2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
13 - తులసీ ఉపాఖ్యాన ప్రారంభము
నారద ఉవాచ- నారద మహర్షి ఇట్లనెను-
నారాయణునకు ప్రియురాలైన తులసి పూర్వజన్మలో ఎవరి కులమున పుట్టినది? ఎవరికి కూతురుగా జన్మించినది? ఎట్టి తపసు చేసి ప్రకృతి కంటె అతీతుడైన శ్రీమన్నారాయణుని భర్తగా పొందినది. ఈమె వృక్షముగా ఎందుకు మారినది అట్లే రాక్షసులకు ఎట్లు దక్కినది.
ఇట్టి సందేహములతో నిండిన నా మనస్సు మాటి మాటికి డోలాయమానమగుచున్నది. కావున అందరి సందేహములను తీర్చు మీరు నా సందేహముల తొలగింపుడు.
నారాయణ ఉవాచ- నారాయణు డిట్లనెను-
పూర్వము విష్ణుభక్తుడైన దక్షసావర్ణి అనే మనువు ఉండెను. అతని పుత్రుడు ధర్మ సావర్ణి. అతని పుత్రుడు విష్ణుసావర్ణి. అతని పుత్రుడు దేవసావర్ణి. వీరందరు విష్ణుభక్తులే. విష్ణువ్రత పరాయణులే.
కాని దేవసావర్ణి పుత్రుడు వృషధ్వజుడు. ఆతడు శివభక్తుడు. అతని ఆశ్రమములో శంకరుడు మూడు దేవ యుగముల వరకు స్వయముగా నివసించెను. పరమశివునకు ఆ మహారాజుపై పుత్రుని కంటె ఎక్కువ ప్రేమ ఉండినది.
ఆమహారాజు నారాయణుని పూజించలేదు. లక్ష్మిని గాని, సరస్వతినిగాని పూజించేవాడు కాదు. అందువలన సమస్త దేవపూజను అతడు దూరము చేసెను. భాద్రపద మాసములో చేయు మహాలక్ష్మీ పూజను గాని, మాఘమాసములో చేయు సరస్వతీ పూజను కాని ఆ వృషధ్వజుడు వదలివేసెను. అందువలన దేవతలతనిని శపింపదలచినప్పటికిని శివునియొక్క భయము వల్ల అతనిని శపించుటకు ఎవరును సాహసింపలేదు.
ఒకప్పుడు సూర్యుడు మాత్రము ఆ మహారాజును నీ సంపదలన్నిటిని పోగొట్టుకొనుము అని శపించెను. అందువలన శంకరుడు కోపముతో శూలము పట్టుకొని సూర్యుని నిగ్రహించుటకు వెళ్ళెను. ఆది చూచి సూర్యుడు బ్రహ్మను శరణువేడెను. అందువలన బ్రహ్మదేవుడు సూర్యునితో కలిసి వైకుంఠమునకు వెళ్ళెను. శంకరుడచటికి సైతము తన శూలమును పట్టుకొని కోపముతో వెళ్ళెను. దాన్ని చూచి బ్రహ్మ, కశ్యప, సూర్యులు, నాలుకలెండిపోగా నారాయణుని శరణువేడిరి. అతనికి నమస్కరించి అనేక విధములుగా స్తుతించిరి. అట్లే వారందరు తమ భయమునకు కారణమును తెలిపిరి. నారాయణుడు వారందరకు కృపతో అభయమిచ్చుచు “నేనుండగా మీరు భయపడవలసిన పనిలేదు. ఆపదలు వచ్చినప్పుడు భయముతో నన్ను స్మరించుకొనిన నేనచ్చటకు చక్రము ధరించి పోయి రక్షింతును. నేను సమస్తలోకములను రక్షింతును. బ్రహ్మగా ఈలోకములను సృష్టింతును. శివరూపుడనై సంహరించెదను. నేనే శివుడను. నేనే బ్రహ్మను. నేనే సూర్యుడను. త్రిగుణాత్మకమైన అనేక రూపములను ధరించి సృష్టిమొదలగు క్రియలు చేయుచుందును.
మీరందరు మీమీలోకములకు వెళ్ళుడు. మీరు భయపడవలసిన అవసరము లేదు. నావరమువలన మీకు నేటినుండి శంకరుని నుండి భయములేదు. ఆ శంకరుడు తొందరగా సంతోషించువాడు. భక్తవత్సలుడు. శరణమునొసగువాడు. భక్తులకు ఆధీనమైనవాడు. నాకు శంకరుడు, సుదర్శన చక్రములు ప్రాణముల కంటె మిన్నయైనవి. ఈలోకములన్నిటిలో వీరికంటె తేజోవంతులు లేరు. అతడు నన్నెల్లప్పుడు ధ్యానించును. తన పంచముఖములచే నా నామస్మరణమును, నాగుణస్మరణమును ఎల్లప్పుడు చేయుచుండును. నేను కూడ ఆ పరమశివుని యోగక్షేమములను చింతించుచుందును. అతడు మంగళస్వరూపుడు. మంగళమునకు అధిదేవత. అతని స్మరణమువలన మంగళము జరుగును కావున అతడు శివుడైనాడని నారాయణుడనెను.
