బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

26 - కర్మవిపాకే కర్మానురూపస్థాన గమనం

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు నారదునితో పలికెను –

సావిత్రి వచనం శ్రుత్వా జగామ విస్మయం యమః

ప్రహస్య వక్తుమారేభే కర్మపాకం చ జీవినాం

సావిత్రీ ఆడిగిన ప్రశ్నల విని యమధర్మరాజు ఆశ్చర్యపడి జీవులయొక్క కర్మవిపాకమెట్లుండునో తెలుపుటకు మొదలిడేమ.

యమ ఉవాచ- యముడు సావిత్రితో ఇట్లనెను –

కన్యా ద్వాదశవర్షీయా వత్సే త్వం వయసాఽధునా

జ్ఞానం తే పూర్వవిదుషాం యోగినాం జ్ఞానినాం పరం

సావిత్రీవరదావేన త్వం సావిత్రీ కళా సతీ

ప్రాప్తా పురా భూభృతా చ తపసా తత్సమా శుభే

యథా శ్రీః శ్రీపతేః క్రోడే భవానీచ భవోరసి

యథా రాధా చ శ్రీకృష్ణే సావిత్రి బ్రహ్మవక్షసి

ధర్మోరసి యథా మూర్తిః శతరూపా మనౌ యథా

కర్ధమే దేవహూతిశ్చ వసిష్ఠేఽరుంధతీ యథా

ఆదితిః కశ్యపేచాఽపి యథాఽహల్యా చ గౌతమే

యథా శచీ మహేంద్రో యథా చంద్రే చ రోహిణీ

యథారతిః కామదేవే యథా స్వాహా హుతాశనే

యథా స్వధా చ పితృషు యథాసంజ్ఞా దివాకరే

వరుణాని చ వరుణే యజ్ఞే చ దక్షిణా యథా

యథా ధరా వరాహె చే దేవసేనా చ కార్తికే

సౌభాగ్యా సుప్రియా త్వం చ భవ సత్యవతీ ప్రియే

ఇతి తుభ్యం వరం దత్తమపరం చ యదీప్పితం

వృణు దేవి మహాభాగే సర్వం దాస్యామీ నిశ్చితం

ఓ సావిత్రి! నీవయసిప్పుడు పన్నెండు సంవత్సరములు మాత్రమే. కాని నీ జ్ఞానము ప్రాచీన విద్వాంసుల కన్నము, యోగినుల కన్నను, జ్ఞానవంతులకన్నను మిన్నయైనది. మీ తండ్రియగు అశ్వపతి చేసిన తప్పువలన సావిత్రీదేవితో సమానురాలవుగా, ఆమె అంశతో, ఆమె వరమువలన నీవు పుట్టినావు.

లక్ష్మీపతి వక్షఃస్థలమున లక్ష్మీదేవి ఎట్లుండునో శంకరుని ఎదపై పార్వతీదేవి ఎట్లుండునో శ్రీకృష్ణదేవునికి రాధ ఎట్లున్నదో బ్రహ్మ దేవునకు సావిత్రి, ధర్మునకు మూర్తీదేవి, మనువునకు శతరూప, కర్దమ ప్రజాపతికి దేవహూతీ, వసిష్ఠునకు అరుంధతీదేవి, కశ్యపప్రజాపతికి అదితి, గౌతమ మహర్షికి అహల్య, దేవేంద్రునకు శచీదేవి, చంద్రునకు రోహిణి, మన్మథునకు రతీదేవి, అగ్నిదేవునకు స్వాహాదేవి, పితృదేవతలకు స్వధాదేవి, సూర్యునకు సంజ్ఞాదేవి, వరుణునకు వరుణాని, యజ్ఞానకు దక్షిణ, ఆదివరాహమూర్తికి భూదేవి, కుమారస్వామికి దేవసేనల వలె నీవు నీభర్తయగు సత్యవంతునకు ప్రియురాలవు కమ్ము అట్లే సౌభాగ్యవతివి కూడ కమ్ము.

ఓ సావిత్రి నీ కిట్టి వరమునిచ్చితిని. ఇంకను నీకిష్టమైన కోరిక ఏదైన ఉన్నచో చెప్పుము నీకోరికను సంపూర్ణముగా తీర్తునని యమధర్మరాజు సావిత్రితో పలికెను.

