2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

2 - దేవతల జన్మవివరణ

నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లనెమ-

భగవన్! మీ వలన సమస్త దేవీమూర్తుల చరిత్రను తెలిసికొంటిని. ఐనా దానిని విపులీకరించి నాకు తెల్పగలరు. సృష్టికి ఆద్య స్వరూపమైన ప్రకృతి ఏవిధముగా ఆవిర్భవించినదో, తిరిగి ఆమె ఐదు విధములుగా ఎట్లు మారినదో, సత్వ రజస్తమోగుణ రూపులైన ఆమె ఆంశస్వరూపలెవరో, వారి జన్మవృత్తాంతమును, ధ్యానపద్ధతిని, పూజాపద్ధతిని, స్తోత్రమును కవచమును మొదలైన వాటినన్నిటిని సవిస్తరముగా వాకు తెల్పుడు.

శ్రీనారాయణ ఉవాచ- శ్రీనారాయణుడిట్లనెను-

నారదా! ఆత్మ నిత్యమైనది. ఆకాశము నిత్యము. కాలము నిత్యమైనది. దిక్కులు నిత్యమైనవి. గోకులము నిత్యమైనది. గోలోకము నిత్యమైనది. ఆగోలోకములో ఒక భాగమైన వైకుంఠము" కూడ నిత్యమైనదే. అట్లే సనాతన స్వరూపిణియైన ప్రకృతి కూడ నిత్యమైనదే.

అగ్నికి కాల్చు స్వభావము సహజము. చంద్రునకు, పద్మమునకు శోభ సహజమైనది. సూర్యునకు కాంతి సహజము. ఇవి విడదీయరానివి. అట్లే పరమాత్మతో ప్రకృతి ఎల్లప్పుడు కలసి ఉండును. ప్రకృతి పరమాత్మలు భిన్న భిన్నమైనవారు కారు.

కంసాలీ బంగారము లేకుండా ఏవిధముగా కుండలములు చేయలేడో, కుమ్మరివాడు మట్టిలేకుండా కుండ లేవిధముగా చేయలేడో అట్లే పరబ్రహ్మ ప్రకృతి సహాయము లేకుండ సృష్టిని చేయలేడు. ఆ ప్రకృతి సర్వశక్తి స్వరూప. ఆమె వలననే పరమాత్మ సర్వశక్తి స్వరూపుడగుచున్నాడు.

'శక్' అనునది ఐశ్వర్యమును తెల్పును. 'తి' అనునది పరాక్రమమునకు సూచకము. ఐశ్వర్య, పరాక్రమ స్వరూపిణి, ఐశ్వర్య పరాక్రమముల నొసగునది కావున ప్రకృతిని శక్తి అని పిలుతురు.

భగ: అనునది సమృద్ధిని, బుద్ధిని, కీర్తిని తెలుపును. సమృద్ధి, బుద్ధి, యశోరూపమైన ఆ శక్తిని భగవతి అని అందురు. ఆ భగవతితో కలిసి ఉన్నందువలన పరమాత్మను భగవంతుడని పిల్తురు.

శ్రీకృష్ణభక్తులగు వైష్ణవులు పరమాత్మనిరాకారుడను మాటను విశ్వసింపరు. వారి అభిప్రాయమున తేజస్వియైన సాకారరూపము లేక తేజస్సు అనునది ఉండదు.  

వైష్ణవులు తేజోమండలము యొక్క మధ్యనున్న పరబ్రహ్మ పరమ తేజస్విగా భావింతురు ఆ పరబ్రహ్మ సంపూర్ణ స్వేచ్ఛామయుడు, సమస్త సృష్టి స్వరూపుడు. సమస్త సృష్టికారణములకు మూల పురుషుడని అందురు.

            మిక్కిలి, సుందర రూపుడు, కిశోరవయసులో ఉన్నవాడు, శాంతుడు, పరాత్పరుడు, నూతన మేఘకాంతి కలవాడు, రాసక్రీడలో నున్న ఏకైక శ్యామసుందరుడు, పద్మములవంటి కన్నులు, ముత్యాలవంటి దంతములు కలవాడు, శిరస్సున నెమలి . ఈక కలవాడు. మాలతీ పుష్పముల మాలను ధరించినవాడు, అందమైన ముక్కుతో, చిరునవ్వుతో ఉన్నవాడు, ఎల్లప్పుడు భక్తులననుగ్రహించువాడు, అగ్నివలే పరిశుద్ధమైన పీతాంబరము కలవాడు, చేతిలో మురళి, మెడలో రత్నభూషణములు కలవాడు, సమస్త సృష్టికి ఆధారభూతుడు, సర్వేశ్వరుడు, సర్వశక్తులుకలవాడు, సర్వైశ్వర్యము నిచ్చువాడు, సర్వ స్వతంత్రుడు, సర్వమంగళ రూపుడు, సర్వ పరిపూర్ణుడు, సమస్త సిద్ధులను భక్తులకిచ్చువాడు, జన్మ, మృత్యు, బిరా, వ్యాధి, శోక, భీతులను పోగొట్టువాడుగా వారు భావించి అతనిని ధ్యానింతురు.

