2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
34 - సావిత్రికి యమోపదేశ పరిసమాప్తి
సావిత్ర్యువాచ- సావిత్రి యమధర్మరాజుతో ఇట్లనెను-
ఓ ధర్మరాజా నీవలన నేను చాలా విషయములను తెలిసికొంటిని. ఇక నీవు ఆన్నీ విషయములకు సారమువంటిది, మీక్కిలి దుర్లభమైనది అగు శ్రీహరి భక్తిని నాకు ప్రసాదించుము. శ్రీకృష్ణుని గుణకీర్తనము చేయించునది, అందరిని ఉద్దరించునదీ, నరకమునుండి దాటించునది, ముక్తికార్యములకు హేతువైనదీ, సమస్తాబుభములను తొలగించునది, కర్మలనే వృక్షములను చీల్చునది, సమస్త పాపములను హరించునది, అగు ధర్మమును నాకు తెల్పుము.
ముక్తిభేదములను, వాటి స్వరూప స్వభావములను, శ్రీహరి భక్తిభేదములను, ని షేకము యొక్క స్వరూప స్వభావములను నాకు వివరించి చెప్పుము,
సమస్త దానములు, నిరాహారదీక్షలు, పుణ్యతీర్థస్నానములు, సమస్త వ్రతములు, సమస్త తపస్పులు, అజ్ఞానికి జ్ఞానమునొసగు రీతికి పదునారవంతైన కాజాలవు.
తండ్రికంటె తల్లి నూరురెట్లు ఎక్కువగా గౌరవించతగినది. జ్ఞానమునొసగు గురువు తల్లి కంటే నూరురెట్లు ఎక్కువగా గౌరవించ తగినవాడు.
యమ ఉవాచ- యమ ధర్మరాజిట్లనెను-
ఓ సావిత్రీ! నీవు కోరుకున్న వరములన్నిటిని నీకిచ్చితిని. ఇప్పుడు నీవు కోరుకున్నట్లు హరిభక్తి నావరమువలన నీకు కలుగును. నీవు శ్రీకృష్ణదేవుని గుణములను వినదల్చితివి. ఇది చెప్పువారిని, ప్రశ్నవేయువారిని, వినువారిని అందరిని తరింపజేయును.
వేయి తలలుగల ఆదిశేషుడు, ఐదుతలలు గల మృత్యుంజయుడు నాలుగు వేదములు తెలసినవాడు, చరాచరసృష్టికంతయు సృష్టికర్తయైన చతుర్ముఖబ్రహ్మ, సమస్తము తెలిసిన శ్రీమహావిష్ణువు, ఆరుముఖములు గల కుమారస్వామి, యోగీంద్రులయొక్క గురువులకు గురువైన గణేశుడు, సమస్త శాస్త్రములకు సారమైన నాలుగు వేదములు, పండితులు శ్రీకృష్ణపరమాత్మయొక్క గుణలేశమును సైతము తెలియజాలరు. అట్లే సరస్వతి దేవి, సనత్కుమారుడు, ధర్ముడు, సనక సనంద సూతులు కపిలుడు, సూర్యుడు ఇంకను తక్కిన బ్రహ్మపుత్రులు శ్రీకృష్ణపరమాత్మ గుణవర్ణనము చేయజాలరు. అట్లే సిద్దులు, మునీంద్రులు, యోగులు సహితము ఆ పరమేశ్వరుని గుణకీర్తనము చేయలేరు. అట్టి స్థితిలో మా వంటివారు అతని గుణకీర్తనమును చక్కగా ఎట్లు చేయుదురు.
బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలు ఆ పరమాత్మ పాదాంభోజములను ఎల్లప్పుడు ధ్యానించుచుందురు. ఆ పరమాత్మధ్యానము అతని భక్తులకే కాని ఇతరులకు చాలా దుర్లభమైనది. శ్రీకృష్ణపరమాత్మ గుణ సంకీర్తనము చాలా శ్రేష్టమైనది. అది శ్రేష్టులైన కొందరికి కొంతయే తెలియును. వారికంటెను, బ్రహ్మదేవునకు అతని పుత్రులు మొదలగువారికి శ్రీకృష్ణపరమాత్మ గుణములు ఎక్కువగా తెలియును. వారికంటే జ్ఞానవంతులకే గురువైన గణపతికి కొంత ఎక్కువ తెలియును. పైవారందరీకన్నను సర్వజ్ఞడైన శంకరునకు ఎక్కువగా తెలియును.
