బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

11 - గంగను మోహించిన శ్రీకృష్ణుని రాధాదేవి దూషించుట

నారద ఉవాచ- నారద మహర్షి ఇట్లనెను-

కలేః పంచసహస్రే సా సమతీతే సురేశ్వరీ

క్వగతా సా మహాభాగా తన్మే వ్యాఖ్యాతు మర్హసి

గంగాదేవి కలియుగమున ఐదువేల సంవత్సరముల తర్వాత ఎక్కడికి వెళ్ళినదో వివరముగా తెలుపుడు.

నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-

భారతం భారతీశాపాత్ సమాగత్యేశ్వరేచ్ఛయా

జగామ తం చ వైకుంఠం శాపాంతే పునరేవ సా

భారతం భారతీ త్యక్త్వా చాగమత్ తత్ హరేః పదం

పద్మావతీ చ శాపాంతే గంగాయాశ్చైవ నారద

గంగా సరస్వతీ లక్ష్మీశ్చైతాస్తిస్రః ప్రియా హరేః

తులసీ సహితా బ్రహ్మన్ చతస్రః కీర్తితాః శ్రుతౌ

నారదా! సరస్వతీ దేవి యొక్క శాపముననుసరించి భారతదేశమును చేరిన గంగాదేవి శాపము తీరిన తరువాత మరల వైకుంఠమునకు చేరెను. అట్లే గంగా దేవి యొక్క శాపము ముగిసినపిదప లక్ష్మీ సరస్వతులు వైకుంఠమునకు చేరిరి. వేదములలో శ్రీహరికి గంగా సరస్వతి, లక్ష్మీ, తులసీదేవి యను నలుగురు ఇష్టమైన వారని చెప్పబడినది.

నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లడిగెను-

హేతునా కేన దేవీ వై విష్ణుపాదాబ్జ సంభవా

ధాతుః కమండలుస్థాచ శంకరస్య శిరోగతా

బభూవ సా ముని శ్రేష్ఠ గంగా నారాయణ ప్రియా

అహో కేన ప్రకారేణ తన్మే వ్యాఖ్యాతుమర్హసి

బ్రహ్మదేవుని కమండలువు లోను పరమశివుని శిరస్సు పైన నున్న గంగాదేవి ఎందువలన విష్ణుపాదాబ్జసంభవయైనది. అట్లే నారాయణుని ప్రియురాలుగా ఎట్లైనది ఈ విషయమును నాకు వివరించి చెప్పుడు.

