శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

39 - అక్రూరుడు బలరామ కృష్ణులను గోకులము తీసుకువెళ్లుట

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను  ---  అక్రూరుడు ఆసనముపై సుఖముగా కూర్చుండెను. ఆయనను బలరామకృష్ణులు గొప్పగా సత్కరించిరి. ఆయన దారిలో మనసులో సంకల్పించిన కోరికలన్నీ తీరిపోయెను.

ఓ పరీక్షిస్మహారాజా! లక్ష్మీదేవికి నివాసస్థానమగు శ్రీకృష్ణ భగవానుడే ప్రసన్న మైనప్పుడు లభించనిది ఏమి ఉండును? (ఉండదు). అయిననూ, ఆయనయే పరమలక్ష్యముగా గల భక్తులు దేనినైననూ కోరనే కోరరు.

దేవకీనందనుడగు శ్రీకృష్ణ భగవానుడు సాయంకాల భోజసమును చేసి, కంసుడు తమ హితైషుల యెడల ప్రవర్తించే తీరును, కంసుడు  చేయదలచిన ఇతర కార్యములను గురించి అక్రూరుని ప్రశ్నించెను.

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- తండ్రీ! తమరిని చూచుటచే ప్రీతి కలిగినది. తమరి రాక సుఖముగా జరిగినదా? మీకు మంగళమగు గాక! మా జాతులు, బంధువుల యెడల కంసుడు పాపమును చేయలేదు గదా? వారు క్షేమమేనా?

అయ్యా! వంశములో మేనమామ అనే పేరుతో వ్యాధి పెరుగుచున్నది. అట్టిచో, మాకు, మా బంధువులకు, కంసునిచే పాలించబడే ప్రజలకు క్షేమమును గురించి ఏమని ప్రశ్నించెదను?

అయ్యో। నా కారణముగా పూజనీయులైన మా తల్లిదండ్రులకు దుఃఖము కలిగినది. నా కారణముగానే వారిద్దరికీ పుత్రుల మరణము, చెరసాల కలిగినవి.

ఓ ప్రియదర్శనా! తండ్రీ! నా వారి దర్శనమును నేను కోరుచుంటిని.ఈనాడు నాకు మీ దర్శనము కలిగినది. ఆనందము. తమరి రాకకు కారణమును చెప్పుడు.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను. శ్రీకృష్ణ భగవానుడిట్లు ప్రశ్నించగా,మధువంశోద్భవుడగు అక్రూరుడు -- యాదవుల యెడల కంసుడు కత్తి కట్టుట, వసుదేవుని వధించే ప్రయత్నమును చేయుట  --  అనే సర్వమును వర్ణించి చెప్పెను.

కంసుడు తనను ఏ సందేశముతో ఏ ప్రయోజనము కొరకు దూతగా పంపెనో, వసుదేవుని వలన తాను (శ్రీకృష్ణుడు) జన్మించినాడని నారదుడీ కంసునకు ఏమి చెప్పెనో, (ఆ సర్వమును వర్ణించి చెప్పెను).

శత్రువీరులను సంహరించే బలరామకృష్ణులు అక్రూరుని మాటను విని నవ్విరి. వారు
కంసుని ఆదేశము (వారిద్దరికి ధనుర్యాగమునకు ఆహ్వానము) ను తండ్రియగు నందునకు విన్నవించిరి.

ఆ నందుడు కూడ గోపాలకులను ఆదేశించెను -- సకల గోరసము (పాలు, వెన్న ఇత్యాది) ను తీసుకురండు. బహుమతులను కూడ తీసుకు రండు. బళ్లను కట్టుడు.

రేపు మథురా నగరమునకు వెళ్లి మహారాజునకు పాలు, పెరుగు మొదలగు వాటిని సమర్పించి, గొప్ప ధనుర్యాగోత్సవమును చూచెదము. దేశవాసులు వెళ్లుచున్నారు అని -- నందుడు గోకులాధిపతిచే అంతటా చాటింపు వేయించెను.

అప్పుడు బలరామకృష్ణులను మథురా నగరమునకు తీసుకు వెళ్లుటకై అక్రూరుడు గోకులమునకు వచ్చినాడని విని గోపికలు దుఃఖమును పొందిరి.

