శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

36 - వృషభాసురుని ఉద్ధారము - కంసుడు అక్రూరుని గోకులమునకు పంపుట

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను  ---  శ్రీకృష్ణుడు గోకులములో ప్రవేశించిన
తరువాత అప్పుడు గోకులమునకు అరిష్టుడనే రాక్షసుడు వచ్చెను. ఆతడు
పెద్ద మూపురముతో కూడిన దేహము గల ఎద్దు రూపములో నుండెను. ఆ
ఎద్దు డెక్కలతో భూమిని పగులగొడుతూంటే భూమి కంపించెను.

ఆ రాక్షసుడు కర్కశముగా రంకెలు వేస్తూ, కాలితో నేలను రాసి
దుమ్ము రేగగొడుతూ, తోకను పైకెత్తి కొమ్ము కొనతో మట్టి పెళ్లలను పైకి
ఎతి విసిరెను.

ఓ పరీక్షిన్మహారాజా! నిశ్చలమగు కన్నులు గల ఆ ఎద్దు కొంచెము
కొంచెము పేడను వేస్తూ మూత్రమును పోయుచుండెను. అది వేసే
భయంకరమగు రంకెలకు ఆవుల కే గాక, మానవస్త్రీలకు కూడ గర్భములు
ప్రసవసమయము రాకుండానే స్రవించును, లేదా పడిపోవును. వాని
మూపురమునందు పర్వతమనే భ్రాంతిచే మేఘములు ఆగుచున్నవి.

ఓ పరీక్షిన్మహారాజా! వాడి కొమ్ములు గల ఆ ఎద్దును చూచి గోపికలు
మాత్రమే గాక గోపాలకులు కూడ భయపడిరి. పశువులు భయపడి
గోకులమును విడిచి పెట్టి పరుగులు తీసినవి.

వారందరు ఓ శ్రీకృష్ణా! ఓ శ్రీకృష్ణా! అంటూ గోవిందుని శరణు
జొచ్చిరి. శ్రీకృష్ణ భగవానుడు కూడ గోకులము భయముతో పరుగులు
తీయుచుండుటను గాంచి, భయపడకుడు అని వారికి ధైర్యమును
చెప్పెను. అప్పుడాయన ఆ వృషభాసురుని సవాలు చేసి తన వద్దకు
పిలుస్తూ ఇట్లు పలికెను ఓరీ జడుడా! నీవు పరమదుష్టుడవు.
గోపాలకులను, పశువులను భయ పెట్టి ప్రయోజనమేమున్నది?

నీవంటి దుర్బుద్ధులగు దుష్టులకు బలము వలన కలిగే గర్వమును
నేను అడంచెదను, అని పలికి శ్రీకృష్ణ భగవానుడు జబ్బ చరచి చప్పట్లను
కొట్టి ఆ అరిష్టాసురునకు కోపమును కలిగించెను.

శ్రీకృష్ణ భగవానుడు పాము పడగవంటి తన భుజమును ఒక మిత్రుని భుజముపై వేసి నిలబడెను. ఈ విధముగా శ్రీకృష్ణుడు కోపమును కలిగించగా, అరిష్టాసురుడు చాల కోపించెను. ఆతడు కాలి గిట్టతో నేలను తవ్వుతూ, తోకను పైకెత్తి దానితో మేఘములను గిర గిర త్రిప్పెను. వాడు శ్రీకృష్ణుని మీదకు ఉరికెను.

నిశ్చలమైన రక్తమువంటి కన్నులు గల ఆ రాక్షసుడు తన కొమ్ముల కొనలను ముందుకు ఉంచెను. వాడు శ్రీకృష్ణ భగవానుని అడ్డముగా చూస్తూ, ఇంద్రుడు విడిచి పెట్టిన వజ్రము వలె, వెంటనే మీదకు ఉరికెను.

ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ అరిష్టాసురుని కొమ్ములను రెండింటినీ పట్టుకొని, ఏనుగు తన ప్రతిస్పర్ధియగు ఏనుగును వలె, వెనుకకు పదునెనిమిది అడుగుల దూరము గట్టిగా త్రోసి పడగొట్టెను.

శ్రీకృష్ణ భగవానుడు క్రింద పడగొట్టగా ఆ రాక్షసుడు మరల వేగముగా పైకి లేచెను. వాడు కోపావిష్టుడై నిట్టూర్పులను విడుస్తూ మీదకు వచ్చెను. వాని అవయవములన్నియు చెమటతో తడిసెను. తమాపతంతం స నిగృహ్య శృంగయోః పదా సమాక్రమ్య నిపాత్య భూతలే!