శ్రీనారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-

పురాబభూవ గోలోకే సా గంగా ద్రవరూపిణీ

రాధాకృష్ణాంగ సంభూతా తదంశా తత్స్వరూపిణీ

ద్రవాధిష్ఠాత్పరూ పా యా రూపేణ ప్రతిమా భువి

నవయౌవన సంపన్నా రత్నాభరణ భూషితా

శరన్మధ్యాహ్న పద్మాస్యా సస్మితా సుమనోహరా

తప్తకాంచన వర్ణాభా శరచ్చంద్ర సమప్రభా

స్నిగ్దప్రభాఽతి సుస్నిగ్ధా శుద్ద సత్వస్వరూపిణీ

సుపీన కఠినశ్రోణీ సునితంబయుగం వరం

పీనోన్నతం సుకఠినం స్తనయుగ్మం సువర్తులం

సుచారు నేత్రయుగళం సుకటాక్షం సువక్త్రిమం

వక్రిమం కబరీభారం మాలతీ మాల్యసంయుతం

సిందూర బిందు లలితం సార్థం చందన బిందుభిః

కస్తూరీ పత్రికా యుక్తం గండయుగ్మం మనోహరం

బిందూక కుసుమాకారమధరోష్ఠం చ సుందరం

పక్వదాడిమ బీజాభ దంతపంక్తి సముజ్వలా

వాససీ వహ్నిశుద్ధే చ నీవీయుక్తే చ బిభ్రతీ

సా సకామా కృష్ణపార్శ్వే సముత్తస్థే సులజ్జితా

పద్మపత్ర సమానాభ్యాం లోచనాభ్యాం విభోర్ముఖం

నిమేష రహితాభ్యాం చ పిబంతీ సతతం ముదా

ప్రపుల్ల వదనా హర్షాన్నవ సంగమ లాలసా

మూర్ఛితా ప్రభురూపేణ పులకాంకిత విగ్రహా

ఏతస్మిన్నంతరే తత్రవిద్యమానాచ రాధికా

గోపీత్రింశత్కోటి యుక్తా కోటి చంద్ర సమప్రభా

కోపేన రక్తపద్మాస్యా రక్త పంకజలోచనా

శ్వేత చంపకవర్ణాభా మత్తవారణగామినీ

అమూల్య రత్నఖచిత నానాభరణ భూషితా

మాణిక్యఖచితం హారమమూల్యం వహ్నిశౌచకం

పీతాభ వస్త్రయుగళం నీవియుక్తం చ బిభ్రతీ

స్థల పద్మప్రభాజుష్టం కోమలం చ సురంజితం

కృష్ణదత్తార్ఘ్య సంయుక్తం విన్యసంతీ పదాంబుజం

రత్నేంద్ర రాజి ఖచిత విమానాదవరుహ్య చ

సేవ్యమానా చ సఖీభిః శ్వేత చామర వాయునా

కస్తూరీ బిందుతిలకం చందనేందు సమన్వితం

దీప్త దీప ప్రభాకారం సిందూరారుణ సుందరం

దధతీ భాలమద్యేచ సీమంతాధస్తదుజ్వలం

పారిజాత ప్రసూనాది మాలాయుక్తం సువక్రిమం

సుచారు కబరీ భారం కంపయంతీ చ కంపితా

సుచారు నాసాసంయుక్తమోష్ఠం కంపయతీ రుషా

పూర్వకాలమున గోలోకమందు గంగాదేవి రాధాకృష్ణుల అంగములనుండి ద్రవరూపముగా పుట్టినది. ద్రవవస్తువులకు ఆమె ఆధిష్ఠాన దేవత. నవయౌవనముతో రత్నాభరణములో ఉన్న ఆమె ముఖము శరత్కాల చంద్రుని వలెనున్నది. ఆమె శరీరకాంతి బంగారు వలె నున్నది. శుద్ధ సత్వ స్వరూపిణి యగు ఆగంగాదేవీ పీనము, కఠినమైన నితంబముతో, పీనోన్నతము, సుకఠినమైన స్తనయుగ్మముతో, అందమైన నేత్ర యుగళముతో అలరారుచున్నది. అట్లే ఆ దేవి మాలతీ మాలగిల వంకర కొప్పుగలది. పాపిటలో చందన బిందువులతో నున్న సిందూర బిందువులున్నవి. చెక్కిళ్ళపై కస్తూరి పత్రములున్నవి. ఆమె దంతములు పండిన దానిమ్మగింజలవలెనున్నవి. బంగారు కాంతి గల రెండు వస్త్రములను ధరించి శ్రీకృష్ణుని పార్శ్వమున లజ్జతో పద్మపత్రములవంటి కన్నులతో శ్రీకృష్ణుని ముఖమును చూచుచు కామముతో మూర్ఛచెందినది.

ఆ సమయమున అచ్చటనే ఉన్న రాధిక ముఖము కోపముతో ఎరుపెక్కినది. తెల్లని చంపక పుష్పము వంటి కాంతిగల ఆ రాధ రత్నాభరణములను రెండు పీతాంబరములను ధరించి వద్మముల వంటి కాంతిగల కోమలమైన పాదములమ రత్నవిమానమునుండి క్రింద ఉంచి చెలికత్తెలు చామరములు వీయగా అందమైన కొప్పును కదలించుచు కోపముతో పెదవులు కంపించగా ఆచ్చట నిలిచినది.

గత్వా తస్థౌ కృష్ణపార్శ్వే రత్న సింహాసనే వరే

సఖీనాం చ సమూహైశ్చ పరిపూర్ణా విభోః సభా

తాం చ దృష్ట్వా సముత్తస్థౌ కృష్ణః సాదరమచ్యుతః

సంభాష్య మధురాలాపైః సస్మితశ్చ ససంభ్రమః

ప్రణేము రభిసంత్రస్తా గోపా నమ్రాత్మకంధరాః

తుష్టువుస్తే చ భక్త్యా తం తుష్టావ పరమేశ్వరం

రాధాదేవి తన సఖులతో శ్రీకృష్ణుని పార్శ్వమందున్న రత్నసింహాసనమున కూర్చొనెను. ఆమెను చూచి శ్రీకృష్ణుడు ఆదరముతో లేచి మధురమైన మాటలతో పలుకరించెను. అచ్చటనున్న గొల్లలు వంచిన శిరస్సులతో శ్రీకృష్ణుని స్తుతింపగా రాధాదేవి సైతము అతనిని స్తుతించినది.

ఉత్థాయ గంగా సహసా సంభాషాం చ చకార సా

కుశలం  పరి పప్రచ్ఛ భీతాఽతివినయేనచ

నమ్రభావస్థితా త్రస్తా శుష్కకంఠౌష్ఠ తాలుకా

ధ్యానేన శరణాపన్నా శ్రీకృష్ణ చరణాంబుజే

తత్ హృత్పద్మేస్థితః కృష్ణో భీతాయై చాఽభయం దదౌ

బభూవ స్థిరచిత్తా సా సర్వేశ్వరవరేణ చ

రాధికా దేవిని చూచి గంగ వెంటనే లేచి భయముతో అతివినయముతో కుశలమడిగెను. ఆ గంగ వినయముతో భయము వలన ఎండిపోయిన గొంతుతో శ్రీకృష్ణుని శరణు వేడినది. ఆతడామెకు అభయమివ్వగా గంగాదేవికి ధైర్యము సమకూరినది.

ఊర్ధ్వం సింహాసనస్థాం చ రాధాం గంగా దదర్శ సా

సుస్నిగ్ధాం సుఖ దృశ్యాం చ జ్వలంతీం బ్రహ్మ తేజసా

అసంఖ్య బ్రహ్మణామాద్యాం చాది సృష్టిం సనాతనీం

యథా ద్వాదశవర్షీయాం కన్యాంచ నవయౌవనాం

విశ్వవందే నిరుపమాం రూపేణ చ గుణేన చ

శాంత కాంతామనంతాం తామాద్యంత రహితాం సతీం

శుభాం సుభద్రాం సుభగాం స్వామిసౌభాగ్య సంయుతాం

సౌందర్య సుందరీం శ్రేష్ఠాం సుందరీష్వఖిలాసు చ

కృష్ణార్ధాంగీం కృష్ణసమాం తేజసా వయసా త్విషా

పూజితాం చ మహాలక్ష్మీం మహాలక్ష్మీశ్వరేణ చ

ప్రచ్ఛాద్యమానాం ప్రభయా సభామీశస్య సుప్రభాం

సఖీదత్తం చ తాంబూలం గృహ్ణతీమన్యదుర్లభం

అజిన్యాం సర్వజననీం ధన్యాం మాన్యాం చ మానినీం

కృష్ణప్రాణాధిదేవీం చ ప్రాణప్రియతమాం రమాం

దృష్ట్యా రాసేశ్వరీం తృప్తిం న జగామ సురేశ్వరీ

నిమేష రహితాభ్యాం చ లోచనాభ్యాం పపౌ చ తాం

రాధాదేవి బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచుండెను. ఆమె బ్రహ్మలందరికి ఆదిదేవత. సనాతని, పన్నెండు సంవత్సరముల కన్యవలె ఉండెను. రూపమున గుణములలో ప్రపంచమున సాటిలేనిది. అంతులేనిది, ఆద్యంత రహిత. ప్రపంచమున నున్న సుందరస్త్రీలందరికంటె సుందరమైనది. శ్రీకృష్ణునకు ఆర్ధాంగి. తేజస్సున, వయస్సున, కాంతియందు శ్రీకృష్ణునితో సమానమైనది. మహాలక్ష్మీశ్వరుడైన శ్రీకృష్ణునిచే పూజింపబడినది. శ్రీకృష్ణునకు ప్రాణప్రియ. అట్టి రాధ సింహాసనమున ఉండగా గంగాదేవి రెప్పవాలని కన్నులతో ఆమెను చూచినది.

