2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
44 - మంగళోపాఖ్యానము
నారాయణ ఉవాచ: నారాయణుడిట్లు నారదునితో అనెను-
నారదా! నీకు ఇంతవరకు షష్ఠీదేవి చరిత్రను తెల్పితిని. ఇప్పుడు మంగళచండీదేవియొక్క ఉపాఖ్యానమును వినుము. ఆట్లే ధర్మదేవతవలన నేను విన్న ఆమె యొక్క పూజ మొదలగువానిని వినుము. ఇది సమస్త వేద సమ్మతము. విద్వాంసులచే ఆమోదితము.
శత్రువులమధ్య భయంకరముగానుండి ప్రకాశించుచున్నందువలన ఆమె చండిమైనది. అట్లే మంగళకార్యములు చేయించుటలో సమర్థురాలైనందువలన మంగళయైనది. ఆదేవి మంగళరూపిణి, అట్లే చండస్వరూపిణి. రెండువిధములైన రూపములతో నున్నందువలన ఆ దేవి మంగళ చండికయైనది.
అట్లే దుర్గాదేవికి ఇంకొక పేరు చండిక. మంగళుడను పేరు కుజునకు గలదు, ఆ మంగళునకు ఇష్టదేవత కావున ఆమె మంగళచండికయైనది.
మనువంశమునందు మంగళుడను రాజా ఈ భూమినంతయు పరిపాలించుచుండెను, ఆ మహారాజునకు ఆభీష్టదేవి కావున ఆమె మంగళచండికయైనది.
ఆ దేవియొక్క మరొక రూపమే దుర్గ. ఆ దేవి మూలప్రకృతి రూపిణి. ఈశ్వరి, మిక్కిలి దయగలది. స్త్రీలందరకు ఇష్టదేవత.
ఈ దేవిని తొలుత శంకరుడు. త్రిపురాసురవధ కాలమున స్తుతించెను. త్రిపురాసురుల యుద్దము పరముగా జరుగుచుండగా దానపుడు కోపముతో శంకరుని రథమును ఆకాశమునుండి కిందికి పడవేయుచున్నప్పుడు బ్రహ్మ, విష్ణుమూర్తులయొక్క ప్రేరణ వలన శంకరుడు దుర్గాదేవిని స్తుతించెను. ఆ దుర్గాదేవియే రూపభేదమున మంగళచండికయైనది.
ఆ మంగళచండిక శంకరునితో నీవు భయపడవలసిన అవసరము లేదు, భగవంతుడు సర్వేశ్వరుడగు శ్రీహరి నీకు వృషభరూపమును ధరించును, నేను ఆ శ్రీహరి ఆజ్ఞననుసరించి యుద్ధ శక్తిస్వరూపనై నీకు సహాయము చేయుదును. మా యిద్దరి సహాయముతో దేవతలను స్వర్గమునుండి తొలగించిన త్రిపురాసురుని సంహరింపుమని చెప్పి ఆ దేవి అంతర్ధానము చెందెను. ఆ తర్వాత ఆమె శంకరునకు శక్తిగా మారినది. అప్పుడు శంకరుడు శ్రీహరి తనకిచ్చిన శస్త్రముచే త్రిపురాసురుని సంహరించను.
అప్పుడు దేవతలు, మహర్షులందరు సంతోషపడిరి. దేవతలు శంకరునకు భక్తిశ్రద్ధలతో పోత్రములు చేసిరి. ఆతని శిరస్సుపై పుష్పవృష్టిని కురిపించిరి.
బ్రహ్మదేవుడు నారాయణుడు సంతోషించి శంకరునకు శుభాశీస్సుల నొసగిరి, తరువాత శ్రీహరి ఉపదేశముననుసరించి శంకరుడు స్నానముచేసి శుచియై మంగళచండికాదేవిని ఇట్లు పూజించెను.
ఆర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, వివిధబలులు, పుష్పములు, చందనము, గొఱ్ఱెలు, మేకలు, దున్నపోతులు మొదలగు నైవేద్యములు, వస్త్రములు, అలంకారములు, మాలలు, పాయసములు, పిండివంటలు, తేనెలు మొదలగు తీపి వస్తువులు, అనేక విధములైన పక్వాన్నములు, పండ్లు, సంగీతము, నృత్యము, వాద్యము మొదలగు వాటిచే శ్రీకృష్ణకీర్తనలచే మంగళ చండికను శాస్త్రొక్తప్రకారముగా మాధ్యందిన శోఖయందు చెప్పబడిన పద్ధతిలో మూలమంత్రముతో శంకరుడు పూజించెను.
ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవిమంగళచండికే ఐం క్రూం ఫట్ స్వాహా అనునది మూలమంత్రము.
ఈ మూలమంత్రము కల్పతరువు వంటిది. భక్తులయొక్క సమస్త కోరికలను తీర్చును. ఈ మంత్రమును పదిలక్షల పర్యాయము జపించినచో మంత్రసిద్ధి కలుగును.
