2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

 48 - రాధోపాఖ్యాన ప్రారంభము

నారద ఉవాచ- నారదమహాముని ఇట్లనెను-

నారాయణపరాయణుడవు, నారాయణాంశ సంభూతుడవు ఆగు నారాయణమునీ! నాకిప్పుడు నారాయణునకు సంబంధించిన కథలను వివరింపుము.

ఇంతవరకు మీరు నాకు సురభి ఉపాఖ్యానమును చాలా చక్కగా వివరించితిరి. ఇది అన్ని పురాణములందు రహస్యముగా కన్పించును. దీనిని పురాణ వీదులందరు. ప్రశంసింపుచుందురు.

ఇక ఇప్పుడు నాకు ఉత్తమమైన రాధా ఉపాఖ్యానమును, రాధాదేవి జనమును, ఆమె ధ్యానమును, స్తోత్రమును, కవచమును నాకు విపరముగా తెలుపుడు అని పలికెను.

శ్రీ నారాయణ ఉవాచ- నారాయణు డిట్లు పలికెను-

పూర్వకాలమున కైలాసపర్వతమున భగవంతుడు, సనాతనుడు, సిద్దేశుడు, సిద్దులను కలిగించువాడు, సమస్త స్వరూపుడగు శంకరుని మునులు సేవించుచుండగా తన పుత్రుడగు కుమారస్వామికి శ్రీకృష్ణపరమాత్మయొక్క రాసోత్సవ కథలను మధురముగా వినిపించుచుండెను.

ఆ సమయమున పార్వతీదేవి భయపడుచు తన ప్రాణవల్లభుడగు మహాదేవుని దగ్గరకు వచ్చి అపూర్వమైన రాధికాఖ్యానము చెప్పుమని ఆడిగెను.

శ్రీ పార్వత్యువాచ- శ్రీపార్వతీదేవి ఇట్లనెను-

నాథ! నీవు చెప్పగా పాంచరాత్రము మొదలగు సమస్త ఆగమశాస్త్రములను, నీతి శాస్త్రమును, యోగశాస్త్రమును, సిద్ధులకు సిద్ధిశాస్త్రము, భక్తులకు భక్తిశాస్త్రము ఆగు శ్రీకృష్ణ పరమాత్మ చరిత్రమును మనోహరముగా వింటిని,

అట్లే సమస్త దేవతాస్త్రీల చరిత్రలు కూడ వినవలెనని నాకు కోరిక కలదు. ప్రస్తుతము ఆ దేవతాస్త్రీలలో ప్రముఖురాలగు రాధికాదేవి చరిత్రను తెలిసికొనవలెనని ఆనుకొనుచున్నాను.

రాధాదేవియొక్క ప్రశస్తమైన చరిత్ర వేదములలో సంక్షేపముగా కనిపించుచున్నది. నీవు దానిని కాణ్వశాఖయందున్నట్లు చెప్పితివి. దానినిప్పుడు వివరించి నాకు చెప్పుము.

రాధాదేవియొక్క జన్మవృత్తాంతమును, ఆమెయొక్క ధ్యానమును, ఆమె నామమాహత్మ్యమును, పూజావిధానమును, చరిత్రను, స్తోత్రమును, కవచమును, ఆరాధనా విధానమునంతయు నీ భక్తురాలనగు నాకు చెప్పుము ఆని ఆడిగెను.

అప్పుడు శ్రీ మహాదేవుడు కొద్దిగా సిగ్గుపడెను.

ఐదు ముఖములు కల మహాదేవుడు పార్వతీదేవియొక్క మాటలువిని నోరు నాలుక ఎండిపోయినను, తన మాటనే తాను తప్పుట పాడిగాదని క్షణకాలము - మౌనముగా ఉండిపోయి, తనకు ఇష్టదేవతయగు శ్రీకృష్ణుని ధ్యానించెను. తరువాత శ్రీకృష్ణుని అనుజ్ఞను పొంది పార్వతితో ఇట్లు చెప్పసాగెను.

