శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

65 - బలరాముడు వ్రజమునకు వెళ్లుట

కురువంశీయులలో శ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! మిత్రులను చూడాలనే కోరిక గల బలరామ భగవానుడు రథమునెక్కి ప్రేమతో . నందుని గోకులమునకు వెళ్లాను.

గోపాలకులు, గోపీకలు కూడ చాల కాలమునుండి ఆత్రముగా బలరాముని చూచుటకై ఎదురు చూచిరి. వారు ఆయనను కౌగిలించుకొనిరి. ఆయన తల్లిదండ్రులగు యశోదానందులకు నమస్కరించగా, వారాయనను ఆశీర్వదించి అభినందించిరి.

ఓ జగన్నాథా! దశార్హవంశీయుడవగు నీవు తమ్ముడు శ్రీకృష్ణునితో గూడి మమ్ములను సర్వదా రక్షించుము, అంటూ ఆయనను ఒడిలో కూర్చుండబెట్టుకొని కౌగిలించి ప్రేమాశ్రువులతో తడిపివేసిరి.

ఆయన గోపాలకులలో పెద్దలకు నమస్కరించెను. పిన్నలు ఆయన వయస్సు-మైత్రి-సంబంధములకు తగ్గట్లుగా ఆయనకు నమస్కరించిరి. .

తరువాత ఆయన గోపాలకుల దగ్గరకు వెళ్లి వారి చేతులను పట్టుకొని వారితో పరాచికములు, ఆలింగనము మొదలగువాటిని చేసెను. ఆయన విశ్రమించి సుఖముగా కూర్చుండగా వారు ఆయన చుట్టూ చేరి ప్రశ్నించిరి.

ఆ గోపాలకులు కలువ రేకులవంటి కన్నులు గల శ్రీకృష్ణుని కొరకై సకలభోగములను విడిచి పెట్టినవారు. బలరాముడు ప్రేమతో బొంగురు వోయిన కంఠముతో వారి బంధువుల క్షేమమును గురించి ప్రశ్నించెను.

ఓ బలరామా! బంధువులందరు క్షేమముగా ఉన్నారా? భార్యాపిల్లలతో కూడియుండే మీకు మేము గుర్తుకు వస్తున్నామా? (అని ఆ గోపాలకులు ప్రశ్నించిరి).

మీరు . కంసుని సంహరించి మిత్రులకు, బంధువులకు విముక్తిని కలిగించిరి. మీరు శత్రువులను జయించి, సంహరించి, ఇతరులు ప్రవేశించ శక్యము కాని ద్వారకను నివాసముగా చేసుకొనిరి. ఇదంతా మంగళము.

గోపికలకు బలరాముని చూచుట చాల ప్రీతికరము. వారు నవ్వుతూ, నగరమునందలి యువతీజనమునకు ప్రియుడైన శ్రీకృష్ణుడు క్షేమముగా ఉన్నాడా? అని ప్రశ్నించిరి.

ఆ శ్రీకృష్ణునకు బంధువులు గాని, తల్లిదండ్రులు గాని గుర్తున్నారా? ఈతడు తల్లిని చూచుటకు ఒక్కసారైనా వస్తాడా? బలిష్ఠమైన భుజములు గల ఆతనికి మేము చేసిన సేవయైనా గుర్తున్నదా?

దశార్దవంశీయుడవగు ఓ ప్రభూ! మేము శ్రీకృష్ణుని కొరకై తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అప్పచెల్లెళ్లాను, భర్తలను, సంతానమును, విడువ కష్టమైన మా బంధువులను కూడ విడిచి పెట్టితిమి. -

శ్రీకృష్ణుడు ప్రేమపాశమును తెగగొట్టి అట్టి మమ్ములను వెంటనే విడిచి పెట్టి వెళ్లిపోయినాడు. ఆతని తియ్యని పలుకులను స్త్రీలు ఏ విధముగా విశ్వసించకుందురు? (మేము నమ్మి మోసపోతిమీ).

నగరస్త్రీలు తెలివైనవారు. స్థిరము లేని చిత్తము కలిగి చేసిన ఉపకారమును మరిచిపోయే శ్రీకృష్ణుని పలుకులను వారు ఎట్లు నమ్మెదరు? (నమ్మరు). కాని, ఆతడు పలు విధముల కథలను చేపూ అందమైన చిరుగవుతో చూచినప్పుడు కామన ఉద్దీపితమై వారు వివశులై ఆతని పలుకులను నిశ్చయముగా విశ్వసించి యుందురు.

ఓ గోపికలారా! మనకు ఆతని ప్రసంగముతో పని యేమి? ఇంకో ప్రసంగమును చేయుడు. ఆతనికి మనము లేకుండానే కాలము గడిచిపోయే పక్షములో, మనకు కూడా అంతే.

ఈ విధముగా గోపికలు శ్రీకృష్ణుని నవ్వు, మాట, అందమైన చూపు, నడక, ప్రేమతోడి కౌగిలి అనువాటిని గుర్తు చేసుకొని రోదించిరి. .

బలరామ భగవానుడు పలు విధములుగా అనునయించుటలో దిట్ట. ఆయన వారిని శ్రీకృష్ణుని మనోహరములైన సందేశములతో ఓదార్చేను.