ఏతస్మిన్నంతరే రాధా జగదీశమువాచ సా

వాచా మధురయా శాంతా వినీతా సస్మితా మునే

అప్పుడు రాధ వినయవంతురాలై మధురమైన మాటలతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికినది.

రాధికోవాచ- రాధిక ఇట్లు పలికెను -

కోఽయం ప్రాణేశ కల్యాణీ సస్మితా త్వమ్మఖాంబుజం

పశ్యంతీ సతతం పార్శ్వం సకామా రక్తలోచనా

మూర్ఛాం ప్రాప్నోతి రూపేణ పులకాంకిత విగ్రహా

వస్త్రేణ ముఖ మాచ్ఛాద్య నిరీక్షంతీ పునః పునః

త్వంచాపి తార సన్నిరీక్ష్య సకామః సస్మితః సదా

మయి జీవతి గోలోకే భూతా దుర్వృత్తిరీదృశీ

త్వమేవ చైవం దుర్వృత్తం వారం వారం కరోషిచ

క్షమాం కరోమి తే ప్రేమ్ణా స్త్రీజాతిః స్నిగ్ధమానసా

సంగృహ్యేమాం ప్రియామిష్టాం గోలోకాద్గచ్ఛలంపట

అన్యథా నహితే భద్రం భవిష్యతి సురేశ్వం

హే భగవన్ చిరునవ్వుతో నీ ముఖాంబుజమును చూచుచున్న ఈ కాముకురాలెవరు? మిమ్ములనుచాటుగా మాటిమాటికి చూచుచు పులకించిన శరీరముతో మూర్ఛపోవుచున్నది. నీవు కూడ ఆమెను కాముకుడవై చిరునవ్వుతో చూచుచున్నావు. స్త్రీజాతికి సహజమైన ప్రేమతో మాటిమాటికి క్షమించుచున్నాను. అందువలన నీకు ప్రియరాలైన ఈస్త్రీని తీసికొని గోలోకమునుండి వెళ్ళిపొమ్ము , లేనిచో నీకు మంచి జరుగదు.

దృష్టస్త్వం విరజాయుక్తో మయా చందన కాననే

క్షమా కృతా మయాపూర్వం సఖీనాం వచనాదహో

త్వయా మచ్ఛబ్దమాత్రేణ తిరోధానం కృతం పురా

దేహం సంత్యజ్య విరజా నదీరూపా బభూవ సా

కోటి యోజన విస్తీర్ణా తతో దైర్ఘ్యే చతుర్గుణా

అధ్యాఽపి విద్యమానా సా తవసత్కీర్తి రూపిణీ

గృహం మయి గతాయాం చ పునర్గత్వా తదంతికం

ఉచ్చైరరౌషేః విరజే విరబే చేతి సంస్మరన్

తదా తోయాత్సముత్థాయ సాయోగాత్ సిద్ధయోగినీ

సాలంకారా మూర్తిమతీ దదౌతుభ్యం చ దర్శనం

తతస్తాం చ సమాశ్లిష్య వీర్యాధానం కృతం త్వయా

తతో బభూవుస్తస్యాం చ సముద్రాః సప్తచైవ హి

శ్రీకృష్ణా! నీవు ఒకప్పుడు చందనవనములో “విరజ” తో కలిసి విహరించుచున్నప్పుడు నేను చూచీ కోపగించితిని. కాని నా స్నేహితురాండ్ర మాటలను విని నిన్ను క్షమించితిని. నీవు విరజతో కలిసి తిరుగుచున్నప్పుడు నా శబ్దమును వినినంతమాత్రమున నీవు మాయమైతివి. విరజ తన శరీరమును వదలి, నదిగా మారినది. విరజానది కోటి యోజనముల విస్తీర్ణముతో నాలుగు కోట్ల యోజనముల పొడవుతో నేటికిని, ప్రవహించుచున్నది.

నేను ఇంటికి తిరిగి పోగానే నీవు ఆమె దగ్గరకు వెళ్ళి విరజా! విరజా! అని గట్టిగా పిలిచితివి. అప్పుడు సిద్ధయోగినియైన విరజాదేవి నీటినుండి బయటకు వచ్చెను. అప్పుడామెను నీవు కౌగిలించుకొని రతి జరుపగా ఆమెకు నీవలన ఏడు సముద్రములు ఉద్భవించినవి.

దృష్టస్త్వంచ శోభయా గోప్యా యుక్తశ్చంపక కాననే

సద్యో మచ్ఛబ్దమాత్రేణ తిరోధానం కృతం త్వయా

శోభా దేహం పరిత్యజ్య ప్రావిశచ్ఛంద్రమండలం

తతస్తస్యాః శరీరం చ స్నిగ్దం తేజో బభూవహ

సంవిభజ్య త్వయా దత్తం హృదయేన విదూయతా

రత్నాయ కించిత్ స్వర్ణాయ కించిన్మతివరాయ చ

కించిత్ స్త్రీణాం ముఖాజ్జేభ్యః కించి ద్రాజ్ఞే చ కించన

కించిత్ ప్రకృష్టవస్త్రేభ్యో రౌపేభ్యశ్చాపి కించన

కించిత్ చందనపంకేభ్యః తోయేభ్యశ్చాపి కించన

కించిత్ కిసలయేభ్యశ్చ పుష్పేభ్యశ్చాపి కించన

కించిత్ ఫలేభ్యః సస్యేభ్యః సుపక్వేభ్యశ్చకించన

నృపదేవ గృహేభ్యశ్చ సంస్కృతేభ్యశ్చ కించన

శ్రీకృష్ణా! నీవొకప్పుడు చంపకవనములో శోభయను గోపికలో కలిసి తిరుగుచుండగా చూచితిని. అప్పుడు కూడ నా శబ్దమును వినగానే నీవు అంతర్ధానమైతివి. శోభకూడ తన శరీరరమును వదలి చంద్రమండలమును ప్రవేశించినది. ఆమె శరీరము గొప్ప తేజస్సుగా మారగా నీవు బాధపడు మనస్సుతో రత్నమున, బంగారమున, విద్యావంతులయందు, స్త్రీల ముఖములయందు, రాజునందు, విలువైన వస్త్రముల యందు కాసులయందు, చందనమున, నీటిలో, చిగురుటాకుల యందు రాజుల ఇండ్లయందు, దేవాలయములయందు, సంస్కృతులైన జనులయందు తేజోరూపమైన ఆమెయొక్క శరీరమును పంచిపెట్టితివి.

