శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

29 - రాస పంచాధ్యాయి - ఉపక్రమము

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- అది శరత్కాలము. రాత్రులయందు మల్లెలు వికసించి యుండెను. వాటిని చూచి శ్రీకృష్ణభగవానుడు కూడ యోగమాయను ఆశ్రయించి విహరించుటకు నిశ్చయించెను.

అప్పుడే చంద్రుడు ఉదయించెను. చాల కాలము తరువాత కనబడిన ప్రియుడు కుంకుమతో ప్రియురాలి ముఖమును వలె, ఆ చంద్రుడు తన మిక్కిలి చల్లని కిరణములతో తూర్పు దిక్కు యొక్క ముఖమును ఎర్రగా చేసెను. ఇంకా ఆ చంద్రుడు జనుల తాపములను కూడ తుడిచి వేసెను.

పూర్ణమగు మండలము కలిగి లక్ష్మీదేవి ముఖము యొక్క శోభవంటి శోభ గల చంద్రుడు కొత్త కుంకుమ వలె ఎర్రగా నుండెను. ఆయనయొక్క సుకుమారమైన కిరణములు అడవిని అంతటా సుందరముగా చేయుచుండెను. శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఆ దృశ్యమును చూచి మధురముగా వేణువును మ్రోగించెను. ఆ ధ్వని అందమైన కన్నులు గల యువతుల హృదయములను దోచివేసెను.

భగవానుని యందలి ప్రేమను వర్ధిల్లజేసే ఆ గానమును విని  గోకులము నందలి స్త్రీలు శ్రీకృష్ణునిచే వశము చేసుకొనబడిన మనస్సులు గలవారై వచ్చి వేసిరి. ఒకరు వచ్చుచున్నట్లు మరియొకరికి తెలియకుండగా వారు వేగముగా వచ్చుచుండగా వారి కుండలములు అల్లలాడుచుండెను. వారు ప్రియుడగు శ్రీకృష్ణుడు ఉన్న స్థానమును చేరిరి.

ఉత్సాహము అధికముగా నుండుట వలన పాలను పితుకుతున్న కొందరు గోపికలు ఆ పనిని సగములో ఆపివేసి, పాలను కాచుచున్న గోపికలు పాలను పొయ్యి మీదనే ఉంచి, గోధుమ హవిస్సును చేయుచున్న గోపికలు దానిని పొయ్యి మీద నుండి దింపకుండా వెళ్లిరి.

అన్నము వడ్డిస్తున్న గోపికలు, పిల్లలకు పాలను త్రాగించుచున్న వారు, భర్తలకు సేవను చేయుచున్నవారు, భోజనము చేయుచున్న గోపికలు. ఆయా పనులను సగములోనే విడిచి పెట్టి వెళ్లిరి.

కొందరు గోపికలు చందనాదులను అలదుకుంటూ మానివేసి, కొందరు అభ్యంగనమును సగములో విడిచి పెట్టి, మరికొందరు కంటికి కాటుక పెట్టుకుంటూ మానివేసి, కొందరు చీరలను వ్యత్యస్తముగా (పై కొంగు క్రిందికి, క్రింది. కొంగు పైకి) కట్టుకొని, మరికొందరు ఆభరణములను తప్పుగా (కంకణములను పాదములకు, నూపురములను చేతులకు) పెట్టుకొని, శ్రీకృష్ణుని వద్దకు వెళ్లిరి.

గోపికల మనస్సును గోవిందుడు దోచివేసెను. భర్తలు, తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు ఆపుతున్నా, మోహములో పడిపోయిన ఆ గోపికలు ఆగలేదు.

ఇంటి మధ్యలో ఉండిపోయి బయటకు వచ్చే అవకాశము దొరకని కొందరు. గోపికలు మనస్సులో ఆ శ్రీకృష్ణుని భావన చేస్తూ కళ్లను మూసుకొని ఆయననే ధ్యానించిరి.

ప్రియతముడగు శ్రీకృష్ణుని విరహము సహించ శక్యము కానిది. అట్టి
విరహము తాపముచే కడిగివేయబడెను. వారు ధ్యానమునందు శ్రీకృష్ణ భగవానుని కౌగిలిని
పొంది మహానందముననుభవించుటచే పుణ్యవాసనలు క్షయమయ్యెను.

వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మనే జారుడనే భావనతోటే అయినా
కలుసుకొనిరి. వెంటనే వారి కర్మబంధము నశించి, త్రిగుణముల
కార్యమగు దేహమును (దేహాభిమానమును) విడిచి పెట్టిరి.

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ శుకమహర్షీ! వారు శ్రీకృష్ణుని
ప్రియతమునిగా భావించిరే గాని, పరబ్రహ్మగానైతే కాదు. వారికి
గుణములు కార్యమగు దేహమునందు ఆత్మబుద్ధి గుణకార్యములగు సుఖదుఃఖముల ప్రవాహము రూపములోనుండే సంసారము అట్టివారికి ఎట్లు తొలగినది?

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విషయమును నేనిదివరలో నీకు
చెప్పియుంటిని. ఇంద్రియములకు అంతర్యామియగు శ్రీహరిని ద్వేషించి
కూడ చేదిదేశప్రభువగు శిశుపాలుడు సిద్ధిని పొందిన విషయమును నేను
చెప్పితిని. ఇంద్రియములకు అతీతుడగు శ్రీహరిని ప్రేమించువారు సిద్ధిని
పొందెదరని వేరుగా చెప్పవలయునా?

ఓ పరీక్షిన్మహారాజా! అవినాశియగు శ్రీహరి భగవానుడు ప్రత్యక్షాది
ప్రమాణములకు గోచరుడు కాడు. గుణముల కార్యమగు జగత్తునకు
అంతర్యామియగు ఆయన నిర్గుణుడు. ఆయన మానవులకు మోక్షమనే
ప్రయోజనము సిద్ధించుటకై విశిష్టమగు రూపములో ప్రకటమగును.

నిత్యము ప్రేమను (గోపికలు) గాని, కోపమును (శిశుపాలుడు) గాని,
భయమును (కంసుడు) గాని, మైత్రిని (అర్జునుడు) గాని, భక్తిని
(నారదుడు) గాని శ్రీహరియందు భావన చేయు వారు ఆయనతోడి
సాయుజ్యమును పొందెదరు.

శ్రీకృష్ణుడు పుట్టుక లేనివాడు, యోగులకు యోగిరాజులకు కూడ
ప్రభువు. ఆయనయందు నీవిట్టి సందేహమును చేయనే రాదు. ఏలయన,
ఈ ప్రాణివర్గము ఆయన వలననే మోక్షమును పొందును.

తన సమీపమునకు వచ్చిన ఆ గోపికలను చూచి వక్తలలో శ్రేష్ఠుడగు
శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. ఆయన వాక్కు యొక్క విలాసలచే
వారికి మోహము కలిగెను.

శ్రీ కృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ యువతులారా! మీరు గొప్ప
భాగ్యవతులు. మీకు స్వాగతము. మీకు నేనేమి ప్రియమును చేయవలెను?
గోకులము క్షేమమేనా? మీరు వచ్చుటకు గల కారణమును చెప్పుడు.

ఓ సుందర యువతులారా! భయమును గొల్పే రూపము గల ఈ
రాత్రియందు భయమును గొల్పే ప్రాణులు సంచరించుచుండును.
గోకులమునకు తిరిగి వెళ్లుడు. యువతులు ఇక్కడ ఉండరాదు.

ఎందుకంటే మీ తల్లులు, తండ్రులు, పుత్రులు, సోదరులు, మరియు
భర్తలు మీరు కనబడక మీ కోసం వెదుకుచుందురు. వారికి భయమును,
కంగారును కలిగించవద్దు.

పూలతో నిండిన ఈ అడవిని మీరు చూచితిరి. దీనిని రాత్రికి
నాయకుడగు చంద్రుడు తన కిరణములతో ప్రకాశింప జేయుచున్నాడు.
యమునానదిమీదనుండి మెల్లగా విలాసగా వీచే గాలికి కదలాడే చెట్ల
చిగుళ్లతో ఈ అడవి శోభిల్లుచున్నది.

