2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

49 - రాధాదేవిని  సుధాముడు శపించుట

పార్వత్యువాచ- పార్వతి ఇట్లనెను-

మహానుభావా! సుదాముడు రాధాదేవికి భృత్యుడుకదా! అతడు తనకభీష్టదేవత, తన దేవునకు భార్యయగు రాధాదేవికి శాపమెందుకు ఇచ్చాను.

శ్రీభగవానువాచ- భగవంతుడగు మహదేవుడు పార్వతితో ఇట్లనెను-

ఓ పార్వతీదేవి! రహస్యమైనదీ, సమస్తపురాణములందు రహస్యముగానున్నది, శుభమును, భక్తినీ, ముక్తిని కలిగించు పరమాద్భుతమైన రాధాదేవి కథను వినుము.

ఒకప్పుడు రాధాపతియగు శ్రీకృష్ణుడు గోలోకమందలి రాసమండలమున శతశృంగ పర్వతమున నున్న బృందావనమున “విరజ” అను గోపకన్యను వెంట పెట్టుకొని ఆమెతో క్రీడింపసాగెను. వారు పడుకొన్న మంచము అమూల్యములైన రత్నములతో నున్నది. దానికి సమీపముననున్న దీపములు రత్నములచే నిర్మితమైనవి. వారు పడుకొన్న పుషతల్పము కస్తూరీ కుంకుమ, మంచి చందనములతో సువాసితమై ఉన్నది. ఆ మంచముచుట్టు సువాసనగల మాలతీ పుష్పమాలలు కట్టుబడినవి.

రతీపండితులైన వారి రతిక్రీడ లక్షమన్వంతరములవరకు సాగినది. ఆ సమయము జన్మమరణములు లేని గోలోకమున స్వల్పకాలమే. అయినను వారిద్దరు సుఖసంభోగమున మునిగియుండిరి.

రాధాదేవియొక్క చెలికత్తెలు విరజా శ్రీకృష్ణులు సమాగతులైన విషయమును రాధాదేవికి తెలియజేసిరి. అందువలన రాధాదేవి కోపముతో ఎరుపెక్కిన ముఖముతో రత్నాలంకారములను బంగారువన్నెగల వస్త్రములను క్రీడాపద్మమును, రత్ననిర్మితమైన అద్దమును, సిందూరమును, చెక్కిలిపై చేసికొన్న మకరిపకా పత్రములను తొలగించి నీటితో ముఖమును, పెదవులకున్న లత్తుకను కడుగుకొని కొప్పును విప్పుకొని, తెల్లని వస్త్రములు ధరించి రథము దగ్గరకు పోయెను.

ఆట్లే ఆమే కోపముతో వణకిపోవుచు తన చెలికత్తెలను, గోపికొస్త్రీలను పిలుచుకొని పోయినది.

రాధాదేవి తనవెంట రమ్మని తనచెలికత్తెలను అనుచరులను ఆజ్ఞాపించగానే వారిలో కొందరు భక్తితో ఆమె వెంటరాగా వారిని వెంటబెట్టుకొని ఆమె తన రథమునెక్కెను. రాధాదేవియొక్క రథము దివ్యమైనదీ, రత్నములతో నిర్మింపబడినది. ఆది చాలా విశాలమైనది. ఆరథమున అనేక చిత్రములున్నవి. ఆది చిత్ర విచిత్రములైన గుడ్డలతోను, మిక్కిలి పలుచనైన పట్టువస్త్రములతో (పరదాలు) అలంకరించబడినది. ఆందు ఆమూల్యమైన రత్నదర్పణములు అమర్చబడినవి. మణులు, పుష్పములు మాలలుగా అలంకరింపబడినవి. ఆమూల్యమైన రత్నకలశములు ఆ రథమున కమర్పబడినవి.

ఆట్టి రథమునెక్కి తన చెలికత్తెలు, అనుచరులు వెంటరాగా కృష్ణుడున్న ప్రదేశమునకు పోయెను.

రాధాదేవి సుమనోమాలియను తన రథమునెక్కి శ్రీకృష్ణుడున్న ప్రదేశమునకు పోయెను. రాధాదేవి చెలికత్తెల కోలాహలమును దూరమునుండే గమనించిన సుదాముడను శ్రీకృష్ణుని అనుచరుడు శ్రీకృష్ణుని హెచ్చరించి తన తోటి గోపకులతో ఆ ప్రదేశమునుండి పరుగెత్తుకొనిపోయెను.