బ్రహ్మదేవుని వయస్సంతయు ఎవరికి నిమిషమువలె ఉండునో ఆపరబ్రహ్మను శ్రీకృష్ణదేవుడని అందురు.

కృషి యనగా ఆ పరమాత్మయందలి భక్తి. 'న' అనగా ఆ పరమాత్మ దాస్యమును కలిగించుట. అందువలన కృష్ణుడనగా ఆ పరమాత్మయందు భక్తిని దాస్యబుద్ధిని కలిగించువాడు.

ఇంకను కృషి యనునది సమస్తమును తెల్సును. న అనునది బీజవాచకము. సమస్త సృష్టి కారణమైన పరబ్రహ్మమును కృష్ణుడని అందురు. అంతులేని బ్రహ్మదేవతలందరు మరణించినను, కాలమంతయు గడచిపోయినను శ్రీకృష్ణపరమాత్మ గుణములకు నాశము లేదు. అట్లే ఆతని గుణములతో సమానమైవాడెవడు ఈ సృష్టిలో కనరాడు.

ఆ కృష్ణపరమాత్మ సమస్త సృష్టి జరుగకముందు తానొక్కడే ఉన్నను సృష్టిని చేయదలచి అతని అంశమువలన, కాలమువలన ప్రేరేపింపబడి తనయొక్క ఇచ్చననుసరించి రెండు విధములుగా మారెను. ఆ పరమాత్మ ఎడమ భాగము స్త్రీ రూపము కాగా కుడిభాగము పురుషుడయ్యెను.

పురుషరూపమున నున్న పరమాత్మ మహాకాముకుడై మిక్కిలి ఆందమైనదీ చంపక పుష్పము వలె కోమలమైనది. నిండు చంద్రునివలె గుండ్రనైన పిరుదులు కలది. ఆరటి కాడలవంటి తొడలు కలదీ, బిల్వ ఫలములవలె గుళడ్రని స్తనములు కలది, సన్నని నడుముగలది, మిక్కిలి ఆందమైనది, శాంత, సుస్మిత, పరిశుభ్రమైన వస్త్రములు రత్నభూషణములు ధరించినది. - కస్తూరిబిందువుల మధ్య పెద్దని సిందూరపుచుక్కను, క్రింద చందనపు చుక్కను నొసట ధరించినది. మాలతీ పుష్పముల మాలగలే వంకరకొప్పును, మెడలో రత్నములు, ఇంద్రనీలమణులు కల మాలమ ధరించినది, రాజహంసవంటీ గమనము కలది, కాటుకకంటి ఆస్తిని చూచి రహస్య ప్రదేశమున నూరు బ్రహ్మ సంవత్సరములు అనేక విధములైన శృంగార చేష్టలతో సంభోగమొనరించెను.

ఆ పురుషుడు దానివలన పరిశ్రమనొంది శుభసమయమున ఆ స్త్రీయొక్క యోనిలో తన వీర్యమునుంచెను. సురత. కొలాంతమున పరిశ్రమచెందిన ఆ స్త్రీ శరీరమునుండి చెమట బిందువులేర్పడినవి. అట్లే మహాసురతమువలన భేదము చెందిన ఆ స్త్రీ దీర్ఘ నిశ్వాసమును వదలెను.

ఆ స్త్రీ యొక్క చెమట బిందువులనుండి సమస్త విశ్వగోళకములు, ఏర్పడినవి. ఆమె యొక్క నిశ్వాసవాయువు ఈ ప్రపంచములందున్న-సమస్త ప్రాణికోట్లకు ఆధారమైన నిశ్వాసవాయువుగా పరిణమించినదీ, ఆకారముకల ఆ వాయువుయొక్క ఎడమ భాగమునుండి అతని భార్యయు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములను అతని పుత్రులు ఐదు ప్రాణములుగా ఏర్పడిరి.

ఆమె చెమటనీటినుండి నీటికి అధిదేవతయైన వరుణుడుద్భవించెను. అతని వామాంగమునుండి “వరుణాని" అనేడు ఆతని భార్య ఆవిర్భవించెను.

