2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

56 -  రాధాకవచము

శ్రీపార్వత్యువాచ- పార్వతీదేవి మహేశునితో నిట్లు పలికెను-

మహేశ్వర! రాధాదేవియొక్క పూజావిధానమును ఆ దేవియొక్క స్తోత్రమును చక్కగా తెలిపితిరి. నాకు ఇప్పుడు రాధాదేవియొక్క కవచమును తెలుపగలరు.

శ్రీమహేశ్వర ఉవాచ- మహేశ్వరుడు పార్వతితో ఇట్లనెను-

ఓదుర్గాదేవి! పూర్వము నాకు శ్రీకృష్ణపరమాత్మ తెలిపిన రాధా కవచమును నీకు చెప్పెదను. అదీ పరమాద్భుతమైనది. మిక్కిలి రహస్యమైనది. సమస్త మంత్రములే మూర్తీభవించినట్లున్నది. పరతత్వరూపమైనది.

ఈ రాధాదేవి కవచమును పఠించుచు బాహుమూలమున్ల దానిని ధరించుటవలననే బ్రహ్మదేవుడు వేదములకన్నీటికి తల్లియగు సావిత్రీదేవిని పొందెను. నేను నీకు భర్తనైతిని. నారాయణుడు మహాలక్ష్మీదేవికి భర్త అయ్యెను. రాధాకవచమును ధరించి పఠించుచున్నందువలననే పరమాత్మ, నిర్గుణరూపుడు, ప్రకృతికంటే శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుడు సృష్టిరచన చేయుచున్నాడు. విష్ణుమూర్తి సర్వజన రక్షకుడు సింధుకన్యకాప్రతీ యయ్యెను. ఆదిశేషుడు ఈ బ్రహ్మాండమునంతయు తన శిరస్సుపై ఆవగింజను మోయుచున్నట్లు అవలీలగా మోయుచున్నాడు, మహావీరాట్స్వరూపుడగు శ్రీ మహావిష్ణువు . తన రోమకూపములందు బ్రహ్మాండములనన్నిటిని ధరించి సర్వాధారుడు కాగలిగెను. ధర్మదేవత సైతము ఈ కవచమును ధరించినందువలన పఠించుచున్నందువలన సర్వసాక్షిగా అయ్యేను. ఈ కవచముయొక్క మహిమవల్లనే కుబేరుడు ధనపతిగాను, ఇంద్రుడు దేవతాపతిగాను.. మనువు మానవులందరకు అధిపతిగాను, సూర్యుడు ముల్లోకములయందు పూజితుడుగాను, ఆగ్నిదేవుడు పరమ పవిత్రుడుగానున్నారు. వాయుదేవుడు ఈ కవచముయొక్క మహిమవలన ముల్లోకములను పవిత్రముచేయగలుచున్నాడు. మృత్యువు అందరను సమానముగా చూచుచున్నాడు. జమదగ్ని మహర్షి పుత్రుడైన పరశురాముడు ఇరువది యొక్కమారులు ఈ భూమండలమంతయు తిరిగి దీనిని క్షత్రీయరహితముగా చేయగలిగెను. సనత్కుమారముని మిక్కిలి జ్ఞానవంతుడాయెను. నరనారాయణ ఋషులు జీవన్ముక్తులు, సిద్దులైనారు. వసిష్ఠుడు బ్రహ్మదేవుని పుత్రుడయ్యెను. దీనివలననే కపిలమహర్షి సిద్ధేశుడుగను, దక్షుడు ప్రజాపతిగాను, భృగుమహర్షి నన్ను ద్వేషించునంతవాడుగాను, ఆదీకూర్మము ఆదిశేషుని భరించువాడుగనునైరి. వాయుదేవుడు సర్వాధారుడయ్యేను. ఈశ్వరుడు దిక్పాలకుడయ్యెను. యమధర్మరాజు సమస్తమును శాసించగలుగుచున్నాడు. కాలుడు, కాలాగ్ని రుద్రుడు సమస్తజగములను సంహరింపగల్గిరీ. ఈ కవచము యొక్క ప్రభావము వలన గౌతముడు, సిద్దుడుగాను, కశ్యపమునీ ప్రజాపతిగాను కాగలిగిరి. దుర్వాస మహాముని తన భార్యగతించినప్పుడు రాధాదేవి అంశగలస్తీని భార్యగా పొందెను. ఆట్లే రామచంద్రుడు రావణాసురునిచే అపహరింపబడిన సీతాదేవిని పొందగలిగెను. కలిదోషమువలన దూరమైన తన భార్యను నలుడు పొందగలిగెను. ఈ కవచముయొక్క గొప్పతనము వలన శంఖచూడుడను మహావీరుడు దానవవీరుడు కాగలిగెను.