దృష్టస్త్వం ప్రభయా గోప్యా యుక్తో బృందావనే వనే

సద్యోమచ్ఛబ్దమాత్రేణ తిరోధానం కృతం త్వయా

ప్రభా దేహం పరిత్యజ్య ప్రావిశత్ సూర్యమండలం

తతస్తస్యాః శరీరం చ తీక్షణం తేజో బభూవహ

సం విభజ్య త్వయా దత్తం ప్రేమ్ణా చ రుదతా పురా

విభజ్య చక్షుషోర్దత్తం లజ్జయా తద్భయేన చ

హుతాశనాయ కించిచ్ఛ నృపేభ్యశ్చాపి కించన

కించిత్ పురుష సంఘేభ్యో దేవేభ్యశ్చాపి కించన

కించిత్ దస్యుగణేభ్యశ్చ నాగేభ్యశ్చాపి కించన

బ్రాహ్మణేభ్యోమునిభ్యశ్చ తపస్విభ్యశ్చ కించన

స్త్రీభ్యః సౌభాగ్య యుకాభ్యో యశస్విభ్యశ్చ కించన

తచ్చ దత్వాచ సర్వేభ్యః పూర్వం రోదితు ముద్యతః

శ్రీకృష్ణా నీవు పూర్వము “ప్రభ” అను గోపికాస్త్రీతో కలిసి విహరించుచుండగా నేను చూచితిని. అప్పుడు కూడ నా శబ్దమును వినగానే నీవు అoతర్ధానమైతివి. “ప్రభ” కూడ దేహమును వదిలి సూర్యమండలమునకు పోయినది. అప్పుడు ఆమె శరీరమునుండి వేడియైన తేజస్సు ఉద్భవించినది. నీవప్పుడు ఆమెపై గల ప్రేమతో ఏడ్చుచు కళ్ళకు, అగ్నికి, రాజులకు, మానవసంఘములకు, దేవతలకు, దస్యులకు, సర్పములకు, బ్రాహ్మణులకు, మునులకు, సౌభాగ్యవతులైన స్త్రీలకు, కీర్తి కలవారికి ఆ తేజస్సును పంచి ఇచ్చితివి.

శాంత్యా గోప్యా యుతస్త్వం చ దృష్టో పై రాసమండలే

వసంతే పుష్పశయ్యాయాం మాల్యవాన్ చందనోక్షితః

రత్నప్రదీపైర్యుక్తశ్చ రత్న నిర్మితమందిరే

రత్న భూషణ భూషాడ్యో రత్నభూషితయా సహ

త్వయా దత్తం చ తాంబూలం భుక్తా సాచ సువాసితం

తయా దత్తం చ తాంబూలం భుక్తావాస్ త్వంపురా విభో

సద్యో మచ్ఛబ్ద మాత్రేణ తిరోధానం కృతం త్వయా

శాంతిర్దేహం పరిత్యజ్య భియా లీనా త్వయి ప్రభో

తతస్తస్యాః శరీరం చ గుణశ్రేష్ఠం బభూవహ

సంవిభజ్య త్వయాదత్తం ప్రేమ్ణా చ రుదతా పురా

విశ్వే విషయిణే కించిత్ సత్వరూపాయ విష్ణవే

శుద్ధసత్వస్వరూపాయై కించిత్ లక్ష్మై పురా విభో

త్వన్మంత్రోపాసకేభ్యశ్చ వైష్ణవేభ్యశ్చ కించన

తపస్విభ్యశ్చ ధర్మాయ ధర్మిష్ఠేభ్యశ్చ కించన

శ్రీకృష్ణా! ఒకప్పుడు నీవు రత్నమందిరములున్న రాసమండలమున ‘శాంతి’ యను గోపికతో కలిసి పూలపాన్పుపై ఉండగా నేను చూచితిని. అప్పుడు ఆమె నీవిచ్చిన సుగంధమైన తాంబూలమును తినినది. అట్లే నీవు కూడ ఆమె ఇచ్చిన తాంబూలమును తింటివి. అప్పుడు కూడ నా చప్పుడు వినపడగానే లీనమైపోయినది. ఆమె శరీరము శ్రేష్ఠగుణముగా రూపుదాల్చగా దానిని నీవు ఆమెపై గల ప్రేమతో ఏడ్చుచు సత్వస్వరూపుడైన విష్ణువుకు, లక్ష్మీదేవికి, సీమంత్రము నుపాసించు వైష్ణవులకు, మునులకు, ధర్మునకు, ధర్మిష్ఠులకు కొంత కొంత భాగము నిచ్చితివి.