బలరామ భగవానుడు రాత్రులయందు గోపీకల ప్రేమను వర్దిల్ల జేస్తూ చైత్ర వైశాఖ మాసములు రెండూ అచటనే నిరంతరముగా నివసించెను.

యమునానది ఒడ్డున ఒక ఉద్యానము గలదు. పూర్ణచంద్రుని వెన్నెలలచే ఉజ్జ్వలముగా ప్రకాశించే ఆ ఉద్యానములో సరస్సులలోని కలువల పరిమళమును మోసుకువచ్చే గాలులు వీచుచుండును. బలరాముడు అచట గోపీకల గణములు చుట్టువారియుండ విహరించెను.

వరుణుడు మదిరాధిష్టానదేవతను పం పెను. ఆమె చెట్టు తొర్రనుండి ప్రవహించెను. ఆ మదిరయొక్క సుగంధము ఆ ఉద్యానమంతా నిండెను.

గాలి మోసుకువచ్చిన మదిరాధారయొక్క ఆ సుగంధమును ఆఘ్రాణించి, బలరాముడు గోపికలతో సహా అచటకు చేరి దానిని త్రాగెను.

గోపీకలు నాగలి ఆయుధముగా గల బలరాముని చరితమును కీర్తించుచుండిరి. మత్తులోనున్న ఆయన కన్నులు మత్తుతో చలించుచుండగా, ఉద్యానమునందు విహరించెను.

మత్తుగానున్న బలరాముడు మణులతో చేసిన మాలతో బాటుగా పూల మాలను కూడ ధరించెను. ఆయన పద్మమువంటి ముఖమునకు ఒకే కుండలము, మంచు బిందువులను పోలిన చెమట బిందువులు, చిరునవ్వు అలంకారములాయెను.

సర్వమును శాసించే ఆ బలరాముడు నీటిలో విహారమునకై యమునానదిని దగ్గరకు రమ్మని పిలిచెను. కాని, ఈతడు మత్తులోనున్నాడని ఆ నది ఆయన మాటను లెక్క చేయలేదు, దగ్గరకు రాలేదు. అపుడాయనకు కోపము వచ్చి, నా గేటి చాలుతో ఆ నదిని లాగివేసెను.

ఓ పాపాత్మురాలా! నేను నిన్ను పిలిచినా, నీవు నన్ను తిరస్కరించి రాకుంటివి. యథేచ్చగా ప్రవహించే నిన్ను నేను నాగేటి చాలుతో వంద ముక్కలుగా చీల్చివేసెదను.

ఓ పరీక్షిన్మహారాజా! యదువంశవర్ధనుడగు బలరాముడు ఈ విధముగా బెదిరించగా, యమున భయపడి వణికిపోయినది. ఆమే ఆయన పొదములపై పడి ఇట్లు పలికెను.

ఓ బలరామా! రామా! గొప్ప బాహువులు గల నీవు జగన్నాథుడవు. నీ ఒక్క అంశచే ఈ భూమి ధరించబడియున్నది. కాని, నీ పరాక్రమమును నేను గుర్తించలేకపోతిని.

ఓ భగవానుడా! ఈ జగత్తుయొక్క సారతత్త్వము నీవే. నీకు భక్తులయందు ప్రేమ మెండు. నేను పూజనీయుడవగు నీ స్వరూపమును తెలియలేకపోతిని. నిన్ను శరణు జొచ్చిన నన్ను విడిచి పెట్టుము.

యమునచే కోరబడిన బలరామ భగవానుడు ఆ ప్రార్థనను మన్నించి ఆమెను విడిచి పెట్టెను. ఆప్పుడాయన, ఆడు యేనుగులతో కూడిన గజేంద్రుడు వలె, గోపికలతో గూడి యమునాజలములలో క్రీడించెను.

యథేచ్ఛగా విహరించి నీటినుండి బలరాముడు ఒడ్డునకు రాగానే, లక్ష్మి ఆయనకు నల్లని వస్త్రముల జతను, గొప్ప విలువ గల ఆభరణములను, శుభకరమైన మాలను సమర్పించెను.

బలరాముడు నల్లని వస్త్రముల జతను ధరించి, బంగరు మాలను మెడలో వేసుకొని, బాగుగా అలంకరించుకొని చందనమునందుకొనెను. ఆయన ఇంద్రుని వాహనమగు ఐరావతగజము వలె ప్రకాశించెను.

ఓ రాజా! ఈ నాటికీ యమునానది నాగలిచే త్రవ్వబడిన దారిలో ప్రవహిస్తున్న వైనము కనబడును. ఆ ప్రవాహము నిశ్చయముగా అనంతమగు శక్తి గల బలరాముని పరాక్రమమును సూచిస్తున్నట్లున్నది.

బలరాముడీ విధముగా గోకులమునందు విహరించుచుండెను. ఆయన మనస్సు గోపికల విలాసలకు వశమయ్యెను. ఆయనకు రాత్రులన్నీ ఒకే రాత్రిగా అయినట్లుండెను.

శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో బలరాముని ప్రజయాత్రను వర్ణించే అరువది ఐదవ అధ్యాయము ముగిసినది.