బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

55 –  రాధా దేవి యొక్క పూజ, స్తోత్రాదులు

శ్రీపార్వత్యువాచ- పార్వతీదేవి ఇట్లనెను-

శ్రీకృష్ణస్యస్థితే మంత్రే చాన్యేషామీశ్వరస్య వః

కథం జగ్రాహ రాధాయాః మంత్రం వై వైష్ణవోనృపః

కిం విధానం చ కిం ధ్యానం కింస్తోత్రం కవచం చ కిం

 కం మంత్రం చ దదౌ రాజ్ఞే తాం పూజాపద్దతిం వద

ఓ మహాదేవా! నీకు, ఇతరులకు కూడ ఈశ్వరుడగు శ్రీకృష్ణమంత్రముండగా దానిని కాదని విష్ణుభక్తుడైన రాజు రాధికామంత్రము నేల గ్రహించెను.

ఆ రాధికా పూజను ఎట్లు చేయవలెను? ఆమెను ఎట్లు ధ్యానింపవలెను. ఆదేవియొక్క స్తోత్రము, కవచము ఏ తీరున ఉన్నవి? ఆ దేవిని ఉపాసించు మంత్రమేది ఈ విషయములనన్నిటినీ నాకు వివరింపుము.

శ్రీమహేశ్వర ఉవాచ- మహాదేవుడిట్లనెను-

హేవిప్ర కం భజామీతీ ప్రశ్నం కుర్వతి రాజనీ

శీఘ్రం ప్రాపయ గోలోకం కస్యారాధనతో మునే

 ఇత్యుక్తవంతం రాజేంద్రమువాచ బ్రాహ్మణోత్తమః

తత్సేవయా చ తల్లోకం ప్రాప్స్యసే బహుజన్మతః

తత్రాణాధిష్ఠాతృదేవీం భజ రాధాం పరాత్పరాం

కృపామయీప్రసాదేన శ్రీఘం ప్రాప్నోషి తత్పదం

ఇత్యుక్త్వా రాధికమంత్రం దదౌ తస్మై షడక్షరం

ఓం రాధేతి చతుర్థ్యంతం వహ్నిజాయాంతమేవచ

ప్రాణాయామం భూతశుద్ధిం మంత్రన్యాసం తథైవ చ

కరాంగన్యాస మేవం చ ధ్యానం సర్వసుదుర్లభం

స్తోత్రం చ కవచం తం చ శిక్షయామాస భక్తితః

రాజా తేన క్రమేణైవ జజాప పరమం మనుం

ధ్యానం చ సామవేదోక్తం మంగళానాం చ మంగళం

కృష్ణస్తాం పూజయామాస పురా ధ్యానేన యేనచ

సుయజ్ఞ మహారాజు బ్రాహ్మణునితో ఆర్యా నేనెవరిని సేవింపవలెను? ఏదేవతను ఆరాధించినచో త్వరగా నేను గోలోకమును పొందగలనో ఆ దేవతామంత్రము నాకు ఉపదేశింపుడని బ్రాహ్మణుని ఆడుగగా సుతపుడను ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని ఆరాధించినచో అనేక జన్మలకు ఆతడుండు గోలోకమును చేరుకొందువు. కాని శ్రీకృష్ణునకు ప్రాణవల్లభయగు రాధికాదేవిని సేవించిన, కృపామూర్తియగు ఆ తల్లియొక్క అనుగ్రహమువలన నీవు గోలోకమును త్వరగా పొందుదువని చెప్పెను.

తరువాత ఆ మహారాజునకు షడక్షరమైన రాధికాదేవి మంత్రమునుపదేశించెను. ఆమంత్రము ఓంకారపూర్వమై చతుర్థి విభక్తి చివర కలిగియున్న రాధాశబ్దమునకు వహ్నిజాయయగు స్వాహాకారాంతమై (ఓం రాధికాయై స్వాహా) ఉండును.

ఆ మంత్రమును ప్రాణాయామము, భూతశుద్ధి, మంత్రన్యాసము, అంగన్యాసము, కరన్యాసము మొదలగు వాటితో ధ్యానించవలయునని ఆ దేవియొక్క స్తోత్రమును, కవచమును బోధించెను. సుయజ్ఞుడు తన మంత్రగురువగు సుతపుడు చెప్పినట్లు రాధీకామంత్రమును జపించెను. అట్లే శ్రీకృష్ణుడు రాధికాదేవిని ఏరీతిగా ధ్యానము చేసెనో సామవేదమున రాదాదేవి ధ్యానమేరీతిగా కలదో ఆ పద్ధతిలో రాధాదేవిని ధ్యానించెను.

