2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

53 - సుయుజ్ఞునకు అథిదివేషముననున్న విష్ణూపదేశము

శ్రీపార్వత్యువాచ- శ్రీపార్వతీదేవి ఇట్లనెను –

మహేశ్వరా! మునులందరు వెళ్ళిపోయిన తరువాత సుయజ్ఞమహారాజు బ్రహ్మశాపభీతుడగుచు ఏమి చేపెమ? అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడు రాజుయొక్క ఇంటికి వెళ్ళేనా? లేదా? ఆ విషయమునంతయు చెప్పుము.

మహేశ్వర ఉవాచ- శంకరుడామెతో ఇట్లనెను –

మహేశ్వరి! మునులందరు తమ ఇండ్లకు వెళ్ళిపోయిన తరువాత ధర్మిష్ఠుడగు వసిష్ఠ మహాముని ప్రేరణవల్ల మహారాజు బ్రాహ్మణునకు సాష్టాంగ దండప్రణామములాచరించెను.

బ్రాహ్మణుడప్పుడు కోపమును వదలిపెట్టి ఆ మహారాజునకు శుభాశీస్సులనొసగెను. కోపములేక, చిరునవ్వుతో నున్న బ్రాహ్మణుని జూచి మహారాజు కన్నీళ్ళు కారగా దండము పెట్టుచు ఇట్లనెను.

రాజోవాచ- సుయజ్ఞ మహారాజిట్లనెను –

ఓ బ్రాహ్మణుడా! నీవే వంశమున జన్మించితివి. నీ పేరేమి? మీ నివాసమెక్కడనుండును? ఇక్కడకు ఎట్లు వచ్చితిరి. బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సుచే ప్రకాశించు అగ్నివలె ఉండును. భగవన్! మీ గురువెవరు? మీ ఇష్టదైవము పేరేమి? సంపూర్ణ జ్ఞానముతో నిండిన మీ వేషమీటైందుకున్నది? మీరు నాయొక్క సమస్త రాజ్యమును, ఐశ్వర్యమును, కోశాగారమును, స్వీకరింపుడు. నన్ను నా పుత్రుని భృత్యునివలె నాభార్యను దాసివలె మీరు స్వీకరింపుడు.

సప్త సాగరములు కలది, సప్త ద్వీపములు, అష్టాదశ ఉపద్వీపములు, పర్వతములు అడవులతోనున్న ఈ భూమినంతయు స్వీకరించి మీరు రాజుగానుండి రత్నసింహాసనమున కూర్చుండి నన్ను భృత్యునిగా స్వీకరింపుడు. అను సుయజ్ఞమహారాజు మాటలు విని బ్రాహ్మణుడు నవ్వుచు సర్వదుర్లభమైన, పరతత్వమును ఇట్లు తెలిపెను.

అతిథ్రువాచ- అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడిట్లనెను –

బ్రహ్మదేవునకు మరీచి మహర్షి పుత్రుడు, అతని పుత్రుడు కశ్యప ప్రజాపతి. ఆ ప్రజాపతి పుత్రులందరు దేవత్వమును పొందిరి. ఆ కశ్యపపుత్రులలో మిక్కిలి జ్ఞానసంపన్నుడైన త్వష్ట పుష్కర క్షేత్రమున వేయి దివ్య సంవత్సరములు గొప్పనైన తపస్సు చేసెను. అతడు పుత్రసంతానమునకై శ్రీహరిని సేవింపగా అతని అనుగ్రహమువలన మంచి తేజస్సంపన్నుడగు పుత్రుని పొందెను. ఆ పుత్రుడే గొప్ప తపః సంపద కల విశ్వరూపుడు..

ఒకప్పుడు బృహస్పతీ కోపముతో వెళ్ళిపోగా దేవేంద్రుడు విశ్వరూపునీ పురోహితునిగా చేసికొనెను. కాని ఆ విశ్వరూపుడు యజ్ఞమున తన మాతామహులైన దైత్యులకు హవిస్సులనీయగా దేవేంద్రుడు కోపపడి తల్లియగు అదితియొక్క ఆజ్ఞపై విశ్వరూపుని శిరస్సు ఖండించెను.

