2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

31 - పాపులు పొందు నరక కుండములు

యమ ఉవాచ- యమధర్మరాజిట్లనెను

ఓ పతివ్రతా! శ్రీహరి సేవలేక కర్మబంధమోచనము జరుగదు. పుణ్యమైన పనులు చేసినచో స్వర్గము లభించును. చెడు పనులు చేసినచో నరకము కలుగును..

వ్యభిచారి పెట్టిన అన్నమును, వేశ్యపెట్టిన అన్నము తినువాడు వారి దగ్గరకు వెళ్ళువాడు కాలసూత్రమను నరకమునకు పోవును. అచ్చట నూరు సంవత్సరములుండి మానవజన్మనెత్తినప్పుడు మొదటి జన్మలో బహురోగములతో బాధపడి నిర్మలుడగును.

ఒకే భర్తతో నుండునది "పతివ్రత". రెండవవానితో తిరుగునది "కులట". ముగ్గురితో ఉండునది "ధర్షిణి", నలుగురితో తిరుగునది పుంశ్చలి. ఐదుగురితో నుండునది వేశ్య. ఆరుగురితో కలిసియుండునది యుగ్మీ. అంతకంటే ఎక్కువ పురుషులతో తిరుగునది మహావేశ్య. మహావేశ్య అన్నీ కులములలోను అస్పృశ్య.

బ్రాహ్మణుడు కులట మొదలగువారితో కలిసి తిరిగినచో అవటోదమను నరకమునకు పోవును.

కులటతో తిరుగువాడు నూరు సంవత్సరములు నరకమున ఉండును. ధృష్ణతో తిరుగువాడు నాలుగు వందల సంవత్సరములు నరకమున నుండును. పుంశ్చలితో కలియువాడు ఆరువందలసంవత్సరములు, వేశ్యాగామి ఎనిమిదివందలసంవత్సరములు, యుగ్మ దగ్గరకు పోపువాడు వేయి సంవత్సరములు ఆవటోదమను నరకమున నుందురు. మహావేశ్య వెంట తిరుగువాడు లక్షసంవత్సరములు నరకబాధను అనుభవించును. అందరిలోను తిరుగువాడు నరకముననే యమదూతలచే బోధలననుభవించుచుండునని బ్రహ్మ తెలిపెను.

కులట వెంట పోపువాడు ఏడు జన్మలు తిత్తిరి పక్షిగను, ధృష్టాస్త్రీ వెంట తిరుగువాడు ఏడుజన్మలు కాకిగాను, పుంశ్చలిగామి ఏడు జన్మలు కోకిలగాను, వేశ్య వెంటపోవువాడు తోడేలుగను, యుగ్మీగామీ ఏడు జన్మలు పందిగను, నరకబాధలనుభవించిన తరువాత పుట్టుదురు. మహావేశ్య వెంట తిరుగువాడు శ్మశానములో బూరుగు వృక్షముగా పుట్టును.

చంద్ర సూర్య గ్రహణముల సమయమున భోజనము చేయు మూర్ఖుడు అరుంతుదమను నరకమునకే పోవును. అచ్చట బాధలనుభవించి మానవ జన్మనెత్తినను ఉదరవ్యాధి, మొదలగు వ్యాధులతో చిన్నతనముననే దంతములు గోల్పోవును.

మాట నిచ్చిన తరువాత ఇంకొకరికి తన కూతురునిచ్చి వివాహము చేయువాడు పాంశు భోగమను. నరకమున సూరు సంవత్సరములుండును.

దానము చేసినదానిని తిరిగి తీసికొనువాడు పాశవేష్టమను నరకమున బాణముల అంచులపై నూరు సంవత్సరములు పడుకొని యమలోక యాతనలననుభవించును.

శివలింగమును పూజించని వాడు పరమ శివుని యొక్క కోపము వలన భయంకరమైన శూలప్రోతమను నరకమున నూరు సంవత్సరములుండును. అచట నరకయాతనలనుభవించిన తరువాత ఏడు జన్మలు పెద్దపులిగా ఏడు జన్మలు దేవాలయమున అర్చకుడుగా జన్మించును.

బ్రాహ్మణుని ఎవరు దండింతురో, ఎవరిని చూచి బ్రాహ్మణుడు వణకిపోవునో అతడు అనేక వేల సంవత్సరములు ప్రకంపనమను నరకమున నుండి యమ యాతనలనుభవించును.

తన భర్తను కోపముగా చూచు స్త్రీ అతనితో కటువుగా మాట్లాడు స్త్రీ ఉల్కా ముఖమను నరకమున అనేక వేల సంవత్సరములుండును. అచ్చట ఆమె ముఖమునకు పిడుగులు తగులునట్లు యమకింకరులుచేయుదురు. ఆ తరువాత మానవ జన్మనెత్తినప్పుడు ఏడు జన్మలవరకు ఆస్త్రీ చీన్నతనముననే తన భర్తను కోలుపోయి రోగములపాలై అనేక విధములుగా బాధలు చెందును.