ఆ వార్త విని కొందరు గోపికలకు హృదయతాపము కలిగి దాని వలన కలిగిన వేడి నిట్టూర్పులకు ముఖకాంతి వాడిపోయెను. మరికొందరు గోపికలకు వస్త్రములు, కంకణములు, జుట్టు ముడులు జారిపోయెను.

ఆ శ్రీకృష్ణుని ధ్యానముచే మరి కొందరు గోపికలకు ఇంద్రియ వ్యాపారములన్నీ తొలగిపోయెను. వారికి ఆత్మసాక్షాత్కారమును పొందిన యోగులకు వలె దేహస్పృహ, ఈ లోకము యొక్క జ్ఞానము లేకుండెను.

మరి కొందరు గోపికలు శ్రీకృష్ణుడు ప్రేమతో కూడిన చిరునవ్వుతో పలికిన పలుకులను గుర్తు చేసుకొని మోహమును పొందిరి. చిత్రమగు (అబ్బురపరచే) పదములు గల ఆ పలుకులు వారి హృదయములను స్పృశించినవి.

మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని మిక్కిలి అందమైన నడకను, చేష్టను,ప్రేమ నిండిన చిరునవ్వుతో కూడిన చూపును, దుఃఖమును బాపే పరిహాస వచనములను, చాల గొప్ప లీలలను కూడ ధ్యానించే గోపికలు ఆయన దూరమగునేమో అనే భయముతో విరహముతో
వ్యాకులపడిరి.

ముఖముపై కన్నీళ్లు, హృదయములో శ్రీకృష్ణ భగవానుడు గల గోపికలు గుంపుగా గుమిగూడి ఇట్లు పలికిరి.

గోపికలిట్లు పలికిరి --- అయ్యో! ఓ బ్రహ్మదేవుడా। నీకు ఏ కాలమునందైననూ దయ లేదు. నీవు ప్రాణులను మైత్రితో, ప్రేమతో కలిపి వారి మనోరథములు సిద్ధించ కుండగనే వారిని విడదీ సెదవు. నీ చేష్ట పిల్లవాని చేష్ట, వలె నిరర్ధకము.

ఏలయన, నీవు మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణ భగవానుని ముఖమును చూపించి మరల కనబడకుండా చేయుచున్నావు. నల్లని ముంగురులతో ఆవరించబడియుండే ఆయన ముఖము చక్కని చెక్కిళ్లతో, ఎత్తైన ముక్కుతో, అందమైన చిరునవ్వుతో శోకమును పోగొట్టును. నీవు దుష్టులు చేసే పనిని చేయుచున్నావు.

అయ్యో। నీవు అక్రూరుడనే పేరుతోనున్న క్రూరుడవు. ఎందుకంటే, చూపును ఇచ్చిన
నీవే చూపును             అపహరించుచున్నావు. మేష చూపుతో నీ సకలసృష్టి నైపుణ్యమును మధువనే రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణ భగవానుని ముఖము, కన్ను మొదలైన ఒకే అవయవములో చూచెడివారము.

ఇళ్లు, బంధువులు, పుత్రులు, భర్తలను విడిచి పెట్టి మేము సాక్షాత్తుగా శ్రీకృష్ణుని దాస్యమును స్వీకరించితిమి. అయ్యో! కొత్త వారిపై ప్రేమ గల ఆ నందుని పుత్రుడు తన చేష్టలతో మమ్ములను పరవశులను చేసి ఆపై మా కేసి చూచుట మానివేసినాడు. ఆతని ప్రేమ క్షణభంగురము.

మధురానగర యువతులకీ రాత్రి శుభోదయమగును. మనోరథములు యథార్థములైనవి. ఎందుకంటే, గోకులప్రభుడగు శ్రీకృష్ణుడు వారి నగరములో ప్రవేశించును. వారు కనుకొలుకులచే ఉజ్జ్వలముగా చేయబడిన చిరునవ్వు అనే మద్యము గల గల ఆతని
ముఖమును (కన్నులతో) పానము చేయబోవుచున్నారు.

ఓ అబలలారా! శ్రీకృష్ణుడు ధీరుడే అయినా ఇతరుల అధీనములో నుండును. ఆ నగరయువతుల తేనె వంటి తియ్యని పలుకులకు ఆతని మనస్సు ఆకర్షించబడును. వారి సిగ్గుతో కూడిన చిరునవ్వు యొక్క విలాసలచే ఆతడు అంతా మరచి పోవును. అట్టివాడు మరల తిరిగి మనవద్దకు ఎట్లు వచ్చును? మనము పల్లెటూరివారము గదా!