శ్వేతచంపక వర్ణాభాం కోటిచంద్రసమప్రభాం

శరత్పార్యణచంద్రస్యాం శరత్పంకజ లోచనాం

సుశ్రోణీం సునితంబాంచ పక్వబింబాధరాం వరాం

ముక్తాపంక్తి ప్రతినిధి దంతపంక్తి మనోహరాం

ఈషద్ధాస్య ప్రసన్నాస్యాం భక్తానుగ్రహ కారికాం

వహిశుద్ధాంశుకాధానం రత్నమాలా వీభూషితాం

రత్నకేయూరవలయాం రత్నమంజీర రంజితాం

రత్నకుండల యుగ్మేన విచిత్రేణ విరాజితాం

 సూర్యప్రభాప్రతికృతి గండస్థల విరాజితాం

ఆమూల్యరత్నఖచిత గ్రైవేయక విభూషితాం

సద్రత్నసారఖచిత కిరీట ముకుటోజ్వలాం

బభ్రతీం కబరీభారం మాలతీమాల్య శోభితాం

రూపాధిష్ఠాతృదేవీం చ మత్తవారణగామినీం

 గోపీభిః సుప్రియాభిశ్చ సేవితాం శ్వేత చామరైః

 కస్తూరీబిందుభి: సార్థమర్ధచందన బిందునా

సిందూరబిందునా చారుసీమంతాధః స్థలోజ్వలాం

నిత్యం సుపూజితాం భక్త్యా కృష్ణైన పరమాత్మనా

కృష్ణసౌభాగ్య సంయుక్తాం కృష్ణప్రాణాధికాం వరాం

కృష్ణప్రణాధిదేవీం చ నిర్గుణాంచ పరాత్పరాం

మహావిష్ణు వీధాత్రీం చ ప్రదాత్రీం సర్వసంపదాం

కృష్ణభక్తి ప్రదాంశాంతాం మూలప్రకృతి మీశ్వరీం

వైష్ణవం విష్ణుమాయాం చ కృష్ణప్రేమమయీం శుభాం

రాసమండల మధ్యస్థాం రత్నసింహాసన స్థితాం

రాసే రాసేశ్వర యుతాం రాధాం రాసేశ్వరీం భజే

 రాధాదేవి ధ్యానశ్లోకములలో ఈవిధముగా వర్ణింపబడినది. ఆ దేవి తెల్లని చంపకపుష్పములవలె తెల్లగానుండును. శరత్కాలమందలి పూర్ణిమాచంద్రుని వలె నిండైన ముఖముగలది. ఆమె నేత్రములు సైతము శరత్కాలమందలి పద్మములవలె శోభించుచుండును. చక్కని నడుము, నితంబములు కలది. ఆ దేవి పెదవులు పండిన దొండపండువలె ఎజ్జగా నుండును. ఆ దేవి దంతములు ముత్యాల వరుస వలెనుండును. ఆమె ఎల్లప్పుడు చిరునవ్వుతో ప్రసన్నముగానుండును. భక్తులననుగ్రహించును. పరిశుద్ధమైన వస్త్రమును, రత్నమాలలను, రత్నకేయూరములను, రత్నమంజీరములను, రత్నకుండలములను ఆమె ఎల్లప్పుడు ధరించును. సూర్యకాంతివంటి కాంతిగల చెక్కీళ్ళతో ఆ దేవి అమూల్యములైన రత్నములున్న కంఠాభరణమును, మంచి రత్నములుగల కిరీటమును, రత్నముల యుంగరమును, రత్నపాశమును మాలతీ మాలచే అలంకరింపబడిన కొప్పును ధరించుచున్నది. ఆదేవి సురూపమునకు ఆధిష్టాన దేవత. మదించిన ఏనుగువంటి నడకగలది. ఆ దేవిని గోపికలు చెలికత్తెలు, తెల్లని చామరములు వీయుచు సేవింతురు. ఆమె పాపిటలో కస్తూరి బిందువులు దానికింద ఆర్ధచందనపు చుక్క దానికింద సింధూరపు చుక్కలున్నవి. ఆ తల్లిని పరమాత్మయగు శ్రీకృష్ణుడే ప్రతిదినము ఆరాధించుచుండును. శ్రీకృష్ణునకు ప్రాణములకంటే మిన్నయైనది. ఆమె నిరుణ, పరాత్పర, సమస్తసంపదల నొసగునదీ. మహావిష్ణువునకు మాత, శ్రీకృష్ణునియందు భక్తిని కలిగించునది. మూలప్రకృతి రూపిణి, ఈశ్వరి, వైష్ణవి, విష్ణుమాయ, శ్రీకృష్ణ ప్రేమరూపిణి. ఆ మహాదేవి రాసమండలమున రత్నసింహాసనమున రాసేశ్వరుడగు శ్రీకృష్ణునితో కలిసియున్నట్లు ధ్యానించుచు ఆమెను సేవింపవలెను.

ధ్యాత్వాపుష్పం మూర్ద్నీ దత్వా పునర్ద్యాయేత్ జగత్ర్పభుం

దద్యాత్ పుష్పం పునర్ద్యాత్వా చోపచారాణి షోడశ

ఆసనం వసనం పాద్యమర్ఘ్యం గంధానులేపనం

ధూపం దీపం సుపుష్పం చ స్నానీయం రత్నభూషణం

 నానాప్రకారనైవేద్యం తాంబూలం వాసితం జలం

మధుపర్కం రత్నతల్పముపచారాణి షోడశ

ప్రత్యేకం వేదమంత్రేణ దత్తం భక్త్యా చ భూభలో

మంత్రాంశ్చ శ్రూయతాం దుర్గే వేదోక్తాన్ సర్వసమ్మతాన్

రాధాదేవిని పై విధముగా ధ్యానించి ఆదేవి శిరస్సుపై పుష్పమునుంచి జగత్ర్పభువగు శ్రీకృష్ణుని కూడ ధ్యానింపవలెను. ఆ తరువాత మరల ఆ దేవి శిరస్సుపై పుష్పమునుంచి ఆమెను ధ్యానము చేయవలెను. అటుపిమ్మట షోడశోపచారములతో ఆమెను పూజింపవలెను.

షోడశోపచారములేవనగా ఆసనము, వస్త్రము, పాద్యము, అర్యము, గంధానులేపనము, ధూపము, దీపము, పుష్పము, స్నానము, రత్నభూషణములు, అనేక విధములైన నైవేద్యములు, తాంబూలము, సువాసనలగల జలము, మధుపర్కము, రత్నశయ్య అనునవి. వీటిని ప్రత్యేక ప్రత్యేకముగా వేదమంత్రములతో సుయజ్ఞుడు చేసెను.

ఓ పార్వతి ఈ షోడశోపచారములు చేయునపుడు ఉచ్చరిపంవలసిన మంత్రములు వేదమున చెప్పబడినవి. అవి అందరికి ఆన్ని సమయములందు సమ్మతమైనవి. ఆ మంత్రములివి.