బ్రాహ్మణస్త్రీ శూద్రునితో సంగమించినచో ఆమె సాంధకూపమను సరకమునకు పోవును. అచ్చట చిమ్మచీకటిలో దుర్వాసన గల నీళ్ళలో నుండి ఆ నీళ్ళే రాత్రింబగళ్ళు ఆహారముగా తీసికొనుచు యమ దూతలు బాధించుచుండగా పదునలుగురు ఇంద్రుల కాలము వరకుండును. ఆచ్చట యమ యాతనలనన్నిటిని అనుభవించి భూమిపై జన్మించినపుడు వేయిజన్మలు కాకిగాను, నూరు జన్మలు పందిగాను, నూరు జన్మలు కోడిగాను, ఏడుజన్మలు నక్కగాను, ఏడు జన్మలు పావురముగాను, ఏడు జన్మలు కోతిగాను జన్మించును. అటుపిమ్మట చండాలిగాను, క్షయరోగగ్రస్తయైన రజకిగాను, కుష్ఠురోగ గ్రస్తయైన తైలకారిగాను జన్మలనెత్తును.

వేశ్య వేధనమను నరకమునకు పోవును. యుగ్మ దండతాడన నరకమునకు పోవును. మహావేశ్య బాలబంధ నరకమునకు, కులట దేహచూర్ణక నరకమునకు, స్వైరిణి దళన నరకమునకు, ధృష్ణ శోషణ నరకమునకు పోవును. అచ్చట యమ భటులచే బాధలు పడుచు మన్వంతరకాలము మలమూత్రములను భక్షించుచుండును. ఆటుపిమ్మట లక్ష సంవత్సరముల వరకు పేడ పురుగుగా జన్మనెత్తును.

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, తమ తమ వర్ణములకు చెందిన ఇతరుల స్త్రీలలో పోయినచో అతడు కషమనే నరకమునకు తన ప్రియురాలితో వెళ్ళును. అచ్చట పన్నెండు సంవత్సరములు కషాయతవ్తమైన నీటిని తాగుచుండును. అటుపిమ్మట పరిశుద్ధులై తమ తమ జన్మనెత్తుదురు. స్త్రీలు కూడ ఇదేవిధముగా కషమనే నరకమున యమయాతనలననుభవించి పరిశుద్ధులగుదురు.

క్షత్రియుడుగాని, వైశ్యుడు గాని బ్రాహ్మణ స్త్రీని అనుభవించినచో తల్లితో వ్యభిచారము చేసిన పాపము పొందును. అతడు శూర్పమను నరకమునకు పోయి, అచ్చట చేటలంత ఆకారమున్న క్రిములచే తాను, తను పోయిన బ్రాహ్మణస్త్రీ భక్షింపబడుదురు. ఆ నరకముననిట్లు యమ దూతలు పెట్టు యాతనలను పదునలుగురు ఇంద్రుల కాలము వరకు అనుభవించి ఏడు జన్మలు పందీగను, ఏడు జన్మలు గొఱ్ఱెగను జన్మించును. ఆ తరువాత పరిశుద్దుడగును.

చేతిలో తులసిని పట్టుకొని ప్రమాణము చేసి దానిని ఆచారింపనివారు, గంగా జలమును, సాలగ్రామశిలను, దేవప్రతిమను పట్టుకొని ప్రమాణము చేసి ఆచరింపనివారు, దేవుని సమీపమున చేతిలో చేయివేసి ఒట్టుపెట్టుకొని దానికి విరుద్ధమైన పనులు చేసినవారు, అట్లే బ్రాహ్మణుని, ఆపుసు, అగ్నిని, విష్ణుమూర్తితో సమానుడైన వానిని ముట్టుకొని ప్రమాణము చేసి దానిని ఆచరింపనివారు, స్నేహితునకు ద్రోహము చేసినవారు, కృతఘ్నులు, విశ్వాసఘాతకులు, తప్పుడు సాక్ష్యము చెప్పువారందరు జ్వాలాముఖమను నరకమునకు పోదురు.

పైవారందరు జ్వాలాముఖ నరకమున పదునలుగురు ఇంద్రుల కాలమువరకు యమదూతలు బాధలు పెట్టుచుండగా నిప్పులో పడి మాడినట్లగుదురు.

తులసిని పట్టుకొని ఒట్టుపెట్టుకొని తప్పినవాడు ఏడు జన్మల వరకు చండాలుడై పుట్టును. గంగా జలమును చేతబట్టుకొని ఒట్టుపెట్టుకొని తప్పిన వాడు ఐదు జన్మలవరకు మ్లేచ్ఛుడై పుట్టును. సాలగ్రామమును పట్టుకొని ఒట్టుపెట్టుకొని తప్పినవాడు ఏడు జన్మల వరకు పేడ పురుగుగా పుట్టును. భగవంతుని అర్చామూర్తిపై చేయిపెట్టి ప్రమాణము చేసి తప్పినవాడు ఏడు జన్మలవరకు ప్రణములు చేయు పురుగుగా పుట్టును. చేతిలో చేయివేసి ప్రమాణము చేసి తప్పిన వాడు ఏడు జన్మల వరకు సర్పముగా పుట్టును. ఇటువంటి జన్మలనెత్తిన తరువాత మానవుడై పుట్టినను చేతులు లేక అవిటివాడుగా పుట్టును.