ఆ విశ్వరూపునకు విరూపుడనువాడు పుత్రుడు. ఆ విరూపుని పుత్రుడను నేను. నా పేరు సుతపుడు. నాకు శంకరుడు విద్యను జ్ఞానమును ప్రసాదించెను. పరమాత్మయగు శ్రీకృష్ణుడు నా ఆభీష్టదైవము. నేనెల్లప్పు డా శ్రీకృష్ణుని చరణ పద్మములను మనస్సులో ధ్యానించుచుందును. నాకు సంపదలపై ఎట్టి వ్యామోహములేదు. శ్రీహరి నాకు చతుర్విధముక్తులగు సాలోక్య సార్టి, సారూప్య సామీప్యములను ఇవ్వదలచినను నేను స్వీకరింపను. నాకు పరమ మంగళ రూపమైన శ్రీహరి సేవయే చాలును. బ్రహ్మత్వము, అమరత్వములను నేను నీటిలోని ప్రతిబింబము వలె అశాశ్వతమైనవని విశ్వసింతును. శ్రీవారి భక్తిలేనిచో సమస్తము మిథ్యా భ్రమములుగా తలపోయుదును. ఇంద్రత్వమైనను, మనుత్వమైనను, సూర్యత్వమైనను నీటిలో గీచిన గీతవలె వ్యర్థమైనవనీ భావింతును. అందువలన నీవు ఇచ్చు రాచరికమును నేను శాశ్వతమని స్వీకరింపజాలను.

నీవు చేయుచున్న యజ్ఞమునకు మునులందరు వచ్చుచున్నారని తెలిసికొని నీకు విష్ణుభక్తిని కలిగింపవలెనని ఇచ్చటకు వచ్చితిని. నేను నిన్ను అనుగ్రహించితినే కాని శపింపలేదు. చాలా భయంకరము, లోతైన సంసారసాగరమున పడిపోయిన నిన్ను ఉద్ధరించుటకు ఇచటకు వచ్చితిని.

కేవలము జలమయమైనవి మాత్రమే తీర్థములు కాజాలవు. విష్ణు భక్తులు తీర్థములవంటివారు. అట్లే మట్టి, శిలలతో రూపొందించినవారే దేవతలుకారు. శ్రీహరి పాదభక్తులు కూడ దేవతలవంటివారు. ఆంబుమయములైనతీర్థములు, మృచ్ఛిలామయములైన దేవతలు చాలాకాలమునకు మానవులను పవిత్రులనుగా చేయుచుండగా శ్రీకృష్ణ భక్తుల దర్శనము జరిగినంతమాత్రముననే జనులు పవిత్రులగుదురు.

ఓరాజా! నీవు ఇంటినుండి బయటకు రమ్ము. నీ రాజ్యమును నీ పుత్రునకిచ్చివేయుము. సాధ్వియగు నీ భార్యను నీ పుత్రునకప్పగించి నీవు అడవికి వెళ్ళుము. ఈ ప్రపంచమున బ్రహ్మమొదలుకొని స్తంబమువరకున్న దంతయు అశాశ్వతమైనది. పరమాత్మ, ఈశ్వరుడు, రాధాపతియగు శ్రీకృష్ణుడు మాత్రమే శాశ్వతమైనవాడు. అందువలన ఆ శ్రీకృష్ణుని నీవు సేవింపుము. అతడు బ్రహ్మవిష్ణు, మహేశ్వరులకు దురారాధ్యుడు. ఆతడు కేవలము ధ్యానమువలననే భక్తులకు సాధ్యుడగును. అతడు ఉత్పత్తి లయములు కల ప్రాకృత పదార్థములకంటెను ప్రకృతికంటెను ష్ణుడు.

శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞననుసరించి బ్రహ్మదేవుడు ఈ చరాచర ప్రపంచమును సృష్టించుచున్నాడు. శ్రీహరి దానిని రక్షించుచున్నాడు. హరుడు దానిని సంహరించుచున్నాడు. అట్లే అతని ఆజ్ఞననుసరించియే దిక్పాలకులు సంచరించుచున్నారు. వాయువు, సూర్యుడు, చంద్రుడు, మృత్యువు, తమతమ కార్యములను నిర్వహించుచున్నారు. ఇంద్రుడు అతని ఆజ్ఞననుసరించియే సకాలమున వర్షములను కురిపించుచున్నాడు. అగ్లీ కాల్చుచున్నోడు. ప్రపంచమునే శాసించుచున్న యముడుకూడ భయముతో తిరుగుచున్నాడు. కాలుడు కాలముననుసరించి సంహరించుచు, సృష్టిచేయుచున్నాడు. సముద్రములు, భూమి, పర్వతములు, పాతాళములు అన్నియు ఆ పరమాత్మయొక్క భయమువలననే తమ తమ స్థానమున ఉన్నవి. ఏడు స్వర్లోకములు, సప్తద్వీపములతో సముద్రపర్వతములలోమన్న భూమి, సప్తపాతాళ లోకములతో నున్న బ్రహ్మాండమంతయు వీటిలో అండమువలె తేలియాడుచున్నది.