సింహాసన మంత్రము-

రత్నసారవికారం చ నిర్మితం విశ్వకర్మణా

వరం సింహాసనం రమ్యం రాధే పూజాను గృహ్యతాం

ఓరాధాదేవీ! నేను సమర్పించుచున్న ఈ ఆసనమును విశ్వకర్మ మంచి రత్నములను కూర్చి ఆందముగా నిర్మించెను. దీనిని పూజయందు నీవు స్వీకరింపుము.

వస్త్రమంత్రము-

అమూల్యరత్నఖచితమమూల్యం సూక్ష్మమేవ చ

వహ్నిశుద్ధం నిర్మలం చ వసనం దేవి గృహ్యతాం

ఓ దేవి! ఈ వస్త్రము అమూల్యములైన రత్నములు కలది. చాలా పలుచనిది. మిక్కిలి పరిశుద్ధమైనది. ఇట్టి వస్త్రమును నీవు అంగీకరింపుము.

పాద్య మంత్రము-

సద్రత్నసారపాత్రస్థం సర్వతీర్ధోదకం శుభం

పాదప్రక్షాళనార్థం చ రాధే పాద్యం చ గృహ్యతాం

ఓ తల్లీ! నీయొక్క పాదములను కడుగవలయునని మంచి రత్నములచే ఖచితమైన పాత్రలో సమస్త పుణ్యతీర్థములనుండి ఉదకమును తెచ్చితిని, నీవు ఈ పాద్యమును తీసికొమ్ము.

అర్ఘ్యమంత్రము-

దక్షిణావర్త శంఖస్థం సగూర్వాపుష్పచందనం

పూతయుక్తం తీర్థతోయై రాధేఽర్ఘ్యం ప్రతిగృహ్యతాం

ఓదేవి! నీకై దక్షిణావర్త శంఖమున గజుక, పుష్పములు, చందనములతో సువాసీతమై, పుణ్యతీర్థముల నీరుకావున పవిత్రమైన ఈ అర్ఘ్యమును స్వీకరింపుము. గంధమంత్రము-

పార్థివద్రవ్య సంభూతం ఆతీవసురభీకృతం

మంగళార్హం పవిత్రం చ రాధే గంధం గృహాణ మే

భూమీయందు దొరుకుచున్న సువాసన ద్రవములతో మిక్కలి వాసనగలదీ, పవిత్రమైనది, మంగళకార్యములందు అర్హమైన గంధమును ఓ రాధాదేవి! నీవు గైకొనుము.

ఆమలేపనమంత్రము-

శ్రీఖండచూర్ణం సుస్నిగ్ధం కస్తూరీ కుంకుమాన్వితం

సుగంధయుక్తం దేవేశి గృహ్యతామనులేపనం

కస్తూరి కుంకుమలు కలదీ, చిక్కనిది అగు ఈ చందన చూర్ణము మంచి సువాసన కలిగియున్నది. దీనితో చేయు అనులేపనమును ఓ దేవేశి! నీవు గ్రహింపుము. ధూపమంత్రము-

వృక్షనిర్యాససంయుక్తం పార్థివ ద్రవ్యసంయుతం

అగ్నిఖండశిఖాజాతం ధూపం దేవి గృహాణ మే

ఓదేవి! ఈధూపము చెట్లనుండి వచ్చు జీగురు, భూమి పై దోరుకు సువాసన ద్రవ్యములు కలిసి నిప్పువలన వెలువడుచున్నది. దీనిని నీవు దయతో స్వీకరింపుము.

దీపమంత్రము-

అంధకారే భయహరమమూల్యమణిశోభితం

రత్నప్రదీపం శోభాడ్యం గృహాణ పరమేశ్వరి

ఓ పరమేశ్వరి! చీకటియందు కలుగు భయమును పోగొట్టునది. అమూల్యమణులచే శోభిల్లు ఈ రత్న దీపమును దయతో నీవు స్వీకరింపుము.

పుష్పమంత్రము-

 పారిజాతప్రసూనం చ గంధ చందన చర్చితం

అతీవ శోభనం రమ్యం గృహ్యతాం పరమేశ్వరి

ఓ పరమేశ్వరి! గంధము చందనములు కలది చాలా అందమైన ఈ పారిజాతపుష్పమును సమర్పించుచున్నాను. దీనిని నీవు ప్రతిగ్రహింపుము.

స్నానీయమంత్రము-

సుగంధామలకీచూర్ణం సుస్నిగ్ధం సుమనోహరం

విష్ణుతైల సమాయుక్తం స్నానీయం దేవిగృహ్యతాం

ఓదేవి! విష్ణుతైలము గలది, సుమనోహరమైనది అగు సువాసనగల ఉసిరిక పప్పుయొక్క పిండిని తెచ్చితిని. ఈ నలుగుపిండిని నీవు స్వీకరింపుము.

భూషణమంత్రము-

అమూల్యరత్నఖచితం కేయూరవలయాదికం

శశ్వత్సుశోభనం రాధే గృహ్యతాం భూషణం మమ

ఓదేవి! నేనొసగు ఈ కేయూరములు హస్తవలయములు (గాజులు) మొదలగు భూషణములు అమూల్యమైన రత్నములచే నిర్మితమైనవి. ఎల్లప్పుడు శోభను కలిగించు వీటిని నీవు స్వీకరింపుము.

నైవేద్యముంత్రము-

కాలదేశోద్భవం పక్వఫలం వై లడ్డుకాదికం

పరమాన్నం చ మిష్టాన్నం నైవేద్యం దేవి గృహ్యతాం

ఆయా కాలములందు ఆయా ప్రదేశములలో పండు ఫలమును, లడ్డులు మొదలైనవాటిని, పరమాన్నమును, మృష్టాన్నమును నైవేద్యముగా నీవు స్వీకరింపుము.

