2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

57 - దుర్గోపాఖ్యాన ప్రారంభము

నారద ఉవాచ- నారదమహర్షి నారాయణునితో ఇట్లనెను-

ఓ నారాయణమునీ! నీవు చెప్పగా పరమాద్భుతమైన కథలనన్నిటిని వింటిని. ఐనను నాకిప్పుడు దుర్గాదేవి ఉపాఖ్యానము వినవలెనని ఉన్నది.

ఆ దేవికి దుర్గ, నారాయణి, ఈశాని, విష్ణుమాయ, శివ, సతి, నిత్య. సత్య, భగవతి, శర్వాణి, సర్వమంగళా, అంబిక, వైష్ణవీ, గౌరీ, పార్వతీ, సనాతని అను పేర్లు కలవు. ఇవన్నీయు సామవేదములోని కౌధుమశాఖయందు చెప్పబడినవి. శుభం కరమైనవికూడ.

ఓ వేదవేదాంగ తత్వవేత్త! పై పదునారు పేర్లకు వేదములందు ఎట్టి అర్థము చెప్పబడినది. ఆ దేవీని తొలుత ఎవరు పూజించిరి? ఆతరువాత పూజించినదెవరు? ఆ తరువాత దుర్గాదేవిని ఎవరెవరు పూజించిరో తెలుపుమని ఆడిగెను.

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

దుర్గాదేవియొక్క షోడశ నామములకు అర్థమును వేదమున విష్ణుమూర్తి చెప్పెను. ఆ విషయము నీకు తెలిసినను నన్నడుగుచున్నావు. ఐనను ఆగమశాస్త్ర పద్ధతిలో ఆ పదముల ఆర్థమును తెలుపుదును.

'దుర్గ' శబ్దమునకు రాక్షసుడు, గొప్పనైన వీఘ్నము, సంసారబంధము, కర్మ, శోకము, దుఃఖము, నరకము, యమదండనము, జన్మ మొదలగు అర్థములున్నవి. అట్లే 'ఆ' శబ్దమునకు పోగొట్టునది హతమొనర్చునది అను అర్థములున్నవి. దుర్గ శబ్దార్థములైన రాక్షసుడు మొదలగువానినీ హతమొనర్చునది కావున ఆ దేవి దుర్గాదేవి యైనది.

ఈదేవి యశస్సున, తేజస్సున, రూపమున, గుణములయందు నారాయణునితో సమానమైనది. పైగా నారాయణునకీదేవి శక్తిరూపిణికావున నారాయణి యైనది.

'ఈశాన' శబ్దమునకు సమస్త సిద్ధులు అను అర్థము కలదు. 'ఆ' శబ్దమునకు దాతయను అర్థము కలదు. ఈవిధముగా సమస్త సిద్ధుల నొసగు దేవతకావున ఈ దేవతను ఈశానా యని యందురు.

పరమాత్మయగు విష్ణువు చరాచరా ప్రపంచమును సృష్టింపదలచి మాయాదేవిని సృష్టించెను. ఆమెవలన ప్రపంచమంతయు మోహపరవశమైనది. విష్ణువుయొక్క - మాయకావున ఆ దేవి విష్ణుమాయయైనదీ.

'శివ' యనగా కల్యాణరూపమైనది. 'ఆ' శబ్దమునకు ప్రియ మరియు దాత యను ఆర్థములున్నవి. కల్యాణములనిచ్చునది లేక శివునకు ప్రియురాలగు ఆదేవిని 'శివా' అనీ అందురు.

సద్బుద్ధికి అధిష్టాన దేవత లేక ప్రతియుగమున ఉండునది. పతివ్రత, మంచిశీలము కల ఆ దేవిని 'సతీ' యని ఆందురు.

భగవంతుడగు పరమాత్మ ఎట్లు నిత్యుడో అట్లే భగవతి కూడ నిత్యస్వరూప. ఆ దేవి తన మాయవలననే ప్రాకృతలయమున భగవంతుని యందు విలీనమగుచున్నది. కాన' ఆ దేవిని 'నిత్య'యని యందురు.