సావిత్ర్యువాచ- సావిత్రి ఈవిధముగా ఆనెను –

సత్యవదౌరసేనైవ పుత్రాణాం శతకం మమ

భవిష్యతి మహాభాగ వరమేతన్మదీప్సితం

మత్సితుః పుత్రశతకం శ్వశురస్యచ చక్షుషీ

రాజ్యలాభో భవత్వేవ పరమేతన్మదీప్సితం

అంతే సత్యవతా సార్థం యాస్యామీ హరిమందిరం

సమతీతే లక్షవర్షే దేహీమం మే జగత్పతే

జీవకర్మవివేకం చ శ్రోతుం కౌతూహలం చ మే

విశ్వవిస్తర బీజంచ తన్మే వ్యాఖ్యాతు మర్హసి

ఓయమధర్మరాజా! నాకు సత్యవంతునకు నూరుగురు పుత్రులు కలుగునట్లు, నాతండ్రికి పుత్రసంతానము కలుగునట్లు, నా మామగారికి కళ్ళు, రాజ్యము లభించునట్లు, నేను సత్యవంతునితో కలిసి శ్రీహరి మందిరమైన వైకుంఠమునకు పోవునట్లు వరమీమ్ము.

ఇక నాకు జీవుల కర్మవిపాకమెట్లు జరుగునో ప్రపంచము విస్తరించుటకు గల కారణమును వివరించి తెల్పుడు.

భవిష్యతి మహాసాధ్వి పర్వం మానసికం తవ

జీవ కర్మవివేకం చ కథయామి నీశామయ

శుభనామ శుభానాo చ కర్మణాం జన్మభారతే

పుణ్యక్షేత్రేఽత్ర సర్వత్ర నాఽన్యత్ర భుంజతే జనాః

సురాదైత్యా దానవాశ్చ గంధర్వా రాక్షసాదయః

నరాశ్చ కర్మజనకాః న సర్వే సమజీవినః

విశిష్టజీవినః కర్మ భుంజతే సర్వ యోనిషు

విశేషతో మానవాశ్చ భ్రమంతి సర్వయోనిషు

శుభాశుభం భుంజతే చ కర్మ పూర్వార్జీతం పరం

శుభేన కర్మణా యాంతి తే స్వర్గాదిక మేవచ

కర్మణా చాశుభేనైవ భ్రమంతి నరకేషుచ

కర్మ నిర్మూలనే ముక్తిః సా చోక్తా ద్వీవిధా మతా

నిర్వాణరూపా సేవా చ కృష్ణస్య పరమాత్మనః

రోగే కుకర్మణా జీవశ్చారోగీ శుభకర్మణా

దీర్ఘజీవీ చ క్షీణాయుః సుఖీదుఃఖీ చ నిశ్చితం

ఆంధాదయాశ్చాంగహీనాః కుత్పితేన చ కర్మణా

సిద్ద్యాదికమవాప్నోతి సర్వోత్కృష్టేన కర్మణా

సామాన్యం కథితం సర్వం విశేషం శ్రుణు సుందరి

మహాసాధ్వియగు సావిత్రి నీవు కోరిన కోరికలన్నియు తీరును. ఇక నీవడిగిన జీవ కర్మ విపాకమును వివరించుచున్నాను.

పుణ్యకర్మలు, పాపకర్మలు చేసికొన్నవారు తత్ఫలమనుభవించుటకై ఈ భారతఖండమున పుట్టుచున్నారు. ఈపుణ్యఖండమున తప్ప ఇతరత్ర జనులు శుభాశుభాకర్మ ఫలములను అనుభవించలేరు. దేవతలు, దైత్యులు, దానవులు, గంధర్వులు, రాక్షసాదులు, మానవులు వీరందరు తమతమ కర్మలననుసరించి పుట్టుచున్నారు. వీరందరు సమానమైన జీవనమును గడుపుటలేదు.

విశిష్టమైన జీవనము కలవారు సమస్తయోనులందు జన్మించి తాము చేసిన కర్మఫలమనుభవించుచున్నారు. ముఖ్యముగా మానవులు ఈవిధముగా వివిధయోనులయందు జన్మనెత్తుచున్నారు. పూర్వ కర్మార్జితమైన ఫలము శుభమైనా అశుభమైనా అనుభవించుచున్నారు. పుణ్యకర్మవలన స్వర్గాది ఫలితమును పొందగా అశుభకర్మవలన నరకమును చెందుచున్నారు.