తాంబూల మంత్రము-

తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితం

సర్వభోగాదీకం స్వాదు తాంబూలం దేవిగృహ్యతాం

ఓదేవి! ఈ తాంబూలము కర్పూరాది సుగంధ ద్రవ్యములతో వాసన కలిగియున్నది. రుచిగల ఈ తాంబూలమును నీవు గ్రహింపుము.

అన్నమంత్రము-

అశనం రత్న పాత్రస్థం సుస్వాదు సుమనోహరం

మయానివేదితం భక్త్యా గృహ్యతాం పరమేశ్వరి

ఓదేవి! రత్నపాత్రలో మనోహరము రుచియైన అన్నమును నీకు నివేదన చేయుచున్నాను. దీనిని దయతో స్వీకరింపుము.

శయ్యామంత్రము-

రత్మేంద్రసారఖచితం వహ్నిశుద్ధాంశుకాన్వితం

పుష్పచందన చర్చాఢ్యం పర్యంకం దేవి గృహ్యతాం

ఓ తల్లీ! నీకు రత్నములచే నిర్మింపబడిన మంచమును సమర్పించుచున్నాను. దీనిపై పరిశుద్దమైన వస్త్రముకలదు. ఆందు పుష్పములు చందనము చల్లితినీ. ఇట్టి పర్యంకికాయుక్తమైన శయ్యను నీవు పరిగ్రహింపుము.

ఏవం సంపూజ్య దేవీం తాం దద్యాత్పుష్పాంజలిత్రయం

యత్నేన పూజయేద్దేవీం నాయికొశ్చ వ్రతే ప్రతీ

ప్రాగాది క్రమయోగేన దక్షిణావర్తత: ప్రియే

భక్త్యా పంచోపచారేణ సుప్రీయా: పరీచారీకా:

మాలవతీం పూర్వకోణే వహ్నికోణే చ మాధవీం

దక్షిణే రత్నమాలాం చ సుశీలాం నైఋతే సతీం

పశ్చిమే వై శశికళాo పారిజాతాం చ మారుతే

పద్మావతిముత్తరే చాథైశాన్యాం సుందరీం తథా

యూధిక మాలతీ పద్మమాలా దద్యాద్యో వ్రతే వ్రతీ

పరిహారం చ కురుతే సామవేదోక్తమేవ చ

పై విధముగా రాధాదేవిని షోడశోపచారములచే పూజించి ఆ దేవికి మూడుమార్లు పుష్పాంజలిని సమర్పింపవలెను. ఇట్లు రాధాదేవిని పూజించి అటుపిమ్మట దేవికి మిక్కిలి సన్నిహితులైన పరిచారికలను తూర్పుదిశనుండి కుడివైపు అన్ని దిక్కులలోనుంచి పంచోపచారపూజ సల్పవలయును.

తూర్పుదిక్కున మాలావతిని, ఆగ్నేయ దోశయందు మాధవీనీ, దక్షిణదిశయందు రత్నమాలను, నైఋతిదిక్కున సుశీలను, పడమర దిక్కున శశికళను వాయవ్యమున పారిజాతను ఉత్తరమున పద్మావతిని, ఈశాన్య దిశయందు సుందరిని నిలిపి మల్లెలు, మాలతీపుష్పములు, పద్మముల మాలలను వారికి సమర్పించుకొని సామవేదమున కనిపించు పరిహారమును ఈ విధముగా కోరుకొనవలెను,

త్వం దేవీ జగతాం మాతా విష్ణుమాయా సనాతనీ

కృష్ణప్రాణాధిదేవీ చ కృష్ణ ప్రాణాధికా శుభా

కృష్ణ ప్రేమమయాశక్తిః కృష్ణే సౌభాగ్యరూపిణీ

  కృష్ణభక్తిప్రదే రాధే నమస్తే మంగళప్రదే

ఆద్య మే సఫలం జన్మ జీవనం సార్థకం మమ

పూజితాసి మయా సా చ యా శ్రీకృష్ణైన పూజితా

కృష్ణవక్షసి యా రాధా సర్వసౌభాగ్య సంయుతా

రాసే రాసేశ్వరీ రూపా బృందాబృందావనే వనే

కృష్ణప్రియా చ గోలోకే తులసీ కాననే తు యా

చంపావతీ కృష్ణసంగే క్రీడా చంపక కాననే

 చంద్రావళీ చంద్రవనే శతశృంగే సతీతి చ

విరజాదర్పహంత్రీ చ, విరజాతటకాననే

పద్మావతీ పద్మవనే కృష్ణా కృష్ణ సరోవరే

భద్రా కుంజకుటీరేచ కామ్యావై కామ్యకే వనే

 వైకుంఠే చ మహాలక్ష్మీర్వాణీ నారాయణోరసి

క్షీరోదే సింధుకన్యా చ మర్యే లక్ష్మీ: హరిప్రియా

సర్వస్వర్గే స్వర్గలక్ష్మీర్దేవదుఃఖ వినాశినీ

సనాతనీ విష్ణుమాయా దుర్గా శంకరవక్షసి

సావిత్రీ వేదమాతా చ కళయా బ్రహ్మవక్షసి

కళయా ధర్మపత్నీ త్వం నరనారాయణ ప్రభో:

కళయా తులసీ త్వం చ గంగా భువన పావనీ

లోమకూపోద్బవా గోప్యః కలాంశా రోహిణీ రతిః

కళాకళాంశ రూపాచ శతరూపా శచీ దీతీః

అదితిర్దేవ మాతా చ త్వత్కలాంశా హరిప్రియా

దేవశ్చ మునిపత్న్యశ్చ తత్కళాకళయా శుభే

కృష్ణభక్తిం కృష్ణదాస్యం దేహి మే కృష్ణపూజితే

ఏవం కృత్వా పరిహారం సుత్వా చ కవచం పఠేత్

పురాకృతం స్తోత్రమేతద్భక్తి దాస్యప్రదం శుభం

ఓ తల్లీ! నీవు జగన్మాతవు. విష్ణుమాయవు. సనాతనివి. శ్రీకృష్ణునకు ప్రాణాధికురాలవు, కృష్ణప్రేమ స్వరూపిణివి, శక్తివి, కృష్ణసౌభాగ్య రూపిణివి. మంగళప్రదురాలవు. శ్రీకృష్ణభక్తిని కలిగించు నీకు నమస్కారము.