శ్రీకృష్ణ పరమాత్మయే చాలా సుందరమైన గోలోకమున రాసమండలమందు రహస్యముగా శంకరునకు దీనిని తెల్పెను. ఆ పరమాత్మ గుణములలో కొంత భాగమును శంకరుడు కైలాసమున ధర్మునకు వివరించెను. ఆ ధర్మదేవత పుష్కర క్షేత్రమున నా తండ్రికీ విషయమును తెల్పెను. నాతండ్రి ధర్మదేవతకై తపమాచరించి అతని అనుగ్రహమువలననే వాగ్దేవతను పొందగలిగెను.
పూర్వం నేను కూడ ఐహికమైన విషయములను వేటిని పట్టించుకొనక వైరాగ్యముతో తపస్సు చేసికొనుటకై బయలు దేరుచుండగా నాతండ్రి ఆ పరమాత్మ గుణకీర్తనమును తెల్పెను. శాస్త్ర ప్రకారముగా ఆవిషయమును నీకు తెలుపుదును.
ఆ పరమాత్మగుణములు బ్రహ్మదేవునకు తెలియవన్నచో ఇతరుల సంగతి ఏమని చెప్పవచ్చును.
భగవంతుడు సర్వాంతరాత్మ, సమస్త మూలములకు మూలభూతుడు, సర్వేశ్వరుడు, అన్నిటికి ఆదిభూతుడు, సర్వజ్ఞుడు, సమస్త రూపములను ధరించువాడు, నిత్యరూపి, నిత్యదేహి, నిత్యానందుడు, ఆ కారరహితుడు, నిరంకుశుడు, సంగరహితుడు. నిర్గుణుడు, నిరాశ్రయుడు, నిర్లిప్తుడు, సమస్త కర్మములకు సాక్షీభూతుడు, సమస్తమునకు ఆధారమైనవాడు, పరాత్పరుడు.
ప్రకృతి అతని వలన ఉత్పన్నమైనది. ఈ చరాచరసృష్టి ఆ ప్రకృతినుండి పుట్టినది.
ఆ పరమాత్మ తానే పరమపురుషుడు. తానే ప్రకృతి స్వరూపుడు. అతడు ప్రకృతికంటె అతీతుడు. ఆ పరమాత్మకు. రూపములేకపోయినప్పటికిని భక్తుల ననుగ్రహింపవలెనని రూపము ధరించుచున్నాడు.
ఆ పరమాత్మరూషము చాలా కమనీయమైనది. సుందరమైనది. మనోహరమైనది. నూతన మేఘమువలె నల్లనిది, బాలరూపమున నుండునది, గొల్లవాని వేషమున కన్పించునది. కోటి మన్మథుల సౌందర్యము కలది. ఆందమైనది. శరత్కాలమందలి కోటి పూర్ణిమా. చంద్రుల కాంతిగల ముఖము కలదీ, అమూల్యమైన రత్నములు గల రత్నాభరణములు గలది. చిరునవ్వుకలది. పీతాంబరమును ధరించినది. పరబ్రహ్మరూపము కలది. అమితమైన బ్రహ్మతేజస్సుచే ప్రకాశించునది. రాధాకాంతుడగు ఆ పరమాత్మ స్వరూపము చూచుటకు ఇంపైనది. పరమశాంత స్వరూపము కలది. చిరునవ్వు కల గోపికలు ఆతని చుట్టు ఉందురు. అతడు రాసమండలమున రత్న సింహాసనమున కూర్చొని వనమాలాలంకృతుడై వేణువును మనోహరముగా వాయించుచుండును. కౌస్తుభమణిని వక్షస్థలమున ధరించి యుండును. కుంకుమ, అగరు, కస్తూరి, చందనము మొదలగు సుగంధ ద్రవ్యములను శరీరమునకు అందుకొని యుండును. ఆతని మెడలో అందమైన చంపకమాల పద్మమాల మాలతీ మాలలుండును. ఆతని వంకర కొప్పుచుట్టు చంపకమాల చుట్టి యుండును.
