2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

15 - తులసీకి బ్రహ్మదేవుడు వరమునిచ్చుట

నారాయణ ఉవాచ - నారాయణుడిట్లనెను-

ధర్మధ్వజమహారాజు భార్యపేరు మాధవి. వారిద్దరు గంధమాదనపర్వతమున చాలా సంవత్సరములు సుఖముగా నుండిరి. నూరు దేవతా సంవత్సరముల వరకు వారికి రాత్రింబవళ్లు తెలియలేదు. తరువాత ఆమె గర్భమును ధరించి కార్తీక పూర్ణిమనాడు మహాలక్ష్మీదేవి అంశకల అందమైన కూతురును ప్రసవించెను.

ఆ శిశువు పాదపద్మములు పద్మరాగములవలె ఎఱ్ఱనివి. రాజలక్ష్మీ చిహ్నములతో సర్వాంగసుందరియైన ఆ శిశువు రాజలక్ష్మికి ఆధిదేవత. ఆమె అందము ఇతరులతో పోల్చరానిది. తులన చేయుటకు వీలులేని అందము కలది కావున ఆ శిశువునకు తులసి యను పేరుపెట్టిరి.

తులసి పెరిగి పెద్దనై బంధువులందరు వద్దని నిషేధించుచున్నను తనకు నారాయణుడు భర్తగా కావలెనని ఆశించి లక్ష దేవతా వర్షములు తపస్సు చేసినది. గ్రీష్మకాలమున పంచాగ్ని మధ్యనుండి, శీతాకాలమున నీటిలో నిలబడి, వర్షకాలమున బయటనుండి వర్షధారలను సహించుచు ఇరవై వేల సంవత్సరములు, పండ్లు, నీరు మాత్రమే తీసికొని తపస్సు చేసినది. తరువాత ముప్పైవేల సంవత్సరములు ఆకులు మాత్రమే ఆహారముగా స్వీకరించినది. అటుపిమ్మట పదివేల సంవత్సరములు వాయువును మాత్రము ఆహారముగా స్వీకరించి తపస్సు చేసినది. తరువాత ఒంటి కాలిపై నిలబడి తపస్సు చేయుచున్న తులసి దగ్గరకు బ్రహ్మ దేవుడు వరమిచ్చుటకై బదరికాశ్రమమునకు వచ్చెను.

హంసవాహనుడగు చతుర్ముఖ బ్రహ్మను చూచి తులసి వెంటనే నమస్కరించెను.

బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను-

ఓ తులసి! నీమనస్సులో నున్న కోరికను తెలుపుము. ఆది శ్రీహరిభక్తియో ముక్తియో, అజరామరత్వమో ఏదైనను వరమును కోరుకొమ్ము అని బ్రహ్మ పలికెను.

తులస్యువాచ- తులసీదేవి ఇట్లనెను-

సర్వజ్ఞుడవగు బ్రహ్మదేవుడా నా మనస్సులోని కోరికను నీతో చెప్పుకొనుటకు సిగ్గు- అనవసరము. నేను పూర్వము గోలోకమున తులసియను గోపికగా, రాధాదేవికి సేవకురాలుగా ఆమె అంశస్వరూపనై యుంటిని. ఒకప్పుడు నేను శ్రీకృష్ణునితో కలిసి తృప్తిలేక మూర్ఛపడియున్న సమయమున రాసేశ్వరి యగు రాధాదేవి కోపమును పట్టలేక మానవజన్మనెత్తుమని శపించినది. అప్పుడు గోవిందుడు నాతో ఇట్లు చెప్పెను. ‘నీవు మానవజన్మనెత్తినను తపస్సు చేసి నా అంశకల చతుర్భుజుడైన నారాయణుని నీవు భర్తగా పొందగలవని చెప్పెను. ఈ మాటలు చెప్పి ఆ గోవిందుడు కూడ అంతర్ధానమయ్యెను.

రాధాదేవియొక్క భయమువలన నేను నా శరీరమును త్యజించి ఈ భూలోకమున జన్మించితిని. నాకు సుందర విగ్రహుడు, శాంతుడైన నారాయణుని వివాహము చేసికొనవలెనని యున్నది. ఇది నా కోరిక. నీవు ఈ వరమును నాకు ప్రసాదింపుము.

బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికెను-

భారతదేశమున శ్రీకృష్ణుని యొక్క ఆంశవలన పుట్టిన సుదాముడను గోపుడు రాధాదేవి యొక్క శాపమువలన దనుజవంశములో “శంఖచూడు"డను పేరుతో జన్మించెను.

ఆతడొకప్పుడు గోలోకమున నిన్ను చూచి కామబాధకు గురియైనప్పటికీ రాధాదేవి ప్రభావమువలన అతిగా ప్రవర్తించలేకపోయెను. అతడు భూమిపై రాక్షసుడుగా జన్మించినను తన పూర్వజన్మ స్మృతి ఉన్నందువలన చాలాకాలము తపమాచరించి నిన్ను భార్యగా వరము పొందెను. పూర్వజన్మస్మృతి కల నీకు ఈవిషయమంతయు తెలియును. అందువలన ఈ జన్మలో శంఖచూడునకు భార్యవై తరువాతి జన్మలో నారాయణుని భర్తగా పొందగలవు.

దురదృష్టవశమున నారాయణుని శాపమును పొంది ప్రపంచములనన్నిటిని పవిత్రముగా చేయు వృక్షరూపమును పొందుదువు. సమస్త పుష్పములలో ప్రధానమైన దానవు, విష్ణుమూర్తికి ప్రాణములకన్న మిన్నగా నున్న నీవు లేనిచో సమస్తదేవతల పూజ నిష్పలమగును. బృందావనమున వృక్షరూపముతో సున్నందువలన నిన్ను బృందావని యని పిలుతురు. గోపులు గోపికలు నీ ఆకులతోడనే పరమాత్మను పూజింతురు. వృక్షాధిదేవతగా నీవు కృష్ణునితో ఎల్లప్పుడు విహరింతువు. ఇది నేనొపగు వరము. అని బ్రహ్మదేవుడు పలుకగా ఆతని మాటలు విని తులసి సంతోషించి అతనికి నమస్కరించి ఇట్లు పలికెను.

తులస్యువాచ- తులసీదేవి ఇట్లు పలికినది-

ఓ బ్రహ్మదేవుడా! నాకు శ్యామసుందరుడు ద్విభుజుడైన కృష్ణునిపై నున్న వ్యామోహము చతుర్భుజుడైన నారాయణునిపై లేదు. ఇది నిజము. దురదృష్టవశమున శ్రీకృష్ణునివద్ద తృప్తి పొందలేకపోయితివి. శ్రీకృష్ణుడు తెల్పినట్లే చతుర్భుజుడైన నారాయణుని ప్రార్థించి తప్పక సుదుర్లభుడైన శ్రీకృష్ణునే భర్తగా తప్పక పొందుదును. కాని మీరు రాధాదేవి వలన కలుగు భయమును మాత్రము తొలగింపుడు. అని తులసి పల్కినది.

బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికెను-

ఓ తులసి! షోడశాక్షరమగు రాధామంత్రమును నీకు ఉపదేశించుచున్నాను. దానివలన, నావరమువలన నీవు రాధాదేవికి ప్రాణములకంటె అధికమైన స్నేహితురాలవగుదువు. ఆ రాధయే నీకు శ్రీకృష్ణుల మధ్య సంగమమేర్పాటు చేయును. నీవు శ్రీకృష్ణునకు రాధాదేవితో సమానమైన ప్రియురాలవగుదువు అని చెప్పి షోడశాక్షరమైన రాధికా మంత్రమును, స్తోత్రమును, కవచమును, పూజావిధిని, పురశ్చర్యాక్రమమునంతయు తెల్పి శుభాశీస్సుల నొసగి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యెను.

బ్రహ్మదేవుని ఉపదేశముననుసరించి పరమ పుణ్యమైన బదరికా వనములో పరమమంత్రమైన రాధికామంత్రమును జపించెను. ఆమె పన్నెండు దివ్య సంవత్సరములు పూజ చేసి సిద్ధురాలైనది. తపస్సు మంత్రము సిద్దినొందుటవలన తనకిష్టమైన శ్రీకృష్ణ సమాగమ వరమును పొంది శ్రీకృష్ణునితో సుఖముగానుండసాగినది. మానవులకు ఫలితము  దొరికినచో  దుఃఖము  కూడ  సుఖమగును.

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండములో నారద నారాయణ సంవాదమున చెప్పబడిన తులసి ఉపాఖ్యానములో తులసీ వర ప్రదానమను పదువైదవ అధ్యాయము సంపూర్ణము.