కర్మనిర్మూలనము వలన కలుగు ముక్తి రెండు విధములు. ఒకటి నిర్వాణరూపమైనది. రెండవది శ్రీకృష్ణపరమాత్మ సేవా రూపమైనది.

పాప కర్మచేయువాడు రోగియగును, క్షీణాయుష్కుడగును. దుఃఖమును పొందును గుడ్డి, చెవిటి, మూగవంటి అవయవహీనుడగును. అట్లే సుకృతమును చేసినచో ఆరోగ్యవంతుడుగా, దీర్ఘజీవిగా, సుఖవంతుడుగా, సర్వసిద్ధి సంపన్నుడుగా నగుమ.

ఇప్పుడు చెప్పిన దంతయు సామాన్యమైనది. ఇక విశేషవిషయమును వినుము.

సుదుర్లభా సుభగ్యం చ పురాణేషు శ్రుతిష్వపి

 దుర్లభా మానవీ జాతిః సర్వజాతీషు భారతే

 సర్వేభ్యో బ్రాహ్మణః శ్రేష్ఠ ప్రశస్తః, సర్వ కర్మసు

 విష్ణుభక్త ద్వీజివ గరీయాన్ భారతే తతః

నిష్కామశ్చ సకామశ్చ వైష్ణవో ద్వివిధః సతి

సకామశ్చ ప్రధానశ్చ నిష్కామో భక్త ఏవచ

 కర్మభోగీ సకామశ్చ నిష్కామో నిరుపద్రవ:

స యాతీ దేహం త్యక్త్యా చ పదం విష్ణోర్నిరామయం

 పునరాగమనం సొస్తి తేషాం నిష్కామినాం సతి

 యే సేవంతే చ ద్విభుజం కృష్ణమాత్మానమీశ్వరం

 గోలోకం యాంతి తే భక్తా దివ్యరూపవిధారిణః

 యే చ నారాయణం భక్తా సేవంతే చ చతుర్భుజం

 వైకుంఠం యాంతి తే సర్వే దివ్య రూప విధారిణః

సకామీనో వైష్ణవాశ్చ గత్వా వైకుంఠమేవచ

భారతం పునరాయాంతి తేషాం జన్మ ద్విజాదిషు

 కాలేన తే చ నిష్కామా భవిష్యంతి క్రమేణ చ

భక్తిం చ నిర్మలాం బుద్ధిం  తేభ్యో దాస్యతి నిశ్చితం

బ్రాహ్మణాద్వైష్ణవా దన్యే సకామాః సర్వజన్మసు

 న తేషాం నిర్మలా బుద్ధిః విష్ణుభక్తి వివర్జితా

సమస్త జీవులలో భారతదేశమున పుట్టిన మానవజాతి చాలా శ్రేష్ఠమైనది. ఆ మానవులలో కూడ బ్రాహ్మణజాతీ చాలా గొప్పది. వారిలో కూడ విష్ణుభక్తుడైన బ్రాహ్మణుడు చాలా గొప్పవాడు.

ఆ విష్ణుభక్తులు రెండు విధములుగానుందురు. ఒకరు నిష్కాములు. ఇంకొకరు సకాములు. కోరికలు గల విష్ణుభక్తులు ప్రధానమైన వారైనప్పటికీ నిష్కాములైన పోరు అసలైన విష్ణుభక్తులు. సకాముడైన విష్ణుభక్తుడు కర్మఫలములననుభవించుచు సుఖముగానుండును. నిష్కామిటైన విష్ణుభక్తుడు దేహత్యాగము చేసిన తరువాత విష్ణులోకమునకు వెళ్ళును. నిష్కామియగు విష్ణుభక్తుడు వైకుంఠమున ఎల్లప్పుడు ఉండును. ద్విభుజాడైన శ్రీకృష్ణపరమాత్మను సేవించు నిష్కామియగు భక్తుడు దివ్యరూపమును ధరించి గోలోకముననుండును. చతుర్భుజుడైన నారాయణుని సేవించు నిష్కామీ భక్తుడు దీవ్యరూపమును ధరించి వైకుంఠమునకు వెళ్ళును. వారు సదా ఆ లోకములందే ఉండి పరమాత్మను సేవించుచుందురు.