బ్రహ్మదేవుడు మొదలుకొని స్తంబమువరకున్న సమస్త చరాచర జంతుకోటి అశాశ్వతమైనది. కాని భగవంతుడు సత్యస్వరూపుడు. అట్లే దుర్గ, ప్రకృతియగు ఆ దేవి సత్యస్వరూపయగుచున్నది.

'భగ'మనగా సిద్ధము, ఐశ్వర్యము మొదలగు ఆర్థములున్నవి. ఈ దేవి ప్రతియుగమున ఐశ్వర్యాది సిద్ధిసహిత కావున "భగవతి" యను పేరుతో నున్నది. - ఈ ప్రపంచముననున్న చరాచర సృష్టికంతయు జన్మ, మృత్యు. జరాదికములను మోక్షమునిచ్చుచున్నందువలన ఆదేవి శర్వాణి యను పేరుతో ప్రసిద్ధిచెందినది.

“మంగళ శబ్దమునకు మోక్షమనీ 'ఆ' శబ్దమునకు దాతయను అర్థమున్నది. సర్వసృష్టికి మంగళరూపమైన మోక్షమునిచ్చు దేవిని 'సర్వమంగళా యని యందురు. 'మంగళ శబ్దమునకు హర్షము, సంపద, కల్యాణమను అర్థములున్నవి. సర్వులకు హర్షాదీ మంగళములను ఇచ్చు. దేవి కావున సర్వమంగళమైనది.

'అంబా' శబ్దమునకు తల్లియనునర్ధముకలదు, అట్లే పూజిత, వందిత యను అర్థములు కూడ నున్నవి. సమస్త జుగములచే ఈ దేవత పూజలనందుకొనుచున్నందువలన, నమస్కారములనందుకొనుచున్నందున 'ఆంబ' యైనది. అట్లే సమస్త విశ్వములకు మాతృరూపిణి కావున 'ఆంబ' యైనది.

విష్ణుమూర్తికి భక్తురాలు, విష్ణుస్వరూపిణి, విష్ణుశక్తి స్వరూపిణి, సృష్టి ప్రారంభమున ఈదేవిని విష్ణువు సృష్టించినందువలన వైష్ణవిగా ప్రసిద్ధికెక్కినది.

 గౌర' శబ్దమునకు పీతవర్ణమనీ, నిర్లిప్తమని, పరబ్రహ్మ, నిర్మలము అను అర్థములున్నవి. పరబ్రహ్మయొక్క శక్తిస్వరూపిణి కావున 'గౌరి' గా ఈ దేవి ప్రసిద్ధినందినది. అందరకు గురువు శంకరుడు. అతని శక్తి స్వరూపిణి లేక గురువైన కృష్ణుని మాయ కావున 'గౌరి'యైనదీ.

తిథి భేదమగు పూర్ణిమకు, పర్వభేదమునకు, ఒకానొక కల్పమునకు, ఇంకను కొన్నిటిని . పర్వమని పిలుతురు. "తీ' యనగా ఖ్యాతి. పై పోటిలో ప్రఖ్యాతీనందినందువలన ఆ దేవత పార్వతి యైనది. ఒక మహోత్సవమునకు 'పర్వన్' అను పేరుకలదు. ఆ యుత్సవమునకు అధిష్టానదేవి కావున పార్వతియైనది. హిమాలయపర్వతమునకు తనయ లేక ఆ పర్వతమునకు అధిష్టాన దేవత కావున పార్వతియైనది.

'సనా'యనగా సర్వకాలము. 'తనీ' యనగా విస్తరించి యుండునది. సర్వకాలములందు సర్వత్ర విస్తరించియుండు ఈ దేవతను 'సనాతనీ'యని పిలుతురు.

నారదమునీ! దుర్గాదేవియొక్క పదునారు పేర్లకు గల అర్థమును ఆగమప్రకారము నీకు విశదపరచితిని. ఇక నీకు వేదోక్తమైన ఆదేవియొక్క ఉపాఖ్యానమును తెల్పెదను.

