2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
59 - బృహస్పతి కైలాసము చేరుట
నారద ఉవాచ- నారదుడిట్లనెను-
తారాదేవిని చంద్రుడు ఎత్తుకొని పోయిన తరువాత ఆమె భర్తయగు బృహస్పతి ఏమీ చేసెను? తిరిగి ఆమెనేట్లు స్వీకరించెను. అను విషయములను నాకు వివరించి చెప్పుడు.
శ్రీ నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
తార స్నానమునకైపోయి ఆలస్యము చేసినదను విషయమును తెలుసుకొని ఆమెను వెదుకుటకై తన శిష్యుని గంగానదికి పంపేను. ఆ శిష్యుడచ్చటకు పోయి ఆ ప్రాంతముననున్న జనులవలన చంద్రుడామెను ఎత్తుకొని పోయిన వృత్తాంతమును తెలిసికొనీ ఏడ్చుచు ఆ విషయమును గురువున కెరిగించెను.
తన భార్యను చంద్రుడెత్తుకొని పోయెనను వార్తను విని బృహస్పతి కొంత సేపు మూర్చపోయి తరువాత లేచి దుఃఖము, సిగ్గు ఆవరించుకొనగా శిష్యసహితముగా ఏడ్చెను. తరువాత తాను తాను దుఃఖించుచు, దుఃఖించుచున్న తన శిష్యులతో ఇట్లు పలికెను.
బృహస్పతీరువాచ- బృహస్పతి ఇట్లనెను-
ఓ వత్సలారా! నన్నెవరు శపించరీ? దీనికి గల కారణము నాకు తెలియదు. ధర్మమునకు వ్యతిరేకముగా ప్రవర్తించువాడు మాత్రమే దుఃఖమును పొందును. మరి నేను ఎటువంటి ధర్మవిరుద్ధమైన పనులు చేసితిని.
ఇంటిలో ప్రియముగా మాట్లాడు భార్యలేనిచో, తన మనసెరిగి ప్రవర్తించు స్త్రీని శత్రువు లెత్తుకొని పోయినచో, సుశీల సుందరీయగు భార్య ఇల్లు వదలి పోయినచో, పతివ్రతయగు స్త్రీ దురదృష్టము వలన పోయినచో, ఆ ఇల్లు అడవిపంటిదిఅగును. అట్లే ఎవని ఇంటిలో తల్లి యుండదో, భార్య లేక ధనము బంధువులెందరున్నను ఆ ఇల్లు అరవివంటిదేగాని ఇల్లు కాజాలదు.
భార్యలేనిచో ఇంటి యజమాని అపవిత్రుడగును. అందువలన దేవతా పితృకార్యములు చేయుటకతనికి అర్హత ఉండదు. అతడు దేవపితృకర్మలు చేసినను తత్ఫలమతనికి లభింపదు.
అగ్నివలె దాహికశక్తిలేని, ప్రభలేని సూర్యునివలె, శోభలేని చంద్రునివలె. శక్తిలేని జీవునివలె, శరీరములేని ఆత్మవలే, ఆధారములేని ఆధేయమువలె, ప్రకృతిలేని ఈశ్వరునివలె, దక్షిణలేని యజ్ఞమువలె, బంగారములేని కంసాలివలె, మట్టిలేని కుమ్మరివానివలే, గృహాధీష్ఠాతృదేవియగు భార్యలేని ఇంటియజమాని ఎట్టిపనులు చేయజాలడు.
క్రియలకన్నిటికి భార్య ప్రధాన కారణమగును, అట్లే ఇంటికీ శోభ భార్యవలననే కలుగును. గృహస్థులకు సుఖమంతయు భార్యమూలముననే లభించును. రథము కలవానికి రథమెట్టిదో, గృహస్థులకు గృహము ఆట్టిది. అట్టి గృహస్థుకు భార్య సారథి వంటిది. స్త్రీ అన్ని రత్నములలో ప్రధానమైనది అని బ్రహ్మదేవుడు పలికెను. జలము లేక పద్మమెట్లు శోభింపదో శోభలేని పద్మమెట్లుండునో అట్లే గృహస్థుకు భార్య లేక శోభ ఉండదు.
బృహస్పతి ఈవిధముగా శిష్యులతో నని తన ఇంటిలోని ప్రవేశించి, బయటకు వచ్చి మరల ప్రవేశించి మాటిమాటికి బాధపడుచుండెను, మాటిమాటికి మూర్ఛపొందుచు లేచుచుండెను. అట్లే తన భార్య గుణములను స్మరించుకొనుచు ఏడ్చుచుండెను.
