శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము
48 - శ్రీకృష్ణుడు ఆక్రూరుని ఇంటికి వెళ్లుట
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఉద్ధవుడు చెప్పిన విషయములను శ్రీకృష్ణ భగవానుడు తెలుసుకొనెను. సకల ప్రాణులలో ఆత్మరూసముగానుండే సర్వజ్ఞుడు. ఆయన ప్రేమచే పీడించబడిన సైరంధ్రి (త్రివక్ర) కి ప్రీతిని కలిగించగోరి ఆమె ఇంటికి వెళ్లెను.
ఆ ఇల్లు మిక్కిలి విలువైన సామగ్రులతో, ప్రేమను వర్ధిల్లజేసే ఉపాయములతో సమృద్ధమై యుండెను. ముత్యాల హారములు, జెండాలు, చాందినీలు, శయ్యలు, ఆసనములు, పరిమళ ధూపములు, దీపములు, పుష్పమాలలు, గంధములతో ఆ గృహము సంపన్న మై యుండెను.
ఇంటికి వచ్చుచున్న ఆ శ్రీకృష్ణ భగవానుని చూచి ఆ సైరంధ్రా కంగారు పడెను. ఆమె వెంటనే ఆసనమునుండి లేచి నిలబడి చెలులతో బాటుగా తగిన విధముగా ఆయనకు ఎదురేగి, మంచి ఆసనము పాద్యము మొదలగువాటితో సత్కరించెను.
ఆమె అదే విధముగా ఉద్ధవుని కూడ సత్కరించెను. కాని, ఆయన ఆమె చూపించిన ఆసనమును చేతితో స్పృశించి నేలపై కూర్చుండెను, శ్రీకృష్ణుడు జనుల చేష్టలను అనుసరించును. ఆయన వెంటనే మిక్కిలి విలువైన శయ్యనధిష్ఠించెను.
ఆమె స్నానము చేసి చందనాదులనలదుకొని కోకను సొమ్ములను పెట్టుకొని పుష్పమాలలనలంకరించుకొని తాంబూలము వేసుకొని అమృతమువంటి పానీయమును మొదలగు వాటితో తనను అందముగా తీర్చి దిద్దుకొనెను. ఆమె సిగ్గుతో విలాసంగా నవ్వుతూ కనుబొమల విరుపులతో ఓరగా చూస్తూ శ్రీకృష్ణ భగవానుని దగ్గరకు వచ్చెను.
కొత్త కలయిక వలని సిగ్గుతో సందేహిస్తున్న ఆ సుందరిని ఆయన దగ్గరకు పిలిచెను. కంకణములనలంకరించిన ఆమె రెండు చేతులను పట్టుకొని ఆయన ఆమెను శయ్య పై కూర్చుండబెట్టెను. ఆయనకు గంధమునర్పించిన పిసరంత పుణ్యము గల ఆమెతో ఆయన రమించెను.
ఆమె శ్రీకృష్ణ భగవానుని పాదమునాఘ్రాణించి, వక్షఃస్థలము పై ఆన్చి, రెండు కళ్లతో చూసి హృదయములోని తాపమును తుడిచివేసెను. . ఆనందమూర్తియగు శ్రీకృష్ణుడు ఆమె వక్షఃస్థలము పైనుండెను. ఆ ప్రియుని ఆమె రెండు చేతులతో కౌగిలించి చిరకాలతాపమును విడిచెను.
అయ్యో! ఏమి దురదృష్టము! మోక్ష మునిచ్చే ప్రభుడగు ఆ శ్రీకృష్ణ భగవానుని పొందుట శక్యము కాదు. కాని, ఆ సైరంధ్రి ఒంటికి రాసుకొనే గంధమును అర్పించుటచే ఆయనను పొంది కూడ, దీనిని (చెప్పబడబోవు దానిని) కోరుకొనెను.
పద్మములవంటి కన్నులు గల ఓ ప్రియతమా! ఇచట ఉండుము. కొన్ని దినములు నాలో నిరంతరముగా రమించుము. నీ పొందును విడిచి పెట్టే శక్తి నాకు లేదు, అన్ని ఆమె పలికెను.
సర్వేశ్వరుడగు శ్రీకృష్ణుడు భక్తులను సమ్మానించును. ఆయన ఆమెకు కోరిన వరము నిచ్చుట ద్వారా సమ్మానించి, ఉద్ధవునితో బాటు సంపత్సమృద్ధమైన తన గృహమునకు వచ్చెను.
ఇంద్రుడు మొదలైన లోకపాలకులందరికీ ఈశ్వరుడగు శ్రీకృష్ణ భగవానుని ప్రసన్నుని చేసుకొనుట తేలిక కాదు. ఆయనను బాగుగా ప్రసన్నుని చేసుకొని ఎవడైతే మనస్సునకు ప్రియమైన భోగమును కోరునో, అట్టివాడు తెలివితేటలు గలవాడు ఎందుకంటే, మనస్సునకు ప్రియమైన సర్వము మిథ్యయే.