మీదకు ఉరుకుచున్న ఆ రాక్షసుని శ్రీకృష్ణుడు రెండు కొమ్ములయందు గట్టిగా పట్టుకొనెను. వానిని ఆయన నేలపై పడగొట్టి కాలితో గట్టిగా తొక్కి పెట్టెను. తడి బట్టను పిండినట్లుగా ఆయన వానిని పిండి వాని కొమ్మును ఊడబెరకి దానితో వానిని పొడువగా, వాడు నేల గూలెను. మీదకు ఉరుకుచున్న ఆ రాక్షసుని శ్రీ కృష్టుడు రెండు కొమ్ములయందు గట్టిగా పట్టుకొనెను. వానిని ఆయను నేలపై పడకొట్టి కాలితో గట్టిగా తొక్కిపెట్టెను. తడి బట్టను పిండినట్లుగా ఆయన వానిని పిండి వాని కొమ్మును ఊడబెరకి దానితో వానిని పొదువగా, వాడు నేల గూలెను.

ఆ రాక్షసుడు రక్తమును గ్రక్కుతూ మూత్రమును పేడను అధికముగా విడిచి పెడ్తూ కాళ్లను కూడ కొట్టుకొనుచుండెను. వాని చూపులో నిలకడ లేకుండెను. వాడు కష్టపడుతూ మృత్యుదేవత ఒడిని చేరెను. తరువాత దేవతలు పూలవానలను కురిపించి శ్రీకృష్ణ భగవానుని స్తుతించిరి.

శ్రీకృష్ణుడీ విధముగా పెద్ద మూపురము గల వృషభాసురుని సంహరించెను, గోపాలకులు ఆయనను ప్రశంసించిరి. గోపికలకు కన్నుల పండువయగు గోవిందుడు బలరామునితో గోకులమును ప్రవేశించెను.

ఆశ్చర్యకరమగు లీలలను చేసే శ్రీకృష్ణుడు అరిష్టాసురుని వధించెను. అప్పుడు దేవర్షియగు నారద భగవానుడు కంసునితో ఈ క్రింది విధముగా చెప్పేను. నారదుడు తాను దేవుని దర్శించుటయే గాక, భక్తులకు కూడ దేవుని దర్శింపజేయును.

యశోదకు పుట్టినది ఆడపిల్లయే గాని కృష్ణుడు కాదనియు, కృష్ణుడు దేవకి పుత్రుడనియు, రోహిణి యొక్క పుత్రుడు బలరాముడనియు, వారిద్దరిని నీకు భయపడిన వసుదేవుడు తన మిత్రుడగు నందుని వద్ద దాచినాడనియు, వారిద్దరే నీ అనుచరులను సంహరించినారనియు నారదుడు చెప్పెను. ఆ విషయమును విన్న భోజదేశాధిపతియగు కంసునకు ఇంద్రియములు, మనస్సు వ్యాకులమయ్యెను.

కంసుడు వసుదేవుని చంపగోరి వాడి కత్తిని తీసుకోగా, నారద మహర్షి అడ్డుకొనెను. బలరామకృష్ణులు తనకు మృత్యువు అని తెలిసిన కంసుడు వసుదేవుని దేవకితో సహా సంకెళ్లతో బంధించెను. దేవర్షి నారదుడు తిరిగి వెళ్లెను. అప్పుడు కంసుడు కేశిని పిలిపించి, నీవు బలరామకృష్ణులను సంహరించుమని పంపించెను.

కేశ పంపిన తరువాత భోజదేశప్రభుడగు కంసుడు, ముష్టికుడు, చాణూరుడు, శలుడు, శలుడు, తోశలుడు మొదలగు మల్లులను, మంత్రులను, మావటీండ్రను కూడ పిలిపించి ఇట్లు పలికెను - -  ఓయీ! ముష్టికా! ఓయీ! చాణూరా! మీరిద్దరు వీరులు. మీరు నా మాటను వినుడు.

వసుదేవుని పుత్రులగు బలరామకృష్ణులు నందుని గోకులములో ఉన్నారు. సుమా! వారిద్దరి వలననే నాకు మరణము వచ్చునని ఆకాశవాణి చెప్పినది గదా!

బలరామకృష్ణులిద్దరు ఇచటకు వచ్చినప్పుడు మీరిద్దరు వారిని మల్లక్రీడలో సంహరించుడు. మల్లయుద్ధరంగమునందు చుట్టూ పలురకముల ఎత్తైన ఆసనములను ఏర్పాటు చేయుడు. సగర వ్రజలు, పల్లెవాసులు యథేచ్ఛగా జరిగే మల్లయుద్ధమును చూచెదరు గాక!

ఓ మావటీ! నాకు హితమును చేసేది నీవే. నీవు కువలయాపీడమనే ఏనుగును మల్లరంగద్వారము వద్దకు తీసుకు రమ్ము. దానితో నా శత్రువులగు బలరామకృష్ణులిద్దరిని సంహరించుము.

చతుర్దశినాడు ధనుస్సు అనే (శత్రువుపై విజయమునిచ్చే) యాగమును యథావిధిగా ఆరంభించుడు. కోరికలను వర్షించే భూతనాథుడగు భైరవుని కొరకు పవిత్రములైన పశువులను బలి యిండు.