పరమాత్మయొక్క ఇటువంటి రూపును భక్తులు అనుక్షణము ధ్యానింతురు. ఆ పరమాత్మ భయము వలననే వీధాత చరాచరసృష్టినీ చేయుచున్నాడు. అట్లే సమస్త జీవులనొసటిపై వారీ కర్మననుసరించి వ్రాయుచున్నాడు. అదేవిధముగా విష్ణుమూర్తి ఆందరిని రక్షించుచున్నాడు. కాలాగ్నిరుద్రుడు సంహరించుచున్నాడు.
పరమజ్ఞానులకు సహితము గురువు, మృత్యుంజయుడైన శివుడు ఆ రాధారమణుడిచ్చిన జిజ్ఞాసము వలననే సిద్దేశుడుగా యోగీశుడుగా, సర్వజ్ఞుడుగా, భక్తి వైరాగ్యములతో పరమానంద సహితుడై యున్నాడు.
ఆతని అనుగ్రహమువలననే గాలి వీచుచున్నాడు. సూర్యుడు మండుచున్నాడు. ఇంద్రుడు వర్షించుచున్నాడు. మృత్యువు తన కార్యమును పూర్తిచేయుచున్నాడు. అట్లే ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞవలననే ఆగ్నీ, జలము, దిక్పాలకులు, రాశి చక్రము, గ్రహములు, తమ తమ కార్యములను చేయుచున్నవి. ఆదేవిధముగా చెట్లు పుష్పించుచున్నవి. ఫలించుచున్నవి. ఆ పరమాత్మ ఆజ్ఞవలననే భూమిపైనుండు ప్రాణులు నీటిలో, నీటిలో నుండు ప్రాణులు భూమిపై జీవించలేకపోవుచున్నవి. యముడనైన నేను కూడ ఆ పరమాత్మ భయమువలననే ధర్మాధర్మములను నియమించుచున్నాను. కాలము అతని ఆజ్ఞననుసరించి సమస్త ప్రాణులను తిప్పుచున్నది. అట్లే అతని భయమువలననే మృత్యువు, కాలము, అకాలమృత్యువును కలిగించకున్నవి.
కాలుడు శ్రీహరి భయమువలననే అగ్నిలోను, సముద్రములోను, చెట్టు పైనుండి, కత్తులపైన పడువారి ప్రాణములను, సర్పాది విష జంతువుల బారిన పడ్డవారీ ప్రాణములను హరించును. అనేక శస్త్రాస్త్రములకు గురియైన వారు, రణరంగమున సున్నవారు, మంత్రతంత్రములకు గురియైనవారు, చివరకు పుష్పచందన శయ్యపై సుఖముగా నున్నవారు, బంధువులచే ప్రయత్నపూర్వకముగా రక్షింపబడినవారీ ప్రాణములను కూడ అతడు కాలము సమీపించగానే హరించును,
ఆదే విధముగా శ్రీహరి ఆజ్ఞననుసరించి వాయువు నీటిని, నీరు ఆది కూర్మమును, ఆ ఆదీకూర్మము ఆదిశేషుని, ఆదిశేషుడు భూమిని, ఈ భూమి సముద్రములను సప్తకుల పర్వతములను మోయుచున్నది. క్షమా స్వరూపుడగు ఆ పరమాత్మ అన్నిటినీ నానా రూపములతో భరించుచున్నాడు,
సమస్త ప్రాణికోటి పరమాత్మవలననే పుట్టుచున్నది. తిరిగి పరమాత్మలోనే విలీనమగుచున్నది. .