సకాములైన వైష్ణవులు వైకుంఠమునకు పోయినను తిరిగి భారతదేశమునకు వచ్చి ద్విజాతులలో పుట్టుదురు. వారు కాలము గడిచిన కొలది నిష్కాములగుదురు. శ్రీహరి వారికి నిర్మలమైన భక్తిని ఇచ్చును.

బ్రాహ్మణులు వైష్ణవులు కాని వారందరు అన్ని జన్మలలో సకాముకులై ఉందురు. వారికి నిర్మలమైన భక్తి యుండదు. విష్ణుభక్తి కూడ ఉండదు.

 తీర్ణాశ్రితా ద్వీదా యే తపస్యానిరతాః సతి

తే యాంతి బ్రహ్మలోకం చ పునరాయాంతీ భారతం

 స్వధర్మ నిరతా విప్రాః సూర్యభక్తాశ్చ భారతే

వ్రజంతి సూర్యలోకం తే పునరాయాంతి భారతం

 స్వధర్మనిరతాః విప్రాః శైవాః శాక్తాశ్చ గాణపాః

తే యాంతి శివలోకం చ పునరాణాంతి భారతం

 యే విప్రా అన్య దేవేష్టాః స్వధర్మనిరతాః సతీ

 తే గత్వా శక్రలోకం చ పునరాయాణాంతి భారతం

హరిభక్తాశ్చ నిష్కామా? స్వధర్మ రహితాః ద్విజాః

 తేఽపి యాంతీ హరేర్లోకం క్రమాద్భక్తి బలాదహో

స్వధర్మ రహితా విప్రాః దేవాన్యసేవినః సదా

 భ్రష్టాచారాశ్చ బాలాశ్చ తేయాంతి నరకం ధ్రువం

 స్వధర్మనిరతాశ్చైవం వర్ణాశ్చత్వార ఏవచ

 భవం త్యేవ శుభస్యైవ కర్మణః ఫలభాగినః

స్వధర్మ రహితాస్తే చ నరకం యాంతి హి ధ్రువం

 భారతే చ భవంత్యేవ కర్మణ: ఫలభాగినః

పుణ్య తీర్థములలోనుండి తపస్సు చేసికొను ద్విజులు బ్రహ్మ లోకమునకు వెళ్ళి ఆ పుణ్యఫలము తీరగానే భారతదేశమునకు తిరిగి వత్తురు. తమ ధర్మము సదా ఆచారించు సూర్యభక్తులైన బ్రాహ్మణులు సూర్యలోకమునకు పోయి వారి పుణ్యఫలము పూర్తియైన వెంటనే భారతదేశమునకు తిరిగివత్తురు. తమ ధర్మమును ఎల్లప్పుడు వదలక ఆచరించు శైవులు, శక్తి నుపాసించువారు శివలోకమగు కైలాసమును చేరుకొని వారి పుణ్యఫలము తీరిన వెంటనే భారత దేశమునకు తిరిగి వత్తురు. తమ ధర్మమును తప్పక, అనుష్ఠించు అన్య దేవతా భక్తులగు బ్రాహ్మణులు స్వర్గలోకమును చేరి పుణ్యము క్షీణింపగా భారతదేశమునకు తిరిగి చేరుకొందురు.

శ్రీహరి భక్తులు, నిష్కాములైన బ్రాహ్మణులు తమ ధర్మము ఆచరింపక నిర్లక్ష్యము చేసినను శ్రీహరి భక్తి బలమున వైకుంఠమునకు తప్పక చేరుదురు. స్వధర్మమును వదలి ఇతర దేవతలను పూజించు బ్రాహ్మణులు భ్రష్టాచారులై నరకమునకు తప్పక పోదురు.

స్వధర్మము సదా అనుష్టించు చతుర్వర్ణములవారు వారు చేసి కొన్న పుణ్యఫలముననుభవింతురు. స్వధర్మమును వదలి పెట్టిన అన్ని వర్ణములవారు నరకమునకు తప్పక పోదురు. అచ్చట వారి కర్మఫలము తీరినవెంటనే భారతభూమికి తిరిగి వత్తురు.