శ్రీకృష్ణ ప్రభుడు అక్రూరునకు ప్రీతిని కలిగించి ఆయనచే ఒక పనిని చేయించ గోరెను. అందుచే ఆయన బలరామ - ఉద్ధవులతో కలిసి అక్రూరుని ఇంటికి వెళ్లెను.
వారు అక్రూరునకు బంధువులు మాత్రమే గాక మానవులలోని గొప్పవారిలో గొప్పవారు. వారిని దూరమునుండి చూచి అక్రూరుడు మహానందముతో ఎదురేగి కౌగిలించి అభినందించెను.
ఆ అక్రూరుడు బలరామ శ్రీకృష్ణులకు నమస్కరించెను. వారు కూడ ఆయనకు నమస్కరించిరి. వారందరు ఆసనమును స్వీకరించిన పిదప, ఆయన వారిని యథావిధిగా పూజించెను.
ఓ పరీక్షిన్మహారాజా! అక్రూరుడు వారిద్దరి పాదములను కడిగిన నీటిని తలపై అంతటా చల్లుకొనెను. ఆయన వారిని అర్ఘ్యము, ప్రకాశించే వస్త్రములు, గంధము, పుష్పమాలలు, విలువైన అలంకారములు మొదలగువాటితో పూజించి తల వంచి నమస్కరించెను. ఆయన వారి పాదములను ఒడిలో ఉంచుకొని సంవాహనము చేసెను. తరువాత ఆయన వినయముతో వినమ్రుడై బలరామకృష్ణులతో ఇట్లు పలికెను.
పాపియగు కంసుడు అనుచరులతో సహా వధించబడెను. మీరిద్దరు ఈ మీ కులమును అంతము కానరాని ఆపదనుండి గట్టెక్కించి వర్ధిల్ల జేసిరి. ఇది మంగళము.
బలరాముడు జగత్తునకు ఉపాదానమగు మాయాశక్తి కాగా, శ్రీకృష్ణుడు నిమిత్తకారణమగు పరబ్రహ్మ. ఈ తీరున మీరిద్దరు జగత్తు రూపముగా ప్రకటమైరి. మీరిద్దరు లేకుండా కారణము గాని, కార్యము గాని ఏదీ లేదు.
ఓ పరమాత్మా! నీవీ జగత్తును సృష్టించి తరువాత నీ శక్తులతో దానియందు ప్రవేశించినావు. నీవే అనేకవిధములుగా వినబడేది (నామము), కనబడేది (రూపము) గా తెలియబడుచున్నావు.
కదిలే మరియు కదలని ప్రాణుల అనేకరూపములైన దేహములయందు పృథివి, జలములు మొదలగు పంచభూతములే ప్రకాశించుచున్నవి. అదే విధముగా, స్వతంత్రుడవగు నీవే నీనుండి ఆవిర్భవించిన సకలచరాచరములయందు అనేకరూపములుగా ప్రకాశించుచున్నావు. సర్వమునకు రెండవది లేని నీవే ఆత్మవు.
నీవు నీ శక్తియగు రజోగుణముచే జగత్తును సృష్టించి, నీ శక్తియగు సత్త్వగుణముచే పాలించి, తరువాత తమోగుణముచే ఉపసంహరించెదవు. కాని, గుణములు గాని క్రియలు గాని నిన్ను బంధించవు. చైతన్యస్వరూపుడవగు నీకు బంధ హేతువగు అజ్ఞానమెక్కడిది? (లేదు).
ఆత్మకు దేహము - మనస్సు మొదలగు ఉపాధులు ఉన్నవి అని గాని, లేవు అని గాని నిరూపించుటకు శక్యము కానివి (మిథ్య). కావున, ఆత్మస్వ రూపమునందు పుట్టుక గాని, భేదము గాని లేవు. కావున, నీకు బంధము గాని, మోక్షము గాని లేనే లేవు. అవివేకముచే మేము మా అభిప్రాయ ములకు తగ్గట్లుగా నీయందు బంధమోక్షములను కల్పిస్తూ ఉంటాము.
నీవు జగత్తు యొక్క హితము కొరకు సనాతనమైన వేదమార్గమును ప్రకాశింప జేసితివి. ఎప్పుడెప్పుడైతే ఆ మార్గము నరకహేతువులైన వేదవిరుద్ధమార్గములచే పీడించబడునో, అప్పుడప్పుడు నీవు సత్త్వగుణ ప్రధానమగు మూర్తి వై అవతరించెదవు.
ఓ ప్రభూ! అట్టి (సత్త్వగుణ ప్రధానుడవగు) నీవు భూభారమును పోగొట్టుటకై ఈ భూలోకములో వసుదేవుని ఇంట్లో నీ అంశయగు బలరామునితో గూడి అవతరించితివి. రాక్షసుల అంశలైన రాజుల వందల అక్షౌహిణీల సైన్యమును సంహరించి ఈ వంశము యొక్క కీర్తిని నీవు విస్తరింప జేసెదవు.