శ్రీకృష్ణుడు కూడ రాధాదేవి వచ్చుచున్నదనగానే భయపడి వీరజాదేవి ప్రేమలో మగ్నుడైనను వెంటనే ఆమెను వదలి పెట్టి ఆంతర్థానమునొందెను.

వీరబాదేవీ అప్పటి పరిస్థితిని గమనించి మనస్సులో చేయవలసిన విషయమును చక్కగా ఆలోచించీ రాధాదేవియొక్క కోపమునకు భయపడి గోలోకమున ఆ లోకమునంతయు చుట్టిముట్టియున్న గడ్డవలె నదీరూపమును చెందినది, వీరబాదేవి స్నేహితురాండ్రు సైతము భయముతో విరజాదేవిని శరణు వేడి చిన్న చిన్న నదులుగా మారిపోయిరి. ఈ ప్రపంచమున నున్న నదులన్నియు విరజాదేవియొక్క చెలికత్తెలైన గోపికలే. అట్లే ఈ భూమి పైనున్న సప్తసముద్రములు విరజాదేవియొక్క సంతానమే.

రాసేశ్వరియగు రాధాదేవి అచ్చటకు వచ్చి విరజనుగాని శ్రీకృష్ణునిగాని కనుగొనక తిరిగి తన ఇంటికి పోయెను. అప్పుడు శ్రీకృష్ణుడు తన సహచరులైన ఎనమండుగురు గోపాలకులతో రాధాదేవి మందిరమునకు వెళ్ళెను. అచ్చట ద్వారముననున్న ద్వారపాలికలు శ్రీకృష్ణుని వెళ్ళవద్దని నివారించినను వారిమాటలు పట్టించుకొనక తన అనుచరులతో రాధాదేవి మందిరమునకు ఆతడు పోయెను.

రాధాదేవీ శ్రీకృష్ణుని చూడగానే కోపముతో ఆతనిని నిందింపసాగినది. రాధాదేవియొక్క నూటలు వినలేక శ్రీకృష్ణుని అనుచరుడైన సుదాముడు రాధాదేవిని శ్రీకృష్ణుని సమీపముననే నిందింపసాగెను. అందువలన రాధాదేవి కోపముతో నీవు రాక్షసుడవై భూలోకమున జన్మించువని, ఇచ్చటినుండి వెంటనే వెళ్ళిపొమ్మనీ సుదాముని శపించెను.

సుదాముడు సహితము కోపముతో నీవు చెలికత్తెలతో భూలోకమందలి భరతఖండమునకు వెళ్ళుమని, ఆచ్చట నీకు శ్రీకృష్ణునితో వంద సంవత్సరములవరకు వియోగము ప్రాప్తించుననీ, శ్రీకృష్ణుడుకూడ భూలోకమున జన్మించి భూమియొక్క భారమును తగ్గించునని శపించెను.

తరువాత సుదాముడు పశ్చాత్తాపముతో తల్లియగు రాధాదేవిని, తండ్రియగు శ్రీకృష్ణుని నమస్కరించి మోహమువలన ఏడ్చుచు గోలోకమునుండి భూలోకమునకు పోవుచుండెను.

రాధాదేవి సుదామునివెంట ఏడ్చుచు, పుత్రవియోగమును సహింపలేక వత్స! నీవెక్కడికి పోవుచున్నావని అమచు పోను, అప్పుడు దయా సముద్రుడగు శ్రీకృష్ణుడు ఆమెను ఓదార్చి రాధాదేవి! నీపేడకుము. నీ పుత్రుని నీవు తొందరగా తిరిగి పొందగలవు అని చెప్పెను.

ఆ సుదాముడే శంఖచూడుడను రాక్షస రాజుగా జన్మించి తులసీదేవిని వివాహమాడి నా శూలముయొక్క దెబ్బచే ప్రాణములను కోల్పోయి గోలోకమునకు తిరిగివెళ్ళాను.

