2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

45 - మనసా దేవి ఉపాఖ్యానము

నారాయణ ఉవాచ- నారాయణమునీ ఇట్లనెను-

నారదమహర్షీ! నీకు షష్ఠీదేవి మంగళచండికాదేవి ఈ ఇద్దరి కథను తెల్పితిని. ఇక ఇప్పుడు ధర్మునివలన నేను విన్న మనసా దేవియొక్క ఉపాఖ్యానమును వినుము.

కశ్యప ప్రజాపతికి మానసిక అను పుత్రిక కలదు.మానసిక పుత్రీ కావున ఆ కన్యను మనస యని పిలుతురు, లేక పరమాత్మను సదా మనసున ధ్యానించునది కావున 'మనస' యైనది. ఆదేవి తనలో తానే రమించునది. సిద్ధయోగిని, వైష్ణవికూడ. అందువలన ఆమె పరమాత్మయగు శ్రీకృష్ణునిగురించి మూడు యుగములు తపస్సు చేసినది.

ఆ మనసాదేవి శ్రీకృష్ణుని గురించి తపస్సు చేయుచుండగా ఆమె వస్త్రము, శరీరము శిథిలమగుచుండెను. అందువలన సమస్తలోకములకు ప్రభువు గోపీపతి అగు శ్రీకృష్ణుడు ఆమెకు జరత్కారు ఆను సార్థక నామమునుంచెను. అట్లే దయానిధియగు ఆ శ్రీకృష్ణుడు ఆమె కోరిన కోరికలను అన్నిటిని తీర్చెను. అందువలన ఆ దేవి ఆ పరమాత్మను మరల పూజించినది. ఆట్లే ఇతరులా పరమాత్మను పూజించునట్లోనర్చినది.

ఆ మనసాదేవిని భూమి పైనున్న వారు, స్వర్గలోకముననున్నవారు, పాతాళ లోకముననున్నవారు పూజించుచుండిరి. తెల్లగా, మనోహరముగా, సుందరముగానుండి అన్నీ జగత్తులనుండు వారిచే పూజలనందుకొనుచున్నందువలన ఆమెను “జగద్గారి’ అనిరి.

ఆ దేవి శివునకు శిష్యురాలు కావున శైవియైనది. విష్ణుమూర్తిపై పరమతీవ్రమయిన భక్తి కలదీ కావున "నైష్ణవియైనది. జనమేజయునీ యజ్ఞమున నాగులనందరిని అగ్ని ఆహుతీకాకుండ రక్షించినందువలన నాగేశ్వరీయని నాగభగివి యని ఆమెను పిలుతురు. సర్పములయొక్క వీషమును సంహరింపచేయగలది కావున ఆమెను “విషహారిణి" యనిరి.

పరమశివుని వలన సిద్దయోగమును, మహాజ్ఞానమును అత్యంత రహస్యమైన మృతసంజీవినీ విద్యను పొందినందువలన సిద్ధయోగినీయైనది. పండితులామెను మహాజ్ఞాని యని కూడ పిలుతురు. ఆస్తీకమునీంద్రుని తల్లి కావున ఆస్తీక మాతయైనది, జరత్కారు అనునదీ ఆమె పేరైనా ఆమె జరత్కారు ఆనుమునీంద్రునకు భార్యయైనది.

ఈ విధముగా మనసాదేవి అన్నిలోకములందు ప్రసిద్ధిని పూజలను పొందినది.

“ఓం నమో మనసాయై" - మనసాదేవికి నమస్కరింతును.

జరత్కారు, జగద్గారి, మనసా, సిద్ధయోగిని, వైష్ణవీ, నాగభగిని, శైవీ, నాగేశ్వరీ, జగత్కారుప్రియా. ఆస్తీక మాతా, విషహరి, మహాజ్ఞానయుతా, అను మనసాదేవియొక్క పన్నెండు పేర్లను పూజా సమయమున చదువువానీకి నాగభయమనునది ఉండదు. అతని వంశమున పుట్టబోవు వారికి కూడ. నాగభయముండదు.

నాగభయముకల శయన మందిరమున సర్పములు తరచుగా వచ్చు ఇంటిలో, సర్పము కాటువేయు సమయమున, సర్పములు చుట్టు ముట్టినప్పుడు, ఈ స్తోత్రమును చదివినచో సర్పభయముండదు.

ఈ స్తోత్రము ప్రతిదినము పఠించు చున్నచో ఆతనిని చూచి సర్పములన్నియు పరుగెత్తి పోవును. ఈ స్తోత్రమును పదిలక్షల మార్లు జపముచేసినచో సిద్ది కలుగును. స్తోత్రసిద్ది జరిగినవాడు విషమునైనా తినగలడు. అతడు పాపములను ఆభరణములుగా చేసికొని యైనను నాగవాహనుడు నాగాసనుడు, నాగతల్పుడైనను కావచ్చును.

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణ సంవాద సమయమున తెల్పబడిన మానసోపాఖ్యానమందు మానసా స్తోత్రాదులను తెలిపే నలభై యైదవ అధ్యాయము సమాప్తము.