అబద్ధములు చెప్పువాడు దేవాలయార్చకుడుగా ఏడుజన్మలవరకుండును. మిత్రుడు మొదలగువారిపై (బ్రాహ్మణుడు, ఆవు మొ॥ (ఒట్టు పెట్టుకొని తప్పువాడు ఆగ్రదాని బ్రాహ్మణుడగును. అగ్రదాని యనగా మృతుడగు వానికి సంబంధించిన దానములను స్వీకరించు బ్రాహ్మణుడు అతనిని సాటి బ్రాహ్మణులే చిన్న చూపుతో చూతురు. వీరందరు మూడు జన్మలవరకు మూగవారుగాను, చెవిటివారుగాను, భార్య గతించిన వారుగాను, సంతానహీనులుగాను, బుద్ధిహీనులుగాను ఉందురు.

మిత్రద్రోహము చేసిన వాడు ఏడుజన్మలవరకు ముంగిసగా పుట్టును. చేసిన మేలును మరిచిపోవువాడు. ఖడ్గమృగముగాను, తప్పుడు సాక్ష్యములిచ్చువాడు ఏడు జన్మల వరకు ఎలుగుబంటిగాను పుట్టును. వీరందరు తమకు ముందున్న ఏడు తరములవారిని, తరువాత రాబోవు ఏడు తరముల వారిని నరకమునకు పంపుదురు.

ప్రతిదినము చేయవలసిన నిత్యకర్మలనన్నిటిని వదలి బిడుడుగా నుండి వేదములందు విశ్వాసములేని బ్రాహ్మణుడు వ్రతములను ఉపవాసములను వదలి పెట్టి మంచి మాటలను, ఇతరులను నిందించు ,బ్రాహ్మణుడు నూరు సంవత్సరములు చల్లని నీటిలో నుండును. తరువాత నూరు సంవత్సరములు జల జంతువులుగా పుట్టును. అట్లే అనేక విధములైన చేపల జాతులలో పుట్టిన తరువాతనే పరిశుద్ధుడగును.

దేవ బ్రాహ్మణుల ధనమునపహరించువాడు తనకు ముందున్న పది తరములను తన తరువాత రాబోవు పదితరములను మొత్తము ఇరువది యొక్క తరములను నరకమునకు పంపును. తాను పొగ, చీకటి కల ధూమధ్వాంతమను నరకమునకు పోయి అచ్చట నాలుగు యుగముల వరకు బాధపడుచుండును. ఆ తరువాత భూమిపై పుట్టినను నూరు జన్మములవరకు ఎలుక జాతీలోను, తరువాత అనేక విధములైన పక్షిజాతులలోను, పురుగుల జాతులలోను, వృక్షజాతులలోను జన్మించును. ఆ తరువాత మానవుడై పుట్టినప్పుడు భార్యను కోల్పోయి, సంతాన రహితుడై రోగములచే బాధపడుచు శబరజాతిలో పుట్టును. అటుపిమ్మట అగసాలిగా, ఆ తరువాత బంగారు నమ్మువాడుగా. ఆ తరువాత యవనులను సేవించువాడుగా, అటుపిమ్మట జ్యోతిష్కుడుగా పుట్టును.

జ్యోతిష్యమును చెప్పి, వైద్యము చేసి బ్రతుకు బ్రాహ్మణుడు లోహము, లతుక, పాదరసము మొదలగు పోటి క్రయ విక్రయములు చేయు బ్రాహ్మణుడు, నాగవేష్టమను నరకమున అనేక వేల సంవత్సరములు సర్పములు కాటువేయుచుండగా బాధలు పడుచుండును. తరువాత భూమిపై జన్మనెత్తినప్పుడు జ్యోతిష్కుడుగను. తరువాత ఏడు జన్మల వరకు వైద్యుడై పుట్టును. ఆ తరువాత గొల్లవాడుగను, కమ్మరిగను, శంఖాకారుడుగను పుట్టి పాపములను వదలించుకొనును.

ఓ సావిత్రి! ప్రసిద్ధమైన నరకకుండముల గురించి నీకు చెప్పితిని, ఇంకను అఫ్రసిద్ధమైనవి చిన్న చిన్నవగుకుండములెన్నో అచ్చట కలవు. పాపాత్ములు తాము జీవించి యుండగా చేసికొన్న దుష్కర్మల ఫలితములను ఈ కుండములందు అనుభవించుచుందురు. నరకమునకు వచ్చు వరకు వారు సంసారమున మునిగియుందురు.

ఓ సావిత్రి! ఇంకను నీవు వినవలెనని అనుకొనుచున్న విషయములను స్వేచ్ఛగా ఆడుగుము.

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణుల సంవాదమున చెప్పబడిన సావిత్రి ఉపాఖ్యానమున కర్మ విపాకముల వివరణ చేయు సందర్భమున తెల్పబడిన పాపుల కుండ నిర్ణయమను ముప్పది యొకటవ అధ్యాయము సమాప్తము.