దీవ్యయుగములు ఒకటి గడిచినచో ఇంద్రునీ ఆయుస్సు తీరిపోవును. ఇరవై ఎనిమిది ఇంద్రులు గతించినచో ఆ కాలము బ్రహ్మదేవునకు ఒక దినము (రాత్రి, పగలు) ఇరవై ఐదు వేల ఐదువందల ఎనిమిది యుగముల కాలము ఇంద్రుని యొక్క ఆయువుండునని జ్యోతి: శాస్త్రవేత్తలు తెల్పుచున్నారు.
ముప్పై దినములు ఒక మాసమగును. రెండు మాసములు ఒక ఋతువు. ఆరు ఋతువులు ఒక సంవత్పరమగును. ఇటువంటి బ్రహ్మ సంవత్సరములు నూరు పూర్తియైనచో బ్రహ్మదేవుని ఆయుస్సు తీరిపోవుము.
ఈ బ్రహ్మదేవుని ఆయుఃకాలము శ్రీహరికి కనురెప్పవేయుకాలము. శ్రీవారి కనురెప్పవేసిన సమయమున (బ్రహ్మదేవుని ఆయువు పూర్తికాగానే) ప్రాకృతిక లయమేర్పడును. ప్రాకృత లయమున దేవాది చరాచరసృష్టి బ్రహ్మదేవునీలో విలీనమగును ఆ బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని నాభి పద్మమున విలీనమగును. వైకుంఠమున క్షీరసాగరమున పవళించి యున్న చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణపరమాత్మయొక్క ఎడమ భాగమున విలీనమగును.
ఏకాదశ రుద్రులు, భైరవుడు మొదలైన సదాశివుని అనుచరులందరు సనాతనుడు, జ్ఞానానందస్వరూపుడగు సదాశివునిలో విలీనమగుచున్నారు.
జ్ఞానాధి దేవుడైన శివుడు మహాదేవుడైన సదాశివుని అనుచరులందరు, సనాతనుడు, జ్ఞానానంద స్వరూపుడగు సదాశివునిలో విలీనమగుచున్డారు.
జ్ఞానాధి దేవుడైన శివుడు మహాదేవుడైన శ్రీకృష్ణుని జ్ఞానమున విలీనమగుచున్నాడు.
ప్రాకృతిక లయమున సర్వశక్తి స్వరూపిణులు విష్ణుమాయ అగు దుర్గాదేవిలో విలీనమగుచున్నవి. బుద్దికి ఆధిష్టానదేవతయగు దుర్గాదేవి శ్రీకృష్ణ పరమాత్మయొక్క బుద్ధిలో విలీనమగుచున్నది.
నారాయణాంత స్వరూపుడగు కుమారస్వామి శ్రీకృష్ణుని వక్షస్థలమున శ్రీకృష్ణాంశుడు దేవతలకందరకు స్వామియైన గణపతి శ్రీకృష్ణుని బాహువున విలీనమగుచున్నారు.
లక్ష్మీదేవి యొక్క అంశభూతలైన స్త్రీలు మహాలక్ష్మియందు విలీనము కాగా ఆమె రాధాదేవి యందు లయమగుచున్నది. సమస్త దేవతాసీలు, గోపికలు కూడ రాధాదేవియందే విలీనమగుచున్నారు. శ్రీకృష్ణదేవునకు ప్రాణములకన్న మిన్నయైన రాధాదేవి అతని ప్రాణములందే విలీనమగుచున్నది.
సావిత్రీదేవి, వేదశాస్త్రములన్నియు సరస్వతిలో విలీనము కాగా.ఆ సరస్వతి దేవి శ్రీకృష్ణ పరమాత్మయొక్క నాలుకయందు విలీనమగుచున్నది.
గోలోకమున నున్న శ్రీకృష్ణపరమాత్మ రోమములందు గోపకులు విలీనము కాగా అందరి ప్రాణరూపమైన వాయువులు శ్రీకృష్ణునిప్రాణములందు, అగ్ని అతని జఠరాగ్నిలో, జలము శ్రీకృష్ణుని నాలుకపైన విలీనమగుచున్నవి. శ్రీకృష్ణపదపద్మములను సేవించుచు పరమానందమున నున్న వైష్ణవులు ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాదములందే విలీనమగుచున్నారు.