వరాహ కల్పమున రాధాదేవి భారతఖండముననున్న గోకులమునకు వచ్చినది. ఆమె అచ్చట వృషభాను అను వైశ్యునకు పుత్రికగా జన్మించెను. ఆయోనిజయైన ఆ దేవి వృషభానువుయొక్క భార్యయగు కళావతికి వాయురూపమున జన్మించినది. ఆ దేవికి పన్నెండు సంవత్సరముల వయసు రాగానే వృషభానుడామెను రాయాణుడను వైశ్యపుత్రునకిచ్చి వివాహము చేసెను.

రాధాదేవి వృషభానునీంట్లో తన ఛాయనుఉంచి అదృశ్యమైనందువలన రాయాణు డా ఛాయనే వివాహమాడెను.

రాధాదేవికి పదునాలుగు సంవత్సరములు గడపగా శ్రీకృష్ణుడు కంసభయమను వ్యాజముతో గోకులమునకు విచ్చేపెను. కృష్ణునకు యశోద తల్లి కాగా రాయాణుడు ఆమెకు గోకులమున సోదరుడుగానుండెమ, రాయాణుడు గోలోకమున శ్రీకృష్ణాంశ కల గోపుడు కాగా భూలోకమున యశోదా సంబంధము వలన శ్రీకృష్ణునకు మేనమామ యయ్యెను.

గోపకులు స్వప్నమున సైతము రాధాదేవి పాదపద్మములను దర్శించుకొనలేరు. బ్రహ్మదేవుడు ఆరవైవేల సంవత్సరములు ఆ దేవీ పదపద్మముల చూడవలెనని తపస్సు చేసెను. ఆతని తపః ఫలితముగా శ్రీకృష్ణుడు భూభారమును పాపుటకై భూమిపై ఆవతరించినప్పుడు రాధాదేవీయొక్క పాదపద్మములను చూడగలెను.

రాధాదేవి రాయణుని దగ్గర ఛాయారూపిగా శ్రీకృష్ణుని వక్షస్థలమున స్వయముగా నుండినది.

గోలోకవాథుడగు శ్రీకృష్ణుడు భారతఖండమందలి బృందావనమున రాధాదేవితో కొంతకాలము గడి పెను. కాని సుదామునియొక్క శాపముననుసరించి తరువాత వీరిద్దరిమధ్య వియోగము కల్గినది.

శ్రీకృష్ణుడు భూమియొక్క భారమును తగ్గించునపుడు నూరుసంవత్సరములు గడచిన తరువాత అతడు తీర్థయాత్రలు చేయుచున్నప్పుడు రాధాదేవి శ్రీకృష్ణులు పరస్పరము చూచుకొనిరి.

తరువాత శ్రీకృష్ణుడు , రాధాదేవితో కలసి గోలోకమునకు వెళ్ళను, కళావతి, యశోదలిద్దరు రాధాదేవితో గోలోకమును చేరిరి. అట్లే వృషభానుడు, నందుడు గోలోకమునకు వెళ్ళిరి. వారివెంట గోపికలు గోపాలురందరు గోలోకమును చేరుకొనిరి. ఆ గోలోకమున గోపాలురు గోపికలందరు కృష్ణునితో కలిసి రమించసాగిరి.

శ్రీకృష్ణునితో, రాధాదేవితో సమానులైన ముప్ఫైఆరు లక్షలకోట్ల గోపకులు, గోపికాసీలు, రాధాశ్రీకృష్ణులతో కలసి గోలోకమునకు వెళ్ళిరి.

విందుడు ద్రోణుడను ప్రజాపతీ, నందుని భార్యయగు యశోద భూదేవి. వీరు తాము పూర్వము చేసికొన్న తపస్సువలన శ్రీకృష్ణ పరమాత్మను పుత్రునిగా పొందిరి, అట్లే వసుదేవుడు కశ్యప ప్రజాపతి కాగా దేవకీదేవీ అదీతీదేవి. వీరిద్దరు ప్రతీకల్పమున పరమాత్మకు తలిదండ్రులుగా ఉందురు. భూలోకమున రాధాదేవికి తల్లియైన కళావతి పూర్వము పితృదేవతలయొక్క మానసీకన్య ఇక గోలోకముననున్న వసుదాముడను గోపుడు భూలోకమున వృషభానుడయ్యెను.