స్వధర్మనిరతా ఏప్రా స్వధర్మనిరతాయ చ

 కన్యాం దదతి ఏప్రాయ చంద్రలోకం ప్రజంతి తే

వసంతి తత్రతే సాధ్వి యావదింద్రాశ్చతుర్ధశ

సాలంకృతా యా దానేన ద్విగుణం ఫలముచ్యతే

 సకామా యాంతి తల్లోకం న నిష్కామాశ్చ వైష్ణవాః

 తే ప్రయాంతి విష్ణులోకం ఫలసంధాన వర్జితాః

గవ్యం చ రజతం భార్యాం వస్త్రం సస్యం ఫలం జలం

 యే దదత్యేవ ఏప్రేభ్యః తల్లోకం ఏ వ్రజంతీ చ

వసంతి తే చ తల్లోకం యావన్మన్వంతరం సతీ

 కాలం చ సుచిరం వాసం కుర్వంతి తత్రతే జనాః

 యే దదతి సువర్ణం చ గాంచ  తామ్రాదికం సతీ

తే యాంతి సూర్యలోకం చ శుచయే బ్రాహ్మణాయ చ

 వసంతి తత్ర తే లోకే వర్షాణామయుతం సతీ

 విపులే చ చీరం వాసం కుర్వంతి చ నిరామయాః

దదాతి భూమిం విప్రేభ్యో ధాన్యాని విపులాని చ

 స యాతి విష్ణులోకం చ శ్వేత ద్వీపం మనోహరం

తత్రైవ నివసత్యేవ యావచ్చంద్ర దివాకరౌ

 విపులం విపులే వాసం కరోతి పుణ్యవాన్ సతి

తమ ధర్మములను ఎల్లప్పుడు అనుష్ఠించు బ్రాహ్మణుడు స్వధర్మ నిరతుడైన బ్రాహ్మణునకు తన కన్యకనిచ్చి పెండ్లిచేయునో అతడు పదునల్గురు దేవేంద్రుల కాలము వరకు చంద్రలోకమున ఉండును. అట్లే ఆభరణసహితయైన (పాలంకృత) కన్యాదానము చేసినచో పై దానికి రెట్టింపు ఫలితముననుభవించును. సకాములైన బ్రాహ్మణులు పై విధముగా చంద్రలోకమునకు పోపుదురు. కానీ నిష్కాములైన వైష్ణవులు ఫలమేమి కోరక కన్యాదానము చేసినచో వైకుంఠమునకు పోవుదురు. గవ్యమును (ఆవుపాలు, పెరుగు, నేయి మొదలగు వాటిని) వెండిని, వస్త్రమును, సస్యమును, పండ్లను, మంచినీటిని కన్యకను బ్రాహ్మణులకు దానము చేసిన వారు మన్వంతర కాలము వరకు చంద్రలోకమున నివసింతురు.

బంగారమును, ఆవులను, రాగి మొదలగు వస్త్రములను ఎవరు పరిశుద్ధుడైన బ్రాహ్మణునకు దానము చేయుదురో వారు పదివేల సంవత్సరముల వరకు సూర్యలోకమున చక్కని ఆరోగ్యముతోనుందురు, భూమిని, ధాన్యమును బ్రాహ్మణులకు దానము చేసినవాడు సూర్యచంద్రులున్నంతవరకు విష్ణులోకమైన శ్వేత ద్వీపమున నుండును.

గృహం దదతి విప్రాయ యే జనా భక్తి పూర్వకం

 తే యాంతి సురలోకం చ చిరం తత్ర భవంతి తే

గృహరేణు ప్రమాణాబ్దం దానం పుణ్యదినే యది

 విపులం విపులేవాసం కుర్వంతి మానవాః సతి

యస్మై యస్మై చ దేవాయ యో దదాతీ గృహం నరః

స యాతి తస్యలోకం చ రేణుమానాబ్దమేవచ

 సౌధ చతుర్గుణం పుణ్యం పూర్తే శతగుణం ఫలం

ప్రకృష్టేఽష్టగుణం తస్మాదిత్యాహ కమలోద్భవః

యో దదాతి తడాగం చ సర్వభూతాయ భారతే

 స యాతి జనలోకం చ వర్షాణామయుతం సతి

 వాప్యాం ఫలం శతగుణం ప్రాప్నోతి మానవస్తతః

 తథా సేతుప్రదానేన తడాగస్య ఫలం లభేత్

ధనుశ్చతుసహస్రేణ దైర్ఘ్యమానేన నిశ్చితం

న్యూనా వా తావతీ ప్రస్థే సా వాపీ పరికీర్తితా

దశవాపీమా కన్యా యది పాత్రే ప్రదీయతే

ఫలం దదాతి ద్విగుణం యది సాలంకృతా భవేత్

స్వధర్మనిరతుడైన బ్రాహ్మణునకు భక్తితో ఇల్లును కట్టి దానము చేసినచో వారు చాలా కాలము స్వర్గలోకమున సుఖింతురు. దీనినే పుణ్యదినమున దానము చేసినచో ఆ ఇల్లు ఎన్ని రేణువులతో నిర్మితమైనదో అన్ని సంవత్సరములు స్వర్గలోకమున సుఖముగా నుందురు.