క్షుద్రవిరాట్ మహావిరాట్ స్వరూపునిలో అంతర్థానము కాగా మహావిరాట్ స్వరూపుడు శ్రీకృష్ణునిలో లీనమగుచున్నాడు. ఈవిధముగానే సమస్త విశ్వములు శ్రీకృష్ణపరమాత్మయొక్క రోమకూపములందు లీనమగుచున్నవి.
శ్రీకృష్ణ పరమాత్మ కన్నులు తెరిచినచో ఈచరాచర జంతుసృష్టి జరుగును. అట్లే ఆతడు కండ్లు మూసినచో ప్రళయము సంభవించును. అదే బ్రహ్మదేవుని యొక్క నూరు సంవత్సరముల జీవిత కాలము. అట్లే సృష్టి లయములు జరుగుచున్నవి.
ఇంతవరకు జరిగిన సృష్టిలయముల సంఖ్యను భూమియందున్న రేణువుల సంఖ్యవలె ఎవ్వరు లెక్క పెట్టలేరు. సర్వాంతరాత్మయైన పరమేశ్వరుడు కండ్లు తెరిచినచో సృష్టి జరుగును. అట్లే అతడు కండ్లు మూసికొన్నచో మరల లయము జరుగును.
శ్రీకృష్ణపరమాత్మ గుణగణవర్ణనమును చేయ బ్రహ్మాండములన్నిటిలో నున్న ఎవ్వరును కూడ సమర్థులు కాజాలరు.
సావిత్రి! నాతండ్రి యగు సూర్యుని వలన శాస్త్రములవలన నేను తెలుసుకొన్న విషయమునంతయు నీకు చెప్పితిని. ముక్తులు నాల్గు విధములుగా నుండునని వేదములు తెల్పుచున్నవి. ఈముక్తులన్నిటి కంటే శ్రీహరి భక్తి చాలా గొప్పనిది. ముక్తులలో సాలోక్యమును కలిగించు ముక్తి ఒకటి కాగా సారూప్యమునిచ్చు ముక్తి రెండవది. సామీప్యమును, నిర్వాణమునిచ్చు ముక్తులును తక్కినవి. శ్రీహరి భక్తులకు శ్రీకృష్ణపాదసేవనము తప్ప ఎట్టి ముక్తులు అవసరమని అనుకొనరు.
సిద్ధత్వము. అమరత్వము, బ్రహ్మత్వము, దివ్యరూపధారణము ఇవి నీర్వాణమోక్షమును కలిగించును. ముక్తియనునదీ భగవంతుని సేవా విరహితము. భక్తి భగవంతుని సేవను పెంచును. భక్తిముక్తుల యొక్క ప్రధానమైన భేదమిది. ఇక నిషేకలక్షణమును వినుము.
జీవి తాను చేసిన కర్మముల ఫలముననుభవించుటను నిషేకమని పండితులందురు. దానిని ఖండించునది శుభమైనది మిక్కిలి శ్రేష్ఠమైనది శ్రీకృష్ణసేవనము.
ఈతత్వమును లోకము, వేదముల యొక్క సారమని చెప్పవచ్చును.
ఈ తత్వము విఘ్నముల తొలగించును. సుఖమును కలిగించును. ఓ సావిత్రీ! నీవు సుఖముగా ఇంటికి పొమ్మని యమధర్మరాజు సత్యవంతుని బ్రతికించి సావిత్రికి శుభాశీస్సులనొసగి తనలోకమునకు కదిలెను.
అప్పుడు సావిత్రి అతనికి నమస్కరించి ఏడ్వమొదలిడెను. సత్పురుషులతోడి వియోగము మిక్కిలి దుఃఖమును కలిగించును కదా!
దయగల యమధర్మరాజు ఏడ్చుచున్న సావిత్రిని చూచి ఆతడు కూడ దుఃఖించెను. తరువాత ఇట్లు పలికెను.
యమ ఉవాచ- యమధర్మరాజిట్లనెను-
సావిత్రీ! నీవు భారతదేశమున లక్ష సంవత్సరములు సుఖముగా ఉండి చీవరకు గోలోకమున శ్రీకృష్ణమందిరమునకు పోదువు.