ఈనాడు ఆ మథురానగరములోని దాశార్హ భోజ అంధక వృష్టి సాత్వత వంశీయుల కన్నులకు గొప్ప ఉత్సవమే కలుగగలదు. వారు లక్ష్మిని రమింపజేసే శ్రీకృష్ణుని చూడగలరు. దారిలోనున్న జనులు కూడ సద్గుణనిధానమగు ఆ దేవకీనందనుని చూడగలరు.

ఇటువంటి చేష్ట కలిగి దయ లేని ఈ వ్యక్తికి అక్రూరుడనే ఈ పేరు ఉండరాదు. ఈతడు మిక్కిలి క్రూరుడు. ఎందుకంటే, ఈతడు దుఃఖించుచున్న మనలను ఓదార్చకుండా, ప్రాణములకంటె ప్రియుడగు శ్రీకృష్ణుని మార్గము యొక్క అంతము వరకు తీసుకొని పోవును.

ఈ శ్రీకృష్ణుని మనస్సులో ప్రేమ లేదు. అప్పుడే రథమునెక్కి కూర్చున్నాడు. పొగరెక్కిన ఈ గోపాలకులు కూడ బళ్లను సిద్ధం చేసుకొని ఆతని వెంటబడి తొందర పెట్టుచున్నారు. పెద్దలు పట్టనట్లు మిన్నకున్నారు.

ఈనాడు దైవము కూడ మనకు విరుద్ధముగా ఆచరించుచున్నది.

మనము కట్టు కట్టుకొని లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుడు వెళ్లకుండా అడ్డుకొనెదము. మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణ భగవానుని సంగమును అర నిముషమైననూ విడిచి పెట్టుట దుర్ఘటము. కాని, దైవము మనలకు, మనకట్టి వియోగమును కలిగించినది. దీనమైన మనస్సులు గల మనలను కులములోని పెద్దలు, బంధువులు ఏమి చేయుదురు?

ఓ గోపికలారా! రాసక్రీడయందు శ్రీకృష్ణుడు ప్రేమతో కూడిన సుందరమైన చిరునవ్వు నవ్వుతూ విలాసముగా చూస్తూ మనోహరమైన రహస్య సంభాషణములను చేస్తూ కౌగిలించెడివాడు. మనమెన్నో రాత్రులను క్షణము వలె గడిపి వేసితిమి. అట్టి కృష్ణుడు లేకుండా అంతులేని విరహదుఃఖమును మనమెట్లు అతిక్రమించవలెను?

శ్రీకృష్ణుడు బలరాముడు గోపు బాలకులు చుట్టువారియుండ సాయంకాలమునందు వేణువును వాయిస్తూ గోకులమును ప్రవేశించును. ఆయన ముంగురులు, వనమాల గోవుల
గిట్టలనుండి లేచే దుమ్ముతో బూడిద రంగును కలిగియుండును. ఆయన చిరునవ్వుతో ఓరచూపులు చూస్తూ మన మనస్సును దోచివేయును. అట్టి ఈ శ్రీకృష్ణుడు లేకుండా మనమెట్లు మనగల్గుదుము ?

శ్రీశుక ఉవాచ ।

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- గోకులమునందలి గోపికలు శ్రీకృష్ణుని (కలుగబోయే) విరహముచే అధికమగు పీడను పొందిరి. వారి మనస్సు శ్రీకృష్ణునియందే విశేషముగా లగ్నమై యుండెను. వారు సిగ్గును విడిచి ఈ విధముగా పలుకుతూ, ఓ గోవిందా! ఓ దామోదరా! ఓ మాధవా! అంటూ మధురమైన స్వరముతో ఏడ్చిరి.

గోపికలే విధముగా ఏడ్చుచుండగనే సూర్యుడు ఉదయించెను. తరువాత అక్రూరుడు మిత్రదేవతాకమైన ప్రాతస్సంధ్యను చేసుకొని, రథమును ముందుకు నడి పెను.