శ్రీకృష్ణపరమాత్మ పూజించిన నిన్ను నేను పూజించుట నా అదృష్టమువలన జరిగినది. దీనివలన నా జన్మకు పార్థక్యమేర్పడినది, నాజన్మ సఫలమైనది.

సమస్త సౌభాగ్యములు కల నీవు శ్రీకృష్ణుని సమీపమున రాధగాను, రాసమండలమున రాసేశ్వరిగాను, బృందావనమున బృందాదేవిగాను, గోలోకమున కృష్ణప్రియగాను, తులసీవనమున తులసిగాను, శ్రీకృష్ణుని సమీపమున చంపావతిగాను, చంపకావనమున క్రీడగాను, చంద్రవనమున చంద్రావళిగాను. శతశృంగపర్వతమున సతిగాను, విరజానదియొక్క, తీరముననున్న వనమున విరజాదేవిగాను, పద్మవనమున పద్మావతిగాను, కృష్ణ సరోవరమున కృష్ణగా, కుంజకుటీరమున భద్రగా, కామ్యకవనమున కామ్యగా, సైకుంఠమున మహాలక్ష్మిగా, నారాయణుని సమీపమున సరస్వతీగా, గంగగా పాలసముద్రమున, సింధుకన్యగా, భూలోకమున శ్రీహరి. ప్రియురాలగు లక్ష్మీదేవిగా, స్వర్గమున దేవతల దుఃఖములను బాపు స్వర్గలక్ష్మిగా, శంకరుని సమీపమున సనాతని విష్ణుమాయయగు దుర్గగా, బ్రహ్మదేవుని సమీపమున నీ ఆంశరూపము వేదమాతయగు సావిత్రిగా, ఆట్లే ధర్ముని సమీపమున ఆంశరూపిణివైన ధర్మపత్నిగా, నరనారాయణులకు మాతగా, నీ కళయైన తులసిగా, గంగగా, పరమాత్మయొక్క రోమకూపములనుండి జన్మించిన గోపికలుగా, నీ ఆంశాంశాలైన శతరూప, దితి, శని, ఆదితి, మొదలగు రూపములలో నున్నావు, దేవతాస్త్రీలు, మునిపత్నులు నీ ఆంశాంశ స్వరూపాలే.

అట్టి నీవు నాకు కృష్ణభక్తిని శ్రీకృష్ణునకు సేవచేయు పరమ సౌభాగ్యమును కలిగింపుము.

ఈ విధముగా పరిహారమును చేసికొని రాధాదేవిని స్తుతించి ఆమె కవచమును చదువవలెను.

పూర్వమున చేయబడిన ఈ రాధాస్తోత్రము శ్రీకృష్ణభక్తిని, శ్రీకృష్ణ దాస్యమును, కలిగించును.

ఏవం నిత్యం పూజయేద్యో విష్ణు తుల్య: సభారతే

జీవన్ముక్తశ్చ పూతశ్చ గోలోకం యాతీ నిశ్చితం  

ఈ విధముగా ప్రతీదినము రాధాదేవిని పూజించువాడు విష్ణుమూర్తితో సమానుడగును. ఆతడు జీవన్ముక్తుడై పవిత్రుడై మరణించిన తరువాత గోలోకమునకు పోవును.

కార్తికాపూర్ణిమాయాం చ రాధాం యః పూజయేత్ శివే

ఏవంక్రమేణ ప్రత్యబ్దం రాజసూయ ఫలం లభేత్

పరమైశ్వర్యయుక్తః స్యాత్ ఇహలోకే స పుణ్యవాన్

సర్వపాపాదినిర్ముక్తో యాత్యంతే విష్ణు మందిరం

ఆదావేవ క్రమేణైవ రాసే బృందావనే వనే

స్తుతా సా పూజితా రాధా శ్రీకృష్ణేన పురాసతీ

సంపూజితా ద్వితీయే చ ధ్వాత్రా త్వేవం క్రమేణ చ

త్వద్వరేణ చ సంప్రాప్య విధాతా వేదమాతరం

నారాయణో మహాలక్ష్మీం ప్రాప సంపూజ్య భారతీం

గంగాం చ తులసీం చైవ పరాం భువన పావనీం

విష్ణుః క్షీరోదశాయీ చ ప్రాప. సింధుసుతాం తథా

మృతాయాం దక్షకన్యాయాం మయా కృష్ణాజ్ఞయా పురా

త్వమేవ దుర్గా సంప్రాప్తా పూజితా పుష్కరే చ సా

అదితిం అదితిం కశ్యప: ప్రాప చంద్ర: సంప్రాప రోహిణీం

 కామో రతిం చ సంప్రాప ధర్మో మూర్తిం పతివ్రతాం

దేవాశ్చ మునయశ్చైవ యాం సంపూజ్య పతివ్రతాం

సంప్రాపుర్యద్వరేణైవ ధర్మకామార్థమోక్షకం

ఏవం పూజావిధానం చ కథితం చ స్తవం శ్రుణు

కార్తీక మాసమున పూర్ణిమనాడు రాధాదేవిని పూజింపవలెను. ఈ విధముగా ప్రతిసంవత్సరము ఆ దేవిని పూజించినచో రాజసూయయాగ ఫలము కలుగును. ఈ లోకమున అంతులేని సంపదను పొంది పుణ్యవంతుడై పాపములు పోగా విష్ణుమూర్తి సమీపమునకు పోవును.

