2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

12 - గంగా విష్ణువుల గాంధర్వ వివాహము

నారద ఉవాచ- నారదుడిట్లనెను-

లక్ష్మీ, సరస్వతి, గంగ, తులసి ఈ నలుగురు శ్రీకృష్ణునకు ప్రియమైనవారు. వారిలో గంగ వైకుంఠమునకు వెళ్ళినట్లు నేను వింటిని. ఐతే ఆ గంగ నారాయణునకు ప్రియురాలైన విషయమును నాకు వివరించుడు.

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు పలికెను-

గంగ వైకుంఠమునకు వెళ్ళగా బ్రహ్మదేవుడు తరువాత వైకుంఠలోకమునకు పోయెను. వారు అక్కడకు వెళ్ళిన తరువాత బ్రహ్మ శ్రీమన్నారాయణుని నమస్కరించి ఇట్లు పలికెను.

బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికెను-

ఈగంగ రాధా కృష్ణుల యొక్క అంగములనుండి ద్రవరూపముతో ఆవిర్భవించినది. జలరూపిణియైన గంగకు ఆధిష్ఠాన దేవతయగు ఈమె నవయౌవనముకలది. సుందరి, శుద్ధ సత్వస్వరూప, క్రోధాహంకారములు లేనిది. కృష్ణుని యొక్క శరీరమునుండి పుట్టినందువలన అతనిని తప్ప ఇంకొకరిని వివాహము చేసికొనుటకు ఇష్టపడలేదు. తన భర్తను వివాహము చేసికొనదలచిన గంగపై కోపముతో రాధాదేవి ఆ జలమునంతయు త్రాగుటకు మొదలిడెను. అందువలన గంగ భయపడి శ్రీకృష్ణపరమాత్మ పాదములను శరణువేడినది. శ్రీకృష్ణుని పాదములయందు లీనమై గంగయుండుట వలన ప్రపంచమంతయు శుష్కించి పోయినది. అందువలన నేను విషయమును తెలిసికొనవలెనని గోలోకమునకు వెళ్ళితిని. సర్వాంతరాత్మయగు శ్రీకృష్ణుడు మా అభిప్రాయమును గుర్తించి తన పాదాంగుష్ఠము నుండి ఆమెను బయటకు పంపెను. అట్లే ఆమెకు రాధికామంత్రమును ఉపదేశించగా గంగ ప్రపంచమందంతట నిండిపోయినది. అందువలన నేను పరమాత్మకు నమస్కరించి ఇక్కడకు తిరిగివచ్చితిని.

ఈ గంగను గాంధర్వరీతిలో వివాహము చేసికొమ్ము. మీరిద్దరు అన్యోన్యము తగినవారు. కోరికతో వచ్చిన కన్యను వివాహము చేసికొననివానిని మహాలక్ష్మి వదలిపోవును. పండితుడైనను ప్రకృతిని అవమానించవద్దు. ఈ జగత్తులోని పురుషులందరు ప్రాకృతికులు స్త్రీలు ప్రకృతి యొక్క ఆంశసంభూతలు.

నీవు ఆద్యుడవైన పరమాత్మవు. అర్ధాంగుడైన శ్రీ కృష్ణుడు ద్విభుజుడు కాగా అతనికి అర్ధాంగభూతుడవైన నీవు చతుర్భుజుడవైతివి.

రాధ శ్రీకృష్ణుని ఎడమ భాగమునుండి పుట్టగా గంగ కుడి పార్శ్వమునుండి పుట్టినది. అందువలన నీ దేహమునుండి పుట్టిన గంగ నిన్ను వివాహము చేసికొనదలచినది. ప్రకృతి పురుషులవలె స్త్రీ పురుషులిద్దరు ఒకే శరీరము కలవారు.

ఈ విధముగా బ్రహ్మదేవుడు నారాయణునితో పలికి గంగను అతనికి సమర్పించెను. అప్పుడు శ్రీహరి గంగాదేవిని గాంధర్వ వివాహమున స్వీకరించెను.

శ్రీహరి గంగతో సుఖముగా నుండెను గాం, గతా అనగా భూమిపైకి పోయినది కావున గంగయైనది. అట్లే విష్ణుపాదమునుండి బయల్వెడలినందువలన విష్ణుపది ఐనది.

శ్రీహరి గంగతో సుఖముగా నుండుటను చూచి సవతియొక్క అసూయతో సరస్వతి దుఃఖించినది. ఆట్లే ఆమెను ఎల్లప్పుడు ఈర్ష్యాభావముతో చూచినది. కాని గంగ సరస్వతిపై ఈర్ష్యపడలేదు.

శ్రీహరికి గంగతో కలిపి ముగ్గురు భార్యలు. తరువాత వచ్చిన తులసితో అతనికి భార్యలు నలుగురు.

శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణ సంవాదమున తెల్పబడిన గంగోపాఖ్యానమను పన్నెండవ అధ్యాయము సమాప్తము.