ఓ ఈశ్వరా! నీ స్వరూపము ఇంద్రియగోచరము కాదు. సకలదేవతలు, పితృదేవతలు, ప్రాణులు, రాజులు నీ మూర్తులే. నీ పాదములను కడిగిన నీరు ముల్లోకములను పవిత్రము చేయును. జగత్తునకు తండ్రివగు అట్టి నీవు మా ఇళ్లలో ఈ నాడు పాదము మోపీనావు. మా ఇళ్లు గొప్ప భాగ్యము గలవి సుమా!
నీకు భక్తుల యందు ప్రీతి. నీవి యథార్థవచనములు. హితకారివగు నీకు జనుల ధర్మాధర్మములు తెలియును. అట్టి నిన్ను కాకుండా వివేకి మరియొకనిని ఎవనిని శరణు జొచ్చును? (ఎవనినైననూ శరణు వేడడు). శుద్ధహృదయుడగు భక్తునకు నీవు సకలకామనలననుగ్రహించుటయే గాక, నిన్ను కూడ సమర్పించెదవు. కాని, నీకు వృద్ధిహాసములు లేవు.
దుష్టజనశిక్షకుడవగు ఓ దేవా! నీ స్వరూపమును తెలియుట యోగిరాజులగు సనకాదులకు, దేవనాయకులగు ఇంద్రాదులకు కూడ చుర్ఘటము. అట్టి నీవు మా నీవు మా ఈ గృహములో ప్రత్యక్ష మైనావు. ఇది మంగళము. నీ మాయ వలన మాకు సంతానము, భార్య, ధనము, బంధువులు, ఇల్లు, దేహము, ఇంద్రియభోగములయందు మోహము కలిగి మమ్ములను బంధించుచున్నది. ఈ అజ్ఞానబంధమును నీవు శీఘ్రముగా తొలగించుము.
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా భక్తుడైన అక్రూరుడు పాపములను పోగొట్టే శ్రీకృష్ణ భగవానుని పూజించి గొప్పగా స్తుతించెను. అప్పుడాయన తన పలుకులతో మోహపెట్టుచున్నాడా యన్నట్లు చిరునవ్వుతో అక్రూరుని ఉద్దేశించి ఇట్లు పలికెను.
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- నీవే మాకు గురుడవు, పినతండ్రివి. సర్వకాలములలో కొనియాడదగిన హితకారివి నీవే. నీవే మమ్ములను రక్షించి పోషించువాడవు, పుత్రులమైన మాపై నీవు దయను చూపవలెను.
శ్రేయస్సును మానవులు నీవంటి మహోత్కృష్టులైన మహానుభావులను నిత్యము సేవించదగును. దేవతలు హవిర్భాగములను కోరి భక్తులకు కామనలనిచ్చెదరు. కాని, సత్పురుషులయందు అట్టి స్వార్థము కానరాదు.
తీర్థములనగా కేవలము జలమయములు మాత్రమే కాదు. సత్పురుషులు కూడ తీర్థములే. దేవతలనగా కేవలము మట్టితో, రాళ్లతో చేసినవారు మాత్రమే కాదు, సత్పురుషులు కూడ దేవతలే. తీర్థములు, దేవతలు సేవించిన తరువాత పావనము చేస్తే, సత్పురుషుల దర్శనమాత్రముచే మానవుడు పునీతుడగును.
తమరు నిశ్చయముగా మా శ్రేయస్కాములలో అగ్రగణ్యులు. కాబట్టి, తమరు పాండవులకు హితమును చేయుటకు, వారి క్షేమమును విచారించుటకై హస్తినాపురమునకు ప్రయాణము కట్టుడు.
తండ్రియగు పాండురాజు మరణించిన మిక్కిలి దుఃఖితులైయున్న ఆయన పిల్లలను వారి తల్లియగు కుంతిని ధృతరాష్ట్ర మహారాజు తన నగరము హస్తినాపురమునకు తీసుకువచ్చినాడనియు, ఇప్పుడు వారు అక్కడే నివసించుచున్నారనియు విని యున్నాము.
అంబిక పుత్రుడగు ధృతరాష్ట్రుడు దీనమైన మనస్సు గలవాడు. ఈయన గ్రుడ్డివాడు, పైగా దుష్టులగు పుత్రులకు వశుడైనాడు. ఈయన పాండవులను తన పుత్రులతో సమముగా చూచుట లేదు. ఇది యథార్థము.
తమరు వెళ్లి ఆ ధృతరాష్ట్రుని ప్రవృత్తిని, పాండవుల బాగోగులను అరయును. ఆతని ప్రవృత్తి బాగున్నదా? లేదా? పాండవులు బాగున్నారా? లేదా? అనే విషయము తెలిసిన పిదప, ప్రియబంధువులగు పాండవులకు సుఖము కలిగే ఉపాయమును చేసెదము.
జగత్తును శాసించువాడు, పాపములను పోగొట్టువాడు అగు శ్రీకృష్ణ భగవానుడు అక్రూరుని ఈ విధముగా ఆదేశించెను. తరువాత ఆయన బలరాముడు, ఉద్ధవుడు తోడు రాగా తన ప్రాసాదమునకు వెళ్లెను.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో
శ్రీకృష్ణుడు అక్రూరుని ఇంటికి వెళ్లుటను వర్ణించే
నలుబది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (48).