ఆ సమయమున మహాజ్ఞానవంతుడగు బృహస్పతిని తోటివారు ఓదార్చగా తన శిష్యులందరితో గూడి అతడు మహేంద్రుని ఇంటికివెళ్ళెను. మహేంద్రుడు తనకు గురువగు బృహస్పతికి ఆతిథ్యమొసగి గౌరవించెను. అప్పుడు బృహస్పతి హృదయశల్యము వలె బాధించుచున్న తన వృత్తాంతమును అతనికి తెలిపెను.
దేవేంద్రుడు బృహస్పతి మాటలు విని కోపమువలన ఎరుపెక్కిన కళ్ళతో వణకుచున్న పెదవులతో ఇట్లనెను.
మహేంద్ర ఉవాచ-
మహేంద్రుడిట్లనెను
వేలకొలది నా దూతలు గూఢచర్యము చేయుటకు వెళ్ళి పాతకియైన చంద్రుడు నా తల్లియగు తారలో ఎక్కడ ఉన్నాడో తెలసికొంటారు. తరువాత నేను దేవతలలో సర్వసన్నద్ధుడనై ఆతనిపై యుద్ధమునకు వెళ్ళుదును. అందువలన పూజ్యులగు బృహస్పతి మహాశయా! మీరు చింతింపవద్దు. మీకు అంతయు మంగళమే జరుగును. మంగళమునకు కారణమైన దుఃఖమే ఇది. ఎవ్వరికిని కష్టము లేక సంపదలు కలుగవు కదా. అందువలన మీరు దుఃఖపడవద్దు అనెను.
దేవేంద్రుని దూతలు నూరు సంవత్సరములు నిర్జనములు, దుర్లంఘ్యములు అగు ప్రదేశములలో లోకములన్నియు తిరిగి చంద్రునీ జాడ తెలుసుకొని తిరిగివచ్చిరి. వారు మహేంద్రునితో చంద్రుడు దేవతలకు భయపడి తారతో శుక్రుని శరణు పొందినట్లు, అతడిచ్చిన అభయమువలన భయములేక శుక్రుని ఇంటిలో ఉన్నట్లు తెలిపిరి. చారులవలన ఈ వృత్తాంతము తెలిసికొన్న దేవేంద్రుడు తలవంచుకొని బాధపడుచు తన గురువులో నిట్లనెను.
మహేంద్ర ఉవాచ- మహేంద్రుడిట్లనెను.
పూజ్యుడా! ఇది సుఖాంతమగును. మీరు భయము పెట్టుకోవద్దు. మీకు సర్వము మంగళమగును. మీరు శుక్రుని జయింపలేదు, నేను దైత్యులను జయింపలేదు, అని ఆలోచించి చంద్రుడు దైత్యగురువగు శుక్రుని శరణువేడెను.
అందువలన మనమందరము కలిసి బ్రహ్మలోకమునకు వెళ్ళి, బ్రహ్మదేవునితో కలసి శంకరుని దగ్గరకు పోవుదము అని దేవేంద్రుడు బాధపడుచు గురువగు బృహస్పతితో కలసి బ్రహ్మలోకమును చేరుకొనెను.
మహేంద్రుడు మొదలగు దేవతలు బ్రహ్మలోకమున బ్రహ్మదేవుని చూచి బృహస్పతితో సహా అందరు బ్రహ్మదేవునకు నమస్కరించిరి. తరువాత దేవతలకందరకు ఈశ్వరుడగు బ్రహ్మదేవునకు విషయమంతయు వివరించిరి. అప్పుడు బ్రహ్మదేవుడు వినయముతో నిట్లు పలికెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనెను-
ఎవరు ఇతరులకు దుఃఖమును కలిగింతురో వారికి సనాతనుడగు శ్రీకృష్ణపరమాత్మ దు:ఖమును కలిగించును. నేను సృష్టినీ చేయగా విష్ణుమూర్తి ఈ సృష్టిని కాపాడుచున్నాడు. రుద్రుడీ సృష్టిని సంహరించుచున్నాడు. శివుడు అందరకు మంగళమును కలిగించును. ధర్ముడు ఎల్లప్పుడు సర్వవిషయములకు సాక్షియై యుండును. ఈ దేవతలమందరము శ్రీకృష్ణపరమాత్మయొక్క ఆజ్ఞను పరిపాలించెదము.
అంగిరస మహర్షికి బృహస్పతి, ఉతథ్యుడు, సంవర్తుడను ముగ్గురు పుత్రులు కలరు. వారందరు వేదవేదాంగములనన్నిటిని క్షుణ్ణముగా అభ్యసించిన వారు. తండ్రియగు ఆంగిరస మహర్షి చిన్నవాడగు సంవర్తున కెట్టి సంపదను ఇవ్వలేదు. అయినను అతడు తపస్సు చేయుచు నిరంతరము శ్రీకృష్ణుని ధ్యానించుచుండును.