దేవాలయములు కట్టించినవారు ఆ దేవాలయము యొక్క రేణువులెన్ని యున్నచో అన్ని సంవత్సరములు ఆయా దేవతలలోకమున నివసింతురు. చక్కని దేవాలయమును కట్టి దానము చేసినచో సామాన్య దేవాలయ దానము కంటే నాలుగురెట్లు అధికమైన పుణ్యము పొందును. పూర్తమును (వాపీ, కూప తటాకము, దేవాలయాది నిర్మాణము, అన్నదానము, తోటలు పెట్టుట) చేసినచో పై దానికంటే వందరెట్లు ఎక్కువ ఫలితము లభించును. పుణ్య తీర్థమున చేసిన దానము పై దాని కంటే ఎనిమిది రెట్లెక్కువ పుణ్యమును కలిగించునని బ్రహ్మదేవుడు పేర్కొనెను.

చెరువును తవ్వి ప్రజలందరకు దానము చేసిన మానవుడు పది వేల సంవత్సరాలు జనలోకమున నివసించును. స్లోల్లువేల ధనువుల పొడవు వెడల్పు (నాలుగు హస్తములు పొడవు ఒక ధనువు) కల దానిని వాపీ (బావి) యందురు. అట్టి వాహిని నిర్మించి ప్రజలకు దానము చేసినచో అది తటాక పుణ్యము కంటే వందరెట్లెక్కువ పుణ్యమును పొందును. ఆనకట్టను కట్టినచో తటాకపుణ్యమునే పొందును. తగిన వరునకు కన్యాదానము చేసినచో పది బావుల పుణ్యము లభించును. అదే సాలంకృత కన్యాదానము చేసినచో దానికంటే రెట్టింపు పుణ్యమును పొందును.

 తత్ఫలం చ తడాగే చ పంకోద్ధారేణ తత్ఫలం

వాప్యాశ్చ పంకోద్ధారేణ వాపీ తుల్యఫలం లభేత్

 ఆశ్వత్థ వృక్షమారోప్య ప్రతిష్ఠాం చ కరోతి యః

స యాతి తపసో లోకం వర్షాణామయుతం పరం

పుష్పోద్యానం యోదదాతి సావిత్రి సర్వభూతయే

 స వసేత్ ధ్రువే లోకే వర్షిణామయుతం ధ్రువం

యో దదాతి విమానంచ విష్ణవే భారతే సతి

విష్ణులోకే వసేత్సోఽపి యావన్మన్వంతరం పరం

 చిత్రయుక్రే చ విపులే ఫలం తస్య చతుర్గుణం

 రథార్థం శిబికా దానే ఫలమేవ లభేధ్ద్రువం

యో దదాతి భక్తియుక్తో హరయే దోలమందిరం

 విష్ణులోకే వసేత్సోఽపి యావన్మస్వంతరం పరం

 రాజమార్గం సౌధయుక్తం యః  కరోతి పతివ్రతే

 వర్షాణామయుతం సో  శకలోకే మహీయతే

 బ్రాహ్మణేభ్యోఽపి దేవేభ్యో దానే సమఫలం భవేత్

 యచ్చదత్తం హి తద్భోక్తుర్న దత్తం నోపతిష్ఠతే

 భుక్త్యా స్వర్గాదికం సౌఖ్యం పునరాణాంతి భారతే

 లభేద్విప్రకులేష్వేవ క్రమేణైవోత్తమాదిషు

భారతే పుణ్యవాన్ విప్రో భుక్త్యా స్వర్గాదికం పరం

పున: సోఽపి భవేద్విప్రో న పునః క్షత్రియాదయః

చెరువును తవ్వించినచో సాలంకృత కన్యాదానము చేసిన ఫలమును పొందును. చెరువులోని బురదనంతా తీసివేసినచో చెరువు తవ్విన ఫలము లభించును. బావిలోని బురదనంతయు తీసివేసినచో బావి తవ్విన ఫలితమును పొందును. రావిచెట్టును పాతి, ప్రతిష్ఠ చేసినచో తపోలోకమున పదివేల సంవత్సరములు సుఖముగానుండును, ఉద్యానవనమును నిర్మించిన వాడు ధ్రువలోకమున పదివేల సంవత్సరములు సుఖముగానుండును.