శ్రీరాధాదేవియొక్క కవచ మాహాత్మ్యము వలన నందీశ్వరుడు నన్ను, గరుత్మంతుడు శ్రీహరిని మోయగలుగుచున్నారు. ఇట్లే మునులు సిద్ధులు ఆ కవచము వలన సిద్ధిని పొందిరి. ఆ కవచ మహిమవలన మహాలక్ష్మీదేవి సమస్త సంపదలనొసగగలిగినది. ఆట్లే సరస్వతీదేవి పరమపూజ్యురాలైనది. రతీదేవి క్రీడావతియయ్యెను. అదేవిధముగా సావిత్రీదేవి వేదములకు మాతయై సిద్దిని పొందెను. మర్త్యలక్ష్మియగు ఫింధుసుత శ్రీమహావిష్ణువును భర్తగా పొందినది. ఆ కవచ మహిమవలననే తులసీదేవి పరమపవిత్రమైనది. గంగాదేవి ముల్లోకములను పవిత్రము చేయగలిగినది. అట్లే మనసాదేవి సిద్దురాలై ప్రపంచమునందంతట పూజలను అందుకొన్నది. దేవమాతయగు ఆదితీదేవి శ్రీమహావిష్ణువును ఉపేంద్రరూపమున పుత్రునిగా పొందగలిగినది, ఈ కవచము వలననే ఆరుంధతి మరియు లోపాముద్రలు పతివ్రతలైరి. దేవహూతీదేవి మహావిష్ణురూపుడైన కపిలుని పుత్రునిగా పడసినది. నీ తల్లియగు మేనాదేవి నిన్ను పొందినది.

ఇట్లు రాధాదేవియొక్క కవచ మహిమవలన సిద్ధులందరు సమస్తిశ్వర్యముల పొందగలిగిరి.

జగన్మంగళకారకమైన ఈ కవచమునకు బ్రహ్మదేవుడు ఋషి గాయత్రీ ఛందస్సు, రాసేశ్వరియగు రాధాదేవి దేవత. శ్రీకృష్ణుని యందు భక్తి కలుగుటకై ఈ కవచమును ఉపయోగింపవలెను. దీనిని శ్రీకృష్ణభక్తునకు మాత్రము ఉపదేశముచేయవలేను. దుష్టుడైన ఇతర దేవభక్తునకు దీనిని ఉపదేశించినచో ఆ గురువు వెంటనే చనిపోవును. రాజ్యమివ్వవచ్చును. తన ప్రాణమునైన ఇవ్వవచ్చును. కానీ అయోగ్యుడగువానికి ఈ కవచమును ఎట్టి పరిస్థితిలోను ఉపదేశింపరాదు.

ఈ కవచమును శ్రీకృష్ణపరమాత్మ తన కంఠమున ధరించెను. నేను, బ్రహ్మ, విష్ణువు కూడ ఈకవచమును ధరించుచున్నాము.

ఓం రాధాయై స్వాహా అను కల్పవృక్షమువంటి మంత్రమును శ్రీకృష్ణుడు ఉపాసనచేసెను. ఈ మంత్రము నాశిరస్సును కాపాడుగాక.

ఓం హ్రీం శ్రీం రాధికాయై స్వాహా అనుమంత్రము నా శిరస్సును, వెంట్రుకలను ఎల్లప్పుడు రక్షించుగాక.

ఓం రాం రాధాయైస్వాహా అనుమంత్రము నా చెక్కిళ్ళను నాసికను ముఖమును రక్షించుగాక.