ఆ రాధాదేవిని ఈ విధముగా కార్తీక పూర్ణిమనాడు బృందావనమున శ్రీకృష్ణుడు పూజించెను. అటుపిమ్మట బ్రహ్మదేవుడు ఈ దేవిని శ్రీకృష్ణదేవుడు పూజించినట్లే పూజించి ఆ దేవియొక్క అనుగ్రహమువలన వేదములకు తల్లియైన సావిత్రీదేవిని భార్యగా పొందెను. అటుపిమ్మట నారాయణుడా మాతను పూజించి ఆమెయొక్క అనుగ్రహమువలన మహాలక్ష్మిని, సరస్వతీదేవిని, గంగాదేవిని. తులసీదేవిని భార్యలుగా పొందగలిగెను.

క్షీరసముద్రమున పవళించియున్న శ్రీమహావిష్ణువు సింధుసుతను భార్యగా పొందగా నేను శ్రీకృష్ణునియొక్క ఆబ్జవలన ఆ మహాదేవిని పూజించి దక్షయజ్ఞమున దక్షుని కూతురైన సతీదేవి మృతిచెందిన తరువాత నిన్ను భార్యగా పొందితిని. అట్లే కశ్యపమునీ అదితిని. చంద్రుడు రోహిణిని, మన్మథుడు రతిని, ధర్ముడు మూర్తీదేవిని, దేవతలు మునులు కూడ ఆ దేవిని పూజించి ధర్మార్థకామమోక్షములను పొందగలిగిరి.

 ఓ భవానీ! రాధాదేవి పూజావిధానమీట్లుండును.

ఏకదా మానినీ రాధా బభూవాగోచరా ప్రభో:

సంసక్తస్య తులస్యాం చ గోప్యాం చ తులసీ వనే

సా సంహృత్య స్వ మూర్తీశ్చ కళాః సర్వాశ్చ లీలయా

సర్వే బభూవుర్దేవాశ్చ బ్రహ్మవిష్ణుశివాదయః

 భ్రష్టైశ్వర్యాశ్చ నిశ్శ్రికా భార్యాహీనా హ్యుపద్రుతా:

తే చ సర్వే సమాలోచ్య శ్రీకృష్ణం శరణం యయు:

తేషాం స్తోత్రేణ సంతుష్ట స్నాత్వా సంపూజ్య తాం శుచిః

తుష్టావ పరమాత్మా స సర్వేషాం రాధికాం సతీం

శ్రీకృష్ణుడు తులసీవనములో తులసియను గోపికతో తిరుగుచుండగా రాధాదేవి చూచి అభిమానవతిగావున, తాను తనయొక్క అంశలు అంశాంశలగు దేవతా స్త్రీలందరితో కలిసి మాయమయ్యెను. అందువలన బ్రహ్మవిష్ణు శివాది దేవతలు తమతమ ఐశ్వర్యములను, కోల్పోయి భార్యావిహీనులైరి. అందువలన వారందరు కలిసి .. ఆలోచించి శ్రీకృష్ణ పరమాత్మను శరణవేడుకొనిరి. దేవతలందరు తన్ను స్తోత్రము చేయగా సంతోషపడిన శ్రీకృష్ణపరమాత్మ వారి బాధలు పోగొట్టుటకై తాను స్నానముచేసి శుచియై రాధాదేవిని పూజించి ఆమెతో ఇట్లనెను.

శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణపరమాత్మ ఇట్లనెను-

 ఏవమేవ ప్రీయోఽహం తే ప్రమోదశ్చైవ తే మయి

సువ్యక్తమద్య కాపట్యవచనం తే వరాననే

హే కృష్ణ త్వం మమ ప్రాణా జీవాత్మేతి చ సంతతం

యద్ర్బూహి నిత్యం ప్రేమ్ణా త్వం సాంప్రతం తద్గతం ద్రుతం

 తస్మాత్సర్వమలీకం తే నచనం జగదాంబికే

క్షురధారం చ హృదయం స్త్రీజాతీనాం చ సర్వతః

అస్మాకం వచనం సత్యం యద్భ్రవీమి చ తత్ ధ్రువం

పంచప్రాణాధిదేవీ త్వం రాధాప్రాణాధికేతీ మే

శక్తో న రక్షితుం త్వాం చ యాంతి ప్రాణాస్త్వయా వినా

వినాధిష్ఠాతృ దేవీం చ కోవా కుత్ర చ జీవతి

మహావిష్ణోశ్చ మాతా త్వం మూలప్రకృతిరీశ్వరీ

సగుణా త్వం చ కళయా నిర్గుణా స్వయమేవతు

జ్యోతీ రూపా నీరాకారా భక్తానుగ్రహ విగ్రహా

భక్తానాం రుచివైచిత్ర్యాన్నానామూర్తిశ్చ బిభ్రతీ

మహాలక్ష్మీశ్చ వైకుంఠే భారతీచ సతాంప్రసూః

 పుణ్యక్షేత్రే భారతే చ సతి త్వం పార్వతీ తథా

తులసీ పుణ్యరూపా చ గంగా భువన పావనీ

బ్రహ్మలోకే చ సావిత్రీ కళయా త్వం వసుంధరా

గోలోకే రాధిక త్వం చ సర్వగోపాలకేశ్వరీ

త్వయావినాఽహం నిర్జీవో హ్యశక్తః సర్వకర్మసు

శివః శక్తస్త్వయా శక్త్యా శవాకారస్త్వయా వీనా

వేదకర్తా స్వయంబ్రహ్మా వేదమాత్రా త్వయా సహ

నారాయణస్త్వయా లక్షా జగత్పాతా జగత్పతిః

ఫలం దదాతి యజ్ఞశ్చ త్వయా దక్షిణయా సహ

బిభర్తి సృష్టిం శేషశ్చ త్వాం కృత్వా మస్తకే భువం

 బిభర్తీ గంగారూపాం త్వాం మూర్ద్ని గంగాధర: శివః

శక్తిమచ్చ జగత్సర్వం శవరూపం త్వయా వినా

వక్త సర్వస్త్వయా వాణ్యా సూతో మూకస్త్వయా వినా

నేను నీకు చాలా ఇష్టమైనవాడను. నీకు నాపై చాలా ప్రేమకలదు. అని నీవెప్పుడు నాతో అనుచుంటివి. ప్రస్తుతము నీవు చేసిన పనివలన నీ మాటలు కల్లలని నాకు తోచుచున్నవి. అట్లే 'ఓ కృష్ణుడా! నీవు నా ప్రాణములవంటివాడవు. జీవాత్మవు” అని ఎల్లప్పుడు చెప్పుచుంటివి. అవన్ని అబద్ధములుగా కన్పించుచున్నవి. ఓ రాధాదేవి! స్త్రీల మనస్సు కత్తి అంచువలె ఇతరులను బాధ పెట్టునను నా మాట ఎల్లప్పుడు సత్యమైనదే.

నీవు నాకు ప్రాణములకన్నను మిన్నయైన దానవు. నా పంచప్రాణములకు అధిదేవతవు. నీవు లేక నా ప్రాణము లెగిరిపోవుచున్నవి. ప్రాణములకు అధిష్టాన దేవత లేక ప్రపంచమున ఎవ్వరుకూడ జీవించరు. అట్లే నా ప్రాణాధిష్టాన దేవతవగు నీవు లేక నేను బ్రతుకుట దుర్లభము.

నీవు మూలప్రకృతి స్వరూపిణివి, ఈశ్వరివి, శ్రీమహావిష్ణువునకు తల్లివి. నీవు స్వయముగా నిర్గుణురాలవైనను నీ అంశస్వరూపముచే సగుణవుగా కన్పించుచున్నావు. నీవు. జ్యోతిస్వరూపముననున్నావు. నిరాకారవైనను భక్తులనెల్లప్పుడు అనుగ్రహించుటకు ఆకారమును ధరించితివి. నీవు భక్తుల అభిరుచులనుబట్టి అనేక రూపములను ధరించితివి.

నీవు వైకుంఠమున మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా కన్పించుచున్నావు. పుణ్యభూమీయగు భారతక్షేత్రమున నీవు సతీదేవిగా పార్వతీదేవిగా పుణ్యమూర్తియైన తులసీగా, సమస్తలోకములను పవిత్రముచేయు గంగగా మారీతివి. నీవు బ్రహ్మలోకమున సావిత్రిగాను, నీ అంశరూపముతో భూమిగాను, గోలోకమున సమస్త గోపాలురకు ఈశ్వరివగు రాధగానున్నావు.

నీవు లేనిచో నేను ప్రాణములు లేనివాడను. ఏపనిచేయుటకైనను అసమర్థుడను. అట్లే శివుడు శక్తిస్వరూపిణివగు నీవలననే శక్తిమంతుడగుచున్నాడు. నీవు లేనిచో అతడు శవమువలె సర్వశక్తులను కోల్పోవును. నీవలననే బ్రహ్మదేవుడు వేదములను దర్శింపగలిగెను.

నీవలననే సారాయణుడు మహాలక్ష్మీ సమేతుడై సమస్తలోకములను రక్షించుచు జగత్పతియైనాడు. ఆదిశేషుడు నీవలన సమస్తలోకములను తన శిరస్సుపై ధరించగలుగుచున్నాడు. అట్లే శివుడు గంగను ధరించి గంగాధరుడాయెను, నీవుండినచో ప్రపంచమంతయు శక్తి కలిగియుండును. నీవు లేనిచో ఇది శవమువలె సర్వశక్తులను కోల్పోగలదు. అట్లే నీవలననే అందరు వక్తలగుచున్నారు. నీవులేనిచో అందరు మూగవారగుదురు.

యథామృదాఘాటం కర్తుం కులాలః శక్తిమాన్ సదా

సృష్టిం స్రష్టు:తథాహం చ ప్రకృత్యా చ త్వయాఽ సహ

త్వయా వినా జడశ్చాహం సర్వత్ర చ న శక్తిమాన్

సర్వశక్తి స్వరూపా త్వం త్వమాగచ్ఛ మమాంతీకం

వహ్నౌ త్వం దాహికా శక్తి: నాగ్నిశక్తస్వయా వీనా

శోభాస్వరూపా చంద్రే త్వం త్వాం వినాన స సుందరః

ప్రభారూపా హి సూర్యేత్వం త్వాం వినా న సభానుమాన్

  కామః కామీనీ బంధుస్త్యయా రత్యా వీవా ప్రియే

ఇత్యేవం స్తవనం కృత్యా తార సంప్రాప జగత్ర్పభుః

దేవా బభూవుః సశ్రీకాభార్యా శక్తి సంయుతాః

సస్త్రీకం చ జగత్సర్వం సనుభూచ్చైల కన్యకే

గోపీ పూర్ణశ్చ గోలోకో హ్యభవత్తత్ప్రసాదత:

కుమ్మరివాడు మట్టితో కుండలు చేయునట్లే ప్రకృతిరూపిణివగు నీ వలన నేను సమస్త సృష్టిని చేయగలుగుచున్నాను. నీవు లేనిచో నేను జడునివలె శక్తినంతయు కోల్పోవుదును. అందువలన సర్వశక్తి స్వరూపిణివగు నీవు నా దగ్గరకు రమ్ము, దాహిళాశక్తి లేక అగ్నిదేవుడు కాల్చలేడు. ఆ దాకాశక్తివి నీవే. అట్లే శోభాస్వరూపిణివి ఆగు నీవులేనిచో చంద్రుడు సుందరుడుగా కన్పీంచడు. కాంతిరూపిణివైన నీవులేనిచో సూర్యుడు కిరణములను కోల్పోవును. అదేవిధముగా రతి స్వరూపిణివగు నీవు లేక మన్మధుడు కామీనీ బంధువు కాజాలడు.