తరువాత (ఆ గోకులమునుండి) ఆ శ్రీకృష్ణుని వెనుక నందుడు, సునందుడు మొదలగు గోపాలకులు బళ్లపై వెళ్లిరి. వారు అనేక బహుమతులను, ఆవు పాలు మొదలగువాటిని నింపిన కడవలను తీసుకు వెళ్లిరి.

అనురాగవతులగు గోపికలు కూడ ప్రియుడగు శ్రీకృష్ణుని వెనుక వెళ్లిరి. ఆయనచే వారించబడి వారు ఆయన సందేశము కొరకు ఎదురు చూస్తూ ఉండిపోయిరి.

తన ప్రయాణము విషయములో ఆ విధముగా దుఃఖించుచున్న గోపికలను యదువంశశిరోమణియగు శ్రీకృష్ణుడు చూచెను. నేను తిరిగి వచ్చెదను, ఆని ఆయన దూత ద్వారా ప్రేమ సందేశమును పంపి వారిని ఓదార్చెను.

ఎంతవరకైతే రథము జెండా కొంచెమైననూ కనబడెనో, రథము యొక్క ధూళి కనబడెనో, అంతవరకు గోపికలు నిలబడి చూచిరి. వారు తమ మనస్సులను శ్రీకృష్ణునితో బాటే పంపివేసి చిత్రపటముల వలె నిలబడిరి.

ఆ గోపికలకు గోవిందుడు వెనుకకు మరలి వచ్చుననే ఆశ తొలగిపోయి వారు వెను దిరిగిరి. వారు రాత్రింబగళ్లు ప్రియుడగు శ్రీకృష్ణుని లీలలను గానము చేస్తూ దుఃఖమును మరచి గడిపిరి.

బలరాముడు, అక్రూరులతో గూడి శ్రీకృష్ణ భగవానుడు వాయు వేగముతో నడిచే రథము పై పాపములను వినాశము చేసే యమునా నదిని చేరెను.

బలరామకృష్ణులు మణి వలె స్వచ్ఛము, తియ్యనిది అగు యమునానది యొక్క నీటితో ముఖమును, చేతులను, కాళ్లను కడుగుకొని, నీటిని త్రాగి, తిరిగి వచ్చి చెట్ల గుంపులో ఆగిన రథమునెక్కిరి.

అక్రూరుడు వారిరువురిని రథము పై కూర్చుండబెట్టి వారి అనుమతితో యమునానది యొక్క సరస్సునకు వచ్చి యథావిధిగా స్నానము చేసెను.

అక్రూరుడు ఆ నీటిలో మునిగి కాలపరిచ్ఛేదము లేని గాయత్రీ మంత్రమును జపించుచుండెను. అచట ఆయనకు కలిసి ఉన్న బలరామకృష్ణులే కనబడిరి. 

వసుదేవుని పుత్రులగు బలరామకృష్ణులు ఇక్కడకు ఎట్లు వచ్చిరి ? అయితే  రథమునందు ఉండరు, అని తలచి ఆ అక్రూరుడు నీటినుండి తలను పైకెత్తి చూచెను.

ఆ రథమునందు కూడ వారిద్దరు ముందులో వలెనే కూర్చుని యుండిరి. ఐతే నేను నీటిలో వారిని చూచినది మిథ్యయా? అనుకుంటూ ఆ అక్రూరుడు మరల నీటిలో మునిగెను.

ఆ అక్రూరునకు మరల అచట నీటిలో నాగనాయకుడగు ఆదిశేషుడు కనబడెను. ఆయనను సిద్ధులు, చారణులు, గంధర్వులు, అసురులు (ప్రహ్లాదుడు మొదలగువారు) మెడలు వంచి స్తుతించుచుండిరి.

ఆ శేషదేవుడు వేయి పడగలను కలిగియుండెను. ప్రతి పడగపై బంగరు కిరీటమును ధరించి బంగరు శిఖరములు గల మేరు పర్వతము వలె నుండెను. తామరతూడువలె తెల్లని ఆయన నల్లని వస్త్రమును ధరించెను.

అక్రూరుడు ఆ శేషుని కుండలాకారపు అర్ధదేహము పై పద్మపత్రము వలె ఎర్రనైన కన్నులు గల శ్రీమహావిష్ణువును చూచెను. మేఘము వలె నల్లని ఆయన పచ్చని పట్టు వస్త్రమును దాల్చెను. నాలుగు చేతులు గల ఆయన ప్రసన్నముగా నుండెను.