మయా పూర్వం హి దృష్టస్త్వం గోప్యా చ క్షమయాసహ

సువేషవాన్ మాల్యవాంశ్చ గంధచందనసంయుతః

రత్న భూషితయా చారు చందనోక్షితయాతయా

సుఖేన మూర్ఛితస్తల్పే పుష్పచందనసంయుతే

శ్లిప్టోఽభూర్నిద్రయా సద్యః సుఖేన నవసంగమాత్

మయాప్రబోధితౌ సాచ భవాంశ్చ స్మరణం కురు

గృహీతం పీతవస్త్రం తే మురళీ చ మనోహరా

వనమాలా కౌస్తుభశ్చాష్యమూల్యం రత్నకుండలం

పశ్చాత్ ప్రదత్తంప్రేమ్ణాచ సఖీనాం వచనాదహో

లజ్జయా కృష్ణవర్ణోభూరద్యాఽపి చ భవాన్ ప్రభో

క్షమా దేహం పరీత్యజ్య లజ్జయా పృథివీం గతా

తతస్తస్యాః శరీరం చ గుణశ్రేష్ఠం బభూవ హ

సంవిభజ్య త్వయాద్తతం ప్రేమ్ణా చ రుదతా పురా

కించిద్దత్తం విష్ణవేచ వైష్ణవేభ్యశ్చ కించన

ధర్మిష్ఠేభ్యశ్చ ధర్మాయ దుర్బలేభ్యశ్చ కించన

తపస్విభ్యోఽపి దేవేభ్యః పండితేభ్యశ్చ కించన

ఏతత్తే కథితం సర్వం కిం భూయః శ్రోతు మిచ్ఛసి

త్వద్గుణం బహు విస్తారం జానామి చ పరం విభో

ఇత్యేవముక్త్యా సారాధా రక్తపంకజలోచనా

గంగాం వక్తుం సమారేభే నమ్రాస్యాం లజ్జితాం సతీం

నీవొకప్పుడు “క్షమ” యనే గోపికతో కలిసియుండగా చూచితిని. అప్పుడు నీవు మంచి వేషముతో పుష్పమాల చందనము ధరించియున్నావు. ఆ గోపిక కూడ రత్నాభరణములతో చందనముతోనుండినది. మీరిరువురు పుష్పములు చందనము కల శయ్యపై సుఖమూర్ఛితులై ఉంటిరి. ఆ సమయమున నేను మీమ్ములనిద్దరిని నిద్రనుండి లేపిన సంగతిని స్మరింపుము. అప్పుడు నేను తీసికొన్న పీతవస్త్రము, మురళి, వనమాలా కౌస్తుభరత్నములను ప్రేమతో నా చెలికత్తెల మాటపై నీకు తిరిగి ఇచ్చివేసితిని. అప్పుడు నీవు సిగ్గుతో నల్లబడితివి. అనలుపురంగు నేటికి నీ శరీరరమున కన్పించుచున్నది.

క్షమాదేవి శరీరమును వదిలిపెట్టి భూమినాశ్రయించినది. తరువాత ఆమె శరీరము ఒక శ్రేష్ఠగుణమైనది. అప్పుడు నీవామెపై గల ప్రేమతో ఏడ్చుచు ఆమె శరీరమును విష్ణుమూర్తికి, వైష్ణవులకు, ధర్మిష్ఠులకు, ధర్మునకు, దుర్బలులకు, మునులకు, దేవతలకు, పండితులకు, పంచిపెట్టితివి.

ఇంకను ఏమైన వినదల్చితివా? నీగుణమును సంపూర్ణముగా నేనెరుగుదును అని రాధ ఎరుపెక్కిన కళ్ళతో సిగ్గుపడుచు నమస్కరించుచున్న గంగతో మాట్లాడుటకు మొదలిడెను.

గంగా రహస్యం యోగేన జ్ఞాత్వా వై సిద్ధయోగినీ

తిరోభూయ సభామధ్యాత్ స్వజాలం ప్రవివేశ సా

రాధా యోగేన విజ్ణాయ సర్వత్రావస్థితాం చ తాం

పానం కర్తుం సమారేభే గండూషాత్సిద్ధయోగినీ

గంగా రహస్యం యోగేన జ్ఞాత్వా వై సిద్ధయోగినీ

శ్రీకృష్ణ చరణాంభోజం పరమం శరణం యయ

గోలోకం చైవ వైకుంఠం బ్రహ్మలోకాదికం తథా

దదర్శ రాధా సర్వత్ర నైవగంగాం దదర్శ సా

సర్వతో జలశూన్యంచ శుష్క పంకజ గోళకం

జల జంతు సమూహైశ్చ మృతదేహైః సమన్వితం

బ్రహ్మ విష్ణు శివానంత ధర్మేంద్రేందు దివాకరాః

మనవో మానవాః సర్వే దేవాః సిద్ధా తపస్వినః

గోలోకం చ సమాజగ్ముః శుష్కకంఠౌష్ఠతాలుకాః

సర్వే ప్రణీముర్గోవిందం సర్వేశం ప్రకృతేః పరం

వరం వరేణ్యం వరదం వరిష్ఠం వరకారణం

వరేశం చ వరార్హంచ సర్వేషాం ప్రవరం ప్రభుం

నిరీహంచ నిరాకారం నిర్లిప్తంచ నిరాశ్రయం

నిర్గుణం చ నిరుత్సాహం నిర్వ్యూహం చ నిరంజనం

స్వేచ్ఛామయం చ సాకారం భక్తానుగ్రహ విగ్రహం

సత్యస్వరూపం సత్యేశం సాక్షిరూపం సనాతనం

పరం పరేశం పరమం పరమాత్మానమీశ్వరం

ప్రణమ్య తుష్టుపుః సర్వే భక్తి సమ్రాత్మ కంధరాః

సగద్గదాః సాశ్రునేత్రాః పులకాంకిత విగ్రహాః

సర్వే సంస్తూయ సర్వేశం భగవంతం పరం హరిం

జ్యోతిర్మయం పరం బ్రహ్మ సర్వకారణ కారణం

అమూల్య రత్నఖచిత చిత్ర సింహాసన స్థితం

సేవ్యమానం చ గోపాలైః శ్వేత చామరవాయునా

గోపాలికా నృత్యగీతం పశ్యంతం సస్మితం ముదా

వల్గువేహైః పరివృతం గోపైశ్చ శతకోటిభిః

చందనోక్షిత సర్వాంగం రత్నభూషణ భూషితం

నవీన నీరద శ్యామం కిశోరం పీతవాససం

యథా ద్వాదశవర్షీయం బాలం గోపాల రూపిణం

కోటి చంద్ర ప్రభాజాష్ట పుష్టశ్రీయుక్త విగ్రహం

స్వతేజసా పరివృతం సుసాదృశ్యం మనోహరం

కోటి కందర్ప సౌందర్య లీలాలావణ్య విగ్రహం

దృశ్యమానం చ గోపీభిః సస్మితాభిశ్చ సంతతం

భూషణైర్భూషితాభిశ్చ మహారత్న వినిర్మితైః

పిబంతీభిర్లోచహాభ్యాం ముఖ చంద్రం ప్రభోర్ముదా

ప్రాణాధిక ప్రియతమా రాధా వక్షస్థలస్థితం

తయా ప్రదత్తం తాంబూలం భుక్తవంతం సువాసితం

పరిపూర్ణతమం రాసే దదృశుః సర్వతః సురాః

సిద్ధయోగినియైన గంగ యోగజ్ఞానముతో రాధాదేవి చెప్పబోవు మాటల భావమును తెలిసికొని ఆ సభమధ్యలోనుండి తన జలములలో ప్రవేశించినది. రాధాదేవి కూడ యోగజ్ఞానముతో గంగ జలరూపముతో అoతట ఉన్నట్లుగా గుర్తించి ఆ నీటినంతయు త్రాగుటకుపక్రమించెను.