ఆ సమయమున శంకరుడు నందినెక్కి శూలహస్తుడై ఎరుపెక్కిన కళ్ళతో అచ్చటికి వచ్చెను. అతడు నందిని దిగి భక్తితో వంచిన శిరస్సు కలవాడై పరాత్పరుడు, లక్ష్మీకాంతుడు, చతుర్భుజుడు, చతుర్భుజములు కల సేవకులచే సేవింపబడినవాడు, శరీరమంతా చందనము పూసుకొన్నవాడు, లక్ష్మీదేవిచ్చిన తాంబూలము సేవించుచున్నవాడు, విద్యాధరుల నాట్యమును గీతములను వినుచున్నవాడు, పరమాత్మ యగు నారాయణుని నమస్కరించెను. అట్లే బ్రహ్మదేవునకు కూడ శంకరుడు నమస్కరించెను.
అప్పుడు సూర్యుడు భయపడుచు భక్తితో శంకరునకు నమస్కరించెను. కశ్యప ప్రజాపతి కూడ అతనికి నమస్కరించెను. శంకరుడు సర్వేశ్వరుని స్తుతించి విష్ణుపార్షదులు చామరములు వీయుచుండగా సుఖాసనమున విశ్రాంతి తీసికొనుచుండెను.
అప్పుడు ప్రసన్నాత్ముడైన శ్రీమన్నారాయణుడు, ప్రసన్నుడైన శంకరునితో మధురముగా ఇట్లు మాట్లాడెను.
శ్రీభగవానువాచ - శ్రీమన్నారాయణుడిట్లనెను-
మంగళస్వరూపుడవైన పరమేశ్వరా! నిన్ను మంగళమును గూర్చి అడుగుట ఉపహాస కరమైనది. ఐనను మీ క్షేమమును ఆడుగుచున్నాను. తపఃఫలమును సర్వసంపదలను ఇచ్చు నిన్ను సంపదలగురించి తపస్సు గురించి అడుగుట తగనిది. మృత్యుంజయుడవైన నిన్ను ఆపదలగురించి అడుగుట తగనిది. ఐనను నీవిచ్చటికి ఇంత త్వరగా ఏలవచ్చితిరని నారాయణుడు అడిగెను.
శ్రీమహాదేవ ఉవాచ- మహాదేవుడిట్లనెను-
ఓ భగవంతుడా! వృషధ్వజుడను నా భక్తుని సూర్యుడు శపించినందువలన కోపించి ఇక్కడకు వచ్చితిని. వృషధ్వజానిపై గల పుత్ర వాత్సల్యముతో, శోకముతో సూర్యుని చంపసమకట్టితిని. అతడు బ్రహ్మదేవుని శరణుపొందగా వారిద్దరు నిన్ను శరణుపొందిరి.
నిన్ను ధ్యానమాత్రముననో మాటతోడనో శరణు పొందినవారికి ఎట్టి ఆపదలుండవు. అట్టి సమయమున సాక్షాత్తు నిన్నే శరణన్నవారికి ఏభయమూ ఉండదు. శ్రీహరిస్మరణ అభయమును, సమస్త మంగళములను ఒసగును.
ఐనచో సూర్యుని యొక్క శాపము వలన సర్వస్వమును కోలుపోయిన నా భక్తుని గతి ఏమిటో వివరింపుము.
శ్రీభగవానువాచ- భగవంతు డిట్లనెను-
పరమ శివా! వైకుంఠమున నీవు గడిపిన అరగడియ కాలమున భూలోకమున ఇరవై ఒక్క యుగములు గడిచినవి. నీవు శీఘ్రముగా నీ భక్తుని ఇంటికి వెళ్ళుము. అక్కడ కాలవశమున నీ భక్తుడగు వృషధ్వజుడు చనిపోయెను. అతని పుత్రుడైన హంసధ్వజుడు సహితము చనిపోయెను. అతని పుత్రుడైన హంసధ్వజుడు సహితము చనిపోయెను. అతని పుత్రులైన ధర్మధ్వజ కుశధ్వజులు ప్రస్తుతమున్నారు. వారు పరమ వైష్ణవులైనను సూర్యుని శాపమువలన రాజ్యభ్రష్టులైనారు. వారి భార్యలకు లక్ష్మీదేవి తన అంశ స్వరూపముతో జన్మించును. అప్పుడు వారు ధనవంతులై రాజ్యము పొందగలరు.
ఓశంకరుడా! నీ భక్తుడు ఎప్పుడో చనిపోయెను. కావున మీరు మీమీ లోకములకు పాండు అని శ్రీహరి సభనుండి లేచి అంతఃపురమును ప్రవేశించెను. దేవతలందరు తమ లోకములకేగిరి. శివుడు తపస్సు చేయుటకు తన ఆశ్రమమునకు వెళ్ళిపోయెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణ సంవాద సమయమున చెప్పబడ్డ తులస్యుపాఖ్యానమను పదమూడవ అధ్యాయము సమాప్తము.