బ్రహ్మాండములన్నిటిలో ప్రత్యేకముగా బ్రహ్మవిష్ణు శివాది దేవతలు, మానవులు, సర్పములు, గంధర్వులు, రాక్షసులు మొదలగువారున్నారు. పాతాళలోకము మొదలుకొని బ్రహ్మలోకమువరకు అండరూపముననున్నది. ఈ అండమే బ్రహ్మయొక్క కృత్రిమమైన అండముగా కన్పించుచున్నది. ఇది బలమున శయనించియున్న క్షుద్రవిరాట్ స్వరూపుడైన విష్ణుమూర్తియొక్క నాభికమలమున, కమలముయొక్క కర్లీకలోనుండు పద్మబీజమువలె కన్పించును.

ఈవిధముగా జలతల్పమున శయనించియున్న ప్రాకృతుడు మహాయోగి, క్షుద్రవిరాట్ స్వరూపుడగు విష్ణువు, ప్రకృతీకంటే శ్రేష్ఠుడు, కాలమునకు ఈశుడు అగు శ్రీకృష్ణ పరమాత్మను మనస్సులో ధ్యానించుచుండును. మహావిష్ణువుయొక్క రోమకూపములు క్షుద్రవిరాట్ స్వరూపునకు ఆధారములగుచున్నవి. మహావిష్ణువుయొక్క రోమకూపములందు ప్రత్యేకముగో బ్రహ్మాండములు కన్పించుచున్నవి. అందువలన ఈ మహావిష్ణువుయొక్క రోమ కూపములు అందున్న బ్రహ్మాండములసంఖ్యాకమైనవి. వీటి సంఖ్యను శ్రీకృష్ణపరమాత్మయే లెక్క పెట్టలేడనినచో ఇతరులగురించిన మాట ఏమియుండును.

శ్రీమహావిష్ణువు ప్రాకృతీకుడు. అతడు అండాకారమైన బ్రహ్మాండముయొక్క ఉత్పత్తికి కారణమైనవాడు. అతడు శ్రీకష్ణ పరమాత్మయొక్క కోరికననుసరించి ప్రకృతియొక్క గర్భమున అండ రూపమున కన్పించుచున్నాడు..

సమస్తమునకు ఆధారభూతుడైన శ్రీమహావిష్ణువు కాలమునకు ఈశ్వరుడు, పరమాత్మయగు శ్రీకృష్ణుని ఎల్లప్పుడు ధ్యానించుచుండును.

ఈవిధముగా సమస్త బ్రహ్మాండములందున్న బ్రహ్మవిష్ణుశివాది దేవతలు, మహావీరాట్, క్షుద్రవిరాట్ వీటి కన్నిటికి బీజరూపమైనది మూల ప్రకృతియగు ఈశ్వరి. ఈమె ప్రళయకాలమున కాలేశుడగు పరమాత్మయైన శ్రీకృష్ణునియందు విలీనమై అతనిని ధ్యానించుచుండును.

ఈవిధముగా ప్రకృతి, ప్రాకృతులైన బ్రహ్మవిష్ణు, శీవాదులు, ప్రళయకాలమున . కాలేశుడగుపరమాత్మయందు విలీనమగుచున్నారు. తిరిగి సృష్టికాలమున ఆవిర్భవించుచున్నారు.

సుయజ్ఞమహారాజా! ఈవిధముగా పరమదుర్లభమైన జ్ఞానమునంతయు నీకు తెలిపితిని. దీనిని నేను నాగురువగు శివుని దయవలన నేర్చుకొంటిని. ఇంకను నీకు తెలుసుకొనవలసిదేమైన ఉన్నచో అడుగుమని బ్రాహ్మణుడు చెప్పెను.

శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణములోని రెండవదగు ప్రకృతి ఖండమున నారదనారాయణుల సంవాదమున కన్పించు గౌరీశంకరుల సంవాదమున చెప్పబడిన రాధోపాఖ్యానములోని సుయజ్ఞమహారాజునకు అతిథిచేసిన ఉపదేశమమ యాభైమూడవ అధ్యాయము సమాప్తము.