ఆ పురుషోత్తముడు ప్రసన్నసుందరమగు ముఖమును, అందమైన నవ్వుతో కూడిన చూపును, అందమైన కనుబొమలను, ఎత్తైన ముక్కును, అందమైన చెవులను, అందమైన చెక్కిళ్లను, ఎర్రని క్రింది పెదవిని కలిగియుండెను.

ఆయన చేతులు పొడవుగా బలముగా నుండెను. ఎత్తైన భుజస్కంధములతో శోభిల్లే వక్షఃస్థలము పై ఆయన లక్ష్మి (రేఖ) ని కలిగియుండెను. శంఖము వంటి కంఠముతో, లోతైన నాభితో, మూడు ముడుతలు కలిగి రావియాకుని పోలిన ఉదరముతో ఆయన శోభిల్లెను.

ఆయన విశాలమైన నడుమును, పిరుదులను, ఏనుగు తొండము వంటి తొడలను, అందమైన మోకాళ్లను, అందమైన పిక్కలను కలిగియుండెను.

ఆయన చీలమండలు ఎత్తుగనుండెను. గోటి వేళ్ల సమూహము కాంతులను విరజిమ్మెను. పాదములు పద్మములను, కోమలమైన వ్రేళ్లు బొటనవ్రేళ్లు పద్మపత్రములను పోలి ప్రకాశించెను.

ఆయన మిక్కిలి విలువైన మణుల సమూహములు పొదిగిన కిరీటమును, కంకణములను, భుజపురులను ధరించెను. ఆయన ప్రకాశించే మొలనూలును, యజోపవీతమును, కాలి యందెలను, కుండలములను కలిగియుండెను. ఆయన చేతులలో పద్మమును, శంఖమును, చక్రమును, గదను ధరించెను. ఆయన వక్షఃస్థలము పై శ్రీవత్సమనే పుట్టుమచ్చ, మెడలో కౌస్తుభమాణిక్యము, వనమాల ప్రకాశించుచుండెను.

నిర్మలమైన అంతః కరణములు గల సునందుడు, నందుడు మొదలుగా గల అనుచరులు ప్రభుభావముతో హరిని స్తుతించుచుండిరి. సనకుడు, సనందనుడు మొదలగు యోగులు పరబ్రహ్మభావముతో స్తుతించుచుండిరి. బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలుగా గల దేవనాయుకులు సర్వేశ్వరుడనే భావముతో స్తుతించిరి, మరీచి, అత్రి, అంగిరసుడు. పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వసిష్ఠుడు, దక్షుడు అనే తొమ్మండుగురు ప్రజాపతులు మరియు ప్రహ్లాదుడు, నారదుడు, ఉపరిచరవసువు మొదలగు భగవానుని భక్తశిఖామణులు ఆత్మబంధువునుగను, ఈ విధముగా వేర్వేరు భావములను ప్రకటించే వచనములతో స్తుతించుచుండిరి.

సంపద, పుష్టి, వాక్కు, కాంతి, కీర్తి, తుష్టి, భూమి, ఊర్జ (సామర్థ్యము), విద్య, అవిద్య, చిచ్ఛక్తి, మాయాశక్తి కూడ రూపు దాల్చి అ శ్రీహరిని సేవించుచుండెను.

శ్రీహరిని చూచిన అక్రూరునకు అతిశయమగు ప్రీతి, ఉత్కృష్టమగు (నిష్కామ) భక్తి కలిగెను. ఆయనకు రోమాంచము కలిగెను. హృదయము భక్తిభావముతో ఆర్ద్రము కాగా, కన్నులయందు నీరు తీరిగెను.

యదువంశీయుడు, సత్త్వగుణ ప్రధానుడు అగు అక్రూరుడు ధైర్యము తెచ్చుకొని తల
వంచి దోసిలి యొగ్గి సమస్కరించెను. ఆయన ఏకాగ్రమగు చిత్తముతో బొంగురు వోయిన వాక్కుతో మెల్లగా శ్రీకృష్ణ భగవానుని స్తుతించెను.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో అక్రూరుడు

బలరామకృష్ణులను గోకులమునుండి తీసుకు వెళ్లుటను వర్ణించే

ముప్పది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (39).