ఈ భారత దేశమున విష్ణ్యాలయముపై విమానమును (శిఖరమును) నిర్మించినచో విష్ణులోకమున మన్వంతర కాలముండును. ఆ విమానమును చిత్రములతో (ప్రతిమలతో) అలంకరించి నిర్మించినచో నాలుగు మన్వంతరములు విష్ణులోకమున నుండును. విష్ణుమూర్తికై పల్లకిని నిర్మించి దానము చేసినవాడు విమానమును నిర్మించినంత ఫలితమును పొందును. శ్రీహరికై ఊయల మండపమును నిర్మించినవాడు వైకుంఠమున మన్వంతర కాలముండును.

సౌధములున్న (ధర్మశాలలు) రాజమార్గమును నిర్మించినవాడు పదివేల సంవత్సరములు స్వర్గలోకమున సుఖముగా నుండును. దేవతలకు దానము చేసినను, బ్రాహ్మణులకు దానము చేసినను సమానమైన ఫలితమే కలుగును. తాను ఈ జన్మముననే పూర్వ జన్మముననో చేసిన దాన ఫలముననుభవించును, దానమే చేయని వానికి దానఫలము ఏవిధముగా కలుగును? అందువలన దానము చేసినచో తత్ఫలమైన స్వర్గాది సుఖములననుభవించి తిరిగి భారతదేశమున జన్మించును. ఆతడు చేసిన పుణ్యకర్మలననుసరించి బ్రాహ్మణుల ఇంటిలోనో ఉత్తములైన వారి ఇంటిలోనో జన్మించును. ఈ భారతదేశమందలి బ్రాహ్మణుడు పుణ్యకర్మలు చేసి తత్ఫలితమైన స్వర్గాదిలోక సౌఖ్యములననుభవించి తిరిగి బ్రాహ్మణుడుగానే పుట్టును.

క్షత్రియో వాపీ వైశ్యోవా కల్పకోటి శతేన చ

 తపసా బ్రాహ్మణత్వం చ నప్రాప్నోతి శ్రుతౌ శ్రుతం

 స్వధర్మ రహితా విప్రా నానా యోనిం ప్రజంతి చ

భుక్త్యా చ కర్మభోగం చ విప్రయోనిం లభేత్పున

నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి

అవశ్యమేవ భోక్తవ్యం కల్పకోటి శతైరపి

 అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం

 దేవ తీర్థ సహాయేన కాయవ్యూహేన శుద్ధ్యతి

ఏతత్తే కథితం సర్వం కిం భూయః శ్రోతుమిచ్ఛసి

తమతమ విధ్యుక్త ధర్మములను వదిలి పెట్టిన బ్రాహ్మణులు అనేక జన్మలెత్తి తాము చేసికొన్ని కర్మభోగముల ననుభవించి తిరిగి బ్రాహ్మణ వంశముననే పుట్టుదురు.

తాము చేసిన కర్మ శుభమైనా అశుభమైనా ఎన్ని కోట్ల సంవత్సరముల వరకైనా అనుభవించి తీరవలెను. అప్పుడే కర్మక్షయము కలుగును. దేవసందర్శనము, పుణ్యతీర్థ సేవనము, కాయవ్యూహముల వలన మానవుడు పరిశుద్ధుడగును.

సావిత్రి! ఇంకను నీవు వినదల్చినదేదైనా ఉన్నచో చెప్పుము. తప్పక చెప్పెదను అని యమధర్మరాజు పలికెను.

ఇతిశ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే సావిత్ర్యుపాఖ్యానే కర్మవిపాకే  కర్మానురూపస్థానగమనం నామ షడ్వింశోఽధ్యాయః

 శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున సావిత్రీ ఉపాఖ్యానములో చెప్పబడిన కర్మవిపాకమున తమ తమ కర్మల ననుసరించి పొందు స్థానముల వివరణ గల ఇరువది యారవ అధ్యాయము సమాప్తము.