గంగాదేవి యోగజ్ఞానముతో రాధాదేవియొక్క మనోభావమును గుర్తించి శ్రీకృష్ణుని పాదములను శరణువేడి ఆచ్చట విలీనమైనది. రాధాదేవి గోలోకమున వైకుంఠమున బ్రహ్మలోకము మొదలగు లోకములన్నిటిలో గంగాదేవిని చూడలేకపోయినది. గంగాదేవి తన శరీరమును ఉపసంహరించుకొన్నందువలన సమస్తలోకములు జల శూన్యమైనవి. జలజంతువులన్నియు నీరు లేక చనిపోయినవి.

అప్పుడు బ్రహ్మ, విష్ణు శివాది దేవతలందరు మనువులు, మానవులు, సిద్ధులు మునులందరు ఎండిపోయిన పెదవులు నాలుకలతో ప్రకృతి కంటె ఉన్నతుడైన సర్వేశ్వరుని చూచిరి. ఆ శ్రీకృష్ణుని యొక్క నిర్గుణ తత్వమును తెలిసికొని భక్తులననుగ్రహించు తలపుతో సాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మను సందర్శించుకొనిరి.

సమస్త చరాచర సృష్టికి కారణ భూతుడు, జ్యోతిర్మయుడు, రత్న సింహాసనముపైనున్నవాడు, గోపాలురు చామరములు వీయగా గోపికలు నృత్యము గానము సేయుచుండగా అనేక గోపగోపీ పరివృతుడు, శరీరమంతటను చందనమును ఆలదుకొనినవాడు, రత్నభూషణ భూషితుడు, మేఘశ్యాముడు, పీతాంబరము ధరించినవాడు. పన్నెండు సంవత్సరముల బాలునివలెనుండువాడు, కోటి చంద్రులకాంతిగల శరీరము కలవాడు, కోటి మన్మథాకారుడు, ప్రాణములకన్న మిన్నయగు రాధాదేవి తాంబూలమును సేవించుచున్నవాడు, రాధాదేవి వక్షస్థలము పై నున్నవాడగు శ్రీకృష్ణుని దేవతలందరు దర్శించుకొనిరి.

మునయో మానవాస్సిద్ధాస్తపసా చ తపస్వినః

ప్రహృష్ట మానసాః సర్వే జగ్ముః పరమ విస్మయం

పరస్పరం సమాలోచ్య తే తమూచుః చతుర్ముఖం

నివేదితుం జగన్నాథం స్వాభిప్రాయమభిప్సితం

బ్రహ్మా తద్వచనం శ్రుత్వా స్థితం విష్ణోస్తు దక్షిణే

వామతో వామదేవస్య చాగమత్కృష్ణముత్తమం

పరమానందయుక్తంచ పరమానందరూపకం

సర్వం కృష్ణమయం ధాతా చాపశ్యద్రాసమండల

సర్వం సమానవేషం చ సమానాసన సంస్థితం

ద్విభుజం మురళిహస్తం వనమాలా విభూషితం

మయూర పుచ్ఛచూడంచ కౌస్తుభేన విరాజితం

అతీవ కమనీయంచ సుందరం శాంత విగ్రహం

గుణ భూషణ రూపేణ తేజసా వయాసా త్విషా

వాససా యశసాఽకృత్యా మూర్త్యా సుందరయా సమం

పరిపూర్ణతమం సర్వం సర్వైశ్వర్య సమన్వితం

కః సేవ్యః సేవకోవేతి దృష్ట్వా నిర్వక్తుమక్షమః

క్షణం తేజః స్వరూపంచ రూపరాశియుతం క్షణం

ఏకమేవక్షణం కృష్ణం రాధయా సహితం పరం

ప్రత్యేకాసన సంస్థంచ తయాచ సహితం క్షణం

రాధారూపధరం కృష్ణం కృష్ణ రూప కలత్రకం

కింస్త్రీరూపం చ పుంరూపం విధాతా ధ్యాతుమక్షమః

హృత్పద్మస్థం చ శ్రీకృష్ణం ధాతా ధ్యానేన చేతసా

చకార స్తవనం భక్త్యా ప్రణమ్యాథ త్వనేకధా

తతః స చక్షురున్మీల్య పునశ్చ తదనుజ్ఞయా

అపశ్యత్ కృష్ణమేకం చ రాధావక్షస్థల స్థితం

స్వపార్షదైః వరివృతం గోపీమండల మండితం

పునః ప్రణేముః తం దృష్ట్వా తుష్టువుశ్చ పునశ్చతే

విజ్ఞాయ తదభిప్రాయం తానువాచ సురేశ్వరః

సర్వాత్మా సర్వయజ్ఞేశః సర్వేశః సర్వభావనః

మునులు, సిద్ధులు, మానవులు మొదలగు వారందరు పరమాత్మను చూచి మిక్కిలి సంతోషముతో పరమాశ్చర్యమునకు లోనైరి. అప్పుడు వారందరు కలిసి ఆలోచించుకొని శ్రీకృష్ణపరమాత్మతో తమ అందరి అభిప్రాయమును వెల్లడించుటకు బ్రహ్మదేవుని ఎన్నుకొనిరి.