ఓం క్లీం కృష్ణప్రియాయై స్వాహా ఆనుమంత్రము నా కంఠమును రక్షించుగాక, ఓం రాం రాసేశ్వర్యైస్వాహా అనునది నా భుజములను రక్షించుగాక, ఓం రాం రాసవిలాసిన్యై స్వాహా అనుమంత్రము నా వీపును కాపాడుగాక, ఓం బృందావన విలాసిన్యై స్వాహా అనుమంత్రము నా రొమ్మును రక్షించుగాక, ఓం తులసీవన వాసిన్యై స్వాహా అనునది నా నితంబముల రక్షించుగాక, ఓం కృష్ణ ప్రాణాధీకాయై స్వాహా అనునది నా పాదములను సమస్త అవయవములను ఎల్లప్పుడు రక్షించుగాక.

రాధాదేవి నా తూర్పుదిక్కున, కృష్ణప్రియ ఆగ్నేయ దిశలో, రాసేశ్వరి దక్షిణ దిశలో, గోపీశ నైఋతి దిశలో, నిర్గుణ పశ్చిమ దిశలో, కృష్ణపూజిత వాయవ్యదిశలో, మూలప్రకృతి ఈశ్వరి ఉత్తర దిశలో, సర్వేశ్వరి ఈశాన్యమున, సర్వపూజిత జలమున, స్థలమున, నిద్రించు సమయమున జాగ్రదావస్థలోను నన్ను ఎల్లప్పుడు రక్షించుగాక. శ్రీమహావిష్ణువునకు జననియగు రాధాదేవి నన్ను అన్నివైపులనుండి. ఎల్లప్పుడు రక్షించుచుండుగాక.

పార్వతీ! లోకములకు మంగళమును కలిగించు రాధాదేవి కవచమును నీపైగల ప్రేమ చెప్పితిని. కాని దీనిని అందరకు చెప్పరాదు.

మంత్రోపదేశము చేయుచున్న గురువును శాస్తోక్తముగా వస్త్రములు, అలంకారములు చందనము మొదలగు వాటిచే గౌరవించి అతనిచే ఉపదేశించబడిన ఈ కవచమును కుడిచేతికో లేక కంఠమునకో కట్టుకొనవలెను. అట్లు చేసినచో అతడు విష్ణుమూర్తితో సమానుడు అగును.

ఈ కవచమును కోటిమార్లు జపించినచో అది. సిద్ధించును. కవచము సిద్ధించినచో ఆతనిని నిప్పు కాల్చలేదు. ఈ కవచముయొక్క సిద్దిపొందినందువలననే దుర్యోధనుడు జలస్తంభ వహ్నిస్తంభవిద్యలలో నిష్ణాతుడయ్యెను.

దీనిని నేను పుష్కరక్షేత్రమున సనత్కుమారున కుపదేశింపగా అతడు సూర్యసంక్రమణ సమయమున మేరు పర్వతమున సాందీపనికి ఉపదేశించెను. సాందీపని బల్లున కుపదేశింపగా బల్లుడు దుర్యోధనునకుపదేశించెను.

ఈ కవచముయొక్క మహిమవలన మానవుడు జీవన్ముక్తుడగును. దీనిని ప్రతిదినము చదువుచు రాధామంత్రమును ఉపాసన చేసినచో అతడు విష్ణుమూర్తితో సమానుడగును. రాజసూయయాగ ఫలితమును కూడ పొందును. సమస్త పుణ్యతీర్థములలో స్నానముచేసినచో, సమస్త దానములు చేసినచో, అన్ని వ్రతములను అనుష్ఠించినచో, భూప్రదక్షిణలు చేసినచో, సమస్త యజ్ఞములు చేసినచో, సత్యధర్మమును చక్కగా పరిపాలించినచో, ప్రతిదినము శ్రీకృష్ణుని అర్చించినచో, శ్రీకృష్ణునకు నివేదితమైన అన్నమును భుజించినచో, నాలుగువేదములను పఠించినచో కలుగు పుణ్యము ఈ రాధాదేవి కవచమును శ్రద్దగా పఠించినచో కలుగును.