నారదా! మంగళచండికయొక్క ధ్యానశ్లోకములను వినుము. ఆది వేదములందు చెప్పబడినది సర్వసమ్మతమైనది. మంగళచండికాదేవి పదునారు సంవత్సరముల వయసు కలదీ, అందమైనది. స్థిరమైన వయసు కలది. సమస్త రూపములు గుణములు కలది. కోమలమైన అవయవములు కలది. తెల్లని చంపక పుష్పములవంటి రంగుకలది. కోటి చంద్రులవంటి కాంతి కలది. మేలిమి బంగారువన్నెగల వస్త్రము ధరించునదీ. రత్నభూషణములు కలది. మల్లెలమాలలను కొప్పున ధరించునది. దొండపండువంటి పెదవులు, చక్కని పలువరుస, శరత్కాలచంద్రునీవంటి ముఖము, చిరునవ్వు కల ముఖము, నీలోత్పలములవంటి కండ్లు కలది. ఈ లోకములనన్నిటిని రక్షించునది. సమస్త సంపదల నొసగునది. భయంకరమైన సంసారమనే సముద్రమున నున్న ఓడ వంటిది.
అట్టి మంగళ చండికాదేవిని నేనెల్లప్పుడు సేవించుచుందును.
ఇది మంగళచండీదేవియొక్క ధ్యానము. ఇక ఆపద కలిగినప్పుడు శంకరుడు మంగళచండికను ఎట్లు స్తుతించెనో దానిని నీకు తెలుపుతున్నానని సారాయణుడనేను.
శంకర ఉవాచ- శంకరుడిట్లు పలికెను-
మంగళ చండికా స్త్రోత్రము-
ఓ దేవి! మంగళచండికా! జగములకు తల్లీ! నన్ను రక్షింపుము. నీవు ఆపదలను పోగొట్టెదపు. సంతోషమును మంగళములను కలిగించు దానవు, శుభస్వరూపిణివి. శుభమంగళ చండికపు. సమస్త మంగళములకు మంగళమైన దానవు. నీవు మంగళగా, మంగళారవుగా పిలువబడుచున్నావు,
ఓదేవి! నీవు సజ్జనులకు మేలును చేకూరును. మంగళములకు నిలయమైన దానవు. మంగళవారమున పూజలనందుకొనుచున్న దానవు. మంగళుడగు కుజునకు ఇష్టదేవతవు. అట్లే మనువంశమున పుట్టిన సంగళుడను భూపతిచే పూజలనందుకొన్న దానవు. మంగళములకు అధిష్టాన దేవతవు, మంగళములకే మంగళమైన దానవు. మంగళమయమైన సంసారమున అందరకు మోక్షమును మంగళమును కలిగించుదానవు, నీకు సార, మంగళాధారము మొదలగు పేర్లు కలవు. ప్రతిమంగళవారమున పూజించదగిన దానవు. నీవు ఆందరకు మంగళములను కళించుదానవు.
శంకరుడిట్టి స్తోత్రముచే మంగళచండికను స్తుతించి ప్రతిమంగళవారమున ఆమెకు పూజచేసి తన లోకమును చేరుకొనెను.
మంగళచండికాదేవియొక్క ఈ స్తోత్రమును ఎవరు శ్రద్ధతో విందురో వారికి ఎల్లప్పుడు మంగళమే జరుగును. అమంగళము. ఎప్పుడును జరుగదు.
ఆ దేవిని తొలుత శంకరుడు పూజించెను. తరువాత మంగళగ్రహమగు కుజుడు పూజించెను. అటుపిమ్మట మంగళుడను రాజు ఆమెను పూజించెను. ఆ తరువాత మంగళవారమున ఆమెను స్త్రీలు పూజించిరి. పిమ్మట మంగళములను కోరుకొను మానపు లా మంగళచండికను పూజించిరి. ఆ దేవిని ప్రపంచముననున్న దేవతలందరు పూజింతురు. ఆ తర్వాత ఆమెను దేవతలు, మునులు, మనువులు, మానవులు అందరు పూజించిరి. ఆందువలన ఆ దేవి దేవతలకందరకు ఈశ్వరియైనది.
మంగళదేవియొక్క ఈ స్తోత్రమును భక్తి శ్రద్దలతో విన్నవారికి ఎల్లప్పుడు మంగళమే కలుగునుకాని అమంగళము మాత్రము కలుగదు. వారికి ప్రతిదినము పుత్రపౌత్రాభివృద్ధి తప్పక జరుగును.
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున, నారదనారాయణ సంవాదమున చెప్పబడిన మంగళచండికా కథలో ఆమె సోత్రాదులను తెలుపు నలభై నాలుగవ అధ్యాయము సమాప్తము.