ఈవిధముగా శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవిని స్తుతించి ఆమెను తీరిగి పొందెను. రాధాదేవి కన్పించగానే అంతవరకు అదృశ్యముగా నున్న దేవతాస్త్రీలందరు కన్పించిరి. అందువలన దేవతలందరు శోభతో శక్తితో భార్యలతో కలిసియుండిరి. ప్రపంచమున స్త్రీలందరు దర్శనమొసగిరి. ఇట్లు గోలోకము గోపికాసీలచే నిండిపోయినది.

రాజా జగామ గోలోకమితి స్తుత్వా హరిప్రియాం

శ్రీ కృష్ణేన కృతం స్తోత్రం రాధాయా య: పఠేన్నర:

కృష్ణభక్తిం చ తద్దాస్యం సంప్రాప్నోతి న సంశయః

స్త్రీ విచ్ఛేదే యఃశ్రుణోతి మాసమేకమిదం శుచిః

అచీరాల్లభతే భార్యాం సుశీలాం సుందరీం సతీం

భార్యాహీనో భాగ్యహీనో వర్షమేకం శ్రుణోతి యః

ఆచీరాల్లభతే భార్యాం సుశీలాం సుందరీం సతీం

పురా మయా చ త్వం ప్రాప్తి స్తోత్రేణానేన పార్వతి

మృతాయాం దక్షకన్యాయామాజ్ఞయా పరమాత్మనః

స్తోత్రేణానేన సంప్రాప్తా సావిత్రీ బ్రహ్మనా పుర

పురా దుర్వాసష శాపాత్ ని:శ్రీకే దేవతాగణే

స్తోత్రేణానేన దేవైస్తై: సంపాప్తా శ్రీ: సుదుర్లభా

శ్రుణోతి వర్షమేకం చ పుత్రార్థీ లభతే సుతం

మహావ్యాధీ రోగముక్తో భవేత్ స్తోత్ర ప్రసాదత:

కార్తికీ పూర్ణిమాయాం తు తాo సంపూజ్య పఠేత్తుయః

 అచలాం శ్రియమాప్నోతి రాజసూయఫలం లభేత్

నారీశ్రుణోతి చేత్ స్తోత్రం స్వామి సౌభాగ్య సంయుతా

భక్త్యా శ్రుణోతి యః స్తోత్రం బంధనాన్ముచ్యతే ధ్రువం

 నిత్యం పఠతి యో భక్త్యా రాధాం సంపూజ్య భక్తితః

స ప్రయాతి చ గోలోకం నిర్ముక్తో భవబంధనాత్

రాజైన సుయజ్ఞుడు రాధాదేవిని ఈ విధముగా స్తుతించి గోలోకమునకు పోయెను.

శ్రీకృష్ణుడు స్తుతించిన ఈ రాధాస్తోత్రమును ఎవరు పఠింతురో అతనికి తప్పక శ్రీకృష్ణభక్తి, శ్రీకృష్ణ దాస్యము లభింపగలదు. భార్య వియోగ సమయమున ఈ స్తోత్రమును ఒక నెలవరకు వినినచో (చదివినచో) అట్లే భార్యా రహితుడు, భాగ్యములేనివాడు దీనిని సంవత్సరమువరకు విన్నచో (చదివినచో) త్వరగా భార్యను పొందును. నేనుకూడ దక్షయజ్ఞమున సతీస్వరూపిణివగు నీవు చనిపోయినపుడు శ్రీకృష్ణపరమాత్మయొక్క ఆజ్ఞవలన ఈ స్తోత్రము పఠించి నీన్ను పొందితిని. అదే విధముగా దుర్వాస మహర్షి శాపము వలన దేవతలు లక్ష్మిని కోల్పోవగా ఈ స్తోత్రమువలన తిరిగి శ్రీని పొందిరి. పుత్రులు కావలెనని అనుకొనువాడు, మహారోగముతో బాధపడువాడు ఈ స్తోత్రమును సంవత్సరము వరకు నియమముతో విన్నచో సంతానమును పొందును. మహావ్యాధి నిర్ముక్తుడు కూడ ఆగును.

. కార్తీకమాసమున పూర్లిమనాడు రాధాదేవిని పూజించి ఈ స్తోత్రమును చదివినచో ఆంతులేని సంపదను, రాజసూయ యాగమువలన లభించు ఫలితము లభించును.

స్త్రీలు ఈ స్తోత్రమును విన్నచో భర్తవలన సకల సౌఖ్యములు పొందుదురు. సంసారబంధమునుండి విముక్తులగుదురు. ఈ స్తోత్రమును ప్రతిదినము రాధాదేవిని పూజించి చదువువారు భవబంధనమును ఛేదించుకొని గోలోకమును చేరుకొనెను.

 ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదాంతర్గత హరగౌరీ సంపాదే శ్రీరాధికోపాఖ్యానే రాధాపూజాస్తోత్రాదీ కథనం నామ పంచ పంచాశత్తమోఽధ్యాయః

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణుల సంవాదమున కనిపించు గౌరీశంకరుల సంవాదమున చెప్పబడిన రాధాదేవి పూజ స్తోత్రాదులుగల యాభైయైదవ అధ్యాయము సమాప్తము.