శ్రీకృష్ణ శక్తి స్వరూపిణియగు ఆస్త్రీ శ్రీకృష్ణుని వలన గర్భమును. శతమన్వంతరకాలము ధరించెను. ఆమె శ్రీకృష్ణుని ప్రాణములకు అధిదేవత, ఆతని ప్రాణములకంటే ఎక్కువ ప్రియమైనది. శ్రీకృష్ణుని వక్షస్థలముపై నున్న ఆమె ఎల్లప్పుడు అతనిని వదలక ఉండునది.

శతమన్వంతరముల తరువాత ఆమె బంగారు కాంతిగలదియు వీతధారణయోగ్యమైన అండమును ప్రసవించినది. అవయవములు లేని ఆ ఆండమును చూచి బాధాతప్తమైన హృదయములో కోపముతో దానినామె బ్రహ్మాండ గోళకమందలి జలములో పారవేసినది. శ్రీకృష్ణుడా దృశ్యమునుచూచి హాహాకారము చేయుచు. కోపస్వభావముగలదానా! నీవు నీ బిడ్డను చేజేతులారా దూరము చేసికొన్నందువలన నీవు కాని, నీ ఆంశస్వరూపాలైన దేవతా స్త్రీలుగాని నీవలె నిత్యయౌవనలైనా సంతానమునకు నోచుకోరు." అని శపించెను.

దేవియొక్క జిహ్వాగ్రమునుండి తెల్లని రంగుతో అందమైనది. పీతాంబరమును, రత్నభూషణములను ధరించినది, చేతులలో వీణ, పుస్తకములను ధరించినది, సమస్త శాస్త్రములకు అధిదేవతయైన సరస్వతి దేవి వెంటనే ఉదయించినది.

కొంతకాలమున కామె వామార్ధాంగమునుండి లక్ష్మిగా, దక్షిణార్ధాంగమునుండి రాధగా రెండు రూపములనందనది. అట్లే శ్రీకృష్ణుడు కూడ దక్షిణార్ధాంగమునుండి ద్విభుజూడైన కృష్ణుడుగా వామార్ధాంగమునుండి చతుర్భుజుడైన నారాయణుడుగా రెండు రూపములు పొందెను.

 శ్రీకృష్ణుడు సరస్వతిని నారాయణునకు ప్రియురాలుగా చేసెను. పూజ్యారాలైన రాధాదేవి ఇచ్చటనే ఉండునని చెప్పి లక్ష్మీదేవిని కూడ నారాయుణన కివ్వగా ఆతడు వారితో కలసి వైకుంఠమునకు పోయెను.

రాధాంతమున జన్మించిన లక్ష్మీ సరస్వతులకు కూడ సంతానము కలుగలేదు. కాని లక్ష్మీ దేవి యొక్క అవయములనుండి ఆమెతో సమానమైన దాసీ జనమెంతయో పుట్టినది. ఆట్లే నారాయణుని అవయవముల నుండి వయస్సున, రూపమున, గుణములతో ఆతవికి సమానులైన చతుర్భుజూలైన అనుచరులెందరో ఉద్భవించిరి.

గోలోక నాథుడైన శ్రీకృష్ణుని రోమ కూపములనుండి వయస్సులో, తేజస్సులో, రూపమున, గుణములలో పరాక్రమమున శ్రీకృష్ణునితో సమామలైన అసంఖ్యాకులైన గోపాలబాలురు ఉదయించిరి. వీరందరు ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ప్రాణములతో సమానమైన అనుచరవర్గము. అట్లే రాధాదేవి యొక్క దోమ కూపములనుండి రాధాదేవితో సమానమైనవారు, రత్నభూషణములు కలవారు, స్థిరమైన యౌవనము కల అనేక గోపికా కన్యలావిర్భవించిరి. కాని వారందరు రాధాంశసంభూతలు. కావున పరమపురుషుని యొక్క శాపము వలన సంతాన రహితలైరి.

 ఆసమయమున శ్రీకృష్ణుని దేహమునుండి విష్ణుమాయయైన దుర్గవెంటనే ఆవిర్భవించినది. ఆ దుర్గాదేవి నారాయణుని మాయా స్వరూపిణి. శంకరుని యొక్క పత్ని. సమస్త శక్తి స్వరూపిణి. శ్రీకృష్ణ పరమాత్మయొక్క బుద్ధికి అధిష్టాన దేవత. దేవతాస్త్రీలందరకు కారణరూపిణి, ఆమెయే మూలప్రకృతి. సర్వ పరిపూర్ణమైనది. తేజ: స్వరూప. సత్వరజాధిర్రిగుణాత్మక, బంగారు వంటి కాంతి కలది. సూర్యునివంటీ తేజస్సు కలది. వేయి చేతులలో అనేక విధములైన శస్త్రాస్త్రములను ధరించినది. మూడు కన్నులు కలది. పరిశుద్దమైన వస్త్రములన రత్నాభరణములను ధరించినది.