బ్రహ్మదేవుడు వారి మాటలకు ఒప్పుకొని విష్ణువూర్తియొక్క కుడిభాగమున, పరమశివుని ఎడమభాగమున నున్న కృష్ణుని చూచెను. అచ్చట రాసమండలమున సమస్తము కృష్ణమయముగా కనిపించెను. అందరు ఒకే వేషముతో ఒకే ఆసనమువనున్నట్లు కన్పించిరి. రెండు భుజములతో మురళిచేతిలో ధరించి వనమాలా విభూషితుడై నెమలిపింఛమును, కౌస్తుభరత్నముమ ధరించి అతిసుందరముగా శాంతమూర్తియై యున్నట్లు కనిపించిరి. వారి వస్త్రములు, ఆకృతి, వయస్సు, తేజస్సు భూషణములందరికి ఒకే విధముగానుండినవి. అచ్చట సేవకుడెవరు? యజమాని ఎవరు అని చెప్పవీలుకాకుండెను. ఒక క్షణము కృష్ణుడు రాధ ప్రత్యేకాసనములందున్నట్లు, ఇంకొక క్షణము రాధాదేవితో కలిసి యున్నట్లు, వేరొకక్షణమున రాధాదేవి మాత్రమే కనిపించగా మరియొక క్షణమున కృష్ణుడు మాత్రమే కనిపించెను. అచ్చట స్త్రీలెవరో పురుషులెవరో బ్రహ్మదేవుడు కూడా గుర్తించలేక పోయెను.

అప్పుడు బ్రహ్మదేవుడు తన హృదయకమలముననున్న శ్రీకృష్ణుని ధ్యానమనస్కుడై దర్శించి అనేక ప్రకారములుగా నమస్కరించి భక్తితో స్తుతించెను. ఆ తరువాత హృదయకమలమున నున్న శ్రీకృష్ణుని అనుజ్ఞతో కళ్ళు తెరవగా గోపిమండల మండితుడు, తన అనుచరగణముతో కలిసి రాధాదేవి దగ్గరనున్న శ్రీకృష్ణుని చూచెను. అప్పుడు బ్రహ్మదేవుని వెంటనున్న మానవ దేవతా గణము శ్రీకృష్ణునకు పునః పునః నమస్కారములొనరించిరి.

అప్పుడు సర్వాత్మ స్వరూపుడు సర్వేశుడు సురేశ్వరుడైన పరమాత్మ వారి మనోగతమును గుర్తించి ఇట్లనెను.

శ్రీ భగవానువాచ- పరనూత్మయైన శ్రీకృష్ణుడిట్లనెను-

ఆగచ్ఛ కుశలం బ్రహ్మన్ ఆగచ్ఛ కమలాపతే

ఇహాగచ్ఛ మహాదేవ శశ్వత్కుశలమస్తు వః

ఆగతాః స్థ మహాభాగా గంగానయన కారణాత్

గంగా మచ్చరణాంభోజే భయేన శరణం గతా

రాధే మాం పాతు మిచ్ఛంతీ దృష్ట్యా మత్సన్నిధానతః

దాస్యామీమాం బహిః కృత్వా యూయం కురుత నిర్భయాం

శ్రీకృష్ణస్యవచః శ్రుత్వా సస్మితః కమలోద్భవః

తుష్టావ సర్వారాధ్యాం తాం రాధాం శ్రీకృష్ణపూజితాo

వక్రైశ్చతుర్భిః సంస్తూయ భక్తి సమ్రాత్మకంధరః

ధాతా చతుర్థాం వేదానాం ఉవాచ చతురాననః

గంగాత్వదంగసంభూతా ప్రభోర్వై రాసమండలే

ద్రవరూపా చ సా జాతా ముగ్ధయా శంకరస్వరాత్

కృష్ణాంశా చ త్వదoశా చ త్వత్కన్యాసదృశీప్రియా

త్వన్మంత్ర గ్రహణం కృత్వా కరోతు తన పూజనం

భవిష్యతి పతిస్తస్యా వైకుంఠే చ చతుర్భుజః

భూగతాయాః కళాయాశ్చలవణోదశ్చ వారధిః

గోలోకస్థా చ యా రాధా సర్వత్రస్థా తదాత్మికా

తదాత్మికా త్వం దేవేశి సర్వదా చ తవాత్మజా

బ్రహ్మదేవుడా! ఇక్కడికి రమ్ము. శంకరుడా నీవు కూడ ఇక్కడికి రమ్ము. మీరు సుఖముగా ఉండుడు. మీరందరు గంగకై ఇక్కడకు వచ్చితిరి. కాని నా సమీపమున నున్న గంగను రాధాదేవి పానము చేయుటకు సిద్ధపడినది. అందువలన మీరు గంగాదేవి భయమును దూరము చేయుడు.

శ్రీకృష్ణుని మాటలు విని బ్రహ్మదేవుడు చిరునవ్వుతో సర్వారాధ్య, శ్రీకృష్ణపూజితయగు రాధను, భక్తితో తల వంచుకొని తన చతుర్ముఖములతో ఇట్లు స్తుతించెను.

ఈగంగాదేవి రాసమండలమున శ్రీకృష్ణపరమాత్మ మరియు నీయొక్క శరీరమునుండి జన్మించినది. ఆమె మీ ఇద్దరి అంశకలది నీకు కూతురు వంటిది. ఆమె నీ మంత్రముతో నీ పూజను చేసినచో ఆమెకు వైకుంఠమున నున్న చతుర్భుజుడైన విష్ణువు భర్తకాగలడు. భూమిలో నున్న ఆమె అంశస్వరూపమైన గంగకు సముద్రుడు భర్త కాగలడు. గోలోకమున నున్న గంగాదేవి నీ వంటిది నీకు కూతురు కూడ అని అనెను.

బ్రహ్మణోవచనం శ్రుత్వా స్వీచకార చ సస్మితా

బహిర్బభూవ సా కృష్ణపాదాంగుష్ఠ నఖాగ్రతః

తత్రైవ సంవృతా శాంత తస్థౌ తేషాం చ మధ్యతః

ఉవాస తోయదుత్థాయ తదధిష్ఠాతృదేవతా

తత్తోయం బ్రహ్మణా కించిత్ స్థాపితం చ కమండలౌ

కించిద్దధార శిరసి చంద్రార్ధే చంద్రశేఖరః

గంగాయై రాధికామంత్రం ప్రదదౌ కమలోద్భవః

తత్ స్తోత్రం కవచం పూజావిధానం ధ్యానమేవ చ

సర్వం తత్సామవేదోక్తం పురశ్చర్యాక్రమం తథా

గంగా తామేవ సంపూజ్య వైకుంఠం ప్రయయౌ సతీ

లక్ష్మీః సరస్వతీ గంగా తులసీ విశ్వపావనీ

ఏతా నారాయణస్యైవ చతస్రోయోషితో మునే

బ్రహ్మదేవుని మాటలను విని రాధాదేవి సరే యనెను. అప్పుడు గంగా దేవి శ్రీకృష్ణుని పాదాంగుష్ఠమునుండి బయలువెడలినది. అచ్చటనే పరమశాంతముగా ఆమె ఉండినది. ఆ గంగనీటిని బ్రహ్మదేవుడు తన కమండలువులో ఉంచుకొనగా పరమశివుడు తన శిరస్సున ధరించెను.

