలకృష్ణుడు తల్లి యశోదాదేవి ఒడిలోనికి చేరెను. ఆమె ఆ పుత్రుని లాలిస్తూండగా, హఠాత్తుగా ఆమెకు పిల్లవాడు పర్వతశిఖరము వలె బరువుగా దోచేను. ఆమె ఆ బరువును మోయలేకపోయెను.

గోపికయగు యశోద ఆశ్చర్యపడి బరువుచే పీడను పొంది ఆ బాలకృష్ణుని నేల పై ఉంచెను. ఆమె పురుషోత్తముని ధ్యానించి సంసారమునకు చెందిన కర్మలలో నిమగ్నురాలయ్యెను.

కంసుడు తన సేవకుడైన తృణావర్తుడనే రాక్షసుని పంపెను. ఆతడు పెద్ద సుడిగాలి రూపముతో కూర్చుని ఉన్న బాలకృష్ణుని ఎత్తుకు పోయెను.

ఆ సుడిగాలి గోకులమునంతనూ కప్పివేసెను. దుమ్ముకణములతో జనుల కన్నులు మూసుకుపోయెను. మిక్కిలి భయమును గొల్పే శబ్దముతో దిక్కులు, విదిక్కులు ప్రతిధ్వనించెను.

గోకులము ఇంచుమించు గంట సేపు దుమ్ముతో చీకటితో కప్పివేయబడెను. యశోద ఎక్కడనైతే కూర్చుండబెట్టెనో అక్కడ పుత్రుడు కనబడలేదు.

తృణావర్తుడు విసిరిన ఇసుక రేణువులచే ఉద్విగ్ను డై వ్యామోహితుడైన ఏ ఒక్క డైననూ తనను గాని, ఇతరుని గానీ చూడలేకపోయెను.

ఈ విధముగా తీక్ష్ణమైన సుడిగాలి వర్షించిన దుమ్ములో పుత్రుని జాడ తల్లి యశోదకు కానరాలేదు. నిస్సహాయురాలగు ఆమె నిరంతరముగా కృష్ణునే స్మరిస్తూ నేలపై పడి, లేగదూడ మరణించిన ఆవు వలె, అతిదీనముగా శోకించెను.

తరువాత గాలి. తగ్గి దుమ్ము వర్షముయొక్క వేగము శాంతించెను. గోపికలు ఆ నందుని ఇంటియందు ఏడ్పును వినిరి. నందపుత్రుడగు బాలకృష్ణుని కానరాక వారి మనస్సులు మిక్కుటమగు తాపమును పొందెను. వారు కన్నీళ్లు నిండిన ముఖములు గలవారై ఏడ్చిరి.

సుడిగాలి రూపమును దాల్చి బాలకృష్ణుని ఎత్తుకొని పోయిన. తృణావర్తుడు ఆకాశమును చేరెను. కాని, మోయుచున్న బరువు పెద్దదగుట వలన ఆతని వేగము తగ్గి ముందుకు వెళ్లే శక్తిని కోల్పోయేను.

ఆ విడ్డూరపు పిల్లవాడు తృణావర్తుని కంటే ఎక్కువ బరువు ఉండెను. ఆ పిల్లవాడు వానికి బండరాయి వలె అనిపించేను. బాలకృష్ణుడు వానిని మెడ పట్టుకొనగా, వాడు విడిపించుకొనలేకపోయెను.

మెడయందు పట్టుకొనుటచే ఆ రాక్షసుని చేష్టలు ఉడిగి కళ్లు పైకి ఉబి కెను. వాని నోటినుండి ధ్వని వచ్చుట లేదు. వాడు ప్రాణములు పోయి పిల్లవానితో సహా గోకులములో క్రింద బడెను.