నీవు నీ సోదరుడగు ఉతథ్యునియొక్క భార్యను కామించి, ఆమె గర్భవతినికూడ గమనించక ఎత్తుకొని పోతివి.
కాముకుడై సోదరుని భార్యను బలాత్కరించిన కాముకుడు వేయిరెట్లు బ్రహ్మహత్యా ఫలమును పొందును. అతడు సూర్యచంద్రులున్నంతవరకు కుంభీపాకమను నరకమన యాతనలననుభవించును. సోదరుని భార్యను బలాత్కరించినవాడు తల్లితో జారత్వము చేసిన వానితో సమానుడు. అందువలన వాడు నరకయాతనలననుభవించిన పిదప మలమునందలి క్రిమీగా వేలకోట్ల సంవత్సరములుండును. తరువాత ఆ మహాపాపి స్త్రీయోనిలోని పురుగై కోట్లకొలది సంవత్సరములుండును. అటుపిమ్మట గద్దగాను, కుక్కగాను, పందిగాను అనేక జన్మలెత్తును.
అట్లే బలవంతుడైనవాడు దుర్బలుడైన తన సోదరునకు దొయభాగమవ్వక మోసగించినచో అతడు కూడ సూర్యచంద్రులున్నంతకాలము కుంభీపాకనరకమున పడును.
శుభాశుభ కర్మలయొక్క ఫలితమును అనుభవించనిదే ఆ కర్మలు తీరవు. అందువలన మానవుడు తప్పక ఆ కర్మఫలితములననుభవించి తీరవలసినదే.
బృహస్పతి జగద్గురువగు శివునకు సైతము గురుపుత్రుడు. అందువలన మహాబలవంతుడైన శంకరునకు కూడ ఈ విషయము తెలియవలెను. అందువలన దేవతలందరు సర్వసన్నద్ధులై వాహనములనధిరోహించి మధ్యభాగమున మునులుండగా నర్మదానదీ తీరమునకు పొండు. మీ వెనక నేను కూడ పవిత్రమైన నర్మదానదీ తీరమునకు వత్తును. అట్లే పరమేశ్వరునకు గురువు అతని పుత్రుడగు బృహస్పతి కూడ పరమేశ్వరుడున్న కైలాసమునకు పోవలెనని బ్రహ్మదేవుడనెను.
వేదములన్ని తెలిసిన నీరు, సిద్ధులకు యోగులకు గురువగు పరమేశ్వరునకు బృహస్పతి గురుపుత్రుడెట్లయ్యెను. అంగిరసుడు నీ పుత్రుడు, బృహస్పతి అతని యొక్క పుత్రుడు. పరమ శివుడు నీ కంటే గొప్ప జ్ఞానవంతుడు. అట్టి పరమశివునకు బృహస్పతి గురుపుత్రుడెట్లయ్యెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనెను-
మహీంద్రా! ఈ కథ పురాణములలో చాలా రహస్యముగానున్నది. ఇట్టికథను నీకు తెల్పెదను. అంగిరసునికి కర్మదోషమువలన పుట్టిన సంతానము నశించుచుండుటచే అతని భార్య కృష్ణపరమాత్మయొక్క వ్రతమును చేసెను. పుంసవనమును ఆ వ్రతమును సనత్కుమారుడు ఒక సంవత్సరమువరకు జరిపించెను. ఆ వ్రతమాహాత్మ్యమువలన గోలోకమునుండి కృపామయుడు, పరమాత్మ, స్వేచ్ఛామయుడు, భక్తులననుగ్రహించువాడగు శ్రీకృష్ణపరమాత్మ ప్రత్యక్షమై చక్కగా వ్రతమును చేసి శ్రీకృష్ణుని చూడగానే కన్నీళ్ళతో వినయముతో నమస్కరించుచున్న ఆమెతో ఇట్లనెను.
శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణుడిట్లనెను-
ఓ సాధ్వీ! నా తేజస్సు గల ప్రతఫలమును తీసికొమ్ము దీనిని అనుభవించినచో నా వరమువలన సా ఆంశతో నీకొక పుత్రుడు ఉదయించును. నీ పుత్రుడు గొప్ప జ్ఞాని, దేవతలకు గురువు కాగలడు. నా వరమువలన నీకు కలుగు పుత్రుడు బృహస్పతియగును. నానరమువలన పుట్టుపుత్రుడు మద్వరపుత్రకుడగును. ఈతడు చిరంజీవియగును. నీగర్భమున నా అంశవలన అతడు పుట్టును.