రాజసన్నిధిలోను, స్మశానములోను, సింహములు, పులులు మొదలైన క్రూర మృగములున్న అడవిలోను, దోపొగ్నియందును, కష్టములందును, దస్యులు చోరులవల్లను, కారాగారమునను, శత్రువులు పైనబడినప్పుడు, దృఢముగా బంధించినపుడు, వ్యాధిగ్రస్తుడైనప్పుడు కలుగు భయమంతయు ఈ కవచమును చదివినంత మాత్రముననే లేక ఈ కవచమును కంఠముననో లేక కుడిచేతికి కట్టుకున్నంతమాత్రమున నశించిపోవును. అతడు జీవన్ముక్తుడు కూడ అగుచున్నాడు.

ఓ దుర్గా ఈ విధముగా నీకు శ్రీ రాధాకవచమును తెల్పితిని. నీవు సమస్తము తెలిసినదానవు, సమస్త భూత రూపిణీవి. ఐనను నన్ను కావలెనని అడుగుచున్నొవని మహేశ్వరుడనెను. శ్రీనారాయణ ఉవాచ- సారాయణముని నారదునితో నిట్లనెను-

మహేశ్వరుడు ఈ విధముగా పార్వతీదేవికి రాధాదేవియొక్క ఉపాఖ్యానమును చెప్పుచు మాటిమాటికి రాధాపతియగు మాధవుని తలచుకొని అవయవములన్నియు పులకించిపోగా, ఆనందబాష్పములు రాలుచుండగా ఇట్లు చెప్పెను.

శ్రీకృష్ణపరమాత్మవంటి దేవుడు, గంగానదివంటి పవిత్రమైననది, పుష్కర కాలమున పవిత్రమైయున్న తీర్థము, బ్రాహ్మణుని వంటి జాతి, పరమాణువునకంటే చిన్నని వస్తువు, మహావిష్ణువుకన్న గొప్పవాడు, ఆకాశముకంటె విశాలమైన వస్తువు. వైష్ణవున కన్న గొప్ప జ్ఞాని, శంకరుని మించిన యోగి ఏవిధముగా లేడో అట్లే రాధా కవచముకంటె గొప్పకవచమేది లేదు.

పరమశివుడు నిద్రలోను, జాగ్రదవస్థలోను ఎల్లప్పుడు శ్రీకృష్ణునే ధ్యానించుచుండును. శివకేశవులమధ్య లేశమైనను భేదములేదు.

విష్ణుభక్తులలో శంకరుడు, దేవతలలో శ్రీ మహావిష్ణువు ఏ విధముగా ఉత్తములో అట్లే కవచములన్నిటిలోను రాధికా కవచమును సర్వోత్తమమైనది.

'శి' అను శబ్దము మంగళమను అర్థమునిచ్చును. 'వ' అను శబ్దము దాత అను అర్థమునిచ్చును. మంగళప్రదాత కావున అతనిని శివుడని పిలుచుచున్నారు. అట్లే మానవులందరకు 'శం'' అనగా కల్యాణము లేక మోక్షమునిచ్చువాడు కావున అతడు శంకరుడయ్యెను. బ్రహ్మాది దేవతలకు మునులందరిలోను మహాత్ములైన వారందరకు దేవుడు కావున మహాదేవుడయ్యేను. అట్లే ప్రపంచముననున్న మహాత్ములందరకు ఈశ్వరుడు కావున మహేశ్వరుడని పిలువబడుచున్నాడు.

ఓ నారదా! నీవు చాలా ధన్యుడవు. నీ గురువు శ్రీకృష్ణభక్తిని కలిగించు సాక్షాత్ మహేశ్వరుడు. ఐనను నీవునన్ను శ్రీకృష్ణసంబంధములైన విషయములను తెల్పుమని అడుగుచున్నందువలన నేను కూడ ధన్యుడనైతిని.

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున నారద నారాయణుల సంవాదమున చెప్పబడిన రాధోపాఖ్యానములో రాధాదేవి మంత్రాది విషయములు గల యాభైయారవ అధ్యాయము సమాప్తము.

రాధోపాఖ్యానము సమాప్తమైనది.