ఓ పార్వతీ! ఈ విధముగా నీకు సంపదలను కలిగించునదీ పాపముల నశింపజేయునది సంతతిని పెంచునదియగు రాధికా ఉపాఖ్యానమును తెలిపితిని..

శ్రీకృష్ణ పరమాత్మ ద్విభుజుడుగా, చతుర్భుజుడుగా రెండురూపాలతో నున్నాడు. ద్విభుజుడు శ్రీకృష్ణపరమాత్మయే, అతడు గోలోకముననుండును. ఇక చతుర్భుజుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠముననుండును.

చతుర్భుజుడగు శ్రీహరికి మహాలక్ష్మి, సరస్వతి, గంగ, తులసి ఆను నలుగురు భార్యలు. శ్రీకృష్ణుని వామపార్వమునుండి ఆవిర్భవించినది తేజస్పున, యశస్సు, గుణమున, రూపమున అతనితో సమానురాలైన రాధాదేవి మాత్రమే.

విజ్ఞుడు తొలుత రాధాదేవి నామమునుచ్చరించి శ్రీకృష్ణనామమును ఉచ్చరింపవలెను. అట్లుకాక తొలుత శ్రీకృష్ణనామమునుచ్చరించి రాధాదేవి పేరునుచ్చరించినచో బ్రహ్మహత్యాపాపము లభించును.

శ్రీకృష్ణుడు గోలోకమునందలి రాసమండలమున ఒకనాటి కార్తిక పూర్ణిమనాడు రాధాదేవిని పూజించి దానిని మహోత్సవముగా జరిపించేను. రాధాదేవి కవచమును రత్నగుళికలోనుంచి దానిని తన కంఠమున, కుడిభుజమున తాను స్వయముగా ధరించుటమాత్రమే కాక అనుచరులగు గోపకులు కూడ ధరించునట్లు చేసెను. రాధాదేవిని ధ్యానించి ఆమె స్తోత్రమును తాను పఠించెను.

రాధాదేవియన్న శ్రీకృష్ణునకు ఎనలేని గౌరవము కలదు. అట్లే శ్రీకృష్ణునిపై రాధాదేవికి అమితమైన గౌరవము కలదు. ఒకరికొకరు ఇష్టదేవతలు. ఇట్టి రాధాకృష్ణులమధ్య భేదభావమునెరుపువాడు నరకమునకు పోవును.

రాధాదేవిని మొదలు శ్రీకృష్ణపరమాత్మయే పూజించగా తరువాత నేను, బ్రహ్మదేవుడు, ధర్మదేవత, అనంతుడు, వాసుకి, చంద్రసూర్యులు, మహేంద్రుడు, రుద్రులు, మనువు, మానవులు, దేవతలు, మునీంద్రులు ఈవిధముగా అందరు పూజించిరి. ఆ తర్వాత భారతఖండమున సప్తద్వీపములకు ప్రభువైన సుయజ్ఞడు పుత్రులతో, మిత్రులతో కలసి ఆ దేవిని పూజించెను. ఆ రోజు దైవమునకు ఆపచారముచేసి బ్రాహ్మణునిచే శపింపబడెను. అందువలన అతని చేయి వ్యాధిగ్రస్తమైనది. అందువలన ఆతడు దు:ఖముతో రాజ్యభ్రష్టుడయ్యెను. అప్పుడతనికి బ్రహ్మదేవుడు చెప్పిన స్తోత్రముచే రాధాదేవిని స్తుతించి, రాధారుడగు శ్రీకృష్ణుని అనుగ్రహమువలన తిరిగి రాజ్యమును పొందెను. తరువాత ఆ దేవియొక్క కవచమును కంఠమున, బాహువున కట్టుకొని పుష్కర క్షేత్రమున నూరు సంవత్సరములు ఆ దేవిని పూజించెను. చివరి కారాజు రత్న విమానమునెక్కి గోలోకమును చేరుకొనెను.

ఈవిధముగా రాధాదేవిచరిత్రను నీకు చెప్పితిని. పార్వతీ! ఇంకను వీపు వినవలసినదేమైన ఉన్నచో ఆడుగుము. ఆని అనెను.

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణుల సంవాదములోని గౌరీ శంకరుల సంవాదమున తెల్పబడిన రాధాదేవి చరిత్రలో సుదామునకు ఇచ్చిన శాపవృత్తాంతము గల వలభై తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.