ఓ దుర్గా! ఆగమములు రచించువేళ శ్రీకృష్ణపరమాత్మ నన్ను రాధాదేవి చరిత్రను అందరకు చెప్పవద్దని నిషేధించెను.

నీవు నాకు అర్థాంగివి. నా కంటే భిన్నమైన దానవుకాదు. కావున శ్రీకృష్ణ దేవుడు రాధాదేవి చరిత్ర నీకు చెప్పుటకు అనుమతి నొసంగెను. రాధాదేవి నాకు ఇష్ట దేవుడగు శ్రీకృష్ణుని భార్య. ఆమె చరిత్ర మీక్కిలి రహస్యమైనది. సుఖమును, శ్రీకృష్ణ భక్తిని ఇచ్చునది. రాధాదేవికి సంబంధించిన చరిత్ర అంతయు నాకు మాత్రము తెలియును. ఇదీ బ్రహ్మకు గానీ ఆదిశేషునకుగాని, సనత్కుమారునకుగాని, ధర్మునకు గాని, దేవేంద్రునకు గాని, మునీంద్రులకుగాని, సిద్ధేంద్రులకుగాని ఎవ్వరికిని తెలియదు.

రాధాదేవి చరిత్ర చాలా రహస్యమైన నీవునాకు ప్రాణముల కంటే గొప్ప దానవు గావున దీనిని నీకు చెప్పుచున్నాను.

పూర్వము బృందావనమున నున్న రానమండలములో శతశృంగపర్వతమున రత్నసింహాసనమున శ్రీకృష్ణపరమాత్మ కూర్చొనియుండెను. స్వేచ్చామయుడగు ఆ పరమాత్మకప్పుడు రమింపవలెనని కోరిక కలిగినది. అప్పుడాతని ఇచ్చేవలన ఆతడే రెండు రూపములుగా నయ్యెను. కుడిపార్శ్వము శ్రీకృష్ణుడుగను ఎడమ పార్వము రాధాదేవిగను ఏర్పడెను.

రాధాదేవి ఆమూల్యరత్నాభరణములు, బంగారు వన్నెగల వస్త్రము ధరించి రత్నసింహాసనమున కూర్చీండినది. ఆమె శరీర కాంతికూడ బంగారు వర్ణముననుండెను. చక్కని పలువరుస కలిగి చిరునవ్వుతో ఆమె ఉండెను. శరత్కాలమందలి పద్మమువంటి ముఖముతో మాలతీ పుష్పములమాల చుట్టబడిన కొప్పుతో, సూర్యునివంటి రత్నమాలను, గంగానది ధారవంటి ముత్యాలమాలను ధరించి - చాలా ఆందముగా కన్పించినది.

నూతన యౌవనమున కన్పించు రాధాదేవిని చూడగానే రసికేశ్వరుడగు శ్రీకృష్ణునకు రమింపవలెనను కోరిక ఎక్కువాయెను.

రాధాదేవి శ్రీకృష్ణుని చూడగానే అతని ముందు తన రూపమును మరింత ఆందముగా చేసుకొన్నందువలన రాధ అను పేరు ఆమెకు వచ్చినదని పెద్దలందరు.

రాధాదేవి శ్రీకృష్ణుని, శ్రీకృష్ణుడు రాధాదేవిని ఇట్లు పరస్పరము అనురాగము కలిగి సేవించుచుండిరి. వారిద్దరి మధ్య అన్ని విషయములలోను సమానత్వమున్నదని పూర్పులు చెప్పుదురు.

ఆ రాసమండలమందలి మాలతీమల్లికానికుంజమున శ్రీకృష్ణుడు రాధాదేవిని భరించెడివాడు, స్మరించెడివాడు, ఆలింగనముచేసికొనెడివాడు. ఆమె నామమును జపించెడివాడు.