ఓ పతివ్రతలారా! గోకులమునకు వెళ్లుడు. విలంబము చేయకుడు.
భర్తలకు సేవను చేయుడు. పిల్లలు, దూడలు కూడ పాలకై ఏడుస్తున్నారు.
పిల్లలకు, దూడలకు పాలను త్రాగించుడు. ఆవులను పొలను పితుకుడు.

అట్లు కాకపోవచ్చును. మీరు నాయందలి అనురాగముచే వశము చేసు
కొనబడిన అంతఃకరణము గలవారై వచ్చిరి. ఈ రాక మీ ప్రేమకు తగియే
యున్నది. ఎందుకంటే, ప్రాణులు నాయందు ప్రీతిని కలిగియుందురు.

ఓ కల్యాణవతులాగా! నిష్కపటముగా భర్తను ఆతని బంధువులను
సేవించుట, సంతానమును పోషించుట స్త్రీలకు సర్వోత్తమమైన ధర్మము.

భర్త చెడు స్వభావము గలవాడు గాని, దురదృష్టవంతుడు గాని,
ముదుసలి గాని, సోమరి గాని, రోగము గలవాడు గాని, దరిద్రుడే గాని,
పాపి కొనిచో, పుణ్యలోకమును కోరే స్త్రీలు అట్టి భర్తను విడిచి పెట్టరాదు.

సర్వదేశకాలములలో కులస్త్రీకి పరపురుషసంబంధము స్వర్గమును,
కీర్తిని కూడ నశింప జేయును. తుచ్ఛమైన ఆ సుఖము కష్టములను,
భయమును కలిగించును. అందరు అట్టి సుఖమునేవగించుకొనెదరు.

నా గాథలను వినుట, నా రూపమును చూచుట, నన్ను కీర్తించుట,
నన్ను ధ్యానించుట అనువాటి వలన నాపై ఏర్పడే భక్తి నా ప్రక్కన
ఉండుట వలన ఏర్పడదు. కావున, మీరు ఇంటికి తిరిగి వెళ్లుడు.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- గోవిందుని ఈ వచనములు
గోపికలకు ప్రియము కాలేదు. సంకల్పము భగ్నమగుటచే వారు
భేదమును పొందిరి. వారికి అతిక్రమించ శక్యము కాని దుఃఖము కలిగెను.

ఆ గోపికలు దుఃఖముతో విడిచే వేడి నిట్టూర్పులకు వారి
దొండపండువంటి క్రింది పెదవులు వాడిపోవుచుండెను.
ముఖములను క్రిందకు దించి నేలపై కాలితో రాస్తూంటే, పెల్లుబికే కన్నీళ్లు
కాటుకతో నల్లనై స్తనములయందలి కుంకుమలను చెరిపివేయుచుండెను.
వారు అధికమగు దుఃఖభాగముతో మిన్నకుండిరి.

గోపికలకు శ్రీకృష్ణునిపై అనురాగము మెండు. వారు ఆయన కొరకై
సకలకామనలను విడిచి పెట్టిరి. ప్రియతముడైన శ్రీకృష్ణుడు ప్రియుడు
కాడన్నట్లు తిరస్కరించెను. ఏడ్చుటచే వారి కన్నులు వాడిపోయి చూపు
అడ్డు కొంచెము కోపము గద్గదమయ్యెను. వారు కళ్లను తుడుచుకొని ఆయనతో నిట్లనిరి.

గోపికలిట్లు పలికిరి --- ఓ ప్రభూ! నీది మొండి పట్టుదల. నీవీ విధముగా
క్రూరముగా పలుకుట తగదు. మేము సకలభోగములను పూర్తిగా విడిచి
పెట్టి నీ పాదముల మూలమును సేవించుచున్నాము. మోక్షమును కోరే సాధకులను జగత్కారణుడు, పూర్ణుడు అగు పరమాత్మ సేవించే విధముగా, నీవు కూడ మమ్ములను సేవించుము, విడిచి పెట్టకుము.

ఓ ప్రభూ! స్త్రీలకు భర్తను, సంతానమును, బంధువులను సేపించుట
స్వధర్మముని ధర్మము తెలిసిన ఈశ్వరుడవగు నీవు ఉపదేశించితివి. నీ
ఉపదేశము యథార్థమే. ఈ ఉపదేశము ఉపదేశకుడవగు నీయందే ఉండు
గాక! ఉపదేశములన్నింటికీ పరమలక్ష్యము నీవే, నీవు దేహధారులకు
ప్రియతముడవు, బంధుడపు, ఆత్మవు గదా!

