2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
5 - యాజ్ఞ వల్క్యమహర్షి కృత సరస్వతి స్తోత్రము
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
నారదా! పూర్వము యాజ్ఞ వల్క్య మహర్షి స్తుతించిన సరస్వతీ దేవతాస్తుతిని వినుము.
గురువుయొక్క శాపమువలన ఆమునియొక్క విద్యలన్నియు నష్టమైపోగా ఆ యాజ్ఞవల్క్యుడు మిక్కిలి దుఃఖముతో రవి దగ్గరకు పోయెను. ఆతడు తపస్సుచేసి దృష్టిగోచరమైన కోణార్కమను స్థానమును చేరి సూర్యదేవతను స్తోత్రము చేయుచు ఏడ్చుచుండెను. భక్తవత్సలుడైన సూర్యుడు యాజ్ఞవల్క్య మహర్షికి వేద, వేదాంగములు చదివించి స్మృతి ఉండుటకై సరస్వతి దేవిని భక్తితో స్తోత్రము చేయుమని చెప్పి అంతర్థానమునందెను. అప్పుడా యాజ్ఞవల్క్య మునీశ్వరుడు స్నానము చేసి భక్తితో సరస్వతీ దేవిని ఇట్లు స్తుతించెను.
యాజ్ఞవల్క్య ఉవాచ- యాజ్ఞవల్క్య మహర్షి ఇట్లనెను-
జగన్మాతా! ఓ సరస్వతీ గురు శాపమువల్ల స్మృతి, విద్యాహీనుడనై, దుఃఖములో ఉన్న నాపై దయ చూపుము. ఓ విద్యాధిదేవతా! నాకు జ్ఞానమును, స్మృతిని, విద్యను, ప్రతిష్ఠను, కవితను, శిష్యులకు బోధించు శక్తిని గ్రంథరచన చేయు శక్తిని, మంచి శిష్యుని, సత్సభలో ప్రతిభను, ఆలోచించు శక్తిని ఇమ్ము. ఇవి అన్నియు నా దురదృష్టమువలన లోపించినవి. భగవంతుడు తన యోగమాయవలన అంకురములను పుట్టించునట్లు నాకు దీనిని తిరిగి ప్రసాదింపుము.
బ్రహ్మస్వరూప, పరంజ్యోతి స్వరూపిణి, సర్వ విద్యాధి దేవత అగువాణీదేవికి నమస్కారము. ఏ సరస్వతీదేవీ లేనిచో జగత్తంతయు ఎల్లప్పటికి బ్రతికి యున్నను చనిపోయిన దానితో సమానమగుచున్నదో జ్ఞానాధీ దేవతయగు ఆ సరస్వతికి నమస్కారము. ఏ జగన్మాత లేనిచో జగత్తంతయు మూగదానివలె, పిచ్చిదానివలె అగునో వాక్కులకు అధిష్టాన దేవతయగు ఆవాణీ దేవికి నమస్కారము. మంచు, చందనము, మల్లెపూవు, చంద్రుడు, కుముదము, తెల్లని పద్మములవలె తెల్లనిది, జక్షరములకు ఆధిదేవతయగు ఆ అక్షరస్వరూపిణికి నమస్కారము. విసర్గ, బిందువు, మాత్రలకు అధిష్టాన దేవతగా సత్పురుషులు కీర్తించు భారతికి నమస్కారము. ఆ దేవత లేనిచో సంఖ్యా గణకుడు లెక్కించలేడో కాల, సంఖ్యా స్వరూపిణి యగు ఆ సరస్వతి దేవతకు నమస్కారము. వ్యాఖ్యాన స్వరూప, వ్యాఖ్యాధిష్టాన దేవత, భ్రమసిద్ధాంత స్వరూపిణి యగు ఆ సరస్వతీ దేవికి నమస్కారము. స్మృతి శక్తి, జ్ఞాన శక్తి, బుద్ధిశక్తి, ప్రతిభాశక్తి, కల్పనాశక్తి స్వరూపిణి యగు ఆ దేవతకు నమస్కారము.