"రా" శబ్దమునుచ్చరించుటచే భక్తుడు అత్యంత దుర్లభమైన ముక్తిని పొందుచున్నాడు. "ధా" శబ్దమునుచ్చరించగనే ఆ భక్తుడు శ్రీహరి నివసించు వైకుంఠమునకు పరుగెత్తుకుని పోవుచున్నాడు. “రా" అనునది ఇచ్చుటను “ధా" అనునది " ముక్తిని తెలుపును కావున - ముక్తిని ప్రసాదించు ఆ దేవి "రాధ" యైనదనీ అందురు.

శ్రీకృష్ణుని పామపార్వమునుండి రాసేశ్వరియగు రాధాదేవి ఆవిర్భవించగా ఆమెయొక్క ఆంశవలన, అంశాంశలవలన, దాని ఆంశములవలన దేవతా స్త్రీలందరు ఆవిర్భవించిరి.

రాధాదేవియొక్క రోమకూపములనుండి గోపికా సంఘము ఉత్పన్నముకోగా శ్రీకృష్ణుని రోమకూపములనుండి సమస్త గోపజనము ఆవిర్భవించినది.

రాధాదేవియొక్క ఎడమపార్వమున మహాలక్ష్మి ఆవిర్భవించినది. ఆ మహాలక్ష్మి జగత్పతియొక్క ఆధిష్టానదేవతగా గృహలక్ష్మిగా పిలువబడినది. పైకుంఠనాథుడగు చతుర్భుజుడైన నారాయణునకు ఆ మహాలక్ష్మి భార్యయైనది. ఆమెయొక్క జంశస్వరూపమే రాజలక్ష్మి. ఆ దేవి రాజులకు రాజసంపదను కలిగించును, రాజలక్ష్మియొక్క అంశస్వరూపము మర్త్యలక్ష్మి, ఈదేవి భూలోకమున అందరి ఇండ్లలో దీపాధిష్టాన దేవతగా నున్నది.

శ్రీరాధాదేవి శ్రీకృష్ణుని వక్షస్థలమున ఎల్లప్పుడుండును. ఆమె ఆ పరమాత్మయొక్క ప్రాణములకు అధిష్టాన దేవత.

బ్రహ్మదేవుడు మొదలుకొని స్తంబపర్యంతమున్న ఈచరాచర జగత్తు సమస్తము నశ్వరమైనది. శాశ్వతమైనవాడు త్రిగుణాతీతుడు, పరాత్పరుడైన రాధాకాంతుడొక్కడే పరమాత్మ, ఈశ్వరుడు సర్వసృష్టికి వీభూతుడు సమస్తజనులచే పూజలనందుకొనువాడు, కోరికలులేనివాడు. ప్రకృతికంటే శ్రేష్ఠుడు. స్వేచ్చామయుడు, భక్తులననుగ్రహించువాడు అగు శ్రీకృష్ణుని నీవు ఆరాధింపుము.

అతడు తప్ప మిగిలిన దేవతలయొక్క రూపము ప్రాకృతమైనది. రాధాదేవి శ్రీకృష్ణునకు తన ప్రాణములకంటె ప్రియమైనది. ఆమె బహుభాగ్యవతి. శ్రీమహావిష్ణువునకు మాత. ఆమెయే మూలప్రకృతి.

సత్పురుషులెల్లప్పుడు రాధాదేవిని సేవించుచుందురు. బ్రహ్మాది దేవతలకు కూడ దుర్లభమైన ఆమె పాదసేవ వారికి సులభముగా లభించును. గోలోకముననున్న గోపకులకు సైతము ఆమె పదపంకజముల సేవ కలలోనైనా లభింపదు, ఆట్టి రాధాదేవి శ్రీకృష్ణుని వక్షస్థలమున ఛాయగా ఎల్లప్పుడు నివసించుచుండును.

ఆ రాధిక సుదాముని యొక్క శాపమువలన భూలోకమున కళావతి వృషభానులకు కూతురుగా జన్మించెను.

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణ సంవాదమున కనిపించి గౌరీశంకరుల సంవాదమున చెప్పబడిన రాధోపాఖ్యానమున రాధాదేవి జననము ఆమెయొక్క పూజాదులు గల నలభై ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.