బ్రహ్మాదేవుడు గంగాదేవికి రాధికామంత్రమును, స్తోత్రమును, కవచమును, పూజావిధానమును, ధ్యాన ప్రకారమును, పురశ్చర్యాక్రమమును తెలిపెను. అందువలన గంగ రాధను పూజించి వైకుంఠమును చేరుకొనెను.

నారాయణునకు లక్ష్మీ, సరస్వతి, గంగ, తులసి వీరు నలుగురు భార్యలు.

అధతం సస్మితః కృష్ణా బ్రహ్మాణం సమువాచహ

సర్వం కాలస్య వృత్తాంతం దుర్బోధ్యమవిపశ్చితం

అప్పుడు శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునకు కాల వృత్తాంతము నిట్లు చెప్పదొడగెను.

శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణుడిట్లు పలికెను-

గృహాణ గంగాం హే బ్రహ్మన్ హేవిష్ణో హే మహేశ్వర

శ్రుణు కాలస్య వృత్తాంతం యదతీతం నిశామయ

యూయం చ యేఽన్యదేవాశ్చ మునయో మనవస్తథా

సిద్ధాస్తపస్వినశ్చైవ యేయేఽత్రైవ సమాగతాః

తేతే జీవంతి గోలోకే కాల చక్రవివర్జితే

జలాప్లుతం సర్వవిశ్వమాగతం ప్రాకృతే అయే

బ్రహ్మాద్యా యేఽన్య విశ్వస్థాస్తే లీనా అధునా మయి

వైకుంఠం చ వినా సర్వం సజలం పశ్య పద్మజ

గత్వా సృష్టిం కురు పునః బ్రహ్మలోకాదికం పరం

స బ్రహ్మాండం విరచయ పశ్చాద్గంగా చ యాస్యతి

ఏవమన్యేషు విశ్వేషు సృష్ట్యా బ్రహ్మాదికం పునః

కరోమ్యహం పునఃసృష్టిం గచ్ఛ శీఘ్రం సురైః సహ

మచ్చక్షుషోర్నిమేషేణ బ్రహ్మణః పతనం భవేత్

గతాఃకతి విధాస్తే చ భవిష్యంతి చ వేధసః

ఇత్యుక్త్యా రాధికానాథో జగామాంతఃపురం మునే

దేవా గత్వా పునః సృష్టిం చక్రురేవ ప్రయత్నతః

ఓ బ్రహ్మదేవుడా! విష్ణుమూర్తీ! పరమశివుడా! గంగను మీమీలోకములకు తీసికొని వెళ్ళుడు. ఇక మీరు కాలము యొక్క వృత్తాంతమును వినుడు.

మీరు, తక్కిన దేవతలు, మునులు, సిద్ధులు, తనస్వులు ఇంకను ఎవరెవరు ఇక్కడ ఉన్నారో వారందరు కాలమునకు అతీతులై గోలోకముననే ఉందురు.

ప్రాకృతలయమున సమస్త ప్రపంచము జలమున మునిగియున్నది. ఇతర లోకములందున్న బ్రహ్మ మొదలైనవారందరు ఇప్పుడు నాలో విలీనమై యున్నారు. ఇప్పుడు గోలోకవైకుంఠములు తప్ప తక్కిన లోకములన్నియు నీటిలో మునిగియున్నవి. అందువలన నీవు బ్రహ్మాండాదిలోకములను సృష్టింపుము. నేను ఇతర లోకములలో బ్రహ్మసృష్టిని చేసెదను.

నాకనురెప్పపాటుతోనే (నిమిషకాలముననే) బ్రహ్మ యొక్క ఆయువు తీరిపోవును. ఈవిధముగా ఎందరో బ్రహ్మలు పుట్టినారు. గతించినారు. పుట్టబోవుదురు.

ఈవిధముగా శ్రీకృష్ణుడు కాల విషయమును చెప్పి తన అంతఃపురమునకు వెళ్ళెను. దేవతలు కూడ తమతమలోకములకు పోయి మరల సృష్టిచేయుటకు ఉద్యమించిరి.

ఈవిధముగా శ్రీకృష్ణుడు కాలవిషయమును చెప్పి తన అంతఃపురమునకు వెళ్ళెను. దేవతలు కూడ తమతమలోకములకు పోయి మరల సృష్టి చేయుటకు ఉద్యమించిరి.

గోలోకే చ స్థితా గంగా వైకుంఠే శివలోకకే

బ్రహ్మలోకే తథాఽన్యత్ర యత్ర తత్ర పురాస్థితా

తత్రైవ సాగతా గంగా చాజ్ఞయా పరమాత్మనః

నిర్గతా విష్ణుపాదాబ్జత్ తేన విష్ణుపదీస్మృతా

ఇత్యేవం కథితం సర్వంగంగోపాఖ్యానముత్తమం

సుఖదం మోక్షదం సారం కిం భూయః శ్రోతు మిచ్ఛసీ

గంగ గోలోకమున వైకుంఠమున, కైలాసమున, బ్రహ్మలోకమున ఇంకను పూర్వమున్నచోట్ల అoతటా ఉండినది. విష్ణుమూర్తి యొక్క పాదాబ్జములనుండి బయటకు వచ్చినందువలన గంగకు విష్ణుపది యను పేరు వచ్చెను.

ఈవిధముగా మోక్షము నిచ్చు గంగోపాఖ్యానమును నీకు వివరించితిని.

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే గంగోపాఖ్యానం నామ ఏకాదశోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్తమహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాద సమయమున చెప్పబడిన గంగోపాఖ్యానమనే పదకొండవ అధ్యాయము సమప్తము.