సనత్కుమారుడు బ్రహ్మను జ్ఞానోపదేశమునకై ఆడుగగా ఆ బ్రహ్మదేవుడు 'జడునివలె ఏమియు తెల్పలేకపోయను. ఆప్పుడు పరమేశ్వరుడగు శ్రీ కృష్ణపరమాత్మ అచ్చటికి వచ్చి సరస్వతీదేవి స్తోత్రమును చేయుమని ఆదేశించెను. ఆ విధముగా శ్రీకృష్ణ పరమాత్మయొక్క ఆజ్ఞననుసరించి బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని స్తుతించి ఆమె యొక్క అమగ్రహము వలన సనత్కుమారునకు జ్ఞానమునుపదేశించెను. అట్లే భూదేవి జ్ఞానోపదేశము చేయమని అనంతుని అడుగగా అతడు మూగపోనీవలె ఏమియు చెప్పలేని స్థితిలో ఉండగా, కశ్యప మహర్షి యొక్క ఆజ్ఞవలన సరస్వతీ దేవిని స్తుతించి భ్రమభంజకమైన జ్ఞానమును ఉపదేశించెను. అట్లే వ్యాసమహర్షి పురాణములను రచించుపద్దతిని తెల్సుమని వాల్మీకి మహర్షిని అడుగగా, అతడు మౌనము వహించి జగదంబికయైన సరస్వతీ దేవిని స్తుతింపగా ఆమె యొక్క వరమువలన వాల్మీకి మహర్షి నిర్మల జ్ఞానమును పొంది పురాణ సూత్రమును వ్యాసమహర్షికి తెలిపెను. అప్పుడా వ్యాసుడు పుష్కర క్షేత్రమున వంద సంవత్సరములు సరస్వతిని ప్రార్థించి ఆమె యొక్క వరమువలన కవి శ్రేష్టుడై, వేదములను విభజించి, పురాణములనన్నిటిని రచించెను. ఆదేవిధముగా మహేంద్రగిరిపై పార్వతీదేవి పరమేశ్వరుని జ్ఞానోపదేశము చేయుమని కోరగా పరమేశ్వరుడు నీమ్న స్మరించి పార్వతీదేవికి జ్ఞానోపదేశమును చేసెను.
అదేవిధముగా మహేంద్రుడు బృహస్పతిని శబ్దశాస్త్రమును బోధింపుమని కోరగా పుష్కర క్షేత్రమున వేయి సంవత్సరములు నీకై తపమాచరించి నీయొక్క వరము వలన వ్యాకరణ శాస్త్రమును బోధించెను. ఆ తరువాత దేవేంద్రుడు ఆ వ్యాకరణ శాస్త్రమును శిష్యులకు బోధింపగా మునీశ్వరులందరు దానిని అధ్యయమును చేసిరి. వారందరు నీన్ను ధ్యానించిన వారే. (ఆదే ఐంద్ర వ్యాకరణము)
అట్లే నీవు మునీంద్రులు, మనుషులు, మానవులు రాక్షసులు, బ్రహ్మవిష్ణు, శీవాది దేవతలచే పూజలనందుకొనుచున్నావు, నిన్ను ప్రోత్రము చేయుటకు చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు కాని, పంచముఖుడైన పరమేశ్వరుడు కాని, వేయితలలు గల అనంతుడు కాని సమర్థులు కారనినచో ఒకే తల కల మానవుడగు నేను నిన్ను స్తుతింపగలనా?
ఈవిధముగా యాజ్ఞవల్క్య మహర్షి భక్తితో సరస్వతీ దేవిని స్తుతించి నిరాహారుడగుచు నమస్కరించగా జ్యోతి స్వరూపయగు ఆ దేవి దృష్టికి కనిపించకున్నను మంచి కవిశ్రేష్ఠుడవు కమ్మని పలికి నిజనివాసమునకు వెడలిపోయెను.
యాజ్ఞవల్క్య కృతమైన ఈ సరస్వతీ స్తోత్రమును నియమములో చదువువాడు, కవీంద్రుడు, మంచిమాటకారి, బృహస్పతీతో సమానుడు కాగలడు. మహామూరుడైనను, తెలివి తక్కువ వాడైనను ఒక సంవత్సరము నియమముతో పఠించినచో అతడు గొప్ప పండితుడు, మేధావి, కవి కాగలడు.
శ్రీ బ్రహ్మా వైవర్తమమ మహాపురాణములోని ప్రకృతి ఖండమునందున్న నారద నారాయణ సంవాదములో యాజ్ఞవల్క్య మహర్షి చేసిన సరస్వతీదేవీస్తుతి అను ఐదవ అధ్యాయము సమాప్తము.