వరమువలన పుట్టినవాడు, వీర్యమువలన పుట్టినవోడు, క్షేత్రజుడు, పాలకుడు, విద్యనుపదేశించుటవలన ఏర్పడు పుత్రుడు (విద్యాపుత్రుడు), మంత్రముపదేశించుటవలన ఏర్పడు పుత్రుడు (మంత్రపుత్రుడు), తీసుకొనబడినవాడని పుత్రులు ఏడువిధములుగా నుందురు. వారిలో ఇతడు వరము వలన పుట్టిన పుత్రుడు.
ఈవిధముగా అంగిరసుని భార్యతో శ్రీకృష్ణపరమాత్మ పలికి 'తనలోకమగు గోలోకమునకు వెళ్ళిపోయెను.
ఇట్లు బృహస్పతి, శ్రీకృష్ణునకు వరపుత్రుడగును. జ్ఞానీశ్వరులకు సైతము గురువు అగు పరమాత్మ ఒకప్పుడు పరమశివునకు మృత్యుంజయమను మహాజ్ఞానము నొసగెను. ఆ మృత్యుంజయజ్ఞానమును పొంది పరమశివుడు హిమాలయములలో మూడులక్షల దీవ్యవర్షములు తపస్సు చేసెను. దానివలన అతడు తనదైన యోగమును, సమస్త జ్ఞానమును, స్వశక్తినీ, విష్ణుమాయను, తనకు వాహనమగు వృషభమును, త్రిశూలమును, కవచమును, ద్వాదశాక్షరమైన స్వమంత్రమును పొందగలిగెను.
ఆ పరమశివుడు కృపామయుడగు శ్రీకృష్ణపరమాత్మను స్తుతించగా శివలోకమున శివా అను పేరుతో ప్రసిద్ధినొందిన నారాయణుని శక్తియగు విష్ణుమాయ ఆవిర్భవించినది. ఆ సనాతని సర్వప్రాణుల తేజస్సుతో కూడుకొన్నది.
ఆ మాయ రాక్షసుల నందరను చంపి వారి నివాసస్థానమును దేవతల కొసగినది. ఆ దేవి కల్పముయొక్క అంతమున దక్షకన్యగా జనించి పరమేశ్వరునకు పత్నియైనది. ఆమె తండ్రియగు దక్షుడు చేయుచున్న యజ్ఞమున తన భర్భనిందను సహింపలేక యోగశక్తిచే శరీరత్యాగము చేసినది. అటుపిమ్మట ఆమె పార్వతిగా అవతరించి శ్రీకృష్ణుని తపః ప్రభావమువలన మరల శంకరునకు భార్యయైనది.
శ్రీకృష్ణుడు శంకరునకు గురువు బృహస్పతి శంకరునికి గురువగు శ్రీకృష్ణుని వరపుత్రుడు. అందువలన దేవతా గురువగు బృహస్పతి శంకరునకు గురుపుత్రుడగుచున్నాడు,
దేవేంద్రా! ఈ విధముగా పరమ రహస్యమైన బృహస్పతి జన్మవృత్తాంతమును తెలిపితిని అని బ్రహ్మదేవుడనెను.
నారదా! పరంపరగా వచ్చుచున్న ఇంకొక సంబంధమును కూడ నీకు తెలి పెదను. దుర్వాసమహర్షి, గరుత్మంతుడు వీరిద్దరు శంకరాంశకలవారు. వీరిద్దరు ఆంగిరసుని దగ్గర విద్యనభ్యసించినందువలన శంకరుడు అంగీరసుని శిష్యుడైనాడు. బృహస్పతి అంగిరసుని పుత్రుడు కావున శంకరునకతడు గురుపుత్రుడాయెను. లేక దక్షునియొక్క శాపము వలన సతీదేవి దక్షయజ్ఞమున శరీర పరిత్యాగము చేసినప్పుడు శంకరుడు మోహమువలన తన జ్ఞానమును, తనను మరచిపోయెను. ఆ సమయమున శ్రీకృష్ణుని ప్రేరేపణవలన అంగిరసుడు శంకరునకు వాటి స్మరణ కలిగించినందువలన నా పుత్రుడగు అంగిరసుడు శంకరునికి గురువగును.
అందువలన బృహస్పతి స్వయముగా తన బాధలు చెప్పుకొనుటకు పరమశివుని దగ్గరకు పోవలయును. నీవుకూడ దేవతలందరితో కలసి సర్వసన్నద్ధుడవై నర్మదానదీతీరమునకు పొమ్మనీ బ్రహ్మదేవుడు పలికి ఊరకుండెను.
బృహస్పతి బ్రహ్మదేవుని మాటననుసరించి కైలాసమునకు పోగా దేవతాధిపతియైన ఇంద్రుడు నర్మదానదీ తీరమునకు పోయెను.
శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణ సంవాదములో తెల్పబడిన దుర్లోపాఖ్యానములో బృహస్పతి కైలాసమునకు వెళ్ళుట అను యాభై తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
