2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
28 - సావిత్రి చేసిన యమధర్మరాజు స్తోత్రము
శ్రీవారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడు నారదునితో నిట్లనెను-
యమధర్మరాజు చెప్పిన శ్రీహరి గుణ కీర్తనమును సావిత్రివిని ఆనందబాష్పములు రాలగా పులకాంకురిత శరీరయై యమునితో ఇట్లు పలికెను.
సావిత్ర్యువాచ- సావిత్రి ఈవిధముగా ఆనెను-
శ్రీమన్నారాయణుని నామ గుణ కీర్తనము చేయువారికి వినువారికి ఆది జన్మమును, మృత్యువును, ముసలితనమును హరించును. అట్లే ధర్మమును తన కులమును ఉద్దరించును. శ్రీహరి నామగుణకీర్తనము అన్నీ దానములకంటె, వ్రతములకంటే సిద్దులకంటే, తపస్సుల కంటే, యోగములకంటె, వేదములకంటే చాలా గొప్పది. ముక్తి, అమరత్వము, సమస్తసిద్దులు శ్రీకృష్ణసేవనమునకు పదహారవ వంతైన కాజాలవు.
ప్రకృతికి అతీతుడైన శ్రీకృష్ణువి ఏ విధముగా సేవించవలెనో తెల్పుడు, మీరింతవరకు మానవులు చేయు పుణ్య కర్మల ఫలితముమ తెలిపితిరి. అట్లే వారు అశుభ కర్మల ఫలితమెట్లుండునో తెలుపుడు.
ఈ విధముగా పావిత్రి ధర్మరాజుతో అని భక్తితో నమస్కరించి వేదమునందు చెప్పబడిన స్తోత్రముచే ఇట్లు స్తుతించెను.
సాహీత్ర్యువాచ- సావిత్రి ఇట్లనెను-
పూర్వము సూర్యుడు పుష్కర క్షేత్రమున ధర్మదేవతను ఆరాధించి ధర్మదేవతాంశుడైన కుమారుని కనెను. అతని పేరు ధర్మరాజు. ఆ యమధర్మరాజుకు నమస్కరింతును. సమస్త ప్రాణులయందు పక్షపాత రహితుడై సమానముగా ఉండి. ప్రాణులు చేయు సమస్తకర్మలకు సాక్షీభూతుడైన శమనుని నమస్కరింతును, ప్రపంచములోని సమస్త జీవులకు వారి వారి కర్మాను రూపమైన సమయమున్న వారిని ఆంతమును చేయుచున్నందువలన కృతాంతుడవగు నిన్ను నమస్కరింతును. పాపము చేసిన ప్రాణులను పాపవిముక్తులను చేయుటకు దండన విధించుటకై చేతిలో దండము ధరించుచున్నందువలన దండధరుడవు అగు. నిన్ను నమస్కరించుచున్నాను. ఈ ప్రపంచమున నున్న జంతువుల ఆయుస్సును ఏర్పరచుచున్నందువలన నీవు కాలుడవైతివి.
తపమాచరించుచు విష్ణుభక్తుడవై, జితేంద్రియుడవై జీవులు చేసిన కర్మలకు ఫలమును సంయమనముతో ఇచ్చుచున్నందువలన యముడవైతివి. సర్వజ్ఞుడు, పుణ్య కర్మలు చేయువారికి స్నేహితుడు, పాపకర్మలు చేయువారికి కష్టములను కల్గించువాడు ఆత్మారాముడవైయుందువు. బ్రహ్మవంశములో పుట్టి బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచు పరబ్రహ్మను ధ్యానించు నిన్ను నమస్కరింతునని సావిత్రి యముని స్తుతించెను.
ఈవిధముగా సావిత్రి యమధర్మరాజును భక్తిపూర్వకముగా స్తోత్రము చేయగా యముడు సంతోషించి ఆమెకు విష్ణుమూర్తిని సేవించు విధానమును అశుభకర్మవిపాకమును ఇట్లు చెప్పెను.
సావిత్రి యముని స్తుతించిన ఈ యమాష్టకమును ఉదయముననే లేచి చదివినవారికి యముని భయముండదు. అట్లే అతని సమస్త పాపములు నశించిపోవును. ఓనారదా! దీవిని మిక్కిలి పాపములు చేసినవాడైనా భక్తి శ్రద్ధలతో చదివినచో యముడతనిని పరిశుద్దుని చేయును అని నారాయణుడు నారదునితో అనెను.
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణుల సంవాదమువ తెలుపబడిన సావిత్రి చేసిన యమస్తోత్రమను ఇరువది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