రుద్రుని బాణముచే కొట్టబడిన త్రిపురము వలె ఆ రాక్షసుడు ఆకసమునుండి రాతిపై పడెను. వాని అవయవములన్నియు నుగ్గు నుగ్గా భయమును గొల్పెను. ఏడ్చుచున్న గోపికలు గుమిగూడి వానిని చూచిరి.

ఆ రాక్షసుని వక్షఃస్థలము పై వ్రేలాడుతున్న బాలకృష్ణుని చకితులైన గోపికలు తీసుకొని తల్లి యశోదకు అప్పజెప్పిరి. నరమాంసభక్షకుడగు రాక్షసుడు ఆకాశమార్గము గుండా ఎత్తుకొనిపోగా బాలకృష్ణుడు క్షేమముగనే ఉండెను. మృత్యువు నోటినుండి విముక్తు డైన ఆ బాలకృష్ణుని తిరిగి పొంది గోపికలు, నందుడు మొదలుగా గల గోపాలకులు కూడ అతిశయించిన ఆనందమును పొందిరి.

ఆశ్చర్యము! ఆహా! గొప్ప అద్బుతము! రాక్షసుని చేతిలో మృత్యువు వాత పడిన ఈ బుడతడు మరల ఎదురుగా వచ్చినాడు. హింసించే ఆ దుష్టుడు తన పాపముచేతనే మృత్యువు వాత పడినాడు. సత్పురుషునకు వాని సమదృష్టియే భయమునుండి విముక్తిని కలిగించును.

మనము ఏమి తపస్సును చేసితిమి? లేక, ఇంద్రియగోచరము కాని శ్రీహరిని ఆరాధించితిమా? నూతులు త్రవ్వించుట మొదలగు సమాజహితకార్యములను చేసితిమా? యజ్ఞయాగాదులను చేసితిమా? దానములను చేసితిమా? లేక ప్రాణులపై దయను . చూపితిమా? ఎందుకంటే, మరణించిన పిల్లవాడు మరల తన బంధువులను హర్షింపజేస్తూ మన ముందున్నాడు. ఇది పరమమంగళము.

నందగోపుడు మహావనములో పలు విధములైన అద్బుతములను చూచి చకితుడై, మరల వసుదేవుని మాటను మెచ్చుకొనెను.

ఒకనాడు తేజస్వినియగు యశోదాదేవి బాలకృష్ణుని తీసుకొని ఒడిలో కూర్చుండబెట్టుకొనెను. ఆమె హృదయము ప్రేమచే ముంచెత్తబడెను. ఆమె పాలను స్రవించుచున్న స్తనమును వానిచే త్రావించెను.

ఓ పరీక్షిన్మహారాజా! బాలకృష్ణుడు పాలు త్రాగుట ఇంచుమించు పూర్తి అయ్యెను. తల్లి యశోద ప్రకాశించే చిరునవ్వు గల వాని ముఖమును ముద్దాడెను. ఆవులించిన కృష్ణుని నోటిలో ఆమె ఈ జగత్తును చూచెను.

ఆకాశమును, ద్యులోకమును, భూలోకమును, నక్షత్రముల గుంపును, దిక్కులను, సూర్యుని, చంద్రుని, అగ్నిని, వాయువును, సముద్రములను, ద్వీపములను, పర్వతములను, వాటినుండి పుట్టే నదులను, అడవులను, కదిలే మరియు కదలని ప్రాణులను కూడ ఆమె చూచెను.

ఓ పరీక్షిన్మహారాజా! లేడి కూన కన్నులవంటి కన్నులు గల ఆ యశోదకు అకస్మాత్తుగా జగత్తును చూడగానే వణుకు పుట్టెను. ఆమె మిక్కిలి ఆశ్చర్యమును పొంది రెండు కళ్లను గట్టిగా మూసుకొని యుండెను.

శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము  పూర్వార్ధములో శకటాసుర సంహారమును, తృణావర్తుని ఉద్ధారమును వర్ణించే ఏడవ అధ్యాయము ముగిసినది (7).