నీవు ఇంటికి వెళ్ళి స్త్రీలకు మోక్షమునిచ్చు సావిత్రి వ్రతమును పదునాలుగు సంవత్సరములు ఆచరింపుము. ఆ వ్రతమును ప్రతి సంవత్సరము జ్యేష్ఠమాసమున శుక్లపక్ష చతుర్దశినాడు ఆచరించుట శ్రేయోదాయకము.
మహాలక్ష్మీ వ్రతమును ప్రతి సంవత్సరము భాద్రపద మాసమున శుక్లపక్షమున అష్టమీ తిథినాడు అనుష్ఠించవలెను. దీనిని పదహారు సంవత్సరములు దీక్షతో భక్తి కలిగి చేసినచో ఆ స్త్రీ శ్రీహరి పాద సన్నిధికేగును. అట్లే ప్రతి మంగళవారమున మంగళచండికా వ్రతమును చేయవచ్చును. ప్రతినెల శుద్ద షష్ఠి తిథినాడు షష్టీదేవి వ్రతము చేయుట మంచిది. ఆషాఢమాసమున వచ్చు సూర్య సంక్రమణమున మానసాదేవి వ్రతము చేయవలెను, ప్రతి సంవత్సరము కార్తీకమాసమున శ్రీకృష్ణునకు ప్రాణప్రియురాలైన రాధికా ప్రతమును చేయవలెను. అదేవిధముగా ప్రతిమాసము శుద్దాష్టమి నాడు ఉదయము. ఉపవసించి వరములను ఒసగునది ఆర్తిని పోగొట్టునదీ, విష్ణుమాయ, జగదంబయగు దుర్గాదేవి వ్రతమునాచరింపవలెను. అట్లే ప్రతివ్రతలయందును, యంత్రములయందును, ఆర్చామూర్తులయందును పతిపుత్రవతి, సతి, జగదంబ యగు ప్రకృతిని ఆరాధించినచో ఈలోకమున సుఖముగా నుండి పరలోకమున శ్రీహరి నివాస స్థానమగు వైకుంఠమును చేరుదురు.
ఈ విధముగా సావిత్రితో మాట్లాడి యమ ధర్మరాజు తన నివాసమునకు పోయెను. సావిత్రి సత్యవంతుని వెంట పెట్టుకొని తన నివాసమునకు చేరెను. తరువాత ఆమె తన భర్తయగు సత్యవంతునకు ఇతర బంధువులకు అరణ్యములో జరిగిన వృత్తాంతమునంతయు పూసగుచ్చినట్లుగా వివరించెను.
యమధర్మరాజొసగిన వర ప్రభావము వలన సావిత్రి తండ్రియైన అశ్వపతికి పుత్రులు పుట్టిరి. అట్లే సావిత్రి మామయగు ద్యుమత్సేనునీకి దృష్టి రాజ్యముతోబాటు, పుత్రులు కలిగిరి.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము సావిత్రి పవిత్రమైన భారతదేశమున లక్షసంవత్సరములు సుఖముగా మండి తన భర్తతో కలిసి గోలోకమును చేరుకొనెను.
సూర్యునకు అధిష్టాన దేవత, సూర్యమంత్రమునకు ఆధిష్టాన దేవత, వేదములకు జనని సావిత్రీ) కావున ఆదేవతను సావిత్రి యనీ పిలుతురు.
నారదా! ఈవిధముగా సావిత్రుపాఖ్యానమును, జీవకర్మ విపాకమును నీకు చెప్పితివి. ఇంకను నీవు వినగోరు విషయమేదైన యున్నచో చెప్పుమని వారాయణుడు నారదునితో ననెను.
ఇతి శ్రీ సావిత్ర్యుపాఖ్యానం శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాదమున చెప్పబడిన సావిత్రి ఉపాధ్యాపములో సావిత్రికి యమోపదేశ పరిసమాప్తి యను ముప్పది నాల్గవ అధ్యాయము సమాప్తము. సావిత్ర్యుపాఖ్యానము సమాప్తమైనది.