కంసుడు స్వార్థసంపాదనములో పండితుడు. ఆతడు ఈ విధముగా వారిని ఆజ్ఞాపించి తరువాత యాదవశ్రేష్ఠుడగు అక్రూరుని పిలిచెను. ఆయన చేతిని తన చేతితో పట్టుకొని, కంసుడు ఆయనతో నిట్లనెను.

ఓయీ! ఓయీ! అక్రూరా! నీవు ఉదారులలో శ్రేష్ఠుడవు. నాకు నీవు మిత్రుడు చేసే ఉపకారమును ఆదరముతో చేయవలెను. భోజవృష్టి వంశీయులలో నీకంటె ఎక్కువ హితమును కోరువాడు మరియొకడు లేడు.

కావుననే, ఏ విధముగానైతే ఇంద్రుడు సర్వసమర్థుడే అయినా, విష్ణువు నాశ్రయించి తన రాజ్యమును తిరిగి పొందెనో, అదే విధముగా, నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. నీవు పనిని గొప్పగా సాధించి పెట్టెదవు.

నందుని గోకులమునకు వెళ్లుము. అచట వసుదేవుని పుత్రులిద్దరు ఉన్నారు. వారిని ఈ రథము పై ఇచటకు తీసుకు రమ్ము విలంబము, వద్దు.

విష్ణువు ఆశ్రయముగా గల దేవతలు వారిద్దరిని నాకు మరణ హేతువు లుగా నిర్దేశించిరట గదా! వారిద్దరిని తీసుకు రమ్ము. వారితో బాటుగా నందుడు. మొదలగు గోసాకులను కూడ కానుకలనిచ్చి తీసుకు రమ్ము.

ఇచటకు తీసుకు రాబడిన వారిద్దరిని మృత్యువుతో సమానమైన ఏనుగుచే చంపించెదను. ఒకచో వారు ఏనుగును తప్పించుకున్నచో, పిడుగులపంటి ముల్లులచే వారిని చంపించెదను.

వారిద్దరు మరణించగా వారి బంధువులు, వృష్టిభోజదశార్హవంశములకు చెందిన వసుదేవుడు మొదలగువారు దుఃఖితులగుదురు. వారిని కూడ సంహరించెదను. వారిద్దరు మరణించగా వారి బంధువులు, వృష్ణిభోజదశార్హవంశములకు చెందిన వసుదేవుడు మెదలగువారు దుఃఖితులగుదురు. వారిని కూడ సంహరించెదను.

నా తండ్రి ఉగ్రసేనుడు ముదుసలియైనా రాజ్యమునందు కోరిక గలవాడు. ఆయనను, ఆయన సోదరుడగు దేవకుని, ఇంకా నన్ను ద్వేషించే ఇతర శత్రువులెవరు గలరో వారిని కూడ సంహరించెదను.

ఓ మిత్రమా! తరువాతనైతే ఈ రాజ్యము ముళ్లవంటి శత్రువులు లేనిది యగును. నాకు జరాసంధుడు గురువు, ద్వివిదుడు ప్రియమిత్రుడు.

శంబరుడు, నరకుడు, బాణుడు నాయందే ప్రేమ గలవారు. వారితో నేను దేవతల పక్షమునకు చెందిన రాజులను చంపి భూసామ్రాజ్యముననుభవించెదను.

ఈ రహస్యము నీకు తెలిసినది. నీవు బలరామకృష్ణులనే బుడతల నిచటకు తీసుకు రమ్ము. ధనుర్యాగమును, యాదవుల నగరమైన మథుర యొక్క సంపదను చూచుట కొరకు, అని మాత్రమే చెప్పుము.

అక్రూరుడిట్లు పలికెను ---  ఓ రాజా! మరణమును తప్పించుకొనే ఉపాయమును నీవు బాగానే విచారించినావు. కాని, మనము కార్యము సిద్ధించుట, సిద్ధించకపోవుట అనే రెండు పరిస్థితులను సమచిత్తముతో స్వీకరించవలెను. ఏలయన, కార్యసిద్ధి దైవాధీనము.

మానవుడు పెద్ద పెద్ద కోరికలను కోరును; దైవముచే తిరస్కరించబడే కోరికలను కూడ కోరును. కోరిక సిద్ధిస్తే హర్షమును, సిద్ధించకపోతే శోకమును పొందును. అయిననూ, నేను నీ ఆదేశమును పాటించెదను.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కంసుడు అక్రూరునకు, మంత్రులకు కూడ ఆ విధముగా ఆదేశములనిచ్చి వారికి వెళ్లుటకు అనుమతినిచ్చి తాను ప్రాసాదమును ప్రవేశించెను. అక్రూరుడు తన గృహమునకు చేరుకొనెను.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము పూర్వార్ధములో

వృషభాసురుని ఉద్ధారమును, కంసుడు అక్రూరుని గోకులమునకు

పంపుటను వర్ణించే ముప్పది ఆరవ అధ్యాయము ముగిసినది (36).