ఓ పరమేశ్వరా! నేర్పరులైన (వివేకవంతులగు) సాధకులు తమ
ఆత్మరూపుడవై నిత్యప్రియుడవగు నీయందు ప్రేమను చేయుదురు. ఇది
నిశ్చయము. దుఃఖమును మిగిల్చే భర్త, కొడుకు, కూతురు మొదలగువారితో పని యేమున్నది? కావున, మాపై ప్రసన్నుడవు కమ్ము. పద్మములనంటి కన్నులు గలవాడా! మేము చాల కాలమునుండి నీపై ఆశలను పెట్టుకున్నాము. మా ఆశలను వమ్ము చేయకుము.

మా మనస్సు ఇంటియందు లగ్నమైనప్పుడు చేతులు ఇంటి పనులలో
నిమగ్నమయ్యెడివి. కాని ఆనందఘనుడవగు నీవు మా మనస్సును
తేలికగా దోచినావు. ఇప్పుడు మనస్సు ఇంటియందు, చేతులు ఇంటి
పనులయందు లగ్నమగుట లేదు. రెండు కాళ్లు నీ పాదమూలమునుండి
ఒక్క అడుగును కూడ వేయుట లేదు. మేము గోకులమును వెళ్లుట
యెట్లు? మరియు, వెళ్లి మేమేమి చేయవలెను?

ఓ మిత్రమా! నీ చిరునవ్వు, చూపులు, మధురగానములచే మా
హృదయములలో పుట్టిన ప్రేమ అనే అగ్నిని నీ అధరామ్మతప్రవాహముతో ఆర్పుము. అట్లు చేయనిచో, నీ విరహము వలన పుట్టిన అగ్ని మా దేహములను దహించివేయును. మేము
ధ్యానము నే నీ పొదముల సన్నిధానమును చేరెదము.

ఓయీ! నీ కన్నులు పద్మములను పోలియున్నవి. నీకు అడవిలో ఉండే
గోపాలకులంటే ప్రీతి. వారికి నీవంటే ప్రీతి. నీ పాదములను స్పృశించే
ఆనందము లక్ష్మీదేవికైననూ అప్పుడప్పుడు మాత్రమే లభించును. అట్టి
నీ పాదమును మేము స్పృశించితిమి. ఆ విధముగా మమ్ములను నీవు
ఎప్పుడు ఆనందింప జేసితివో, అప్పటినుండియు ఇతరుల యెదుట
నిలుచుట కూడ మాకు చేతగాకున్నది.

లక్ష్మీదేవి తమపై చూపులను బరపవలెనని ఇతర దేవతలు
ప్రయాసపడుచుందురు. అట్టి ఆమె నీ పక్షఃస్థలమునందు స్థానమును
పొంది యున్నది. ఆయిననూ, ఆమె తులసీదేవితో పోటీపడి, భక్తులు
సేవించే నీ పాదపద్మముల ధూళిని కోరినది. ఆమె వలెనే మేము కూడ నీ
పాదముల ధూళిని శరణు వేడినాము.

పాపములను నశింపజేసీ ఓ పురుషోత్తమా! మేము భర్త మొదలగు
వారితో కూడియున్న ఇళ్లను విడిచి పెట్టి నిన్ను సేవించాలనే కోరికతో నీ
పాదమూలమును చేరినవారము. కావున, మాకై ప్రసన్నుడవు కమ్ము. నీ
అందమైన చిరునవ్వును చూడాలనే తీవ్రమైన కోరికచే మా చిత్తములు
ఆపమును పొందియున్నవి. మాకు నీ దాస్యముననుగ్రహించుము.

కుండలముల శోభతో ప్రకాశించే చెక్కిళ్లు గల నీ ముఖము
ముంగురులచే కప్పివేయబడి యున్నది. అధరామృతము గల నీ
ముఖము చిరునవ్వుతో కూడిన చూపులతో అలరారుచున్నది. దండముల
వంటి నీ భుజముల జంట భక్తులకు అభయమునిచ్చుచున్నది. నీ
వక్షఃస్థలము లక్ష్మీదేవికి ఏకైకవిహారస్థానము. ఈ సర్వమును చూచి మేము
నీకు దాసీలమైనాము.