ఆదేవిని తొలుత పరమాత్మయగు శ్రీకృష్ణుడు. గోలోకమందలి రాసవనమున సృష్టిని ప్రారంభించు సమయమున పూజించెను. ఆ తరువాత మధుకైటభులనే రాక్షసులకు భయపడిన బ్రహ్మదేవుడామె పూజను చేసేను.

ఆ తరువాత త్రిపురాసుర సంహార కాలమున మహేశ్వరుడామెను పూజించెను. తరువాత దుర్వాసమహర్షి శాపమునకు గురియైనందువలన రాజ్యలక్ష్మిని పోగొట్టుకొన్న మహేంద్రుడామెను పూజించెను. అటుపిమ్మట మునీంద్రులు సిద్ధేంద్రులు దేవతలు మొదలగు వారందరు ఆ దేవిని పూజింపసాగిరి.

ఆ దేవి సమస్త ప్రాణులయొక్క తేజస్సుగా ఆవిర్భవించినందువలన సమస్తదేవతలాదేవికి తమతమ అస్త్రములను ఆభరణములనిచ్చిరి, ఆ దేవతలయొక్క ప్రార్థనపై ఆ దేవి దుర్గాది రాక్షసులను సంహరించి వారి రాజ్యములను దేవతలకిచ్చివేసెను. అట్లే ఆ దేవతలయొక్క అభీష్టములను నెరవేర్చినది.

 ఇంకొక కల్పమున మేధమహర్షి శిష్యుడైన సురథుడను రాజు నదీతీరమున మృణ్మయమైన దుర్గాదేవియొక్క మూర్తిని నిర్మించి. వేదోక్తములైన షోడశోపచారములతో ఆ దేవిని పూజించి ధ్యానించి కవచాదికములను శాస్త్రపద్దతిలో ధరించెను. అటుపిమ్మట పరిహారము ఆను స్తోత్రమును చేసి ఆ దేవతవలన అభీప్పితమును పొందెను.

సమాధియను ఒక వైశ్యుడు నదీతీరమున మృణ్మయమైన దుర్గామూర్తిని నిర్మించి పూజించి మోక్షమును పొందెను. ఆ వైశ్యుడు, రాజగు సురథుడు కలసి చేతులు జోడించుకొని కండ్లలోనుండి అశ్రువులు రాలగా నిర్మలమైన నీటిలో మృణ్మయమైన దేవీమూర్తిని వదలి పెట్టిరి. అప్పుడా దేవతామూర్తీ తిరిగి కన్పించక పోవుటచే వైశ్యుడు ఏడ్చుచు పుష్కరక్షేత్రమునకు వెళ్ళి ఆ దేవినిగూర్చి దుష్కరమైన తపస్సు చేసెను. అప్పుడా దేవియొక్క అనుగ్రహము వలన అతడు గోలోకమును చేరుకొనెను.

సురథుడు తన రాజ్యమునకు వెళ్ళి అరవై వేల సంవత్సరములు రాజ్యసుఖముననుభవించి తన రాజ్యమును, తన భార్యను తన పుత్రునీ అధీనముననుంచి పుష్కరక్షేత్రమున తపమాచరించి సావర్ణి మనువయ్యెను.

నారదా! నీకు దుర్గాదేవియొక్క ఉపాఖ్యానమును ఆగమశాస్త్రములననుసరించి సంక్షేపముగా చెప్పితినని నారాయణముని అనెను.

ఇతిశ్రీ బ్రహ్మవైవర్త్ మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే దుర్లోపాఖ్యానే దుర్గాదీనామ వ్యుత్పత్తి కథనం నామ సప్త పంచాశత్తమోఽధ్యాయః॥ శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణములోని ప్రకృతి ఖండమున నారదనారాయణుల సంవాదసమయమున తెల్పబడిన దుర్లోపాఖ్యానమున దుర్గాది నామముల వ్యుత్పత్తిని తెల్పు

యాభై ఏడవ అధ్యాయము సమాప్తము.