ఆ దుర్గాదేవియొక్క ఆంశమువలన ఆంశాంశముల వలన సమస్త స్త్రీలు ఉద్భవించిరి. సమస్త లోళములు ఈమె యొక్క మాయవలన మోహించబడినవి. ఈమె భక్తులమొక్క అన్ని కోర్కెలను తీర్చును. వైష్ణవి యగు ఏ దుర్గ పులకు విష్ణుభక్తిని కలుగజేయును. మోక్షము కోరువారికి మోక్షమునిచ్చును. సుఖము కోరువారికి సుఖములనిచ్చును. ఈమె స్వర్గమున స్వర్గలక్ష్మిగా, గృహములందు గృహలక్ష్మిగా, తపస్సు చేసికొనువారికి తపస్సు, రాజాలకు లక్ష్మీరూపమున కనిపించును.   

ఈ దుర్గాదేవి ఆగ్నేయందు దాహకశక్తిగా, సూర్యునీయందు కాంతిగా, చంద్రునిలో పద్మములలో శోభారూపిణిగా, శ్రీకృష్ణ పరమాత్మయందు సర్వశక్తిమంతమగుచున్నది. పరమాత్మ సహితము ఈ దుర్గాదేవివలన శక్తివంతుడగుచున్నాడు. ఈమె లేనిచో జగత్తతంతయు జీవన్మతముగా కన్పించును.

సనాతని యగు ఈ దుర్గ సంసారమనే వృక్షమునకు మూలకారణమైనది. స్థితికి కారణమైనది. బుద్ధి, ఫలస్వరూపిణిగా నున్నది. ఆకలి దప్పులు, దయ, శ్రద్ధ, నీద్ర. తంద్ర, క్షమ, ధృతి, శాంతి, లజ్జ, తుష్టి పుష్టి భ్రాంతి, కాంతి మొదలగునవన్నియు ఈమె స్వరూపములే.

ఆ దుర్గాదేవి శ్రీ కృష్ణపరమాత్మను స్తుతింపగా నతడు ఆమె కూర్చుండుటకై రత్న సింహాసనము నొసగెను.

ఆ సమయమున విష్ణుమూర్తియొక్క నాభికమలమునుండి కమండలువు ధరించినవాడు, తపస్వి, జ్ఞానులలో శ్రేష్ఠుడు, చతుర్ముఖుడగు బ్రహ్మదేవుడు భార్యాసహితముగా బ్రహ్మతేజస్సుచే ప్రకాశించుచు బయలువెడలెను.

శతచంద్రులతో సమానమైన కాంతిగలది, సుందరి, పరిశుద్ధమైన వస్త్రములను, రత్నభూషణములను ధరించిన ఆతని స్త్రీ సమస్త సృష్టికి కారణుడైన శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించి అతని ముందు తన స్వామితో కలసి రత్న సింహాసనముపై కూర్చుండెను.

ఆ సమయమున కృష్ణుడు తన కుడిపార్శ్వమున శ్రీకృష్ణుడుగా, ఎడమపార్వమువ మహాదేవుడుగా మారెను.

ఆ మహాదేవుడు పరిశుద్ధమైన స్పటికమువంటి వన్నె కలవాడు, శతకోటి సూర్యులతో సమానమైన కాంతి కలవాడు. త్రిశూలము, పట్టిమను ఆయుధములను.. వ్యాఘ్రచర్మమును, బంగారువన్నెగల జడలను ధరించినవాడు. శరీరమున భస్మమే భూషణముగా కలవాడు. చంద్రుని ఆభరణముగా ధరించినవాడు, దిగంబరుడు, నీలకంఠుడు, సర్పములే ఆభరణములుగా కలవాడు. అతడు తన కుడి చేతిలో రత్నమాలను ధరించి, తన ఐదు ముఖములతో సత్య స్వరూపుడైన శ్రీకృష్ణపరమాత్మను జపించుచుండెను.

కారణకారణుడు. సర్వమంగళములకు మంగళమైనవాడు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, శోక, భీతులను తొలగించువాడు, మృత్యువునకే మృత్యువగు ఆ శ్రీకృష్ణుని జపించి మహాదేవుడు మృత్యుంజయుడయ్యెను. ఆ మహాదేవుడు శ్రీకృష్ణుని స్తుతించి అతని ముందు రత్నసింహాసనమున కూర్చుండెను.

శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమున రెండవదియగు ప్రకృతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున తెలుపబడిన దేవ, దేవ్యుత్పత్తి యనెడు ద్వితీయాధ్యాయము సమాప్తము.