నీ గానము మధురమగు పదములతో దీర్ఘమైన స్వరముల
ఆరోహ - అవరోహములను కలిగియున్నది. నీ రూపము ముల్లోకములలో అతిశయించిన అందము గలది. ఈ గానమును విని, ఈ రూపమును చూచి గోవులు, పక్షులు, చెట్లు, పశువులు
రోమాంచములను పొందును. అట్టి, ముల్లోకములలో ఏ స్త్రీ ఈ గానమును విని, రూపమును చూచి మోహమును సత్ప్రవర్తననుండి చలించకుండును? (చలించి తీరును).

పీడితులను రక్షించువాడా! జగత్కారణుడు, పూర్ణుడు అగు శ్రీహరి
దేవుడు దేవలోకమునకు రక్షకుడు. అదే విధముగా, నీవు
గోకులము యొక్క భయమును, పీడను పోగొట్టుటకై అవతరించినాడవనేది
స్పష్టమే. కావుననే, పద్మమువంటి నీ చేతిని తాపమును పొందియున్న
సేవకురాండ్రమగు మా వక్షఃస్థలమునందు, తలలపై కూడ నుంచుము.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ప్రభువగు శ్రీకృష్ణుడు ఆ గోపికల ఈ దీనవచనములను విని దయతో నవ్వెను. ఆయన తన స్వరూపమునందు రమించువాడే ఐననూ, వారిని రమింపజేసెను.

శ్రీకృష్ణ భగవానుడు తన గానాదులతో వారి మనోరథమును తీర్చెను.
అట్టి తమ ప్రియుని చూచుటచే వారి ముఖములు వికసించెను. ఆయన
పెద్దగా నవ్వినప్పుడు దంతములు మల్లె మొగ్గలవలె ప్రకాశించెను. ఆ
గోపికలచే చుట్టువారబడిన ఆయన నక్షత్రముల మధ్యలో చంద్రుడు వలె
విశేషముగా ప్రకాశించెను.

వందలాది గోపికల సమూహమునకు నాయకుడగు శ్రీకృష్ణుని కీర్తిని
వారు గానము చేయగా, ఆయన కూడ వారి ప్రేమను ప్రశంసిస్తూ గానము
చేసేను. ఆయన వైజయంతి మాలను ధరించి విహరిస్తూ అడవికే
అలంకారమాయెను.

ఆయన గోపికలతో గూడి యమునానది యొక్క ఇసుకతిన్నెను
ప్రవేశించి విహరించెను. ఆ నది యొక్క పిల్ల కెరటములమీదనుండి వీచే
చల్లని గాలి కలువల పరిమళముతో ఆహ్లాదమును కలిగించుచుండెను.

ఆయన చేతులను చాచి కౌగిలించి చేతులు, ముంగురులు, ఊరువులు, కోకముడులు, వక్షఃస్థలములను స్పృశించి గోటికొనలతో గిచ్చి పరిహాసములతో చూపులతో నవ్వులతో క్రీడిస్తూ, గోకులము యొక్క యువతులకు ప్రేమను వర్ధిల్లజేస్తూ విహరించెను.

ఈ విధముగా అభిమానవతులగు గోపికల మనోరథమును గొప్ప
మనస్సు గల శ్రీకృష్ణ భగవానుడు సఫలము చేసెను. భూలోకమునందలి స్త్రీలలో తామే చాల గొప్ప యని తలపోసిరి.

ఆ గోపికలకు తాము సౌందర్యవతులమనే గర్వము, శ్రీకృష్ణుడు
తమవాడనే అభిమానము ఉండుటను ఆయన గమనించెను. వాటిని
పోనాడి వారిని అనుగ్రహించుటకై శ్రీకృష్ణ భగవానుడు అక్కడనే
అంతర్ధానమాయెను.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము
పూర్వార్ధములో రాసపంచాధ్యాయి - ఉపక్రమమును వర్ణించే
ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (29).